పిఎంఇండియా

గౌరవనీయ స్పీకర్, మాల్దీవుల మాజీ అధ్యక్షుడు, ప్రియ మిత్రుదు, మాన్యులు శ్రీ మహమ్మద్ నషీద్ గారు, మజ్లిస్ గౌరవ సభ్యులు, మాన్యులు, విశిష్ట అతిధులు అందరికీ నమస్కారం .
కోటీ 30 లక్షల మంది భారతీయుల తరపున, నేను వ్యక్తిగతంగా మీకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. పవిత్ర రంజాన్ తెచ్చిన సంతోషం, ఉత్సాహం ఇంకా మనలో ఉంది. అందువల్ల మాల్దీవుల ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను.
గౌరవనీయ స్పీకర్ గారూ,
మాల్దీవులు వేయి దీవుల సమాహారం. హిందూ మహాసముద్ర ప్రాంతపు అరుదైన మణి మాత్రమే కాక మొత్తం ప్రపంచానికి కూడా జాతి రత్నం వంటిది. అందానికి, అరుదైన ప్రకృతి సంపడకు ఆలవాలమైన మాల్దీవులు శతాబ్దాలుగా మానవాళిని ఆకర్షిస్తోంది. ప్రకృతిశక్తి ముందు తలవొగ్గకుండా మానవుడు మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేయడం అనే దానికి మంచి ఉదాహరణ మాల్దీవులు. మాల్దీవులు వాణిజ్యానికి, సాంస్కృతిక మార్పులకు, యాత్రికుల రాకడకు పెట్టింది పేరు. అందమైన రాజధాని మాలే కేవలం సముద్ర జలాలకు యాత్రికుల ప్రవేశ ద్వారం మాత్రమే కాదు సుస్థిరమైన , శాంతియుతమైన , సంపన్నమైన హిందూసముద్ర ప్రాంతానికి ఆయువుపట్టు వంటిది
గౌరవనీయ స్పీకర్ గారూ,
ఈ రోజు మాల్దీవులలో మీ అందరితో మహనీయమైన మజ్లిస్ సభలో కలసి ఉండటం నాకు ఎంతో సంతోషకరం మరియు గౌరవప్రదమైన విషయం. గౌరవనీయ శ్రీ నషీద్ గారు స్పీకర్ పదవిని అలంకరించిన తరువాత మొదటి సమావేశంలోనే నన్ను ఆహ్వానించాలని ఏకగ్రీవంగా తీర్మానించడం నాకు లభించిన విశేష గౌరవంగా నేను భావిస్తున్నాను. ఈ మీ భావన ప్రతి భారతీయుని హృదయాన్ని కదిలించింది. వారి హోదాను, గౌరవాన్ని ఇనుమడింపజేసింది. ఇందుకు గౌరవనీయ స్పీకర్ గారు మీకు , గౌరవనీయ సభ్యులందరికీ నేను వ్యక్తిగతంగా మరియు యావత్ భారతావని తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
గౌరవనీయ స్పీకర్ గారూ,
మాల్దీవులకు నేను రావడం ఇది రెండవసారి. ఒక రకంగా చెప్పాలంటే మజ్లిస్ చారిత్రక సమావేశాలను చూడటం కూడా నాకు రెండవసారి. గత నవంబరులో అధ్యక్షుడు సొలిహ్ పదవీ స్వీకారోత్సవానికి హాజరయ్యే విశేష గౌరవం కూడా నాకు లభించింది. విశ్వాసం, ధైర్యం, సంకల్పం పునాదిగా లభించిన ప్రముఖ, చారిత్రక ప్రజాస్వామ్య విజయం తరువాత వేలాది మంది ప్రజల సమక్షంలో ఆరుబయలు స్టేడియంలో ఆ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆ ఉత్సవం నాకు ఒక మహత్తరమైన అనుభవం. మాల్దీవుల ప్రజాస్వామ్యానికి గల శక్తిని నేను స్వయంగా చూశాను. ప్రజాస్వామ్యం పట్ల మాల్దీవులలోని సామాన్య పౌరులకు గల కట్టుబాటును, అంకితభావాన్ని, మీ వంటి నాయకుల పట్ల వారికున్న ప్రేమను నేను చూశాను స్పీకర్ గారూ. మాల్దీవులలో ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందడానికి కృషిచేస్తున్న మీ అందరికీ ఈ రోజు నేను నమస్కరిస్తున్నాను.
