పిఎంఇండియా
ప్రియమైన నా దేశ వాసులారా.. మీకు అందరికీ నమస్కారాలు. ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమంలో ఇది 12వ సంచిక. మరొకలా చూస్తే ఇప్పటికి ఏడాది గడచిపోయింది. గత సంవత్సరం అక్టోబర్ 3న మొదటి సారి ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) చెప్పుకొనే సౌభాగ్యం నాకు కలిగింది. ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) లో ఒక సంవత్సరంలో ఎన్నెన్నో మాటలు. దీని వల్ల మీరు ఏం పొందారో నాకైతే తెలియదు; కానీ, నేనైతే ఎంతో పొందానని తప్పకుండా చెప్పగలను. ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తికి ఎంతో గొప్పదనం ఉంది. నా జీవితంలో ఓ ప్రాథమిక ఆలోచన ఉంది.. దానితో ప్రజల శక్తి మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. అయితే ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమం ద్వారా నేను నేర్చుకున్నదీ, నాకు అర్థమైందీ, నేను తెలుసుకున్నదీ, పొందినదీ.. వీటి వల్ల నేను చెప్పేది ఏమిటంటే- మనం ఆలోచిస్తాం; అంతకంటే ఎక్కువగా జనశక్తి అపారమైంది అని. మన పూర్వీకులు చెబుతుండే వారు ప్రజలు భగవంతుడి అంశలో భాగమని. ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) ద్వారా నాకు అనుభవమైంది ఏమిటంటే, మన పూర్వీకుల ఆలోచనలలో ఒక గొప్ప శక్తి ఉన్నదీ, గొప్ప నిజం ఉన్నదీ అని. ఎందుకంటే- వీటిని నేను అనుభవించాను. ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమం ద్వారా నేను ప్రజల నుండి సలహాలు కోరాను. అయితే, ప్రతి సారి రెండు సలహాలు, లేదా నాలుగు సలహాలు అందేవి. కానీ, లక్షల సంఖ్యలో ప్రజలు చైతన్యవంతులై నాకు సలహాలు పంపిస్తూ ఉండే వారు. ఇది దానంతటదే ఒక గొప్ప శక్తి; లేకుంటే, ప్రధాన మంత్రికి సందేశం పంపించాం, మై గవ్ డాట్ ఇన్ లో రాశాం. ఉత్తరాలు పంపించాం, కానీ ఒక్కసారి కూడా మాకు అవకాశం దొరకలేదు.. అని ఎవరైనా నిరాశకు లోనుకావచ్చు. కానీ, నాకు అలా అనిపించలేదు.
అవును.. ఈ లక్షలాది ఉత్తరాలు నాకొక పెద్ద పాఠాన్ని నేర్పించాయి. ప్రభుత్వంలోని అనేక సున్నితమైన కష్టాల విషయంలో నాకు సమాచారం అందుతూ ఉండేది. నేను ఆకాశవాణికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే, శ్రోతల నుండి వచ్చే సలహాలను వారు కేవలం కాగితం ముక్కలు అని అనుకోకుండా, వాటిని సామాన్య ప్రజల ఆకాంక్షలుగా భావించారు. దీనిని తర్వాత వాళ్లు ఒక కార్యక్రమంగా చేశారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాలను ఆకాశవాణికి ఆహ్వానించారు; ప్రజలు చెప్పిన విషయాలను వారి ముందు ఉంచారు. కొన్ని విషయాలను తోసిపుచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంలోని మా వివిధ శాఖలు ఈ ఉత్తరాలపై విశ్లేషణ జరిపాయి. వీటిలో ప్రభుత్వ విధాన నిర్ణయం ఏం ఉంది ? ఏ వ్యక్తిగత కారణాల వల్ల ఆందోళనలు కలుగుతున్నాయి ? పరద భుత్వ దృష్టిలోనే లేని ఏ అంశాలున్నాయి ? చాలా విషయాలు క్షేత్ర స్థాయి నుండి ప్రభుత్వానికి చేరడం మొదలయింది. పాలనలో ఒక మూల సూత్రం ఉంది.. అదేమిటంటే – సమాచారం కింది స్థాయి నుండి పై స్థాయికి చేరుతుండాలి అనేది. ఇది వాస్తవం. ఆదేశాలు పై నుండి కింది స్థాయికి వెళ్తుండాలి. ఈ సమాచార స్రవంతి ‘మన్ కీ బాత్’ (మనసులో మాట)గా మారుతుందని ఎవరు అనుకున్నారు ? కానీ, ఇది జరిగింది. అదే విధంగా ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) సమాజ శక్తిని తెలియజేసే ఒక అవసరంగా మార్పు చెందింది. నేను ఒక రోజు అన్నాను ‘సెల్ఫీ విత్ డాటర్’ అని. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది: దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల నుండి ఎవరో ఒకరు.. లక్షలాదిగా ‘సెల్ఫీ విత్ డాటర్’ ను అనుసరించారు. దీనితో కుమార్తెలకు ఎంతో గౌరవం లభించింది. వాళ్లు ‘సెల్ఫీ విత్ డాటర్’ చేస్తున్నప్పుడు అది వారి కుమార్తె ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేది; వారి లోలోపల కూడా ఒక నిబద్ధతను పెంపొందిస్తూ ఉండేది; ప్రజలు చూసినప్పుడు ఆడపిల్లల పట్ల నిర్లక్ష్యం విడిచి పెట్టాలని వాళ్లకు కూడా అనిపిస్తుండేది. ఓ నిశ్శబ్ధ విప్లవం వచ్చింది.. భారతదేశంలో పర్యాటక రంగాన్ని దృష్టిలో పెట్టుకుని పౌరులందరికీ విజ్ఞప్తి చేశాను ‘ఇన్ క్రెడియబుల్ ఇండియా’ సోదరులారా.. మీరు కూడా వివిధ ప్రదేశాలకు వెళ్తుంటారు, ఏదైనా మంచి ఫొటో ఉంటే పంపించండి నేను చూస్తాను అని. ఏదో తేలికగా అనేశాను. కానీ ఎంత పెద్ద ప్రతిస్పందన. లక్షలాదిగా దేశం నలుమూలలా నుంచి ప్రజలు ఫొటోలు పంపించారు. మన దగ్గర ఎటువంటి వారసత్వ సంపద ఉన్నదో – కేంద్ర పర్యాటక శాఖ గానీ, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని పర్యాటక విభాగాలు గానీ ఎప్పుడూ ఆలోచించి కూడా ఉండవు. ప్రభుత్వ సొమ్ము ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండానే అన్ని అంశాలు ఒకే వేదిక పైకి వచ్చి చేరాయి. ప్రజలు పనిని పెంచేశారు. గత ఏడాది అక్టోబర్ నెలలో మొదటిసారి మన్ కీ బాత్ (మనసులో మాట) కార్యక్రమం సందర్భంగా నేను గాంధీ జయంతిని గురించి ప్రస్తావించాను, అక్టోబర్ 2న మహాత్మ గాంధీ జయంతిని నిర్వహిస్తున్నామని విజ్ఞప్తి చేయడానికి ఎంతో సంతోషించాను.
ఒకప్పటి ఖాదీ ఫర్ నేషన్ (దేశం కోసం ఖాదీ). ప్రస్తుత పరిస్థితులలో దీని అవసరం లేదా ? ఖాదీ దుస్తులు కొనుగోలు చేయండని ప్రజలకు నేను విజ్ఞప్తి చేశాను. మీ వంతు సహకారాన్ని అందించండి. గత ఏడాది కాలంలో ఖాదీ విక్రయాలు దాదాపు రెట్టింపయ్యాయని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇది ప్రభుత్వ ప్రకటనల వల్ల జరగలేదు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల కాలేదు. ప్రజల శక్తికి ఒక నిదర్శనం. ఒక అనుభూతి. ఒకసారి నేను మన్ కీ బాత్ – (మనసులో మాట) ద్వారా చెప్పాను. పేదల ఇళ్లలో పొయ్యి వెలుగుతుంది, పిల్లలు ఏడుస్తుంటారు… ఆ పేద తల్లికి గ్యాస్ సిలిండర్ అవసరం లేదా..? మీరు రాయితీని వదులుకోలేరా.. అని ధనికులకు నేను విజ్ఞప్తి చేశాను.
ఆలోచించండి… ఈ దేశంలో 30 లక్షల కుటుంబాలు గ్యాస్ సిలిండర్ పై రాయితీని వదులుకున్నారని తెలియజేయడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. వాళ్లంతా ధనికులు కాదు. నేనొక టీవీ ఛానల్ చూశాను, ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు, వితంతు మహిళ, తమ రాయితీని వదులుకోవడానికి బారులు తీరి నిలబడ్డారు. సమాజంలోని సామాన్యులు, మధ్యతరగతి వర్గాలు, దిగువ మధ్యతరగతి వర్గాల వారు రాయితీని వదులుకోవడం కష్టమైన పనే. కానీ అలాంటి వాళ్లు కూడా వదులుకున్నారు. ఇదొక నిశ్శబ్ద విప్లవం కాదా…? ఇది ప్రజల శక్తికిది నిదర్శనం. మన ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే పని… కార్యాలయాల వెలుపల సమర్ధమైన, శక్తిమంతమైన సంకల్పంతో కూడిన జన శక్తి సమాజం ఉందనే విషయం ప్రభుత్వానికి బోధపడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఎంత ఎక్కువగా సమాజంతో కలసి పనిచేస్తాయో, అంత ఎక్కువగా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఒక మంచి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. ‘మన్ కీ బాత్’ ద్వారా ఏ విషయాల్లో నాకు నమ్మకం ఉండేదో…. ఇప్పుడు వాటిపై విశ్వాసం పెరిగింది. ఆసక్తి పెరిగింది; ఇందుకోసం ఈ రోజు ‘మన్ కీ బాత్‘ కార్యక్రమం ద్వారా ప్రజల శక్తికి శతాధిక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి చిన్న విషయాన్ని తమదిగా చేసుకున్నారు, దేశ శ్రేయస్సులో భాగమయ్యేందుకు కృషి చేశారు. ఇంతకు మించిన సంతోషం ఏముంటుంది. ‘మన్ కీ బాత్‘ (మనసులో మాట) కార్యక్రమంలో ఈసారి నేనొక కొత్త ప్రయోగం చేయాలనుకున్నాను. ఫోన్ చేసి తమ ప్రశ్నలను, తమ సూచనలు, సలహాలను నమోదు చేయాలని దేశంలోని పౌరులందరికీ నేను విజ్ప్తి చేశాను, వాటిపై దృష్టి పెడతానని అన్నాను. దేశం నలుమూలల నుంచి దాదాపు 55 వేలకు పైగా ఫోన్ కాల్స్ నాకు వచ్చాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సియాచిన్ నుంచి కానీ, కచ్ ప్రాంతం నుంచి కానీ, కామరూప్, కాశ్మీర్ లేదా కన్యాకుమారి నుంచి గానీ – ఫోన్ కాల్ చేయని ప్రాంతమంటూ ఏదీలేదు. అన్ని ప్రాంతాల నుంచి ఫోన్లు చేశారు. ఇదొక సంతోషకరమైన అనుభూతి. అన్ని వయస్సుల వారు వారి సందేశం పంపించారు. కొన్ని సందేశాలను నేను స్వయంగా వినడానికి ఇష్టపడ్డాను, చాలా బాగున్నాయి. మిగతా వాటిపై నా బృందం పనిచేస్తోంది. మీరు ఒకటి రెండు నిమిషాలు సమయం వెచ్చించి ఉంటారు. మీ ఫోన్లు, మీ సందేశాలు నాకు ఎంతో ముఖ్యమైనవి. మీ సలహాలు, సూచనలపై మొత్తం ప్రభుత్వం తప్పకుండా దృష్టి పెడుతుంది. అయితే నాకొక విషయం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలగజేస్తోంది – మన చుట్టూ వ్యతిరేకత, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది. కానీ, నా అనుభవం మరోలా ఉంది. ఈ 55 వేల మంది వారికి నచ్చిన విధంగా తమ తమ విషయాలను తెలియజేయాల్సింది. వారికి ఏ అడ్డంకులు లేవు. ఏదైనా చెప్పే వీలుంది. కానీ నాకు ఆశ్చర్యమేస్తోంది. వారు చెప్పిన విషయాలు ఎలా ఉన్నాయంటే, వాటిపై ‘మన్ కీ బాత్‘ ప్రభావం ఉందనిపిస్తోంది. వారు చెప్పిన విషయాలన్నీ సానుకూల దృక్పథంతో ఉన్నాయి. మంచి సలహాలుగా ఉన్నాయి. సృజనాత్మకంగా ఉన్నాయంటే చూడండి. దేశంలో సామాన్య పౌరులు కూడా సానుకూల ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఇది దేశానికి ఎంత పెద్ద పెట్టుబడి అవుతుందో ఆలోచించండి. తీవ్రమైన ఫిర్యాదుల వంటివి ఒక శాతం లేదా రెండు శాతం ఫోన్లు ఉండవచ్చు. 90 శాతం కంటే ఎక్కువ మంది సంతోషాన్ని, ఆనందం కలిగించే విషయాలు తెలిపారు. నాకు మరో విషయం గుర్తుకొచ్చింది – ప్రత్యేకించి వికలాంగులు, అందులోనూ అంధులు మన వాళ్లు.. వారి వద్ద నుండి ఎన్నో ఫోన్లు వచ్చాయి. అయితే ఇందుకు కారణం ఏమిటంటే, వాళ్లు టీవీ చూడలేరు గనుక రేడియో తప్పక వింటుంటారు. చూపు లేని వారికి రేడియో ఎంత గొప్ప సాధనమో, దీని ద్వారా నాకు తెలిసింది. నేను మరో కొత్త కోణం చూస్తున్నాను. వాళ్లంతా ఎన్ని మంచి విషయాలు తెలియజేశారో. ప్రభుత్వాన్ని చైతన్యవంతం చేయడానికివి చాలు. రాజస్థాన్ లోని అల్ వర్ నుండి శ్రీ పవన్ ఆచార్య ఓ సందేశాన్ని పంపించారు. శ్రీ పవన్ ఆచార్య చెప్పిన విషయాలు దేశం మొత్తానికి వినిపించాలనుకుంటున్నాను. దేశమంతా దీన్ని అంగీకరించాలని భావిస్తున్నాను. తప్పకుండా వినండి ఆయనేం చెప్పాలనుకుంటున్నాడో.
‘నా పేరు పవన్ ఆచార్య. నేను రాజస్థాన్ లోని అల్ వర్ కు చెందినవాడిని. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈసారి దీపావళికి మట్టితో చేసిన ప్రమిదలు ఎక్కువగా వాడాలని మీరు ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేయాలని కోరుకుంటున్నాను. దీంతో పర్యావరణ ప్రయోజనం కలగడంతో పాటు వేలాది కుమ్మరులకు ఉపాధి కలుగుతుంది. ధన్యవాదాలు’ అని.
శ్రీ పవన్ లాగే మీ అభిప్రాయాలు కూడా దేశం నలుమూలలా చేరుతాయని, వ్యాపిస్తాయని నేను భావిస్తున్నాను. మంచి సలహా ఇచ్చారు. మట్టి కోసం ధర చెల్లించాల్సిన అవసరం ఉండదు. మట్టి ప్రమిదలు అమూల్యమైనవి. పర్యావరణ పరిరక్షణ దృష్టితో చూసినప్పుడు వాటికి ప్రాముఖ్యం ఉంది. ప్రమిదలను పేదలు తయారుచేస్తారు. దీంతో వారికి ఉపాధి లభిస్తుంది. శ్రీ పవన్ ఆచార్య చెప్పినట్లు రాబోయే పండుగలకు మనం ఇళ్లలో మట్టి ప్రమిదలు వెలిగిస్తే పేదల ఇళ్లలో వెలుగులు నిండుతాయి.
ప్రియమైన నా దేశవాసులారా… వినాయక చవితి నాడు మన సైనికులతో రెండు మూడు గంటలు గడిపే అవకాశం నాకు లభించింది. దేశ భూభాగాన్ని, సముద్రాలను, ఆకాశాన్ని పరిరక్షించేవి మన సైన్యం, నావికాదళం, వాయుసేన. 1965లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగి, 50 ఏళ్లు పూర్తయ్యాయి. దానికి సంబంధించి న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద శౌర్యాంజలి ప్రదర్శనను ఏర్పాటుచేశారు. దాన్ని నేనెంతో ఆసక్తిగా చూశాను. అర్థ గంట కోసం వెళ్లాను. కానీ బయటకు వచ్చేసరికి రెండున్నర గంటలు అయిపోయాయి. మరికొన్ని చూడాల్సినవి ఉండిపోయాయి. చరిత్ర మొత్తం సజీవంగా కనిపించింది. కళా సౌందర్యం దృష్టితో చూస్తే ఉత్తమంగా ఉంది, చరిత్రాత్మక దృష్టితో చూస్తే విజ్ఞానవంతంగానూ, జీవితంలో ప్రేరణ కోసమైతే మాతృభూమి సేవ కోసం ఇంతకుమించి ప్రేరణనిచ్చేది ఏదీ ఉండదు. యుద్ధంలో మన సైనికులు ప్రదర్శించిన సాహసోపేత ఘడియలు, మన సైనికుల ధైర్యసాహసాలు, వారి త్యాగాల గురించి మనం వింటూ ఉండేవాళ్లం. ఆ సమయంలో అన్ని ఫొటోలు కూడా లభించేవి కావు, వీడియోగ్రఫీ కూడా అంతగా ఉండేది కాదు. ఈ ప్రదర్శన ద్వారా ఆనాటి అనుభూతి కలుగుతుంది. హాజీపూర్‌లో జరిగిన పోరాటం కానీయండి, ఉత్తరాదిన జరిగిన పోరాటం గానీ, చమిండాలో జరిగినది కానీయండీ, హాజీపూర్ పాస్ వద్ద సాధించిన విజయ దృశ్యాలను చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మన సైనికుల పట్ల మనకెంతో గర్వం కలుగుతుంది. ఈ వీరుల కుటుంబాలను కలిసే అవకాశం కూడా నాకు లభించింది. ప్రాణాలను బలిదానం చేసిన వారి కుటుంబాలను కూడా కలుసుకున్నాను. యుద్ధంలో పాల్గొన్న వారిని కలిశాను, వీరంతా వారి జీవితాల చరమ దశలో ఉన్నారు. వారితో కరచాలనం చేసినప్పుడు అనిపించింది, వాహ్….. ఎంత శక్తి ఉంది. ఎంతో ప్రేరణనిస్తుంది. మనం చరిత్ర సృష్టించాలంటే చరిత్ర గురించిన సున్నితమైన విషయాలను తెలుసుకొని, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర మన వారసత్వంతో కలుపుతుంది. చరిత్రతో మన సంబంధాలు తెగిపోతే, చరిత్ర సృష్టించే అవకాశాలు కూడా నిలచిపోతాయి. ఈ శౌర్య ప్రదర్శన ద్వారా చరిత్ర అనుభూతి కలుగుతుంది. మనకు చరిత్ర తెలుస్తుంది, కొత్త చరిత్రను సృష్టించేందుకు అవసరమైన బీజాలు మొలకెత్తుతాయి. నేను మిమ్మల్ని, మీ కుటుంబాలను ఒకవేళ మీరు ఢిల్లీ చుట్టుపక్కల ఉంటున్నట్లయితే – ఈ ప్రదర్శన మరికొన్ని రోజులు ఉంటుందనుకుంటున్నాను – మీరు తప్పకుండా చూడండి. నాలాగా త్వరత్వరగా చూసి వెళ్లిపోవద్దు. నేను రెండున్నర గంటల్లోనే తిరిగి వెళ్లిపోయాను. కానీ మీకు మూడు, నాలుగు గంటలు పడుతుంది; తప్పకుండా చూడండి.
ప్రజాస్వామ్య బలమేంటో చూడండి. ఒక చిన్న బాలుడు ప్రధాన మంత్రిని ఆదేశించాడు. కానీ ఆ బాలుడు తొందరపాటుతో తన పేరు చెప్పడం మరచిపోయాడు. అతని పేరేంటో నాకు తెలియదు. కానీ అతని మాటలు ప్రధాన మంత్రి దృష్టిని ఆకర్షించేవిగా ఉన్నాయి, కానీ దేశవాసులందరు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వినండి ఈ బాలుడు మనకేం చెబుతున్నాడో….
