పర్యాటక రంగంలో సహకారాన్ని పటిష్టం చేసుకోవడం కోసం భారత ప్రభుత్వ పర్యాటక శాఖకు, మాల్దీ వ్ స్ ప్రభుత్వ పర్యాటక శాఖకు మధ్య కుదిరిన ఒక అవగాహన పూర్వక ఒప్పందానికి కేంద్ర మంత్రిమండలి ఈ రోజు ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ ఎమ్ ఒ యు మాల్దీవ్ స్ నుంచి పర్యాటకులు మరింత ఎక్కువ స్థాయిలో భారతదేశానికి తరలివచ్చేందుకు దోహదం చేయనుంది. ఇటీవలి కాలంలో భారతదేశాన్ని సందర్శించే విదేశీ పర్యాటకులలో మాల్దీవ్ స్కు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు.
ధ్యేయాలు:
అవగాహన పూర్వక ఒప్పందం ముఖ్య ధ్యేయాలు ఈ కింది విధంగా ఉన్నాయి.. :
1. పర్యాటక రంగంలో ద్వైపాక్షిక సహకార పరిధిని విస్తరించడం;
2. పర్యాటక రంగ సంబంధిత సమాచారాన్ని ఒక దేశానికి మరొక దేశం ఇచ్చి పుచ్చుకోవడం;
3. హోటళ్లు, టూర్ ఆపరేటర్ల తో సహా పర్యాటక రంగానికి సంబంధించిన వర్గాలన్నింటి మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం;
4. మానవ వనరుల అభివృద్ధిలో సహకారం కోసం ఒక మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించడం;
5. పర్యాటకం, ఆతిథ్య రంగాలలో పెట్టుబడులు పెట్టడం;
6. ఇరు దేశాలలోను పర్యాటకానికి చేయూతను ఇవ్వడం కోసం టూర్ ఆపరేటర్లు/ప్రసార మాధ్యమాలు/ఒపీనియన్ మేకర్ల రాకపోకలను ఏర్పాటు చేయడం;
7. ప్రమోషన్, మార్కెటింగ్, సరికొత్త పర్యాటక స్థలాల అభివృద్ధి, నిర్వహణ లకు సంబంధించి అనుభవాలను పరస్పరం పంచుకోవడం;
8. ఒక దేశం మరొక దేశంలో ట్రావెల్ ఫెయిర్ లు/ ప్రదర్శనలలో పాలు పంచుకోవడం;
9. భద్రమైన, గౌరవనీయమైన, నిలకడ కలిగిన పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుండడం.