పిఎంఇండియా
మాననీయ మహోదయులు అధ్యక్షుడు శ్రీ మాగూఫూలి,
విశిష్ట అతిథులారా,
మీ సహృదయ వ్యాఖ్యలకు, ఉదాత్తమైన ఆతిథ్యానికీ, అలాగే నాకు, నా ప్రతినిధి బృందానికి మీరు అందజేసిన స్వాగత సత్కారాలకుగాను గౌరవనీయ అధ్యక్షుల వారికి ఇవే నా కృతజ్ఞతలు.
ఈ రోజు ఆదివారమైనప్పటికీ, మీరందరూ నా కోసం సమయాన్ని కేటాయించారు. ఇందుకు గాను నేను మీ పట్ల కృతజ్ఞుడిని.
స్నేహితులారా,
శాంతికి ప్రతిరూపమైన ఈ చైతన్యశీల నగరం దార్ ఎస్ సలామ్ ను సందర్శించినందుకు నాకెంతో సంతోషంగా ఉంది.
స్వాహిలీ భాష లో “హేరీ యాకో హేరీ యాంగు” అని ఒక సామెత ఉంది. దీని అర్థం “మీ సంతోషమే నా సంతోషం” అని నా దృష్టికి తీసుకువచ్చారు.
ఇదే స్ఫూర్తి తో నేను ఈ రోజు టాంజానియాకు విచ్చేశాను. మన రెండు దేశాల మధ్య సంబంధాలకు చరిత్రాత్మక పూర్వ రంగం ఉంది. శతాబ్దాల క్రితం నుంచే మన ప్రజలు ఒకరికొకరు తెలుసు. హిందూ మహాసముద్ర జలాలు మనల్ని కలుపుతున్నాయి. మన రెండు దేశాలు బలమైన సముద్ర సంబంధి సంప్రదాయాలు కలిగి ఉన్నాయి.
హిందూ మహాసముద్ర జలాల వ్యాప్తంగా ఉన్న సానుకూల పవనాలను మనం శతాబ్దాల నుండీ నియంత్రించుకున్నాము. మనం ఈ రోజు ఒకరిపై ఒకరు ఆధారపడిన ప్రపంచం గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే గతంలో 18వ శతాబ్దంలో గుజరాత్ లోని మాండ్వీ రేవు, జాంజీబార్ రేవు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉండేవి. గుజరాత్ లోని మాండ్వీ రేవు వర్తకులు స్వాహిలీ పడవుల కోసం ఆతృతగా వేచి ఉండే వారు.
నా సొంత రాష్ట్రానికి చెందిన వారే మీ ఘనమైన దేశానికి ప్రప్రథమంగా వలస వచ్చారు. భారతదేశం నుండి వచ్చిన ప్రజలు ఈ రోజు టాంజానియాలోని వ్యాపారం, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలకు ప్రధాన భూమికను పోషిస్తున్నారు.
ఇటీవలి దశాబ్దాలలో అధ్యక్షుడు శ్రీ న్యరేరే కాలం నుండీ మనం పంచుకున్న విలువలు, ఉమ్మడి ఆందోళనలు, మన ప్రగతి, మన శ్రేయస్సు కోసం మన ప్రజలకున్న బలమైన కోరికలు మన బంధాలను నిర్వచిస్తున్నాయి.
స్నేహితులారా,
వాణిజ్య బంధాలు, వ్యాపారం, పెట్టుబడుల సంబంధాలు, సహకారంలో అభివృద్ధి ఇటీవలి కాలంలో వృద్ధి చెందాయి. ఈ రోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న దేశంగా ఆవిర్భవించింది.
అలాగే ఈ ఉపఖండంలో టాంజానియా కూడా ముఖ్యమైన ఆర్ధికవ్యవస్థలలో ఒకటిగా ఉంది. అధ్యక్షుడు శ్రీ మాగూఫూలితో నా సవివరమైన చర్చల్లో పూర్తి స్థాయి భాగస్వామ్యాన్ని గురించిన అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.
మన కీలక అభివృద్ధి ప్రాధాన్యాలు, మన సాధారణ భద్రతా అవసరాల స్ఫూర్తి తో మన సమగ్ర సహకార కార్యాచరణను రూపొందించడం జరిగింది. 21వ శతాబ్దంలో భాగస్వామ్యానికి ఈ చర్చలు పునాది వేస్తాయి.
స్నేహితులారా,
టాంజానియా అభివృద్ధి పథంలో భారతదేశం ఒక నమ్మకమైన భాగస్వామిగా గతంలో ఉంది. భవిష్యత్తులో కూడా ఉంటుంది.
అదే విధంగా –
• మీ వ్యవసాయాన్ని ఆధునికీకరించడం;
• మీ విద్యా, ఆరోగ్య పరిరక్షణ విధానాలను విస్తరించడం ;
• ఆర్ధిక వ్యవస్థలో పారిశ్రామికీకరణ;
• యువతకు నైపుణ్యాభివృద్ధి;
• మీ సామర్ధ్యాలనూ, సంస్థలను నిర్మించడం;
• మీ ప్రజలకు, సమాజానికీ భద్రత కల్పించడం వంటి రంగాలలో
భారతదేశాన్ని ఒక నమ్మకమైన స్నేహితునిగా మీరు గుర్తిస్తారు.
స్నేహితులారా,
– మీ దేశాభివృద్ధి కోసం
– గౌరవనీయులైన అధ్యక్షుడు శ్రీ జాన్ మాగూఫూలి ఆరోగ్యం కోసం, విజయం కోసం
– గొప్ప దేశమైన సంయుక్త గణతంత్ర టాంజానియాకు చెందిన స్నేహ పూర్వకమైన, ఆదరణ పూర్వకమైన మీ ప్రజల ప్రగతి, శ్రేయస్సు కోసం
– భారతదేశం, టాంజానియా ల మధ్య ఎడతెగని స్నేహాన్ని, భాగస్వామ్యాన్నిపెంపొందించడం కోసం
నాతో చేతులు కలపవలసిందిగా కోరుకుంటున్నాను.