గౌరవనీయ స్పీకర్ గారూ,
ఈ సభ , ఈ మజ్లిస్ కేవలం ఇటుక, సిమెంటుగచ్చుతో నిర్మించిన భవనం మాత్రమే కాదు. కేవలం సామాన్య జనసమూహం కాదు. ఇది ప్రజాస్వామ్య శక్తి కేంద్రం, ఇక్కడ జాతి జనుల నాడి, వారి హృదయ స్పందన సభలోని ప్రతి ఒక్క సభ్యుడి ఆలోచనల్లో, గొంతుకలో ప్రతిధ్వనిస్తుంటుంది. మీ ప్రయత్నాల వల్ల దేశ ప్రజల కలలు, ఆకాంక్షలు నిజరూపం దాల్చేది ఇక్కడే. వివిధ పార్టీలు, సిద్ధాంతాలకు చెందిన సభ్యులు ఒకచోట చేరి తమ ఆలోచనలను కలబోయడం ద్వారా దేశ ప్రజాస్వామ్యం, అభివృద్ధి, సుస్థిర శాంతి కోసం దీర్ఘకాలిక విజయాలను సాధించేది కూడా ఇక్కడే.
అదేవిధంగా కొన్ని నెలల క్రితంమాల్దీవుల ప్రజలు కలసికట్టుగా మొత్తం ప్రపంచానికి ప్రకాశవంతమైన ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఉదాహరణ చూపారు. మీ పయనం సమస్తం సమస్యలమయం. అయితే ఒక ఎశం మాల్దీవులు చూపింది. మీరు చూపారు, అదేమంటే ప్రజలదే చివరి గెలుపు అని. అది మామూలు విజయం కాదు. మీరు సాధించిన ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి బలాన్ని చేకూరుస్తుంది. మాల్దీవులు సాధించిన ఈ విజయాన్ని చూసి అందరికన్నా ఎక్కువ సంతోషపడేది మరియు గర్వించేది ఎవరు? జవాబు విదితమే. అది మీకు పొరుగున ఉన్న సన్నిహిత మిత్ర దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, ఇండియా. ఈ రోజు, మాన్యులకు నెలవైన ఈ సభలో ఒక విషయాన్ని ఉద్ఘాటిస్తున్నాను అదేమంటే భారతదేశం , భారతీయులందరూ గతంలో, భవిష్యత్తులో సర్వదా మాల్దీవులలో ప్రజాస్వామ్యాన్ని బలపరచడానికి మీకు మద్దతు ఇస్తారని తెలియజేస్తున్నాను.
గౌరవనీయ స్పీకర్ గారూ,
ఇండియాలో కూడా ఇటీవల మానవాళి చరిత్రతో అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను పూర్తి చేశాము. కోటీ 30 లక్షల మంది భారతీయులకు అది మామూలు ఎన్నిక కాదు అదొక వేడుక, భారీ ప్రజాస్వామ్య ఉత్సవం. అర్హులైన ఓటర్లలో మూడింట రెండు వంతుల మంది అంటే 60 కోట్ల కన్నా ఎక్కువ మంది ప్రజలు ఓటు వేసేందుకు వచ్చారు. వారంతా అభివృద్ధికి, సుస్థిరతకు మద్దతుగా అఖండ తీర్పు చెప్పారు.
గౌరవనీయ స్పీకర్ గారూ,
మా ప్రభుత్వం మౌలిక మంత్రం “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ ఔర్ సబ్ కా విశ్వాస్” (అందరితో కలసి అందరి అభివృద్ధి కోసం అందరి విశ్వాసంతో) కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాదు. అది మా విదేశీ విధానానికి మూల స్థంభం కూడా మరియు విశాల ప్రపంచంలో ప్రత్యేకంగా పొరుగువారితో మేము ఇదే మార్గాన్ని అవలంభిస్తాము.
