Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని రాయబరేలీ లో వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభం సందర్భం గా ప్రధాన మంత్రి ప్రసంగం

ఉత్తర్ ప్రదేశ్ లోని రాయబరేలీ లో వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభం సందర్భం గా ప్రధాన మంత్రి ప్రసంగం

ఉత్తర్ ప్రదేశ్ లోని రాయబరేలీ లో వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభం సందర్భం గా ప్రధాన మంత్రి ప్రసంగం

ఉత్తర్ ప్రదేశ్ లోని రాయబరేలీ లో వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభం సందర్భం గా ప్రధాన మంత్రి ప్రసంగం


భారత్ మాతా కీ జయ్

భారత్ మాతా కీ జయ్

భారత్ మాతా కీ జయ్

ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ గారు, విజయవంతమైన, ప్రజాదరణ పొందిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, నా సహచరుడు రైల్వే మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారు, బి జె పి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, పార్లమెంటు లో నా సహచరుడు శ్రీ మహేంద్ర పాండే గారు, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన గౌరవనీయ మంత్రులు, ఈ నాటి సమావేశాని కి హాజరైన శాసన సభ్యులు, గౌరవనీయులైన స్పీకర్ గారు మరియు అధిక సంఖ్య లో సమావేశాని కి హాజరైన రాయబరేలీ సోదరులు మరియు సోదరీమణులారా,

ఈ రోజు నేను దేశం లోని ప్రతి ప్రాంతానికి ఆధ్యాత్మికత నుండి స్వాతంత్ర్య సమరం దాకా మరియు సాహిత్యం నుండి రాజకీయాల దాకా వివిధ క్షేత్రాల కు దిశానిర్దేశం చేసిన భూమి లో ఉన్నాను. ఇది మహర్షి జమదగ్ని వంటి రుషులు, సాధువులు, రాణా బేణీ మాధవ్ బక్ష్ సింహ్, వీర పసి వంటి త్యాగధనులు నడయాడిన భూమి. ఇది జయశి పని కి సమానార్ధకమైంది మరియు మహావీర్ ప్రసాద్ ద్వివేది గారి కవనాన్ని రూపు దిద్దిన భూమి కూడాను. ఈ భూమి పైనే రైతు ఉద్యమ మూలపురుషుడు పండిత్ అమోల్ శర్మ జన్మించారు. రాజ్ నారాయణ్ గారు కూడా ఈ భూమి దీవెనల ను పొందారు. ఇంతటి మహత్తరమైన రాయబరేలీ ధర్మ భూమి కి, ఇక్కడి ప్రజల కు నేను వందనం చేస్తున్నాను.

మిత్రులారా,

ఘన చరిత్ర గల ఈ ప్రాంత అభివృద్ధి కి కేంద్ర ప్రభుత్వం, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంకితమైనాయి. అదే స్పూర్తి తో కొద్ది సేపటి క్రితం ఇక్కడ 1,000 కోట్ల రూపాయల విలువ గల ప్రోజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం ఇవ్వడం గాని, శంకుస్థాపన చేయడం గాని జరిగింది. అంకితమిచ్చిన లేక శంకుస్థాపన చేసిన ఈ పథకాలు రహదారుల కు, గృహాల కు, వైద్య కళాశాల కు సంబంధించినవి. వాటి వల్ల మీ జీవనం మెరుగుపడి సుఖవంతమవుతుంది. ఈ సౌకర్యాల ను పొందినందుకు మీ అందరినీ హృదయపూర్వకం గా అభినందిస్తున్నాను.

మిత్రులారా,

ఇక్కడ కు రావడానికి ముందు నేను దగ్గర లోని అత్యంత ఆధునికమైనటువంటి రైలు పెట్టె ల కార్ఖానా ను చూసి వచ్చాను. ఈ సంవత్సరం ఆ కార్ఖానా లో తయారైన 900వ రైలుపెట్టె ను ఆమోదించే అవకాశం కూడా నాకు లభించింది. ఫ్యాక్టరీ లో పని ప్రగతి వేగం అభినందనీయం. దేశం లో వనరులు గత ప్రభుత్వ హయం లో ఏ విధం గా దుర్వినియోగం అయ్యాయో, వారి పని సంస్కృతి ఎటువంటిదో చెప్పడానికి రాయబరేలీ రైలుపెట్టె ల ఫ్యాక్టరీ ఒక ఉదాహరణ. ఏటా 1,000 రైలుపెట్టె లను నిర్మించాలనే ఉద్దేశ్యం తో 2007వ సంవత్సరం లో ఈ కార్ఖానా ను ఆమోదించారు. ఫ్యాక్టరీ నిర్మాణం 2010వ సంవత్సరం లో పూర్తి అయింది. ఆ తరువాత నాలుగు సంవత్సరాల పాటు దానికి కేవలం కపూర్ థలా నుండి తెచ్చిన రైలు పెట్టెల కు రంగులు వేయడం, మరమ్మతులు చేయడం మాత్రమే చేశారు. కొత్త రైలు పెట్టె ల నిర్మాణాని కి ఉద్దేశించిన ఫ్యాక్టరీ ని ఎన్నడూ పూర్తి సామర్ధ్యం మేరకు పని చేయనివ్వలేదు. 2014వ సంవత్సరం వరకు ఫ్యాక్టరీ లో కేవలం 3 శాతం యంత్రాలు పనిచేస్తున్నాయి.

మేము అధికారం లోకి వచ్చిన మూడు నెలల్లోనే ఒక రైలుపెట్టె ను పూర్తి గా రాయబరేలీ ఫ్యాక్టరీ లోనే ఉత్పత్తి చేయడం జరిగింది. బిజెపి ప్రభుత్వం యొక్క ప్రయత్నాల వల్ల, ఫ్యాక్టరీ లోని అన్ని యంత్రాలు పూర్తి సామర్ధ్యం మేరకు పని చేస్తున్నాయి. కొత్త, ఆధునిక యంత్రాలు బిగించే పని త్వరిత గతి న సాగుతోంది. దాని పర్యవసానం గా గత ఏడాది మీ ప్రేమ కు, ఉత్సాహాని కి కృత‌జ్ఞ‌త‌లు. అయితే, నేను చెప్పే మాటలను మీతో పాటు ఇతరుల ను కూడా విననివ్వమని మిమ్మల్ని నేను మనస్పూర్తిగా వేడుకొంటున్నాను. మీరు అనుమతిస్తే, నా ప్రసంగాన్ని కొనసాగిస్తాను. కొనసాగించమంటారా ? మీ అనుమతి లేకుండా నేను ఏమీ చేయను. మీ యొక్క ప్రేమాశీస్సులకు నేను చాలా కృతజ్ఞుడి ని. అయితే అధిక సంఖ్య లో తరలి వచ్చిన వారు కూడా కొన్ని మాటలు వినాలనుకొంటున్నారు. కాసేపు ఓపిక పట్టి నిశ్శబ్దం గా ఉంటారా ? నిజమా ? ఒట్టు. నిలబెట్టుకుంటారా ? గొప్ప విషయం. రాయబరేలీ యువత చాలా మంచి వారు.. పర్యవసానం గా గత ఏడాది ఈ ఫ్యాక్టరీ లో 711 రైలుపెట్టెల ను ఉత్పత్తి చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం మార్చి కల్లా ఈ సంఖ్య 1,400 మించాలని నేను అభిలషిస్తున్నాను.

మిత్రులారా,

రైలుపెట్టెల ను ఆధునికీకరించే పని ఈ ఫ్యాక్టరీ లో కొనసాగుతోంది. మరి వచ్చే రెండు మూడు సంవత్సరాల లో ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్ధ్యం ఏటా 3,000 రైలుపెట్టెల కు పెరగనుంది. కాలక్రమం లో ఈ ఫ్యాక్టరీ యొక్క సామర్ధ్యాన్ని ఏటా 5,000 రైలుపెట్టెల ను ఉత్పత్తి చేసే స్థాయి కి పెంచేందుకు మేము ప్రయత్నిస్తున్నామని మీకు తెలియజేస్తున్నాను. ఈ ఫ్యాక్టరీ లో జరిగే పని ద్వారా రాయబరేలీ కోచ్ ఫ్యాక్టరీ కేవలం భారతదేశం లోనే కాక ప్రపంచం లోనే అత్యధిక సంఖ్య లో రైలుపెట్టెల ను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ గా మారుతుంది.
సోదరులు మరియు సోదరీమణులారా,

నాకు చిన్న చిన్న ఆలోచనలు చేసే అలవాటు ఎన్నడూ లేదు. త్వరలోనే ఈ ఫ్యాక్టరీ దేశం లో మెట్రో రైళ్ల కు, వేగం తో నడిచే రైళ్ల కు అవసరమైన బోగీల ను తయారు చేస్తుంది. అత్యంత అధునాతనమై తేలిక గా, దృఢం గా ఉండే అల్యూమినియమ్ రైలు పెట్టెలు కూడా ఇక్కడ తయారవుతాయి.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఈ విస్తరణ కోచ్ ఫ్యాక్టరీ కి, బోగీల సంఖ్య కు సంబంధించింది మాత్రమే కాదు. అది ఇక్కడి ప్రజల జీవనాని కి సంబంధించింది కూడా. కోచ్ ఫ్యాక్టరీ కి ఉత్పత్తి సామర్ధ్యం పెరిగితే, దాని వల్ల ఇక్కడి యువత కు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ప్రతి రోజూ ఇక్కడ పది పన్నెండు రైలు పెట్టెలు ఉత్పత్తి అయ్యే రోజు ను గురించి యోచించండి. ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్ధ్యం పెరిగితే కార్మికులు, ఇంజినీర్ లు, సాంకేతిక నైపుణ్యం ఉన్న పని వారు, డిప్లొమా ఉత్తీర్ణులు ఎంతో మంది కి ఉద్యోగాలు వస్తాయి. అంతేకాక దాని వల్ల రాయబరేలీ కి చెందిన చిన్న సంస్థల కు , మధ్యతరహా సంస్థల కు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

గతంలో అంటే 2014వ సంవత్సరానికి ముందు రాయబరేలీ రైలు పెట్టె ల ఫ్యాక్టరీ కోసం స్థానిక విపణులు, వ్యాపారుల నుండి కేవలం ఒక కోటి రూపాయల విలువైన వస్తువుల ను మాత్రమే కొనుగోలు చేశారు. ఈ సమాచారం మీకు దిగ్బ్రాంతి కలిగించవచ్చు. నేను చెప్పనా ? మా ప్రభుత్వం అధికారం లోకి రాక ముందు ఈ ఫ్యాక్టరీ లో వాడేందుకు స్థానిక వ్యాపారుల నుండి కేవలం ఒక కోటి రూపాయల విలువైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేశారు. బిజెపి అధికారం లోకి వచ్చిన తరువాత స్థానిక వ్యాపారుల నుండి ఈ సంవత్సరం లో ఇప్పటి వరకు 125 కోట్ల రూపాయల విలువైన వస్తువులను కొనడం జరిగింది.