“ప్రధాన మంత్రి మోదీ గారు…. మీరు అమలు చేస్తున్న స్వచ్ఛత కార్యక్రమం కింద అన్నిచోట్లా, అన్ని వీధుల్లో కుప్ప తొట్టి ఏర్పాటుచేయండి” అని.
ఈ బాలుడు చెప్పింది నిజమే. మనం పరిశుభ్రతను మన స్వభావంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రతకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. ఈ బాలుడి సందేశంతో నాకొక గొప్ప సంతోషం కలిగింది. సంతోషం ఎందుకంటే – అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రవేశపెడుతూ ప్రకటన చేశాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి పార్లమెంట్లో పరిశుభ్రత అంశంపై గంటల కొద్దీ చర్చ జరుగుతోంది. మా ప్రభుత్వం మీద విమర్శలు కూడా వస్తాయి. నాకు కూడా వినాల్సి వస్తూ ఉంటుంది. మోదీ గారు పెద్ద పెద్ద మాటలు చెబుతారు స్వచ్ఛత గురించి, కానీ ఏం జరిగింది అని. నేను దాన్ని తప్పుగా అనుకోను; నేను దీంట్లో మంచిని చూస్తున్నాను. అది దేశ పార్లమెంట్ కూడా పరిశుభ్రత గురించి చర్చించడం. ఇంకోవైపు చూడండి. ఒకవైపు పార్లమెంటేరియన్లు, మరోవైపు దేశంలోని పసివాళ్లు… ఇద్దరూ పరిశుభ్రత గురించి మాట్లాడుతున్నారు. ఇంతకుమించి దేశానికి సౌభాగ్యం ఇంకేముంటుంది. అభిప్రాయాల ఉద్యమం ఏదైతే నడుస్తోందో దానివల్ల మురికి, మాలిన్యాలను ద్వేషించే పరిస్థితి ఏర్పడుతోంది. పరిశుభ్రత దిశగా ఒక చైతన్యం వచ్చింది. ఇది ప్రభుత్వాలు కూడా పనిచేయక తప్పని స్థితిని కలిగిస్తుంది. స్థానిక స్వపరిపాలన సంస్థలు కూడా అవి పంచాయతీలైనా, నగర పంచాయతీలైనా, నగరపాలికలైనా, మహానగర సంస్థలైనా, ఇంకా రాష్ట్రాలైనా, కేంద్రమైనా…. ప్రతి ఒక్కరికీ దీనిపై పని చేయాల్సి వస్తుంది. ఈ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకువెళ్లాలి. లోపాలున్నా ముందుకే తీసుకెళ్లాలి. ఇంకా 2019 సంవత్సరంలో గాంధీ గారు 150వ జయంతి జరుపుకునే నాటికి ఆయన స్వప్నాలను సాకారం చేసే దిశగా మనం పనిచేయాలి. ఇంకా మహాత్మ గాంధీ ఏం చెప్పేవారో మీకు తెలుసు. ఒకసారి ఆయన ఏమన్నారంటే – స్వాతంత్య్రం, పరిశుభ్రత రెండింటిలో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే తాను పరిశుభ్రతనే ఎంచుకుంటాననీ, స్వాతంత్య్రం ఆ తర్వాతేనని చెప్పారు. గాంధీ జీ కి స్వాతంత్య్రం కంటే పరిశుభ్రతే ముఖ్యమైంది. రండి… మనమంతా కలసి మహాత్మ గాంధీ చెప్పిన మాటని అనుసరిద్దాం. ఆయన కోరికను నెరవేర్చడానికి మనమూ కొన్ని అడుగులు వేద్దాం. ఢిల్లీ నుంచి శ్రీ గుల్షన్ అరోడా గారు మై గవ్ మీద ఒక సందేశాన్ని పంపారు. దీన్ దయాళ్ జీ శత జయంతిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నట్టు ఆయన రాశారు.
