Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2020 సంవ‌త్స‌రంలో ”36వ ఇంట‌ర్ నేష‌నల్ జియోలాజిక‌ల్ కాంగ్రెస్” ను నిర్వ‌హించ‌డం కోసం ఒక సొసైటీని ఏర్పాటు చేయ‌డం, మ‌రియు భార‌త ఉప‌ ఖండంలో భూవిజ్ఞానాన్ని ప్రోత్స‌హించ‌డం


“36వ ఇంట‌ర్ నేష‌నల్ జియోలాజిక‌ల్ కాంగ్రెస్” ను నిర్వ‌హించ‌డం కోసం ఒక సొసైటీని నెలకొల్పేందుకు కేంద్ర మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది. 36వ ఇంట‌ర్ నేష‌నల్ జియోలాజిక‌ల్ కాంగ్రెస్ (ఐజిసి)ని 2020 సంవ‌త్స‌రంలో నిర్వ‌హించ‌నున్నారు. దీనితో పాటు, భార‌త ఉప‌ ఖండంలో భూవిజ్ఞానాన్ని ప్రోత్స‌హించ‌డం కోసం 1860 ఇండియ‌న్ సొసైటీ రిజిస్ట్రేష‌న్ యాక్టు కింద ఒక సొసైటీని నెల‌కొల్పే ప్ర‌తిపాద‌న‌కు కేంద్ర మంత్రిమండ‌లి ఆమోదముద్ర వేసింది. కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని 2020 మార్చి 2-6 తేదీల మ‌ధ్య ఢిల్లీ లోని ఎన్ సి ఆర్ లో జ‌రుపుతారు. 2018-19 వ‌ర‌కు స‌న్నాహ‌క కార్య‌క‌లాపాల‌ను చేప‌ట్ట‌డానిక‌ని రూ.52 కోట్ల విలువైన బ‌డ్జెటు వ్య‌యానికి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ను కేంద్ర మంత్రిమండ‌లి ఇప్ప‌టికే ఆమోదించింది. అద‌న‌పు నిధుల‌ను ప్ర‌ధాన కార్య‌క్ర‌మం జ‌ర‌ప‌డానిక‌న్నా ఒక ఏడాది ముందు, అంచ‌నాలను స‌వ‌రించిన త‌రువాత కోరుతారు.

36వ ఐజిసి కి గ‌నుల మంత్రిత్వ శాఖ (ఎమ్ ఒ ఎమ్), భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ లు కల‌సి ఆతిథ్యం వ‌హిస్తాయి. క్రియాశీల మ‌ద్ద‌తును భార‌త‌దేశంలోని సైన్స్ అకాడ‌మీలు, స‌హ ఆతిథ్యం వ‌హించ‌నున్న ఇరుగు పొరుగు దేశాలు అందించ‌నున్నాయి. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌పంచ దేశాల‌న్నింటి నుంచి 7,000కు పైగా భూగర్భశాస్త్రవేత్త‌లు త‌ర‌లి రాగ‌ల‌ర‌ని అంచ‌నాలున్నాయి. ఈ కార్య‌క్ర‌మాన్ని ఇంట‌ర్ నేష‌న‌ల్ యూనియ‌న్ ఆఫ్ జియోలాజిక‌ల్ సైన్సెస్ (ఐ యు జి ఎస్) ఆధ్వ‌ర్యంలో ఐయుజిఎస్- ఐజిసి కౌన్సిల్ ల నియ‌మాల‌కు అనుగుణంగా నిర్వ‌హించ‌నున్నారు. న‌మోదైన త‌రువాత ఆ సొసైటీ 36IGC కొన్ని కార్య‌క‌లాపాల‌ను చేపట్ట‌డం ద్వారా కార్య‌క్ర‌మానికి స‌న్నాహ‌కాలు చేస్తుంది. ఈ కార్య‌క‌లాపాల‌లో స్థానిక నిర్వ‌హ‌ణ సంఘం (ఎల్ఒసి) నియామ‌కం, 35వ ఐజిసి లో పాలు పంచుకోవ‌డం వంటివి క‌ల‌సి ఉంటాయి. 35వ ఐజిసి 2016 ఆగ‌స్టు 27 నుంచి సెప్టెంబ‌రు 4 వ తేదీల మ‌ధ్య ద‌క్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్ లో జ‌ర‌గాల్సి ఉంది. 36వ ఐజిసి ముగియ‌డంతోనే సొసైటీని మూసివేస్తారు.

ప్ర‌తిపాదిత కార్య‌క్ర‌మం భూగర్భశాస్త్ర స‌మాజానికంత‌టికీ ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండ‌డమే కాక‌, ఖ‌నిజాల అన్వేష‌ణ‌, గ‌నుల త‌వ్వ‌కం, ప‌ర్యావ‌ర‌ణ సంబంధిత నిర్వ‌హ‌ణ‌, శీతోష్ణ స్థితుల‌లో మార్పుల‌పై అధ్య‌య‌నాలు, ప్రాకృతిక అపాయాల వేళ తీసుకొనే జాగ్ర‌త్త చ‌ర్య‌లు, వ‌గైరా భూవిజ్ఞాన సంబంధిత అంశాల‌పైన ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా చ‌ర్చ‌లు- తీర్మానాలు జ‌ర‌గ‌నున్నాయి. భార‌త‌దేశంలో జియో-టూరిజానికి ఈ స‌భ ఉత్తేజాన్ని ఇవ్వ‌గ‌ల‌ద‌ని భావిస్తున్నారు. స‌మావేశాల స‌మ‌యంలో “GEOEXPO-2020” పేరిట‌ నిర్వ‌హించే ఒక ప్ర‌ద‌ర్శ‌న‌లో పెద్ద పెద్ద మైనింగ్ కంపెనీలు, మిన‌ర‌ల్ ఎక్స్ ప్లొరేష‌న్ కంపెనీలు పాల్గొనే అవ‌కాశం కూడా ఉండ‌వ‌చ్చు. గ‌నుల త‌వ్వ‌కం, ఖ‌నిజాల అన్వేష‌ణ‌, మౌలిక స‌దుపాయాల అభివృద్ధి వంటి కార్య‌క‌లాపాల‌లో నిమ‌గ్న‌మైన ప్రపంచ శ్రేణి కంపెనీల దృష్టిని జియోఎక్స్ పో ఆక‌ట్టుకోగ‌ల‌దు. భార‌త‌దేశ ఖ‌నిజ వ‌న‌రుల సామ‌ర్థ్యాన్ని చాటిచెప్ప‌డం వ‌ల్ల భార‌త‌దేశం లోని ఆయా రంగాల‌ లోకి విదేశీ పెట్టుబ‌డిని ర‌ప్పించుకొనేందుకు కూడా అవ‌కాశం ల‌భిస్తుంది.

36వ ఐజిసి “భూగర్భ శాస్త్రం- స్థిర‌మైన భ‌విష్య‌త్తుకు ఆధార‌భూత‌మైన విజ్ఞానం” (Geoscience-the Basic Science for Sustainable Future) అనే ఇతివృత్తంతో సాగ‌నున్న‌ది. ఈ కార్య‌క్ర‌మానికి భార‌త‌దేశంలో ఆతిథ్యం ఇవ్వ‌డం ద్వారా దేశంలో భూవిజ్ఞానంతో పాటు, భూవిజ్ఞాన సంబంధ ప‌రిశోధ‌న‌ల స్థాయిని పెంపొందింప‌చేసుకొనేందుకు అవ‌కాశం ల‌భించ‌గ‌ల‌దు. అంతే కాకుండా, ఇది భౌగోళిక మార్పుల స‌వాళ్ల‌కు ఎదురొడ్డి నిల‌బ‌డ‌టానికి, ప్రాకృతిక వ‌న‌రుల‌ను మ‌రింతగా ఒడిసిప‌ట్టాల‌న్న త‌ప‌న‌కు వేదిక కాగ‌ల‌దు. ఖ‌నిజాల అన్వేష‌ణ‌, జియోసైంటిఫిక్ మ్యాపింగ్, భూవిజ్ఞాన సంబంధిత మౌలిక కార్య‌క‌లాపాల‌లో ప‌రిశోధ‌న‌లు- అభివృద్ధి వంటి కార్య‌క‌లాపాల‌లో వేరు వేరు జాతీయ సంస్థ‌లు/ విశ్వ‌విద్యాల‌యాలు, ప‌రిశ్ర‌మ‌లు, ప్ర‌యివేటు రంగ సంస్థ‌ల‌లో పాలు పంచుకొంటున్న భూశాస్త్రవేత్త‌లు భార‌తీయ‌ ఉప ఖండంలో 10,000 కు పైగానే ఉన్నారు. అప్లయిడ్ రంగాల శ్రేణిని చూస్తే ఎంతో విభిన్నంగా చ‌మురు- వాయువులు మొద‌లుకొని భూగ‌ర్భ జ‌లాల దాకా, గ‌నుల త‌వ్వ‌కం మొద‌లుకొని ప‌ర్యావ‌ర‌ణం దాకా, శీతోష్ణ స్థితుల‌లో మార్పుల మొద‌లుకొని ప్ర‌కృతి అపాయాల దాకా విస్త‌రించి ఉంది. ప్ర‌పంచం అంత‌టి నుంచి విచ్చేసే వ
ిష‌య ప్రావీణ్యుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపే ఒక గొప్ప అవ‌కాశాన్ని భార‌తీయ భూశాస్త్రవేత్త‌లు 36వ ఐజిసి ద్వారా పొందనున్నారు. దీని వ‌ల్ల భార‌తీయ భూవైజ్ఞానికులు ముందుముందు త‌లెత్త‌గ‌ల స‌వాళ్లను త‌ట్టుకొనేందుకు వీలుగా త‌మ జ్ఞాన ప‌రిధిని పెంపొందింప‌చేసుకోవ‌డ‌మే కాక‌, త‌మ నైపుణ్యాల‌కు మ‌రింత ప‌దును పెట్టుకోగ‌లుగుతారు కూడా.

పూర్వ రంగం:

2012 ఆగ‌స్టులో ఆస్ట్రేలియా లోని బ్రిస్ బేన్ లో 34వ ఇంట‌ర్ నేష‌న‌ల్ జియోలాజిక‌ల్ కాంగ్రెస్ జ‌రిగినప్పుడే 36వ ఐజిసికి త‌న ఇరుగు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక ల‌తో క‌ల‌సి ఆతిథ్యం ఇవ్వ‌డానికి భార‌త‌దేశం సంసిద్ధ‌త‌ను వ్య‌క్తం చేసి బిడ్ వేసింది. ఆ ప్ర‌య‌త్నానికి ప్ర‌పంచ భూవైజ్ఞానిక స‌మాజం నుంచి అనూహ్య‌మైన విధంగా గొప్ప మ‌ద్ద‌తు ల‌భించింది. స‌భ‌కు స‌హ ఆతిథ్యాన్నిచ్చే అంశంలో భార‌త‌దేశపు బిడ్ ను విజయం వరించింది.

ఐజిసి ఒక ప్ర‌తిష్టాత్మ‌క‌మైన భూవైజ్ఞానిక స‌మావేశం. దీనిని ఇంట‌ర్ నేష‌న‌ల్ యూనియ‌న్ ఆఫ్ జియోలాజిక‌ల్ సైన్సెస్ (ఐ యు జి ఎస్) ఆధ్వ‌ర్యంలో నాలుగేళ్ల విరామంతో నిర్వ‌హిస్తుంటారు. ఐయుజిఎస్ అనేది ఇంట‌ర్ నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ (ఐసిఎస్ యు)కు అనుబంధంగా ప‌నిచేస్తోంది. ఐజిసి 1878లో ఆరంభం అయినప్ప‌టి నుంచి.. గ‌డ‌చిన అయిదు సార్లుగా ప్ర‌తి స‌ద‌స్సు కు ప్ర‌పంచంలోని వివిధ దేశాల నుంచి 6,000 పై చిలుకు ప్ర‌తినిధుల‌ను ఆక‌ర్షించ‌గ‌లిగింది. భార‌త‌దేశం ఇంత‌క్రితం 1964లో ఐజిసి 22వ స‌మావేశాల‌కు ఆతిథ్యం ఇచ్చింది. అప్ప‌ట్లో ఢిల్లీలో జ‌రిగిన‌ ఈ స‌మావేశాలు ఆసియాలో జ‌రిగిన తొలి ఐజిసి స‌మావేశాలు.

ఈ కార్య‌క్ర‌మం భార‌త‌దేశాన్ని మాన‌వ వ‌న‌రుల వికాసం, శిక్ష‌ణ ల‌లో ఒక శాస్త్రీయ గ‌మ్య‌స్థానంగా నిల‌బెడుతుంది. ఇది ద‌క్షిణ ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల‌లో భార‌త‌దేశ స్థాయిని మెరుగుప‌ర‌చ‌గ‌లుగుతుంది. జియో టూరిజానికి కొత్త మార్గాల‌ను తెర‌వ‌డం ద్వారా భార‌త ప‌ర్య‌ట‌క రంగ సంబంధిత ఆదాయాన్ని పెంచుకోవ‌డానికి కూడా ఈ కార్య‌క్ర‌మం త‌న వంతు తోడ్పాటును అందించ‌గ‌ల‌దు.

***