పిఎంఇండియా

స్వచ్ఛ భారత్ దిశగా అడుగు

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీ లోని రాజ్ ఘాట్ లో స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ప్రారంభిస్తూ, “2019 సంవత్సరంలో జరుగనున్న మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు మన దేశం అందించగల ఉత్తమ నివాళి స్వచ్ఛ భారత్” అని అన్నారు. 2014 అక్టోబర్ రెండో తేదీన దేశ వ్యాప్తంగా మూలమూలలకు విస్తరించేలా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఒక జాతీయ ఉద్యమ రూపంలో మొదలుపెట్టారు.

పరిశుద్ధమైన, ఆరోగ్యవంతమైన భారత్ ను ఆవిష్కరించాలన్న మహాత్ముని కలను నిజం చేసి చూపించాలని ప్రధాని ఈ సందర్భంగా దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. మందిర్ మార్గ్ పోలీసు స్టేషన్ వద్ద చీపురు చేతబట్టి చెత్తా చెదారాన్ని ఊడ్చివేయడం ద్వారా ప్రధాని స్వయంగా ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల్లో ప్రతి ఒక్కరూ చెత్తను వీధుల్లో వేయకుండా జాగ్రత్త పడడమే కాకుండా ఇతరులు కూడా చెత్త వేయకుండా చూడాలని ప్రధాని ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు. “న గందగీ కరేంగే, న కర్నే దేంగే” అనే మంత్రాన్ని ఆయన ప్రజలకు ఉపదేశించారు. తొమ్మిది మందిని ముందుకు వచ్చి ఈ ఉద్యమంలో భాగస్వాములు కండంటూ ఆయన కోరారు. అలాగే ఆ తొమ్మండుగురు మరో తొమ్మిది మందిని ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవలసిలందిగా ఆహ్వానించాలని వారిలో ప్రతి ఒక్కరికీ ప్రధాని విజ్ఞ‌ప్తి చేశారు.

ప్రజలందరినీ ఈ కార్యక్రమంలోభాగస్వాములను చేయడంతో ఇది ఒక జాతీయోద్యమంగా మారింది. స్వచ్ఛ భారత్ ఉద్యమం ద్వారా ప్రజల్లో ఒక బాధ్యతాయుత ధోరణిని అలవరచడం జరిగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ చురుకైన భాగస్వాములు కావడంతో, మహాత్మా గాంధీ కలలు గన్న ‘పరిశుభ్రమైన భారతదేశం’ ఆవిష్కారానికి ఒక రూపం రావడం మొదలయింది.

ప్రధాని తన స్ఫూర్తిదాయకమైన మాటలు, చేతల ద్వారా స్వచ్ఛభారత్ సందేశం దేశం అంతటా వ్యాపించేందుకు దోహదపడ్డారు. వారణాసిలో కూడా ప్రధాని స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం ఆ నగరంలోని అస్సీఘాట్ లో గంగానది సమీపంలో ఒక పారను ఆయన ఉపయోగించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో స్థానికులు ఈ స్వచ్ఛభారత్ అభియాన్ లో పాల్గొన్నారు. పారిశుద్ధ్యం ప్రాముఖ్యాన్ని సైతం గుర్తించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ.. భారతీయ కుటుంబాలు అనేకం వారి ఇళ్లలో సరైన మరుగుదొడ్లు లేని కారణంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు.

ఈ స్వచ్ఛత ఉద్యమంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చారు. ప్రభుత్వాధికారుల మొదలుకొని జవానులు, బాలీవుడ్ నటీనటుల నుంచి క్రీడాకారులు, పారిశ్రామికవేత్తల నుంచి ఆధ్యాత్మిక గురువుల దాకా.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన పనిలో పాల్గొనడానికి ముందుకు వచ్చి బారులు తీరారు. స్వచ్ఛ భారత్ ఆవిష్కరణ కోసం ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వేతర సంస్థలు, స్థానిక సమాజం నిర్వహిస్తున్న ఈ ఉద్యమంలో రోజు రోజుకు అధిక సంఖ్యలో ప్రజలు భాగస్వాములవుతున్నారు. దేశం నలు మూలలకు స్వచ్ఛ భారత్ సందేశాన్ని చేరవేయడానికి తరచుగా వీధి నాటకాలు ప్రదర్శిస్తున్నారు; సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

బాలీవుడ్ నటులు, టివి నటులు ఎందరో ఈ కార్యక్రమంలో చేరారు. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కైలాష్ ఖేర్, ప్రియాంక చోప్రాలతో పాటు ఎస్ఏబి టివి షో “తారక్ మెహతా కా ఉల్టా చష్మా”కు పనిచేస్తున్న వారంతా స్వచ్ఛ భారత్ కు చేయూత అందించారు. సచిన్ టెండూల్కర్, సానియా మీర్జా, సైనా నెహ్వాల్, మేరీ కోమ్ వంటి పలువురు క్రీడాప్రముఖులు స్వచ్ఛ భారత్ ఉద్యమంలో పోషించిన భూమిక అభినందనలు అందుకొంది.

0.08413900-1451572653-swachh-bharat-1

స్వచ్ఛభారత్ ఉద్యమం ఘన విజయం సాధించడానికి వ్యక్తులు, సంస్థలు చేసిన కృషిని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన నెలవారీ రేడియో ప్రసంగ కార్యక్రమం “మన్ కీ బాత్”లో పలు మార్లు కొనియాడారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నందుకు మధ్యప్రదేశ్ లోని హార్దా జిల్లాకు చెందిన ప్రభుత్వోద్యోగుల బృందాన్ని ప్రధాని ప్రశంసించారు. వ్యర్థ పదార్థాల కొనుగోలుకు, అమ్మకానికి మొబైల్ అప్లికేషన్ ను రూపొందించిన బెంగళూరుకు చెందిన న్యూ హొరైజాన్ స్కూల్ విద్యార్థులను కూడా ప్రధాని మెచ్చుకొన్నారు.

ఐసిఐసిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్ పూర్, ఐఐఎం- బెంగళూరు వంటి సంస్థలు సాధారణ ప్రజానీకంలో స్వచ్ఛభారత్ సందేశాన్ని వ్యాపింపచేసేందుకు గట్టి ప్రచారం నిర్వహించాయి.

0.52207900_1451629836_swachh

స్వచ్ఛభారత్ లో ప్రజల భాగస్వామ్యాన్ని శ్రీ నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా వేనోళ్ల కీర్తించారు. వారణాసిలో “మిషన్ ప్రభుఘాట్” ను చేపట్టిన స్వచ్ఛంద కార్యకర్తల బృందం సభ్యులు తెంసుతులా ఇంసాంగ్, దర్శికా షా వంటి వారందరినీ కూడా ఆయన ప్రశంసించారు.

దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్ ఉద్యమం వ్యాపింపచేయడానికి, కార్యక్రమాల నిర్వహణకు సాధారణ ప్రజలు చేస్తున్న కృషిని ప్రజల్లోకి చేర్చేందుకు సమాంతరంగా ‘మై క్లీన్ ఇండియా’ను కూడా ప్రారంభించారు.

స్వచ్ఛభారత్ అభియాన్ కు ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభిస్తుండటంతో అది ఇప్పుడు ఓ “జన్ ఆందోళన్”గా మార్పు చెందింది. ప్రజలు ఎక్కడికక్కడ భారీ సంఖ్యలో పోగవుతూ స్వచ్ఛ, పరిశుభ్ర భారత్ దీక్ష బూనారు. స్వచ్ఛభారత్ అభియాన్ ప్రారంభించిన నాటి నుంచి ప్రజలు చేతుల్లో చీపురులు చేత పట్టి వీధులను ఊడ్చివేయడం, చెత్తాచెదారాన్ని తొలగించడం, పారిశుద్ధ్యంపైన దృష్టిని కేంద్రీకరించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. “దైవత్వానికి వెన్నంటి ఉండేది పరిశుభ్రమైన పరిసరాలే” అనే సందేశాన్ని ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

0.92400400-1451572703-clean-india

పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛభారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం, వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత సమాచార వ్యాప్తి, అమలు కార్యక్రమాలను పటిష్ఠం చేయడం, డెలివరీ యంత్రాంగాలను గ్రామ పంచాయతీ స్థాయికి విస్తరింపచేయడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్థానిక సంస్కృతులు, విధానాలు, మానసిక స్థితులు, అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించుకునే స్వేచ్ఛ రాష్ర్టాలకు ఇచ్చారు. టాయిలెట్ల నిర్మాణంపై ఇస్తున్న ప్రోత్సాహకాన్ని రూ.2,000 మేరకు పెంచి రూ.10,000 నుంచి రూ.12,000 చేశారు. గ్రామ పంచాయతీలలో ఘన, ద్రవ్య వ్యర్థ పదార్థాల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయిస్తున్నారు.

లోడ్ అవుతోంది...