పిఎంఇండియా
పంచదార ధరలు ఇటీవల పైకెగస్తున్న పోకడను దృష్టిలో ఉంచుకొని, ”చక్కెర”ను చక్కెర డీలర్ల వద్ద ఉండాల్సిన నిల్వలకు పరిమితులను విధించే పరిధి లోకి తీసుకువచ్చే ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. సుగర్ మిల్స్ వద్ద చక్కెర నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నప్పటికీ, పంచదార టోకు ధరలు, చిల్లర ధరలు పెరిగిన సంగతిని ప్రభుత్వం గమనించింది.
పంచదార లభ్యతను పరిశీలించిన ప్రభుత్వం, దేశ వ్యాప్తంగా పంచదార బజారు ధరలకు రెక్కలు రావటానికి వేరు వేరు అంశాలు కారణం అవుతున్నాయని గ్రహించింది. చక్కెర ధరలు ప్రియమవుతున్న తీరును అదుపు చేయడానికీ టోకు వ్యాపారులు మరియు చిల్లర వ్యాపారస్తులు ఈ సరకును అక్రమంగా దాచడాన్ని తగ్గించడానికీ నిల్వ పరిమితుల పరిధిలో పంచదారను చేర్చవలసిన తక్షణ అవసరం ఉన్నదని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ నిర్ణయం చక్కెర నిల్వ పరిమితులను అమలులోకి తీసుకు రావడానికి, ఇంకా.. చక్కెర సరఫరాలను, చక్కెర పంపిణీని, చక్కెర నిల్వలను, చక్కెర వ్యాపారాన్ని నియంత్రించే అధికారాన్ని రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీలకు దఖలుపరుస్తుంది. చక్కెర ధరలను సహేతుకమైన స్థాయిలో కిందకు దించడానికి, చక్కెర వ్యాపారం చేయడంలో నీతి నియమాలకు లోబడని ధోరణులకు తెగబడడానికి అడ్డుకట్ట వేసేందుకు కూడా ఈ నిర్ణయం తోడ్పడగలుగుతుంది.
***