నా ప్రియమైన దేశవాసులారా.. మహాపురుషుల జీవితాలు ఎప్పుడూ, ఎల్లప్పుడూ మనకి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇంకా మన పనేమిటంటే మహాత్ముల వైఖరులను, ఆలోచనలను మదింపు చేయడం మన పని కాదు. దేశం కోసం జీవించి, మరణించే వారిలో ప్రతి ఒక్కరూ మనకు స్ఫూర్తి ప్రదాతలే. ఇప్పుడైతే ఎందరో మహాపురుషుల్ని స్మరించుకునే అవకాశం వస్తోంది. సెప్టెంబర్ 25న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అక్టోబర్ 2న మహాత్మ గాంధీ, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి, 11న శ్రీ జయ ప్రకాశ్ నారాయణ, అక్టోబర్ 31న సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్…. ఎన్ని లెక్కలేనన్ని పేర్లున్నాయో చూడండి. నేనైతే చాలా చెబుతున్నాను. ఎందుకంటే దేశం రత్నగర్భ. మీరేదైనా తేదీ చెప్పండి. చరిత్ర పుటలలో నుండి ఎవరో ఒక మహాపురుషుని పేరు దొరకనే దొరుకుతుంది. రానున్న రోజుల్లో ఈ మహాత్ములందరినీ మనం గుర్తు చేసుకుందాం. వారి జీవిత సందేశాలను ఇంటింటికీ చేరుద్దాం. వారి నుండి ఎంతో కొంత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా – అక్టోబర్ 2 విషయం నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అక్టోబర్ 2 పూజ్య బాపూజీ జయంతి. నిరుడు కూడా నేను చెప్పాను. మీ దగ్గర అన్ని రకాల ఫ్యాషన్ దుస్తులు ఉండి ఉంటాయి. అన్ని రకాల ఫ్యాబ్రిక్ ఉంటుంది. చాలా వస్తువులు ఉంటాయి. కానీ వాటిలో ఖద్దరుకు కూడా స్థానం ఉండాలి. నేను మరోసారి చెబుతున్నాను. అక్టోబర్ 2 నుండి నెల రోజులపాటు ఖద్దరు మీద రాయితీ ఉంటుంది. దీని నుండి లబ్ధిని పొందండి. ఖాదీతో పాటు… చేనేతలకు అంతే ప్రాధాన్యం ఇవ్వండి. మన చేనేత సోదరులు ఎంతో శ్రమ పడుతున్నారు. నూట పాతిక కోట్ల మంది దేశవాసులం… 5 రూపాయలో, పదో, యాభై రూపాయలతోనైనా ఏదైనా చేనేత లేదా ఖాదీ వస్తువు కొంటే, అదంతా చివరికి ఆ ఖాదీ నేత కార్మికులకు చెందుతుంది; ఖాదీ వస్త్రం తయారుచేసే పేదింటి వితంతువులకు చేరుతుంది. అందుకే ఈసారి దీపావళి పండుగకు మనం ఖాదీకి మన ఇంట్లో స్థానం కల్పిద్దాం. ఖద్దరు బట్టలు ధరిద్దాం. మీరు పూర్తిగా ఖాదీ ధరించాలని నేను చెప్పడం లేదు. కొంత వరకైనా దీనిని ఆదరించండి. అంతే నేను విజ్ఞప్తి చేసేది. ఇంకా చూడండి. క్రితం సారి అమ్మకాలు దాదాపు రెట్టింపయ్యాయి. ఎంత మంది పేదలకు లబ్ధిని చేకూరిందో. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ప్రకటనలతో చేయలేని పనిని మీ ప్రజలు చిన్నపాటి మద్దతుతో సాధించారు. ఇదే జన శక్తి అంటే. అందుకే నేను మరోసారి ఆ పని కోసం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.
ప్రియమైన దేశవాసులారా…. ఒక విషయంలో నా మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఆ ఆనందాన్ని మీకు కూడా కొంచెం పంచాలనిపిస్తోంది. నేను మే నెలలో కోల్‌కతా కు వెళ్లినప్పుడు శ్రీ సుభాష్ చంద్ర బోస్ కుటుంబ సభ్యులు వచ్చి కలిశారు. ఆయన సోదరుని కుమారుడు శ్రీ చంద్ర బోస్ అంతా ఏర్పాటుచేశారు. శ్రీ సుభాష్ బాబు కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఉల్లాసంగా ఆ సాయంత్రం గడిపే అవకాశం లభించింది. ఆ రోజు నిర్ణయం జరిగింది. శ్రీ సుభాష్ బోసు కుటుంబం అంతా ప్రధాన మంత్రి నివాసానికి రావాలని. శ్రీ చంద్రబోస్, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఆ ఏర్పాట్లలో ఉన్నారు. 50 మందికి పైగా సుభాష్ బోసు కుటుంబ సభ్యులు ప్రధాన మంత్రి నివాసానికి వచ్చే విషయం గత వారం ఖరారైంది. అది నాకెంతో ఆనందం కలిగించే క్షణాలు అవి. మీరు ఊహించగలరు. నేతాజీ కుటుంబ సభ్యులందరూ కలసి, ఒకేసారి ప్రధాన మంత్రి నివాసానికి వచ్చే అవకాశం బహుశా మొదటిసారి లభించింది. కానీ దానికంటే ఆనందం కలిగించే విషయం ఏమిటంటే – అలాంటి మహా మనిషి పరివారానికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం. ప్రధాన మంత్రి నివాసానికి వారు ఎప్పుడూ వచ్చి ఉండదు. అది నాకు అక్టోబర్‌లో దక్కబోతోంది. వేరు వేరు దేశాల్లో ఉంటున్న 50 మందికి పైగా శ్రీ సుభాష్ బాబు కుటుంబ సభ్యులు ఇందుకోసమే ప్రత్యేకంగా వస్తున్నారు. అది నాకెంతో ఆనందం ఇచ్చే క్షణమే కదా అది. వారిని ఆహ్వానించడం కోసం ఎంతో ఆనందానుభూతిని పొందుతున్నాను నేను.
భార్గవి కానడే నుంచి నా కోసం దేశం వచ్చింది. ఇంకా ఆమె చెప్పిన తీరు, కంఠస్వరం, అంతా విన్నాక నాకేమనిపించిందంటే – ఆమె ఒక నాయకురాలు అనిపించింది, నాయకురాలు అవుతుందేమోననిపిస్తోంది.
“నా పేరు భార్గవి కానడే. నేను ప్రధాన మంత్రి గారికి విజ్ఞప్తి చేయదలిచాను. యువతరం ఓటరుగా నమోదు చేసుకునేందుకు చైతన్యపరచండి. రానున్న కాలంలో దీనివల్ల యువతరం భాగస్వామ్యం పెరుగుతుంది. భవిష్యత్ లో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో యువతరం కీలక భాగస్వామ్యం ఉంటుంది. ధన్యవాదాలు” అని.
వోటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడం, వోటు వేయడం గురించి భార్గవి చెబుతున్నారు. మీరు చెప్పేది నిజమే. ప్రజాస్వామ్యంలో ప్రతి వోటరూ దేశ భాగ్య విధాత అవుతారు. ఈ చైతన్యం పెరుగుతోంది. వోటింగ్ శాతం కూడా పెరుగుతోంది. ఇందుకుగాను ముఖ్యంగా – భారత దేశ ఎన్నికల సంఘానికి అభినందనలు చెప్పాలనుకుంటున్నాను. కొన్నేళ్ళ క్రితం మన ఎన్నికల సంఘం కేవలం నియంత్రణ సంస్థగా పనిచేయడం చూసేవాళ్లం. కానీ గత కొన్నేళ్లుగా ఈ స్థితిలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు మన ఎన్నికల సంఘం నియంత్రణ సంస్థ మాత్రమే కాదు. ఒక రకంగా ఫెసిలిటేటర్‌గా మారింది. వోటరు సానుకూల సంస్థగా మారింది. వారి ఆలోచనలు, ప్రణాళికల్లో ఇప్పుడు వోటరే కేంద్ర బిందువుగా మారాడు. ఇదొక మంచి మార్పు. కానీ ఎన్నికల సంఘం ఒక్కటే పని చేస్తుంటే పని నడవదు. మనం కూడా బడి, కళాశాల, వీధులలో ఈ చైతన్యం నింపాలి. ఎన్నికలొచ్చినప్పుడే చైతన్యం తేవాలనుకోవడం సరికాదు. వోటరు జాబితాలు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతూ ఉండాలి. తాజా పరిచేలా మనం కూడా చూస్తూ ఉండాలి.
నాకు లభించిన అమూల్య అధికారం అది సురక్షితంగా ఉందా… లేదా… నా అధికారాన్ని నేను ఉపయోగిస్తున్నానా… లేదా… అని తరచి చూసుకునే అలవాటు మనమందరం చేసుకోవాలి. దేశ యువజనులు వోటర్ల జాబితాలో వారి పేర్లు నమోదు చేసుకోనట్లయితే చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే వోటు కూడా తప్పకుండా వెయ్యాలి. ఎన్నికల సమయంలో అయితే బహిరంగంగానే చెబుతుంటారు. ముందు వోటు… తర్వాతే తిండీతిప్పలు అని. ఈ పవిత్రమైన పనిని ప్రతి ఒక్కరూ విధిగా చెయ్యాలి.
ఈ మధ్య నేను కాశీలో పర్యటించి వచ్చాను. చాలా మందిని కలిశాను. చాలా కార్యక్రమాలు జరిగాయి. ఎంతో మందిని కలిశాను కానీ, ఇద్దరు పిల్లల గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. క్షితిజ్ పాండే అనే ఏడో తరగతి విద్యార్థి కలిశాడు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఏడో తరగతి చదువుతున్నాడు. చాలా తెలివైన, చురుకైనవాడు. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగానే ఉంది. కానీ – ఇంత చిన్న వయసులో భౌతికశాస్త్రం సంబంధిత విషయాలపై అభిరుచి చూశాను. చాలా చదువుతాడనుకుంటా. ఇంటర్ నెట్లో సర్ఫింగ్ చేస్తూ ఉండొచ్చు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తాడనుకుంటా. రైలు ప్రమాదాలు ఎలా అరికట్టాలి…? ఎలాంటి టెక్నాలజీ ఉండాలి…? ఇంధన పొదుపు ఎలా చేయాలి…? ఎలాంటి పరిశోధనలు ఉన్నాయి…? రోబో లో భావనలు ఎలా వస్తాయి….? ఎలాంటెలాంటి మాటలో చెప్పాడు.
చిచ్చర పిడుగు అనుకోండి. సరే, పిల్లాడు చెప్పేదేంటో లోతుగా చూడలేకపోయాడు. అతను చెప్పిన దానిలో సూక్ష్మ పరిజ్ఞానం ఉందో ఏమోకానీ అతని విశ్వాసం, అభిరుచి చూశాను. దేశంలోని పిల్లలందరిలో వైజ్ఞానిక విషయాల మీద అభిరుచి పెరగాలని అనుకుంటున్నాను. పిల్లల మనసుల్లో ప్రశ్నలు ఎల్లప్పుడూ తలెత్తాలి. ఎందుకు….? ఎలా….? ఎప్పుడు….? పిల్లలు మనస్సు పెట్టి ఈ ప్రశ్నలు అడగాలి.