ఇక ఇప్పుడు ఫ్యాక్టరీ విస్తరణ జరుగుతుంది. కొనుగోళ్ళు కూడా పెరుగుతాయి. రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తో కలసి ఒక రైల్ ఇండస్ట్రియల్ పార్కు ను నిర్మించాలని సంకల్పించినట్లు నాకు చెప్పారు. రైలు పెట్టెల ఫ్యాక్టరీ కి అవసరమైన వస్తువుల ను, సామగ్రి ని ఈ ఇండస్ట్రియల్ పార్కు ద్వారా సరఫరా చేస్తారు. అది చిన్న సంస్థల కు, మధ్యతరహా సంస్థల కు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తుంది.

మిత్రులారా,

ఈ రోజు న నేను మరో వాస్తవాన్ని రాయబరేలీ ప్రజల దృష్టి కి తేదలిచాను. గత ప్రభుత్వం ఇక్కడ రైలు పెట్టెల ఫ్యాక్టరీ ని నిర్మించాలని అనుకొన్నప్పుడు 5,000 మంది ఉద్యోగులను నియమించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకున్న గత ప్రభుత్వం అదే విధంగా ప్రకటన కూడా చేసింది. ఆ నిర్ణయం తీసుకున్నందుకు వారిపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే అందులో సగం ఉద్యోగాలకు మాత్రమే ఆమోదం తెలిపారని తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. ప్రకటన చేసింది 5000 ఉద్యోగాలకు. ఆమోదం తెలిపింది అందులో సగాని కి. కోచ్ ఫ్యాక్టరీ లో కొత్తగా ఏ నియామకాలు జరగలేదని 2014వ సంవత్సరం లో మా ప్రభుత్వం ఎన్నికైన తరువాత మేము గమనించాము. వారు చెప్పిన ప్రతిదీ మీరు నమ్మారు. కానీ ఇక్కడి వారి లో ఒక్కరి కి కూడా ఉద్యోగాలు రాలేదు. కార్మికులందరినీ కపూర్ థలా నుండి తీసుకు వచ్చారు.

కానీ ఇవాళ దాదాపు 2,000 మంది కొత్త శ్రామికులను మా ప్రభుత్వం నియమించింది. అంతేకాక 2014వ సంవత్సరం లో కేవలం 200 గా ఉన్న తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 1500 కు పెరిగింది. భవిష్యత్తు లో రాయబరేలీ రైలు పెట్టె ల ఉత్పత్తి కి ప్రపంచ కేంద్రం గా మారగలదని నేను సగర్వం గా చెప్తున్నాను.

మిత్రులారా,

ప్రాంతాల మధ్య సంబంధాల ను పటిష్టం చేయడం, ప్రజలకు అవసరమైన సౌకర్యాల ను పెంచడం కోసం రైల్వేల తో పాటు జాతీయ రహదారులు, ఆకాశమార్గాలు, జలమార్గాలు, ఇన్ ఫర్ మేశన్ సూపెర్ హైవే ల వంటి రంగాల లో పనులు శీఘ్ర గతి న జరుగుతున్నాయి. ప్రజల జీవన పరిస్థితులు ఉద్ధరించడానికి ఉత్తర్ ప్రదేశ్ లోని నదీమార్గాల ద్వారా, గ్రామీణ రహదారులపై నిర్మించిన ఆధునిక ఎక్స్ ప్రెస్ వేల ద్వారా నిరంతర కృషి జరుగుతోంది. ఈ కార్యక్రమం లో భాగం గా రాయబరేలీ లోని వివిధ రంగాల లో వేగం గా పనులు జరుగుతున్నాయి. 500 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించిన జాతీయ రహదారి ని కొద్ది సేపటి క్రితమే దేశ ప్రజల కు అంకితం చేయడం జరిగింది. ఇది రాయబరేలీ ని నేరు గా రాయబరేలీ మరియు ఫతేహ్ పుర్ ల గుండా బాందా తో కలుపుతుంది. దాదాపు 125 కిలోమీటర్ల పొడవైన ఈ జాతీయ రహదారి చిత్రకూట్ ధామ్ సందర్శన సౌకర్యం కల్పిస్తుంది.

మిత్రులారా,

వైద్య రంగం లో మౌలిక సదుపాయాల ను మెరుగుపరచడం తో పాటు దేశం లో ప్రతి పౌరుని కి ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందుబాటు లోకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి వుంది. రాయబరేలీ లో నిర్మాణం లో ఉన్న అఖిల భారత వైద్య విజ్ఞానశాస్త్రాల సంస్థ (ఎఐఐఎంఎస్) పనులు బాగా జరుగుతున్నాయి. దాని వల్ల రాయబరేలీ కే కాకుండా ఈ ప్రాంతం ప్రజలందరికీ మంచి ఆరోగ్య వసతి లభిస్తుంది.

450 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు తో నిర్మించిన ఆసుపత్రి, ఇంకా వసతి గృహ భవనం ఈ రోజు న దేశ ప్రజలకు అంకితం ఇవ్వడం మరియు శంకుస్థాపన చేయడం జరిగింది. మున్శీ గంజ్ లో నిర్మిస్తున్న వైద్య కళాశాల మరియు ఆసుపత్రి కూడా ఎఐఐఎంఎస్ లో భాగమే. దీని వల్ల రాయబరేలీ కి, ఇరుగుపొరుగు జిల్లాల కు ప్రయోజనం కలుగుతుంది. మంచి ఆరోగ్య వసతి తో పాటు ప్రభుత్వం ప్రజల కు గృహ వసతి ని కల్పించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. 2022వ సంవత్సరం కల్లా దేశం లో ప్రతి పేద కుటుంబాని కి శాశ్వత గృహాల ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం శ్రమిస్తోంది. ఇందుకోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా దేశం లో ఇప్పటి వరకు 1.25 కోట్ల ఇళ్ళ నిర్మాణం జరిగింది. పూర్తి అయిన ఇళ్ళ తాళంచెవుల ను లబ్ధిదారుల కు అందజేయగా వారు గత సంవత్సరం లో దీపావళి పండుగ ను ఆ ఇళ్ళలో జరుపుకొన్నారు.

యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పినట్లు, రాయబరేలీ లోనూ 23,000 కన్నా ఎక్కువ ఇళ్ళ ను నా పేద కుటుంబాల కు అందజేయడం జరిగింది. మరో 500 ఇళ్ళ నిర్మాణ పనులు కొద్దిసేపటి కిందట మొదలయ్యాయి. ఈ ఇళ్ళు గతం లో ఉన్నట్లు నాలుగు గోడ లు మాత్రమే కాదు. వాటి లో పంపులు, నీటి సరఫరా, విద్యుత్తు, వంట గ్యాస్ కనెక్షన్ మరియు ఇజ్జత్ ఘర్.. అదే.. మరుగుదొడ్ల వంటి సౌకర్యాల ను కల్పించేందుకు కూడా మేము ప్రయత్నిస్తున్నాం.

సోదరులు మరియు సోదరీమణులారా,

దేశ చరిత్ర లో ఈ రోజు కు మరో కారణం వల్ల ప్రత్యేకత ఉంది. శౌర్యవంతులైన భారతీయ సైనికులు 1971వ సంవత్సరం లో ఈ రోజు న శత్రు సేనల ను సంహరించి విజయం సాధించారు. దేశం లోని వివిధ ప్రాంతాల నుండి ఆ యుద్ధం లో పాల్గొని విజయం సాధించిన, అమరులైన సైనికుల కు నా వందనాలు. వారిలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వారు కూడా కొందరు ఉన్నారు. 130 కోట్ల మంది భారతీయుల తరపున వారి కి కూడా నేను నివాళులు అర్పిస్తున్నాను.

డిసెంబర్ లో శరీరం గడ్డ కట్టే చలి వాతావరణం లో మన సరిహద్దులను సంరక్షిస్తున్న శౌర్యశీలురు, సాహసవంతులైన వీర జవాన్లను కీర్తించడానికి మీరు మీ చేతులు పైకెత్తి పిడికిలి బిగించి బిగ్గర గా ‘భారత్ మాతా కీ జయ్’ ‘భారత్ మాతా కీ జయ్’ ‘భారత్ మాతాకీ జయ్’ అనండి.

సోదరులు మరియు సోదరీమణులారా,

మీకు ఎంతో గర్వకారణమైన ‘భారత్ మాతా కీ జయ్’ నినాదం కొందరికి కలవరం కలిగిస్తోందనే విషయాన్ని ఊహించండి. వాళ్ళేం మనుషులు. భరత మాత ను పొగిడితే వారికి వచ్చే సమస్య ఏంటి?. వారికి దేశమంటే పట్టదా ?

మిత్రులారా,

మోదీ ని తిట్టడమే వారి ఉద్దేశ్యం అని నాకు తెలుసు. ఏదో విధంగా మోదీ పైన నింద వేయాలనుకుంటారు. అందుకు దేశాన్ని పణం గా ఎందుకు పెడుతున్నరన్నదే నా ప్రశ్న ? దేశ భద్రత విషయం లో ఎందుకు రాజీ పడుతున్నారు ?

సోదరులు మరియు సోదరీమణులారా,

దేశం లో ఈనాడు రెండు పక్షాలు ఉన్నాయి. నిజం, దేశ భద్రత వైపు ఉన్న పక్షాని కి ప్రభుత్వం నాయకత్వం వహిస్తూ సైన్యాన్ని బలపరచేందుకు ప్రయత్నిస్తోంది. ఏది ఏమైనా దేశాన్ని బలహీనపరచాలనే శక్తులు మరో పక్షాన ఉన్నాయి. సోదరులారా, మీరే చెప్పండి, మన దేశ సైన్యం బలంగా ఉండాలా ? వద్దా ? భారత సైన్యం వద్ద అధునాతన ఆయుధాలు ఉండాలా ? వద్దా ?

ఇప్పుడు మన సైన్యం బలపడకుండా అడ్డుకుంటున్న శక్తుల తో మన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఉందన్న నిజాని కి జాతి జనులే సాక్షి. వారి ప్రయత్నాలకు మద్దతిస్తున్న దేశాలేవి ? జాతి యావత్తు ఆ విషయాన్ని కూడా దగ్గర నుండి గమనిస్తోంది. కొంతమంది నాయకులు ఉపయోగిస్తున్న భాష ను చూసి పాకిస్తాన్ చప్పట్లు కొడుతోంది. అలా ఎందుకు జరుగుతోంది ?