“ఇరుగుపొరుగు ముందు” అనేది మా ప్రాధాన్యం. మరియు ఇరుగుపొరుగులో మాల్దీవులు ప్రాధాన్యం. అందువల్ల ఏమిటంటే ఈ రోజు నేను మీ మధ్య ఉండటం కేవలం కాకతాళీయం కాదు.
గత డిసెంబరులో అధ్యక్షుడు సొలిహ్ పర్యటించిన మొదటి దేశం ఇండియా. మాల్దీవుల నుంచి అందిన ప్రేమపూర్వక ఆహ్వానం ఇప్పుడు నన్ను ఇక్కడకు తీసుకొచ్చింది. రెండవసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత నేను పర్యటిస్తున్న మొదటి విదేశం ఇదే.
కొద్దిసేపటి క్రితం అధ్యక్షుడు సొలిహ్ విదేశీయులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాన్ని నాకు అందజేశారు. అందుకు ఎలా కృతజ్ఞతలు తెలిజేయాలో నాకు మాటలు రావడం లేదు.
గౌరవనీయ స్పీకర్ గారూ,
భారత్, మాల్దీవుల మధ్య ఉన్న సంబంధాలు అతి పురాతనమైనవి. సముద్ర జలాలు అనాదిగా మన రెండు తీరాలను తాకుతున్నాయి. మన దేశాలను తాకుతున్న సముద్రజలాల అలలే మన రెండు దేశాల ప్రజలకు మైత్రీ సందేశాలను అందజేస్తున్నాయి. ఆ అలలే మన సంస్కృతులను, నాగరికతలను పెంచి పోషించాయి. మన మధ్య సంబంధం సాగరమంత లోతైనది, అంతే విశాలమైనది. అనేక వేల సంవత్సరాలుగా నా సొంత రాష్ట్రం గుజరాతుతో పాటు ఇండియా, మాల్దీవుల మధ్య వాణిజ్యం వృద్ధి చెందింది. 2500 సంవత్సరాలకు పూర్వం మాల్దీవులు, లోథాల్ మధ్య వాణిజ్యం జరిగేది. లోథాల్ ప్రపంచంలోనే అతి పురాతన ఓడరేవులలో ఒకటి. ఆ తరువాత సూరత్ వంటి నగరాలతో కూడా వాణిజ్యం కొనసాగింది. భారతీయ బాలలు మాల్దీవుల గవ్వలను కూడబెట్టుకొని ముచ్చట పడుతుంటారు. సంగీతం, సంగీత సాధనాలు, ఆచారాలు, సంప్రదాయాలు వంటివి ఎన్నో మన ఉమ్మడి వారసత్వానికి మంచి ఉదాహరణలు.
దివేహి భాషను ఉదాహరణగా తీసుకుందాం. ఒక వారం అంటే ఇండియాలో “హఫ్తా” అంటారు. దివేహి భాషలో కూడా అంతే. వారంలో ఉండే రోజులను చూద్దాం. దివేహి భాషలో ఆదివారాన్ని అడిత్తా అంటారు. అది ఆదిత్యునికి లేక సూర్యునికి సంబంధించినది. సోమవారాన్ని హోమ అంటారు. అది సోమను లేక చంద్రున్ని పోలి ఉంటుంది.
దివేహి భాషలో ‘ధునియా’ ఇండియాలో ‘దునియా’ ఒకటే రెండింటి అర్ధం ప్రపంచమే. ‘దునియా’ అనేది మాల్దీవులలో బాగా ప్రఖ్యాతి చెందిన పేరు కూడా. భాషలో పోలిక కేవలం ఈ లోకానికే పరిమితం కాలేదు. స్వర్గ నరకాలకు కూడా విస్తరించింది. దివేహి భాషలో ‘సువురుగే’ మరియు నరక పదాలు హిందీలో ఉన్న స్వరగ్, నరక్ లను పోలి ఉన్నాయి.
