Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కొత్త‌గా అనుబంధం ప‌ది పైన సంత‌కాలు చేయడం ద్వారా భార‌త‌దేశం, కెన‌డా ల మ‌ధ్య ఎమ్ ఒ యు లో తొమ్మిదో అనుబంధం విస్త‌ర‌ణ‌ మరియు పునరుద్ధరణ


భార‌త ప్ర‌భుత్వం, శాస్త్రి ఇండో- కెన‌డియ‌న్ ఇన్ స్టిట్యూట్ (ఎస్ ఐ సి ఐ)ల మ‌ధ్య 1968 న‌వంబ‌ర్ లో కుదిరిన అవ‌గాహ‌నాపూర్వక ఒప్పంద పత్రానికి (ఎమ్ ఒ యు) ప‌దో అనుబంధాన్ని (addendum X) చేర్చ‌డానికి, రెన్యూ చేసిన ఒప్పంద పత్రంపైన సంత‌కాలు చేయ‌డానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తొమ్మిదో అనుబంధం (Addendum IX) కాల‌ప‌రిమితిని 2011 ఏప్రిల్ ఒక‌టో తేదీ నుండి 2016 మార్చి 31వ తేదీ మ‌ధ్య‌ వరకు పొడిగించేందుకు కూడా అనుమ‌తించింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఈ అనుమ‌తి ఈ దిగువ కార్య‌క‌లాపాల‌కు వ‌ర్తిస్తుంది:

ఎ. శాస్త్రి రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ మొబిలిటీ ప్రోగ్రామ్

i. శాస్త్రి రీసెర్చ్ ఫెలోషిప్ స్

– డాక్ట‌రేట్ కోసం ప‌రిశోధ‌న‌

– డాక్ట‌రేట్ అనంత‌ర ప‌రిశోధ‌న‌

– సంస్థ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యంతో సాగే ప‌రిశోధ‌న‌

ii. శాస్త్రి మొబిలిటీ ప్రోగ్రామ్

బి. ఫ్యాక‌ల్టీ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ (కొత్త‌ది)

సి. వృత్తి విద్య విభాగంలో ఫ్యాకల్టీ డెవ‌ల‌ప్ మెంట్ ప్రోగ్రామ్ (కొత్త‌ది)

డి. లైబ్ర‌రీ ప్రోగ్రామ్‌

భార‌త స్కాల‌ర్లు, సంస్థ‌ల‌కు ఆన్ లైన్ జ‌ర్న‌ళ్ళు

ఇ. ఫెసిలిటేష‌న్ క‌మ్ ఇన్ఫ‌ర్మేష‌న్ స‌ర్వీసెస్ ( కొత్త‌ది)

i. ఉభ‌య‌దేశాల్లోని సంస్థ‌ల‌కు అనుసంధానం క‌లిగించి ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం కోసం రీసోర్స్ సెంట‌ర్

ii. సెమినార్లు, స‌ద‌స్సులు, క‌న్స‌ల్టేష‌న్ల నిర్వ‌హ‌ణ‌

iii. ప‌రిశోధ‌న ప‌త్రాలు, నివేదిక‌లు, మెటీరియ‌ల్ ప్ర‌చుర‌ణ‌

ఉభ‌య దేశాల మ‌ధ్య స‌హ‌కారాన్ని విస్త‌రించ‌డానికి కొత్త రంగాల్లోకి ప్ర‌వేశించేందుకు వీలుగా మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ ఏవైనా కార్య‌క్ర‌మాలు సిఫార‌సు చేస్తే ఎస్ ఐసిఐ వాటిని నిర్వ‌హిస్తుంది.

గ్లోబ‌ల్ ఇనీషియేటివ్ ఫ‌ర్ అకాడ‌మిక్ నెట్ వ‌ర్క్స్ (జి ఐ ఎ ఎన్), ఇంపాక్టింగ్ రీసెర్చ్, ఇన్నోవేష‌న్ అండ్ టెక్నాల‌జీ (IMPRINT), నేష‌న‌ల్ డిజిట‌ల్ లైబ్ర‌రీ వంటి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ నిర్వ‌హ‌ణ‌లోని ప‌లు కార్య‌క్ర‌మాలు కూడా ఎస్ ఐ సి ఐ ఆచ‌ర‌ణీయం చేస్తుంది. ఉభ‌య దేశాల మ‌ధ్య 2010లో కుదిరిన, మ‌రో ఐదు సంవ‌త్స‌రాల పాటు పొడిగించేందుకు అవ‌కాశం ఉన్న‌ ఉన్న‌త విద్యా స‌హ‌కార అవ‌గాహ‌నా ఒప్పందం కింద నిర్వ‌హించాల్సిన కార్య‌క్ర‌మాలు కూడా ఈ సంస్థ చేప‌డుతుంది.

ప‌ద‌వ అనుబంధం అమ‌లులో ఉండే ఐదేళ్ళ కాలానికి… అంటే 2016 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 మ‌ధ్య కాలానికి 33.176 కోట్ల రూపాయ‌ల వ్య‌యాన్ని హెచ్ ఆర్ డి మంత్రిత్వ శాఖ ఆమోదించింది.

పూర్వ రంగం :

ఉభ‌య దేశాల మ‌ధ్య ఉమ్మ‌డి సంస్థ‌గా ఎస్ ఐ సి ఎల్ 1968లో ఏర్పాట‌యింది. ఉభ‌య‌ దేశాలు ఇందుకు అనుగుణంగా 1968 న‌వంబ‌ర్ 29వ తేదీన కేంద్ర‌ప్ర‌భుత్వం, ఎస్ ఐ సి ఎల్ ఎమ్ ఒ యు ను కుదుర్చుకున్నాయి. మొద‌ట మూడు సంవ‌త్స‌రాల కాలానికి ఈ అంగీకారం కుదిరింది. అప్ప‌టి నుండి ఎప్ప‌టిక‌ప్పుడు మంత్రిమండలి ఆమోదంతో ప్ర‌త్యేక అనుబంధాలను చేర్చ‌డం ద్వారా ఒప్పందాన్ని పొడిగిస్తూ వ‌స్తున్నారు. ఇందుకు అనుగుణంగానే తొమ్మిదో అనుబంధంపై 2011 మార్చి 31వ తేదీన సంత‌కాలు చేశారు. దీని కాల‌ప‌రిమితి ఐదు సంవ‌త్స‌రాలు.

పూర్వ ప్ర‌ధాని కీర్తిశేషుడు శ్రీ లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి పేరిట ఎస్ ఐ సి ఐ ని ఏర్పాటు చేశారు. భార‌త‌, కెన‌డా ల మ‌ధ్య విద్యారంగంలో స‌హ‌కారం, కార్య‌క‌లాపాల విస్త‌ర‌ణ ఈ ఒప్పందం ల‌క్ష్యం. ఈ సంస్థ రెండు దేశాల్లోనూ కార్యాల‌యాలు క‌లిగి ఉంటుంది. ఉభ‌య దేశాల‌కు చెందిన విద్యా సంస్థ‌లకు లాభ‌దాయకంగా ఉండే విధంగా ఫెలోషిప్ లు, ఉమ్మ‌డి ప‌రిశోధ‌నా కార్య‌క‌లాపాలను ఎస్ ఐ సి ఐ చేప‌డుతుంది.. మొద‌ట్లో ఈ సంస్థ త‌న కార్య‌క‌లాపాలను సామాజిక శాస్త్రాలు, హ్యుమానిటీస్ కే ప‌రిమితం చేసింది. 2001 త‌రువాత త‌న కార్య‌క‌లాపాలను లా, మేనేజ్ మెంట్, ఇన్ ఫర్మేష‌న్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాల‌జీ, హ్యూమ‌న్ ఇంట‌ర్ ఫేస్ సైన్స్ విభాగాల‌కు విస్త‌రించింది.

అలాగే ఎస్ ఐ సి ఐ స‌భ్య‌త్వాన్ని కూడా మొద‌ట్లో నాలుగు వ్య‌వ‌స్థాప‌క సంస్థ‌ల‌కే ప‌రిమితం చేయ‌గా త‌దుప‌రి 35 కెన‌డా విశ్వ‌విద్యాల‌యాలు, 54 భార‌తదేశ విద్యా సంస్థ‌ల‌కు విస్త‌రించారు. ఎస్ ఐ సి ఐ లో స‌భ్య‌త్వం గ‌ల సంస్థ‌ల్లో ఇండియ‌న్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐ ఐ ఎమ్ లు), ఇండియ‌న్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐ ఐ టి లు), నేష‌న‌ల్ లా స్కూళ్ళు, నేష‌న‌ల్ మ్యూజియం ఇన్ స్టిట్యూట్, ప‌రిశోధ‌నా రంగంలోని అత్యున్న‌త స్థాయి సంస్థ‌లు, సంఘాలు, కేంద్ర‌, రాష్ర్ట‌ ప్ర‌భుత్వాల నిర్వ‌హ‌ణ‌లోని ప్ర‌ముఖ విశ్వ‌విద్యాల‌యాలు ఉన్నాయి.

గ‌తంలో బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్స్ గా వ్య‌వ‌హ‌రించిన కార్య‌నిర్వాహ‌క మండ‌లి ఎస్ ఐ సి ఐ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లను చేప‌డుతుంది. భార‌తదేశం, కెన‌డా ల‌కు చెందిన ముగ్గురేసి కౌన్సిల్ స‌భ్యులు, ఉభ‌య ప్ర‌భుత్వాల ప్ర‌తినిధులు ఇందులో స‌భ్యులుగా ఉంటారు. ఢిల్లీలోని ఎస్ ఐ సి ఐ కార్యాల‌యం నిర్వ‌హ‌ణ‌కు, కెన‌డాలో భార‌త ప‌రిశోధ‌న‌ల ప్రోత్సాహానికి అవ‌స‌ర‌మైన నిధుల‌ను భార‌తదేశ ప్ర‌భుత్వం కేటాయిస్తుంది. అలాగే కెన‌డా ప్ర‌భుత్వం, కెన‌డాకు చెందిన ఇత‌ర సంస్థ‌ల నుండి కూడా నిధులు అందుతాయి.

***