మిత్రులారా,

రామ్ చరిత్ మానస్ నాలుగు పాదాల పద్యమొకటి ఉంది. ఎవరి వ్యక్తిత్వాన్నో భగవాన్ శ్రీ రామచంద్రుడు వివరిస్తూ ఇలాగ అన్నారని గోస్వామి తులసీదాస్ రాశారు –

“झूठई लेना, झूठई देना,
झूठई भोजन, झूठ चबेना” ।

ఈ మాటలకు ..
కొంతమంది అబద్దాలే వింటారు, అబద్దాలే చెప్తారు,
అబద్దాలే తింటారు, అబద్దాలే జీర్ణించుకుంటారు.. అని భావం.

పై వాక్యాలను తమ జీవన విధానం గా కొంతమంది మార్చుకున్నారు. ఈ దేశం లో అటువంటి వారికీ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక అబద్దం, రక్షణ మంత్రి చెప్పేది ఓ బూటకం, భారత వైమానిక దళం అధికారులు కూడా అబద్దాలకోరులు. ఫ్రెంచ్ ప్రభుత్వం కూడా అబద్దం చెబుతోందని వారు అంటారు. ఇప్పుడు వారు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. నిజాని కి ఎలాంటి వివరణ అక్కరలేదు. అబద్దాలు ఎన్ని చెప్పినా నమ్మించలేము. ఎవరో గతం లో ఓ గొప్ప సంగతి ని చెప్పారు “जयेत् सत्येन चानृतम्”. ఈ మాటలకు నిజం చెప్పడం ద్వారా మాత్రమే అబద్ధాలు అనే ధోరణి పైన గెలుపు ను సాధించవచ్చును అని భావం.

సైనిక దళాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చరిత్రాత్మక వైఖరి ఏ విధం గా ఉండేదన్నది దేశ ప్రజలకు నేను స్పష్టం చేయదలచుకొన్నాను. దేశ ప్రజ వారి ని ఎన్నటికీ క్షమించదు. దేశ ప్రజ ఎన్నటికీ మరచిపోదు.

మిత్రులారా,

కార్ గిల్ యుద్ధం తరువాత మన వైమానిక దళం ఆధునిక విమానాలు కావాలని కోరింది. కార్ గిల్ యుద్ధం, అటల్ జీ ప్రభుత్వం తరువాత దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు పాలించింది. అయినప్పటికీ వైమానిక దళాన్ని బలపడనివ్వలేదు. ఎందుకు?, ఎవరి ఒత్తిడి వల్ల ?

సోదరులు మరియు సోదరీమణులారా,

రక్షణ ఒప్పందాల కు సంబంధించిన వ్యవహారాల లో కాంగ్రెస్ చరిత్ర బోఫోర్స్ కుంభకోణం లోని కత్రోచీ తో ముడిపడి ఉంది. కాంగ్రెస్ హయం లో జరిగిగిన హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం లో నిందితుడు క్రిస్టియన్ మైకేల్ ను కొద్దిరోజుల కిందట భారతదేశాని కి తీసుకొని రావడం జరిగింది. మైకేల్ ను కాపాడేందుకు కాంగ్రెస్ తన న్యాయవాది ని పంపి ఏ విధం గా ప్రయత్నించిందీ మనం చూశాం. కాంగ్రెస్ వారి కి కోపం ఎందుకో, నిత్యం అబద్ధాలు ఎందుకు చెప్తున్నారో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. బిజెపి ప్రభుత్వం చేసిన రక్షణ సామగ్రి కొనుగోలు ఒప్పందాల లో కత్రోచీ, మైకేల్ ల వంటి దళారులు లేనందువల్లనా ? ఈ కారణం వల్లనేనా న్యాయ వ్యవస్థ పైన అపనమ్మకం కలిగే వాతావరణాన్ని సృష్టిస్తోంది ? ఇప్పుడు న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తోంది ?

సోదరులు మరియు సోదరీమణులారా,

మాకు పార్టీ కన్నా దేశం గొప్పది. రానున్న తరాల కు కూడా మాది అదే మంత్రం. ఎన్నడైనా పార్టీ కన్నా జాతి గొప్పది. దేశ ప్రజల కు నేను చెప్పేది ఒక్కటే. దేశ భద్రత , సైన్యం అవసరాలు, సైనికుల ప్రతిష్ఠ విషయం వచ్చినప్పుడు బిజెపి నేతృత్వం లోని ఎన్ డిఎ ప్రభుత్వం కేవలం జాతి సంక్షేమం, ప్రజా సంక్షేమం పై మాత్రమే దృష్టి ని కేంద్రీకరిస్తుంది. మా ప్రభుత్వం ఆచరించేది అవే విలువలు.

భారతీయ సైన్యం ఏ విషయంలోను వెనుకబడి పోకుండా మా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. ప్రాణాలు ఒడ్డి పోరాడుతున్న మన వీర జవాన్లు ఎటువంటి సమస్య ను ఎదుర్కోకూడదు. సరిహద్దు రక్షణ కు తన కుమారుని పంపే తల్లి కి నేను జవాబుదారు ను. సరిహద్దు రక్షణ కు తన సోదరుడిని పంపే సోదరి కి కూడా నేను జవాబివ్వాలి. తమ ఇంటి పెద్ద కోసం, తమ తండ్రి కోసం ఎదురుచూసే పిల్లల కు కూడా బదులు ఇవ్వవలసిన బాధ్యత నా పైన ఉంది. మా ప్రభుత్వం అధికారం లో ఉన్నంత వరకు, నేను అక్కడ ఉన్నంత వరకు, ప్రభుత్వం కేవలం ఒక్క కుటుంబాని కి కాదు లక్షలు, కోట్ల కుటుంబాల కు జవాబివ్వవలసిన అవసరం ఉంది. అందువల్ల మేము కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్నడూ వెనకంజ వేయబోము.

సోదరులు మరియు సోదరీమణులారా,

మన సైనికుల క్షేమం, భద్రత విషయం లో కాంగ్రెస్ వైఖరి ని గురించి మీకు గుర్తు చేస్తాను. 2009వ సంవత్సరం లో, భారత సైనిక అధికారులు ఒక లక్షా 86 వేల బులిట్ ప్రూఫ్ జాకెట్ లు కావాలని ప్రభుత్వాన్ని కోరారు. 2009వ సంవత్సరం నుండి 2014వ సంవత్సరం వరకు ఐదు సంవత్సరాలు గడచిపోయాయి. కానీ భారత సైన్యానికి బులిట్ ప్రూఫ్ జాకెట్ లు మాత్రం కొనుగోలు చేయలేదు. మా ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత 2016వ సంవత్సరం లో సైన్యానికి 50 వేల బులిట్ ప్రూఫ్ జాకెట్ లు కొనుగోలు చేసే ప్రతిపాదన కు ఆమోదం తెలిపి వాటిని కొనుగోలు చేశాం. అంతేకాదు దేశ ప్రజల కు మరొక సంగతి ని నేను చెప్పదలచుకొన్నాను. ఈ సంవత్సరం ఏప్రిల్ నెల లో ఒక లక్షా 86 వేల బులిట్ ప్రూఫ్ జాకెట్ లకు ఆర్డరు ను ఇవ్వడం జరిగింది. ఈ జాకెట్ లను మన దేశానికే చెందిన ఒక కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

కాంగ్రెస్ చేసిన పాపాలు చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. అవి అన్నీ వివరించాలంటే కొన్ని వారాలు పడుతుంది. దేశ ప్రజల కు ఒక విషయం చెప్పదలచుకొన్నాను. 2014వ సంవత్సరం లో కాంగ్రెస్ ప్రభుత్వం గనక ఏర్పడి ఉంటే దేశ ప్రతిష్ఠ మంట కలిసేది. దేశాని కి గర్వకారణమైన తేజస్ యుద్ద విమానం ఎన్నటికి వెలుగు చూసేది కాదు. ఎవ్వరూ ఒక్క మాట మాట్లాడే వారు కాదు. కాంగ్రెస్ పాలన లో యుపిఎ ప్రభుత్వం తేజస్ ఉత్పత్తి కి సంబంధించిన అన్ని అంశాల ను బలహీనం చేయడానికి సకల ప్రయత్నాలు చేసింది. ఈ ప్రోజెక్టు చాలా సంవత్సరాల పాటు ముందుకు సాగకుండా నిలచిపోయింది. అయితే దానిని వేగిరపరిచేందుకు కాంగ్రెస్ పాలన లో ఎటువంటి ప్రయత్నం చేయలేదు.

బిజెపి నాయకత్వంలో ఎన్ డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2016వ సంవత్సరం జూలై లో తేజస్ యుద్ద విమానాన్ని వైమానిక దళం లో చేర్చాలని మేము నిర్ణయించాము. 83 కొత్త తేజస్ యుద్ద విమానాలను కొనుగోలు చేసే ప్రతిపాదన కు మా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాంతో పాటు గత సంవత్సరం తేజస్ విమానాల ఉత్పత్తి కి వీలుగా ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) ఉత్పత్తి సామర్ధ్యాన్ని రెట్టింపు చేసేందుకు అవసరమైన 1,400 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది.

సోదరులు మరియు సోదరీమణులారా,

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పని చేసే పద్ధతి ఇదే విధం గా ఉంటూ వచ్చింది. కాంగ్రెస్ చేసే ప్రతి రక్షణ సామగ్రి కొనుగోలు ఒప్పందం లో ఎవరో ఒక విదేశీ మధ్య దళారులు జోక్యం ఉంటూ వస్తోంది. అందువల్లనే ఏదైనా వ్యాపార ఒప్పందం నిజాయతీ గా, పారదర్శకం గా జరిగినప్పుడు కాంగ్రెస్ కలవరపడుతుంది. అప్పుడు ఆ పార్టీ ఒక వ్యూహాన్ని యోచించి సైన్యం పై దాడి జరిపి బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది.

మిత్రులారా,

ఏది ఏమైనా సైన్యాని కి ఇచ్చే మర్యాద, వారి పట్ల చూపే గౌరవం కాంగ్రెస్ పార్టీ కి, దాని అనుచరుల ఊహ కు అందని విషయం. పార్టీ లో ఉన్నత స్థానం లో ఉన్న వ్యక్తి సైనిక దళాల ప్రధానాధికారి ని ‘గూండా’ అని అన్నాడంటే ఆ పార్టీ ని గురించి మనం ఇంకా ఏమి ఆశిస్తాము? ఉగ్రవాద స్థావరాల పై మెరుపు దాడులు జరపడాన్ని ప్రశ్నించే సభ్యులు ఉన్న పార్టీ ని చూసి ఏమనుకోవాలి?. మన సొంత సైన్యం సామర్ధ్యం కన్నా శత్రువు ప్రకటనల నే ఎక్కువ నమ్మే వారి నుండి ఇంకా ఆశించేది ఏముంది.