పోలికఉన్న పదాల జాభితా చాలా పెద్దదవుతుంది. నేను ఇలాగే కొనసాగిస్తే ఒక నిఘంటువు తయారవుతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రతి అడుగులో మనం ఒకే తోటలో పూచినా పువ్వులం అనే సంగతి గుర్తిస్తాము.
అందువల్ల మాల్దీవుల సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, లిఖితప్రతులను సంరక్షించడం, దివేహి నిఘంటువు అభివృద్ధి చేయడం వంటివి మాకెంతో ప్రాముఖ్యత ఉన్న పనులు. ఈ కారణం చేతనే నేను ఈ రోజు చారిత్రాత్మక జుమ్మా మసీదును రక్షించడంలో భారత సహకారం అందిస్తామని ఈ సందర్భంగా సంతోషంతో ప్రకటిస్తున్నాను. పగడంతో తయారైన ఇటువంటి మసీదు మాల్దీవుల వెలుపల ప్రపంచంలో మరెక్కడా లేదు. వందలాది సంవత్సరాల క్రితం విజ్ఞులైన మాల్దీవుల పౌరులు సాగర సంపదను వినియోగించుకొని నిరుపమానమైన వాస్తుకళను ఆవిష్కరించారు. ప్రకృతి పట్ల వారికి గల గౌరవానికి, సామరస్య భావనకు సాక్ష్యంగా నిలుస్తోంది.
అయితే అదే సముద్ర సంపదకు ఇప్పుడు కాలుష్యం వల్ల ముప్పు పొంచి ఉండటం విచారకరం. అందువల్ల ఇంతటి దివ్యమైన పగడం మసీదును రక్షించడం ద్వారా పర్యావరణ సంరక్షణ ఆవశ్యకత గురించి మొత్తం ప్రపంచానికి సందేశం పంపినట్లవుతుంది.
గౌరవనీయ స్పీకర్ గారూ,
ఇండియా ఎల్లప్పుడూ మాల్దీవులతో భుజం భుజం కలిపి నడుస్తోంది. ఆ దేశ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సంపద, శాంతి కాపాడటానికి మద్దతు ఇస్తోంది. 1988లో జరిగిన ఘటన గానీ, 2004 సునామీ వంటి ప్రకృతి వైపరీత్యం గానీ లేక ఇటీవల ఏర్పడిన నీటి కొరత గానీ అన్ని సందర్బాలలో మేము మీకు అండగా నిలిచామని, ప్రతి అడుగులో మీ ప్రయత్నాలకు మేము మద్దతు ఇచ్చామని సగర్వంగా చెప్పగలము.
ఇక ఇప్పుడు అభివృద్ధి , సంపద మరియు సుస్థిరతను కాంక్షిస్తూ మన రెండు దేశాలలో బలమైన ప్రజా తీర్పు వెలువడిన నేపధ్యంలో మన రేడు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలు ఏర్పడ్డాయి.
అధ్యక్షుడు సొలిహ్ భారత పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందం మేరకు 140 కోట్ల అమెరికా డాలర్ల ఆర్ధిక ప్యాకేజీ అమలులో ప్రగతి ప్రోత్సాహకరంగా ఉంది. మాల్దీవుల ప్రజల సామాజిక, ఆర్ధిక అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించి ఇండియా సహకారాన్ని అందజేస్తోంది. నీటి సరఫరా కానివ్వండి, దీవుల్లో పారిశుద్ధ్యం కానివ్వండి, ఆరోగ్య, విద్యా సౌకర్యాల కల్పన కానివ్వండి, దేనిలోనైన మాల్దీవుల ప్రాధాన్యతలు, అవసరాల ఆధారంగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనులలో ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోంది.
