పిఎంఇండియా
శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన సంబంధిత సహకారం కోసం భారత- ఫ్రెంచ్ సంయుక్త సంఘాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసేందుకు ఒప్పందంపై సంతకాలు జరిగిన విషయాన్ని కేంద్ర మంత్రిమండలి దృష్టికి తీసుకు వచ్చారు. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ ఉన్నత స్థాయి సంయుక్త సంఘాన్ని ఏర్పాటు చేసే అంశానికి సంబంధించి 2016 జనవరి 25న న్యూఢిల్లీలో భారతదేశం, ఫ్రాన్స్ లు ఒక పత్రంపై సంతకాలు చేశాయి.
ఇందులో భాగంగా, శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన, నవకల్పన (ఇన్నొవేషన్) రంగాలలో భారతదేశం, ఫ్రాన్స్ లు పరస్పరం సహకరించుకోవలసిన అంశాలను సంయుక్త సంఘం గుర్తిస్తుంది; వాటి ప్రాధాన్య క్రమాన్ని, సంంయుక్త కార్యాచరణను కూడా నిర్దేశిస్తుంది. పరిశోధనలు, అభివృద్ధి, నవకల్పన ద్వారా ఆర్థిక, సామాజిక వికాసానికి కృషి చేయడమే ఈ విధమైన సహకారానికి పరమావధిగా ఉంటుంది.
ఆయా దేశాలు నిర్దేశించిన మేరకు.. భారతదేశం వైపు నుంచి శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాఖ మంత్రి, ఫ్రాన్స్ వైపు నుంచి విదేశ వ్యవహారాలు, మరియు అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రి గాని.. లేదా భారత పాలనా యంత్రాంగంలో కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి, ఫ్రాన్స్ పాలనా యంత్రాంగంలోని డైరెక్టర్ జనరల్ స్థాయి ఉన్నతాధికారి గాని.. సంయుక్త సంఘానికి సహాధ్యక్షులుగా ఉంటారు.
ఉభయ దేశాల మధ్య శాస్త్ర సంబంధమైన, సాంకేతిక విజ్ఞాన సంబంధమైన సహకారంతో పాటు ఇరు దేశాలలోను ఈ తరహా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో పలు జాతీయ శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన సంస్థలు పోషించిన పాత్ర కూడా ఇదివరకటి కన్నా పెంపొందిన నేపథ్యంలో, తాజాగా సంయుక్త సంఘం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
***