ఒకే ర్యాంకు ఒకే పించను పథకాని కి చిన్న మొత్తం 500 కోట్ల రూపాయలు కేటాయించి సైనిక జవాన్ల ను మోసగించడానికి చూసే సభ్యులు ఉన్న పార్టీ నుండి అంత కన్నా ఏమి ఆశించగలం?. ఒకే ర్యాంకు కు ఒకే పెన్శన్ సమస్య నలభై సంవత్సరాలుగా నానింది. దీని ని మా ప్రభుత్వం నెరవేర్చింది. 11 వేల కోట్ల రూపాయల కు పైబడిన బకాయిల ను ఇప్పటికే మాజీ సైనికుల కు ఇవ్వడమైంది.

మిత్రులారా,

కాంగ్రెస్ హయాం లో సైనికుల ను గురించి గాని, రైతుల ను గురించి గాని అసలు పట్టించుకోలేదు. సైనికుల తరువాత నేను రైతుల ను గురించి వివరంగా మాట్లాడుతాను.

డెబ్భై సంవత్సరాల లో మొదటిసారిగా, ఏదైనా ప్రభుత్వం రైతు ల ఆదాయాన్ని పెంచడం గురించి యోచించిందంటే అది మా ప్రభుత్వం; ఎన్ డిఎ ప్రభుత్వం. రైతుల సమస్యల ను పరిగణన లోకి తీసుకొని, భవిష్యత్ అవసరాల ను అర్ధం చేసుకొని విత్తనాల నుండి విపణి వరకు ఉండే సమస్యల నేపధ్యం లో విధానాల కు రూపకల్పన చేసి వాటి ని అమలు చేయడం జరిగింది. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి రైతుల ను బయట పడేసేందుకు మేము గట్టిగా, నిజాయతీ తో కృషి చేస్తున్నాము. అయితే దేశ రైతాంగం కాంగ్రెస్ చరిత్ర ను, దాని విధానాల ను, వాస్తవాల ను, దాని వంచన ను ఎన్నడూ మరువరాదు. స్వామినాథన్ కమిటీ సిఫారసుల ను కాంగ్రెస్ తన పది సంవత్సరాల పాలన లో ఎందుకు అమలు చేయలేదు ? దానికి కాంగ్రెస్ వద్ద జవాబు ఉందా ? వారి ని ఎవరు ఒత్తిడి చేశారు ? కనీస మద్దతు ధర వంటి ముఖ్యమైన సమస్య పై వారు ఎంకు మౌనం వహించారు ? ఈ ప్రశ్నల కు కాంగ్రెస్ ఎన్నడూ జవాబివ్వదు.

కానీ సోదరులు మరియు సోదరీమణులారా,

రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్రం లోని ఎన్ డిఎ ప్రభుత్వం కనీస మద్దతు ధర పై స్వామినాథన్ కమిటీ సిఫారసుల ను అమలు చేసింది. 22 రబీ, ఖరీఫ్ పంటల కు కనీస మద్దతు ధర ను నిర్ణయించింది. రైతుల కు 60,000 కోట్ల రూపాయలకు పైగా లాభాన్ని చేకూర్చే ఈ ఒక్క నిర్ణయాన్ని గురించి మీకు కాంగ్రెస్ ఇకో సిస్టమ్ ఎన్నటికీ చెప్పదు.

సోదరులు మరియు సోదరీమణులారా,

యురియా కు 100 శాతం వేప పూత నిర్ణయాన్ని తీసుకోకుండా ఏ ఒత్తిడి వల్ల కాంగ్రెస్ వెనుకకు తగ్గిందో కూడా నేను తెలుసుకోవాలని అనుకొంటున్నాను. యురియా కొరత వల్ల మన రైతు లు లాఠీ దెబ్బల ను తినవలసి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు మౌన సాక్షి గా నిలచింది.

మిత్రులారా,

ఆ కాంగ్రెస్ పార్టీ యే పంటల బీమా కోసం రైతుల నుండి 15 శాతం అదనం గా బీమా కిస్తీ ని వసూలు చేసింది. బీమా సొమ్ము కు కూడా పరిమితి ఉండేది. పంట నష్టం 30 శాతమా లేక 40 శాతమా అనే విషయం లో అక్రమాలు జరుగుతుండేవి. మా ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేసి, పంటల బీమా అమలు లో ఉన్న సమస్య లను అన్నిటి ని తొలగించింది. ఇప్పుడు వివిధ పంటల కు బీమా కిస్తు 2.5 శాతం నుండి 5 శాతం వరకు ఉంటుంది. గత రెండు సంవత్సరాల గణాంకాలు మీ ముందుకు తీసుకువస్తాను. దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల నుండి బీమా కిస్తుల రూపం లో 8,000 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. కానీ ఏదైనా విపత్తు సంభవించి నష్టం వాటిల్లితే బీమా సభ్యత్వం పొందిన రైతులకు 33,000 కోట్ల రూపాయల సహాయం అందుతుంది. ఆ విధం గా 8,000 కోట్ల రూపాయలు చెల్లించిన రైతులకు 33,000 కోట్ల రూపాయల సహాయం లభిస్తుంది. అంటే, చెల్లించిన బీమా కిస్తు కు బదులు గా నాలుగింతలు సహాయం అందుతుందన్న మాట.