మేము చేపట్టే సామాజిక ప్రభావమున్న, ఇతర సహకారం అందించే ప్రాజెక్టులు ఈ దేశంలోని సామాన్యులదైనందిన జీవితాన్ని సృశిస్తాయి. వారి జీవనాన్ని మెరుగుపరచడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలకు తోడ్పడతాయి. మాల్ల్దీవులలో ప్రజాస్వామ్యాన్ని, సంపదను పెంపొందించడంలో ఇండియా విశ్వసనీయమైన, బలమైన, అగ్ర భాగస్వామిగా కొనసాగుతుంది. ఈ సహకారం మాల్దీవుల ప్రజా ప్రతినిధులుగా మిమ్మల్ని మరింత శక్తివంతుల్ని చేస్తుంది.
గౌరవనీయ స్పీకర్ గారూ,
రెండు దేశాల మధ్య సంబంధాలు కేవలం తమ తమ ప్రభుత్వాలకే పరిమితం కాలేదు. ప్రజల మధ్య ఉన్న బలమైన సంబందాలతోనే అవి శక్తిని పుంజుకుంటున్నాయి. అందువల్ల ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించే ప్రయత్నాలకు నేను ప్రత్యేక ప్రాముఖ్యం ఇస్తాను. కావునా ఈ రోజు మనం కొత్తగా రెండు దేశాల మధ్య పడవ సర్వీసు ప్రారంభించడానికి మనం అంగీకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాక గత సంవత్సరం వీసా జారీకి ఒప్పందం కుదరడం వల్ల మాల్దీవులకు చెందిన వేలాది మంది వర్తకం, వైద్య సేవలు, విద్య, విశ్రాంతి, పర్యాటకం తదితర అవసరాల నిమిత్తం ఇండియాకు రావడం సులభం కావడం కూడా నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
గౌరవనీయ స్పీకర్ గారూ,
మన రెండు దేశాల మధ్య ఉమ్మడి సహకారాన్ని కొనసాగిస్తూ మన చుట్టుపక్కల ఉన్న అనిశ్చితిలను గురించి, తీవ్రమైన సవాళ్ళను గురించి మనం జాగరూకులమై వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది. బహుళ ధ్రువ ప్రపంచంలో వస్తున్న ఆర్ధిక , వ్యూహాత్మక మార్పుల వల్ల, సాంకేతిక అభివృద్ధి వల్ల, పోటీ మరియు స్పర్ధల కారణంగా కొత్తగా తలెత్తుతున్న సవాళ్ళు ఎన్నో వున్నాయి.
అయినప్పటికీ మన రెండు దేశాలకు ముఖ్యమైన మూడు అంశాలను ప్రస్తావించదలిచాను.
గౌరవనీయ స్పీకర్ గారూ,
ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఉగ్రవాదం. ఇది కేవలం ఒక దేశానికో లేక ఒక ప్రాంతానికో పరిమితమైన సవాలు కాదు. మొత్తం మానవాళి ఎదుర్కొంటున్న సవాలు. ఎక్కడో ఒకచోట ఎవరో ఒక అమాయక ప్రాణం ఉగ్రవాద భూతం దాడికి బలి కాకుండా రోజు గడవడం లేదు. టెర్రరిస్టులకు బ్యాంకులు లేవు. వారు నోట్లు ముద్రించారు. వారికి ఆయుధాల తయారీ ఫ్యాక్టరీలు లేవు. అయినప్పటికినీ వారికి డబ్బుకు, ఆయుధాలకు కొరతలేదు. అవి వారికి ఎక్కడినుంచి వస్తున్నాయి? వారికి అవసరమైన ఆ సౌకర్యాలను ఎవరు కల్పిస్తున్నారు?
రాజ్య ప్రేరేపిత ఉగ్రవాదమే అన్నిటికన్నా పెద్ద ముప్పును తేనున్నది.