అలాగే సోనం పటేల్.. చాలా చిన్నపిల్ల. నన్ను కలిసింది. తనకు తొమ్మిదేళ్లు. వారణాసిలో సందర్ పూర్ నివాసి. సదావృత్ పేట్ కుమార్తె. చాలా పేదింటి పిల్ల. ఆమె నన్ను అబ్బురపరిచింది. భగవద్గీత అంతా ఆమెకు కంఠోపాఠం. అన్నిటికంటే చకితుల్ని చేసిన విషయం ఏంటంటే…. గీత నుండి అడిగిన శ్లోకం చెప్పింది. ఆంగ్లంలో టీకాటిప్పణీ చెప్పింది. దాని మీద విశ్లేషణ చెప్పింది. హిందీలో కూడా టిప్పణీ చెప్పింది. ఆమె తండ్రిని అడిగితే చెప్పాడు. ఆ పిల్ల ఐదేళ్ల వయసు నుండి ఇలా చెబుతోందని. ఎక్కడ నేర్చుకుందని అడిగాను. వాళ్లకి కూడా తెలీదని చెప్పారు. మిగతా చదువు ఎలా ఉందని అడిగాను. భగవద్గీత ఒక్కటే చదువుతుందా…. ఇంకా ఏమైనా చేస్తుందా అని అడిగితే వాళ్లు చెప్పారు. గణితం ఒకసారి చేతిలోకి తీసుకుంటే సాయంత్రానికి కంఠతా వస్తాయని.
చరిత్ర పాఠం తీసుకుంటే సాయంత్రానికి తిరిగి చెప్పేస్తుంది. కుటుంబంలో ఎవరికీ లేనిది ఆమెకు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతామని వాళ్లు చెప్పారు. నిజంగానే నాకు ముచ్చటేసింది. ఒక్కొక్కసారి కొంత మంది పిల్లలకు విశిష్ట వ్యక్తి అయిపోవాలని అనిపిస్తుంది. సోనంలో అలాంటిదేమీ లేదు. భగవంతుడు తనకు ఏదో శక్తి తప్పక ఇచ్చాడు అని నాకనిపిస్తోంది. సరే…. ఈ ఇద్దరు పిల్లల్ని కలవడం నా కాశీ యాత్రలో ఒక విశేషం. అందుకే నాకు అనిపించింది మీకు కూడా చెప్పాలని. టీవీలో మీరు చూసేది, పత్రికల్లో చదివేది కాకుండా ఇంకా కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఇలాంటి పనుల వల్ల కొంత ఆనందం కలుగుతుంది. అలాగే ఈ ఇద్దరి పిల్లలతో మాట్లాడటం నాకు గుర్తుండిపోతుంది. ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమంలో కొందరు నాకోసం చాలా పని పెట్టడాన్ని గమనించాను. చూడండి. హరియాణాకి చెందిన శ్రీ సందీప్ ఏం చెబుతున్నాడో..
‘సందీప్ హర్యాణా… సార్ మీరు నెలకొకసారి పాల్గొంటున్న ‘మన్ కీ బాత్’ వారానికి ఒకసారి ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ మాటల్లో చాలా ప్రేరణ లభిస్తుంది’ అని.
సందీప్ గారు…. నా చేత ఏమేం చేయిస్తారు. నెలకోసారి చేయడానికైనా నాకెంతో కష్టపడాల్సి వస్తోంది. సమయాన్ని ఎంతో సర్దుబాటు చేసుకోవలసి వస్తోంది. అప్పుడప్పుడు మన ఆకాశవాణి సహచరులు – అరగంట … ముప్పావుగంట… నా కోసం ఎదురుచూస్తూ కూర్చోవలసి వస్తుంది. కానీ – మీ భావనను నేను ఆదరిస్తాను. మీ సూచనకు నా ధన్యవాదాలు. ఇప్పటికైతే నెలకొకసారి సరిగ్గా ఉంది.
‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి ఒక రకంగా సంవత్సరం అయింది. మీకు తెలుసు. శ్రీ సుభాష్ బాబు రేడియోను ఎంతగా ఉపయోగించుకునేవారో మీకు తెలుసా ? జర్మనీలో ఆయన తన సొంత రేడియోను ప్రారంభించారు. హిందుస్థాన్ ప్రజల స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించి ఆయన రేడియో ద్వారా చెబుతూనే ఉండేవారు. ‘ఆజాద్ హింద్ రేడియో’ను వీక్లీ న్యూస్ బులెటిన్‌తో ఆయన మొదలుపెట్టారు. ఆంగ్లం, హిందీ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, పశ్తో, ఉర్దూ అన్ని భాషల్లో రేడియోను ఆయన నిర్వహించేవారు.
నాకు కూడా ఇప్పుడు ఆకాశవాణిలో ‘మనసులో మాట‘ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సంవత్సరం అయింది. ‘మన్ కీ బాత్‘ (మనసులో మాట) మీ కారణంగా అర్థవంతంగా, మీ ‘మనసులో మాట‘గా మారింది. మీ మాటలు వింటూ ఉంటాను. మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. దాంతోనే నా ఆలోచనల్లో ఒక పరుగు మొదలవుతుంది. అది ఆకాశవాణి వేదికగా మీ వద్దకు చేరుతుంది. పలికేది నేనే, కానీ ఆ పలుకులు మీవే అవుతాయి. అదే కదా నా సంతోషం. వచ్చే నెల మనసులో మాట కోసం మళ్లీ కలుద్దాం. మీ సూచనలైతే అందుతూ ఉండాలి. మీ సూచనలతో ప్రభుత్వానికి కూడా లాభం ఉంటుంది. దిద్దుబాటు మొదలవుతుంది. మీ భాగస్వామ్యం నాకు ఎంతో విలువైనది, అమూల్యమైనది. మళ్లీ ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు – ధన్యవాదాలు.