మిత్రులారా,

గత కొన్ని రోజులు గా కాంగ్రెస్ పార్టీ రుణ మాఫీ ని గురించి గొప్పలు చెప్పుకుంటోంది. అది పచ్చి మోసం, ఘోరాతిఘోరమైన అబద్దం. కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ రైతు రుణాల ను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అందుకు 10 రోజుల గడువు కూడా నిర్ణయించారు. ఇప్పటి కి ఆరు నెలలైంది. వాస్తవం మరొక విధం గా ఉంది. ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఆరు నెలలు గడచినప్పటికీ కనీసం 1,000 మంది రైతుల రుణాల ను కూడా మాఫీ చేయలేదని రెండు మూడు రోజుల క్రితం వార్త పత్రికలు రాశాయి. ఇక మీరే ఊహించండి.. కనీసం 1,000 మంది కి కూడా రుణాలు మాఫీ కాలేదట. రుణాలు తీసుకొని చెల్లించని కేసుల విచారణ ను న్యాయస్థానాలు చేపట్టాయి. వారి అరెస్టు కోసం వారెంట్ లు కూడా జారీ అయ్యాయి. మొత్తం సంగతి అంతా దేశం లోని రైతుల కు తెలిసి తమ బండారం ఎక్కడ బట్టబయలు అవుతుందో ఏమో అని, వాస్తవాల ను దాచేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే వారు రైతుల ను మోసగిస్తున్న తీరు వెల్లడై వారినే నాశనం చేస్తుంది. కాంగ్రెస్ చేస్తున్న కుట్ర ను బిజెపి ప్రభుత్వం ప్రజల ఎదుట బట్టబయలు చేస్తుంది.

మిత్రులారా,

గుర్తు కు తెచ్చుకునే ప్రయత్నం చేయండి.. 2008వ సంవత్సరం లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే విధం గా రైతుల కు రుణ మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ రోజుల్లో దేశవ్యాప్తం గా రైతులందరికీ కలిపి 6 లక్షల కోట్ల రూపాయల కు పైగా రుణాలు ఉండేవి. అప్పుడు కూడా కాంగ్రెస్ రుణ మాఫీ చేసింది. వాళ్ళు ఎంత మాఫీ చేశారు ? కేవలం 60,000 కోట్ల రూపాయలు! 6 లక్షల కోట్ల రూపాయల లో 60,000 కోట్ల రూపాయలు మాత్రమే ! ఇంత మోసమా! అంతేకాదు, అనర్హులైన 35 లక్షల మంది కి అక్రమ మార్గాల ద్వారా రుణ మాఫీ చేశారు.

సోదరులు మరియు సోదరీమణులారా,

వ్యవసాయాని కి చెందిన ఏ రంగాన్ని కూడా బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ శ్రద్ధ చూపలేదు. ఆహార పదార్ధాల తయారీ, ప్యాకింగ్, నాణ్యమైన విత్తనాల అభివృద్ధి, వ్యవసాయ పరిశోధన, నీటిపారుదల వ్యవస్థల ఏర్పాటు, అవసరమైన మేరకు రైతుల ఆదాయ వృద్ధి కి మార్గాన్వేషణ ల వంటి వాటిని కాంగ్రెస్ ఎప్పుడూ ప్రోత్సహించలేదు.

వేలాది కృషి విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు, 17 కోట్ల భూసార పరీక్ష కార్డుల పంపిణీ, ఆహార పదార్ధాల తయారీ యూనిట్లలో 100 శాతం ఎఫ్ డిఐ కి అనుమతి, దేశవ్యాప్తం గా కొత్త గిడ్డంగుల స్థాపన, సరఫరా శృంఖలాన్ని బలోపేతం చేయడం వంటి చర్యల ద్వారా రైతు ల ఖర్చు ను తగ్గించి వారి పంటల కు ఎక్కువ విలువ వంటివి.

మిత్రులారా,

కేంద్ర ప్రభుత్వం తో పాటు యోగి గారి నాయకత్వం లో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా
ఉమ్మడి మంత్రం – ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ ను వల్లిస్తున్నాయి. ఇది సాధ్యపడేటట్టు చూసేందుకు మేము రాత్రింబగళ్లు శ్రమిస్తున్నాము. రాయబరేలీ లో దాదాపు 8 లక్షల మంది కి బ్యాంకు ఖాతాల ను తెరవడం జరిగింది. 1.75 లక్షల మంది కి ఉచిత వంట గ్యాస్ కనెక్షన్ లను ఇచ్చాము. అంతే కాక దాదాపు 55,000 గృహాలకు ఉచిత విద్యుత్తు కనెక్షన్ లను ఇవ్వడం జరిగింది.

ప్రభుత్వ పథకాల కు అందరి నుండి లభిస్తున్న సహకారం మున్నెన్నడూ కని విని ఎరగనటువంటిది. మీ అందరి సహకారం వల్లనే సామాన్యుల జీవితాల లో సకారాత్మక మార్పు ను తీసుకు రావడం లో సఫలురం కాగలుగుతున్నాము. భవిష్యత్తు లో మనం అందరమూ కలసి సహకార స్పూర్తి ని పటిష్టపరచాలి. రాయబరేలీ తో సహా ఉత్తర్ ప్రదేశ్ ప్రతి ఒక్క స్థాయి లో సత్వర అభివృద్ధి కోసం వేగంగా ముందుకు సాగాలి. ఈ విశ్వాసం తో మరొక్క మారు నేను మీ అందరికీ అన్ని అభివృద్ధి పథకాల విషయం లో మరొక్క మారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఇక్కడకు అధిక సంఖ్యలో హాజరైనందుకు మరియ మీ ఆశీర్వాదాలను మాపై వర్షించినందుకు కూడా మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

నా తో గొంతు కలిపి బిగ్గర గా అనండి –

భారత్ మాతా కీ జయ్

భారత్ మాతా కీ జయ్

భారత్ మాతా కీ జయ్

అనేకానేక ధన్యవాదాలు.