ఇప్పటికీ కొంతమంది టెర్రరిస్టులలో ‘మంచి’ మరియు ‘చెడు’ టెర్రరిస్టులని వేరుచేసి వంచన చేయడం దురదృష్టకరం. ఈ కృత్రిమ తేడాలను గురించి చర్చిస్తూ మనం ఎంతో కాలయాపన చేశాం. అది ఇంకా సహనీయం కాదు. మానవజాతికి మద్దతిస్తున్న శక్తులన్నీ టెర్రరిజంపై సమర్ధవంతంగా పోరాటం చేసేందుకు కలసికట్టుగాఒక్కటి కావాలి. ఉగ్రవాద శక్తులను తుదముట్టించడమే ఈనాటి నాయకత్వానికి నిజమైన పరీక్ష. వాతావరణ మార్పులవల్ల కలిగే దుష్పరిణామాల గురించి అంతర్జాతీయ సమాజం ప్రపంచ దేశాల సదస్సు నిర్వహించారు. అనేక సభలు కూడా జరిగాయి. అదే విధంగా టెర్రరిజంపై జరపవచ్చు కదా?
ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు చెలరేగిపోవడాన్ని నిరోధించడానికి, వారి ఆట కట్టించడానికి నిర్ణీత కాల వ్యవధిలో ప్రపంచ దేశాల సదస్సు నిర్వహించవలసిందిగా ప్రపంచ సంస్థలకు , అన్ని ప్రముఖ దేశాలకు నేను పిలుపు ఇస్తున్నాను. టెర్రరిజం అంతానికి చర్యలు తీసుకోవడంలో ఇంకా ఆలస్యం చేస్తే ఇప్పటి, భావి తరాలు కూడా మనల్ని క్షమించబోరు.
గౌరవనీయ స్పీకర్ గారూ,
వాతావరణ మార్పుల గురించి నేను ప్రస్తావించాను. ఆది మన తరం చూస్తున్న వాస్తవమనడంలో ఎలాంటి సందేహం లేదు.
నదులు ఎండిపోవడం, వాతావరణ అనిశ్చితి వంటివి మన వ్యవసాయంపైన, రైతుల పైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అన్నిటికన్నా ఎక్కువగా కరిగే హిమానీనదాలు, పెరిగే సముద్ర మట్టలు మాల్దీవుల వంటి దేశాల ఉనికికే ప్రమాదంగా మారాయి. సముద్ర సంబంధ కాలుష్యం వల్ల సాగరంపైన, పగడపు దీవులపైన ఆధారపడే వారి జీవనం నాశనమైంది.
గౌరవనీయ స్పీకర్ గారూ,
వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే ముప్పును గురించి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడానికి మీరు విప్లవాత్మకంగా, ధైర్యంతో సముద్రం మధ్యలో మంత్రివర్గ సమావేశం నిర్వహించిన విషయాన్నీ ఎవరు మరువగలరు?
నిలకడైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి మాల్దీవులు చొరవతో ఆదర్శప్రాయంగా ఎన్నో చర్యలు తీసుకొంది.
వాతావరణ మార్పులవల్ల కలిగే దుష్పరిణామాలను నివారించే దిశలో భారత్, ఫ్రాన్సుతో కలసి సంయుక్తంగా ప్రారంభించిన అంతర్జాతీయ సౌర కూటమిలో మాల్దీవులు చేరడం ముదావహం. భూమండలాన్ని పరిరక్షించేందుకుఆచరణీయమైన చర్యలు తీసుకోవడానికి అనేక దేశాలకు సౌర కూటమి ఒక వేదిక కానున్నది. వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాన్ని అంతం చేయడానికి అక్షయ ఇంధన వినియోగమే బలమైన ప్రత్యామ్నాయం.
2022 నాటికి 175 గిగా వాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది ఇండియా లక్ష్యం కాగా అంచనాలను మించిన ఉత్పత్తి సాధిస్తున్నాం.
ఇటీవల మాలేలో వీధి దీపాల ఏర్పాటు కోసం ఇంధన సామర్ధ్యం గల, పర్యావరణ హితమైన 2500 ఎల్ ఇ డి బల్బులను ఇండియా సరఫరా చేసింది. అంతే కాక రెండు లక్షలకు పైగా బల్బులు మాల్దీవులలోని గృహాలను, దుకాణాలను చేరాయి. వాటివల్ల విలువైన విద్యుత్ వాడకం తగ్గుతుంది. ఈ బల్బులు పర్యావరణ హితమైనవే కాక విద్యుత్ బిల్లు కూడా తగ్గుతుంది.
