పిఎంఇండియా
దేశంలోని ప్రధాన ఓడరేవులలో రేవు ఆధారిత పరిశ్రమలకు సముద్ర తీర- తీర అనుసంధానిత భూముల కేటాయింపు విధానంతో పాటు ఆ విధానం అమలుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ విధానంవల్ల స్వాధీన సదుపాయాల కేటాయింపు ప్రక్రియలో పారదర్శకత, ఏకరూపతకు వీలుంటుంది. అంతే కాకుండా ప్రధాన ఓడరేవులలో సామర్థ్యాల గరిష్ఠ వినియోగం, తద్వారా రేవు ప్రాధికార సంస్థల రాబడిలో పెరుగుదలకు అవకాశం ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధాన రేవులకు ఈ విధానం వర్తిస్తుంది. ప్రస్తుత ఖాళీ బెర్తుల వినియోగం, కొత్త ఆస్తుల సృష్టి కూడా దీని కిందకు వస్తాయి.
ఈ విధానం కింద రేవు ఆధారిత పరిశ్రమలు (పి డి ఐ) 30 సంవత్సరాలకు మించకుండా ప్రధాన రేవులలో ప్రత్యేకించి ఎగుమతి/దిగుమతుల కోసం సదుపాయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే సరకులను గమ్యానికి రవాణా చేసే ముందు నిల్వ చేసుకునే సౌకర్యాలను కూడా కల్పించుకోవచ్చు. ఈ రాయితీ ఒప్పందం కింద ఆస్తుల సామర్థ్యం కన్నా తక్కువ వినియోగం సహా ఇతర షరతుల ప్రకారం రాయితీ కాలాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది.
ప్రధాన రేవులలో సముద్ర తీర- తీర అనుసంధానిత భూమిని గరిష్ఠంగా 30 సంవత్సరాల పాటు వినియోగించుకున్న తరువాత బెర్తులు, తీరంలో ఓడల లంగరు, సరుకుల మార్పిడి రేవుకట్టలు, ఓడ వసతి వంటి నిర్మాణాలు చేసుకునేందుకు భూమిని కేటాయిస్తారు. రేవుల ప్రాధికార సంస్థ, సంబంధిత రేవు ఆధారిత పరిశ్రమ లకు మధ్య రాయితీ ఒప్పందం (సిఎ)లోని నిబంధనలకు ఇవన్నీ లోబడి ఉంటాయి.
ప్రధాన రేవుల కార్యకలాపాలలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి కేంద్ర నౌకారవాణా మంత్రిత్వ శాఖ 1996 సంవత్సరంలోను, 1998 సంవత్సరంలోను కొన్ని మార్గదర్శకసూత్రాలు జారీచేసింది. నిర్దేశిత అర్హతలు ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సహా రేవు ఆధారిత పరిశ్రమలకు సముద్రతీర- తీర అనుసంధానిత భూమిని స్వాధీన సదుపాయం కింద కేటాయించేందుకు ఈ మార్గదర్శకాల మేరకు నిబంధనలను రూపొందించారు. వీటికి అనుగుణంగా కొన్ని ప్రధాన రేవులలో బెర్తులు, ఇతర సదుపాయాల నిర్మాణం జరిగినా అటువంటి సదుపాయాల విస్తరణ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు.
అందుకే ఆర్థిక వృద్ధికి కీలక ఉపకరణంగా పరిగణిస్తున్న సాగరమాల కార్యక్రమం కింద రేవుల ఆధారిత అభివృద్ధిపై భారత ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ప్రధాన రేవులకు అందుబాటులో ఉన్న సముద్రతీర- అనుసంధాన భూముల గరిష్ఠ వినియోగానికి ఇందులో విశేష ప్రాముఖ్యం ఉంది. స్వాధీన సదుపాయాల కేటాయింపు ప్రక్రియలో పారదర్శకత్వాన్ని, ఏకరూపతలను స్థిరీకరించడమే ఈ విధానం పరమోద్దేశం. ప్రధాన రేవులు దీర్ఘకాలంలో నిర్దేశిత వ్యాపార పరిమాణాన్ని సాధించడానికి ఈ విధానం తోడ్పడుతుంది. ఈ దిశగా రేవు ఆధారిత పరిశ్రమలు అక్కడ సదుపాయాలను అభివృద్ధి చేసి, వినియోగించుకునే వీలు కల్పిస్తుంది. సరకుల ఎగుమతి/దిగుమతుల కోసం ఆయా పరిశ్రమలు ఏదో ఒక ప్రధాన రేవుపై ఆధారపడి ఉంటాయి గనుక రేవు ఆధారిత అభివృద్ధిలో అంతిమంగా అవి ఉత్ప్రే రక పాత్ర పోషిస్తాయి.
పూర్వ రంగం: