పిఎంఇండియా
ముఖ్యాంశాలు:
i. లైంగికదాడులు, వేధింపులు, అశ్లీల సాహిత్యం-దృశ్యీకరణ వంటి అఘాయిత్యాలనుంచి బాలలకు రక్షణతోపాటు వారి ప్రయోజనాల పరిరక్షణ, శ్రేయస్సు కోసం ప్రభుత్వం పోక్సో చట్టం-2012ను అమలులోకి తెచ్చింది. బాలలు అంటే 18 ఏళ్లలోపు వయసున్న వ్యక్తులుగా ఈ చట్టం నిర్వచించింది. ఆ వయసుకు లోబడిన బాలల ప్రయోజనాలు, శ్రేయస్సుకు ప్రతి దశలోనూ అగ్ర ప్రాధాన్యం ఇవ్వడం అత్యంత ప్రధానాంశంగా ఈ చట్టం పరిగణిస్తుంది. ఆ మేరకు ఆరోగ్యకర భౌతిక, భావోద్వేగ, బౌద్ధిక, సామాజికాంశాల పరంగా వారి అభివృద్ధికి ఈ చట్టం భరోసా ఇస్తుంది. అంతేకాకుండా ఈ చట్టం లింగభేదానికి అతీతమైనది.
ii. బాలలపై లైంగిక నేరాలకు సంబంధించిన సమస్యలకు సముచిత పరిష్కారం కోసం పోక్సో చట్టం-2012లోని సెక్షన్-4, సెక్షన్-5, సెక్షన్-6, సెక్షన్-9, సెక్షన్-14, సెక్షన్-15, సెక్షన్-42లకు సవరణ చేయబడింది. దేశంలో బాలలపై లైంగిక నేరాల పెరుగుదల ధోరణికి అడ్డుకట్ట వేసేవిధంగా దోషులపై కఠినచర్యలకు వీలుకల్పిస్తూ ఈ మార్పుచేర్పులు చేయబడ్డాయి.
iii. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడేవారిలో భయం పెరిగే విధంగా మరణ దండనసహా కఠిన శిక్ష విధింపునకు వీలుకల్పిస్తూ సెక్షన్-4, సెక్షన్-5, సెక్షన్-6లలో సవరణలు ప్రతిపాదించారు. బలవంతపు అంగప్రవేశం, లైంగిక దురాగతాల వంటి నేరాలకు పాల్పడే దుండగుల నుంచి బాలలందరికీ రక్షణ కల్పించడం ఈ సవరణల ప్రధానోద్దేశం.
iv. ప్రకృతి విపత్తులు, ఇతర ముప్పుల సందర్భాల్లో లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించడం లక్ష్యంగా సెక్షన్-9కి సవరణలు ప్రతిపాదించారు. అలాగే బలవంతపు రతిక్రియవంటి కార్యకలాపాల కోసం బాలలు లైంగికంగా త్వరగా యుక్తవయసుకు వచ్చేవిధంగా మత్తుమందు లేదా హార్మోన్ లేదా రసాయన పదార్థాల ఇంజెక్షన్ ఇవ్వడంవంటివి కూడా ఈ సవరణల ప్రకారం తీవ్ర నేరంగా పరిగణించబడతాయి.
v. బాలలతో అశ్లీల కార్యకలాపాలు, అసభ్య చిత్రాల చిత్రీకరణవంటి దుశ్చర్యల నిరోధం దిశగా పోక్సో చట్టం-2012లోని సెక్షన్-14, 15లలో సవరణలు ప్రతిపాదించారు. బాలలకు సంబంధించిన అలాంటి చిత్రాలు, దృశ్యాలు కలిగి ఉండి వాటిని నాశనం చేయకపోవడం లేదా తొలగించకపోవడం, వాటిగురించి సమాచారం ఇవ్వకపోవడాన్ని కూడా నేరంగా పరిగణించి జరిమానా విధించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా అటువంటి చిత్రాలు, దృశ్యాలను ఇతరులకు పంపడం, ప్రచారం చేయడం, వినియోగించడం వంటి దుశ్చర్యలకు జరిమానా లేదా జైలుశిక్ష లేదా రెండూ విధించేలా సవరణలు ప్రతిపాదించారు. అయితే, ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్థానంలో సాక్ష్యంగా వినియోగించే సందర్భాల్లో మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది. బాలలకు సంబంధించి ఏ రూపంలోనైనా అశ్లీల చిత్రాలు, దృశ్యాలు కలిగి ఉండటం, వాటిని నిల్వ చేయడంవంటి చర్యలకూ శిక్షలు విధించే నిబంధనలను కూడా కఠినతరం చేశారు.
నేపథ్యం:
చట్టంలో నిబంధనలను అత్యంత కఠినతరం చేస్తూ తీసుకువచ్చిన ఈ సవరణలవల్ల బాలలపై లైంగిక దాడులు, దారుణాలకు పాల్పడేవారు అలాంటి దుశ్చర్యలకు దూరంగా ఉండే వీలుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆపదలో, నిస్సహాయస్థితిలో ఉన్న దుర్బలులైన బాలలకు ఇలాంటి నేరాలనుంచి రక్షణతోపాటు వారి భద్రత, గౌరవాలకు భంగం కలగకుండా ఉంటుందని ఆశిస్తోంది. ఆ మేరకు బాలలపై లైంగిక నేరాలకు సంబంధించిన అంశాలతోపాటు దోషులకు విధించాల్సిన శిక్షలపైనా ఈ సవరణలు స్పష్టతనిస్తున్నాయి.