చిన్న దీవుల అవసరాలను, ఆందోళనలను ఇండియా ప్రత్యెక శ్రద్ధతో పరిగణనలోకి తీసుకోండి. వారి ఇబ్బందులను స్వయంగా పరిష్కరించడమే కాక అంతర్జాతీయ వేదికలలో వారి ఇబ్బందులను గురించి ప్రస్తావించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరాము. అయితే అందరూ కలసివచ్చినప్పుడే సమష్టి యత్నాల ద్వారా ఆశించిన ఫలితాలను సాధించవచ్చు. అయితే కేవలం సాంకేతిక చర్యల ద్వారా వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవచ్చని బావించడం మన తప్పే అవుతుంది. మన విలువలు, విధానాలు, జీవన శైలి మరియు సమాజాలలో మార్పులు రానంత వరకు వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలనుంచి ఉపశమనం పొందలేము. ప్రాచీన కాలం నుంచి భూమిని ‘భూమాత’ అని మనందరం ఆమె బిడ్డలమనే విశ్వాసం మనలో పాదుకొనిపోయి ఉంది. భూగ్రహాన్ని మన తల్లిగా భావించినట్లయితే మనం గౌరవిస్తాము మరియు సంరక్షిస్తాం మరియు ఎలాంటి హాని తలపెట్టబోము. ఈ ఇల్లు, మన భూమి మన సొంత ఆస్తి కాదని భావి తరాలకు ఇచ్చే వారసత్వం అని మనం గుర్తుంచుకోవాలి.
గౌరవనీయ స్పీకర్ గారూ,
ఇకపోతే మూడవ అంశం మన ఉమ్మడి ప్రాంతం ఇండో – పసిఫిక్ గురించి. ప్రపంచంలో సగం జనాభా ఈ ప్రాంతంలోనే నివసిస్తారు. మతాలు, సంస్కృతులు, భాషలు, చరిత్ర మరియు రాజకీయ , ఆర్ధిక వ్యవస్థలు ఎంతో వైవిధ్యభరితంగా ఉంటాయి. అయితే ఈ ప్రాంతంలో జవాబులేని ప్రశ్నలు మరియు అపరిష్కృత వివాదాలు ఎన్నో ఎన్నెన్నో. ఇండో – పసిఫిక్ ప్రాంతం మన ఉనికి ఉన్నంతవరకు పరాధీనము కాగూడనిభాగం. అది మన జీవనరెఖ మాత్రమే కాక వాణిజ్యానికి, సంపద ఆర్జనకు మార్గం ఏ రకంగా చూసినా ఇది మన ఉమ్మడి భవిష్యత్తుకు కీలకం. అందుకే నేను 2018 జూన్ నెలలోనే సింగపూరులోఇండో – పసిఫిక్ ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ కలసికట్టుగా నిష్కాపట్యత, సమైక్యత , సమతుల్యతతో పనిచేయాలని చెప్పాను. దానివల్ల మాత్రమే నియమాలపై ఆధారపడిన వ్యవస్థ మరియు బహుముఖత కొనసాగింపునకు దోహదం చేస్తుంది.
గౌరవనీయ స్పీకర్ గారూ,
హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత , ప్రగతి కోసం నాలుగేళ్ల క్రితం నేను ‘సాగర్’ అనే పేరుతో ఒక స్పష్టమైన ప్రకటన చేశాను. ఇండో – పసిఫిక్ ప్రాంతంలో సహకారానికి అదొక నమూనా. అదే విషయాన్ని నేను మళ్ళి ఈ రోజు దేశాల కలయికతో పని చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్తున్నాను. ఇండియా తనకున్న సామర్ధ్యాన్ని, బలాలను తన సొంత సౌభాగ్యం , భద్రత కోసం మాత్రమే ఉపయోగించుకోదనీ నేను పునరుద్ఘాటిస్తున్నాను. ప్రాంతంలోని ఇతర దేశాల సామర్ధ్యాన్ని పెంచడానికి కూడా మేము ప్రయత్నిస్తాము. అందరి బాగు కోసం పనిచేస్తాము. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవతా సహాయం చేస్తాము. ఉమ్మడి భద్రత కోసం పాటుపడతాము. సమర్ధవంతమైన, బలమైన, సంపన్నమైన ఇండియా కేవలం దక్షిణాసియా, ఇండో – పసిఫిక్ ప్రాంతంలోనే కాక మొత్తం ప్రపంచంలో శాంతి, అభివృద్ధి, భద్రతలకు మారుపేరైన మహాస్తంభంగా నిలుస్తుంది.
గౌరవనీయ స్పీకర్ గారూ,
సాగరతీరంలో ఉన్న పొరుగుదేశమైన మాల్దీవులతో పరస్పర సహకారంతో సముద్ర ఆర్ధిక వ్యవస్థ నుంచి లబ్ధి పొందుతున్నండు వల్ల మాల్దీవులకన్నా మంచి భాగస్వామి ఇండియాకు దొరకదు. ఎందుకంటె మన రెండు దేశాలు మిత్ర దేశాలు. స్నేహంలో చిన్న, పెద్ద, బలవంతుడు, బలహీనుడు అనే తేడాలు ఉండవు. శాంతియుతమైన, సౌభాగ్యవంతమైన ఇరుగుపొరుగు అనేది విశ్వాసం, సుహృద్భావం, సహకారం పైన ఆధారపడి ఉంటుంది. ఒకరి అవసరాలకు, సమస్యలకు, ప్రయోజనాలకు మరొకరు పరస్పరం స్పందిన్చినప్పుడే విశ్వాసం పాదుకుంటుంది. మన ఉమ్మడి విశ్వాసం మరియు భరోసా మంచి రోజులతో పాటు కష్టకాలంలో కూడా బలంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది.
గౌరవనీయ స్పీకర్ గారూ,
“వసుదైకకుటుంబం” అనేది మన తత్త్వం మరియు విధానం. అంటే మొత్తం ప్రపంచం ఒకే కుటుంబం. జాతిపిత మహాత్మాగాంధీ పొరుగువారికి సహాయపడమని చెప్పారు. ‘పొరుగువారికి సేవచేయడానికి పరిమితులు లేవు’ అని కూడా ఆయన అన్నారు. అందుకే భారత్ చేపట్టే అభివృద్ధి భాగస్వామ్యాలు అన్నీ ప్రజలను సాదికారులను చేయడానికే గాని భావి తరాలను రుణగ్రస్తులను చేయడానికో, ఇతరులపై ఆధారపడటాన్ని పెంచడానీకో కాదు.
గౌరవనీయ స్పీకర్ గారూ,
ఇది సవాళ్ళతో కూడిన సంక్లిష్టమైన సంధికాలం. అయితే సవాళ్లతో పాటు అవకాశాలు కూడా వస్తాయి. ఈ రోజు మాల్దీవులకు, ఇండియాకు గల అవకాశాన్ని వినియోగించుకొని ….
చరిత్ర , మన ప్రజలు , ఈ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుంటామని, చేజారనివ్వబోమని ఆశిస్తారు. ఈ ప్రయత్నంలో ఇండియా మీకు పూర్తి సహకారాన్ని అందించగలదని , మాల్దీవులతో విలువైన మైత్రిని భారత్ మరింత గాఢమైన రీతిలో కొనసాగించగలదని ఉద్ఘాటిస్తూ నేను ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను.
ప్రత్యేకంగా గౌరవించి నన్ను ఆహ్వానించినందుకు, సత్కరించినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు. మీ సౌహార్ద మైత్రికి నా కృతజ్ఞతలు.
మీకు కృతజ్ఞతలలతో
***
Honoured to address @mvpeoplesmajlis. Watch my address. https://t.co/0cEhKQk7PJ
— Narendra Modi (@narendramodi) June 8, 2019