పిఎంఇండియా
నమస్తే,
కోబే లో ఇంతకు ముందు కూడా మిమ్మల్ని కలుసుకొనే అదృష్టం నాకు లభించింది. అయితే, ఈ వ్యక్తి ఒకనాటికి ప్రధాన మంత్రి అవుతాడని ఆనాడు ఎవరూ ఊహించి ఉండరు. అయినప్పటికీ అప్పట్లో మీరు నా పట్ల ఇదే తరహా ప్రేమాభిమానాలను ప్రదర్శించారు. మరి నేను కోబే కు వచ్చి మిమ్మల్ని కలుసుకోకుండా వెళతానని ఎలా ఊహించగలను.
ప్రధాన మంత్రి శ్రీ ఆబే తో మాట్లాడినప్పుడు కోబే తో నా అనుబంధాన్ని గురించి చెప్పాను. 2001లో గుజరాత్ ను పెను భూకంపం కుదుపేసినప్పుడు మొట్టమొదట స్పందించి గుజరాత్ ప్రజలకు సహాయాన్ని అందించింది కోబే నే. అంతకు ముందు భూకంపం బారిన పడిన నగరం అయినప్పటికీ, సాయం చేయడం విశేషం. సంతోషంగా ఉన్న వేళ ఎవరో ఒకరు తోడు ఉంటే మంచిదే.. ఎవరూ రాకపోయినా పర్వా లేదు. కానీ, ఆపద సమయంలో అండగా నిలువని వారిని మరచిపోలేం.. అయితే, ఆపన్న హస్తాన్ని అందించిన వారిని జీవితాంతం ప్రేమతో గుర్తు పెట్టుకొంటాం. నాటి సంక్షోభ సమయంలో కోబే మొదట స్పందించింది కాబట్టి గుర్తు పెట్టుకోవడం, గౌరవించడం సహజం. ఈ విషయంలో మీరందరూ గర్విస్తుంటారు. అంతేకాదు.. భారతదేశానికి సంబంధించిన ప్రతి సమాచారం మీకు గర్వించదగిన విషయం కూడా. అవునా? కాదా ? మీరు ఎదుటివారి కళ్లలోకి చూస్తూ ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలరు. కానీ, అందుకు కారణం మోదీ కాదు; అందుకు కారణం 125 కోట్ల మంది భారతీయులు. దేశ ప్రజలు.. ముఖ్యంగా యువతరం దేశాన్ని ముందుకు తీసుకుపోళ్లడం కోసం కృత నిశ్చయంతో కృషి చేస్తున్న తీరు ఎవరికైనా గర్వకారణమే.
రెండేళ్ల కాలం తీవ్ర దుర్భిక్షంతో అల్లాడిపోయాం. వాన చుక్క కనిపించడమే అరుదైపోయింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎటువంటిదంటే కరువు పరిస్థితులలో ప్రతిదీ ఒత్తిడితో కటకటలాడిపోతుంది. అయినప్పటికీ.. రెండు సంవత్సరాల పాటు కరవు బాధించినా, అన్నివిధాల కొరతతో అల్లాడినా ఇవాళ ప్రపంచం ముక్త కంఠంతో ఒక మాట అంటోంది.. ఏమని ? అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో గల ఆర్థిక వ్యవస్థ ఏదైనా ఉందంటే అది భారతదేశమేనని! అది అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కావచ్చు.. ప్రపంచ బ్యాంకు కావచ్చు.. అన్నీ ఒకే గళంతో వినిపిస్తున్న నినాదం ఇదే. భారతదేశమే ఉజ్జ్వలమైన ప్రకాశ బిందువని ఐఎంఎఫ్ చెప్పింది. భారతదేశం శర వేగంగా వృద్ధి చెందుతోందని ప్రపంచంలోని ఆర్థికవేత్తలంతా అంగీకరిస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్ డిఐ) నేను ఇచ్చే నిర్వచనం మరో విధంగా ఉంటుంది. అదే.. ఫస్ట్ డెవలప్ ఇండియా (ముందు భారతదేశాన్ని అభివృద్ధి చేద్దాం). రెండో నిర్వచనం.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఇవాళ చరిత్రలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అధికంగా పొందుతున్నది భారతదేశమే. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహ వృద్ధి రేటు కూడా చరిత్రలో ఇదే అత్యధికం. అంటే.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత జోరైన వేగంతో పరుగు తీస్తోందని ఇవన్నీ రుజువు చేస్తున్నాయి.
మా దేశంలో పేదరికాన్ని గురించి ఎప్పుడూ చర్చ నడుస్తూంటుంది. నేను అధికారం లోకి వచ్చాక అంటున్న మాట కాదిది. సాధారణంగా ఎన్నికల సమయంలో పేదరికం మీద ఎక్కువగా చర్చ ఉంటుంది. కానీ, ఆ తరువాత అన్నీ మరచిపోవడం పరిపాటి. అయితే, ఎన్నికల అనంతరం నేను దీనిని గురించిన చర్చను మొదలుపెట్టాను. పేదరికం నుండి భారతదేశం అత్యంత వేగంగా విముక్తం కావాలన్న దీక్షతో ముందుకు పోతున్నాను. మేం ఇది సాధించగలం.. దేశంలో 40 శాతం ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో లేదు. అంత పెద్ద అద్దాల భవంతి లోకి ప్రవేశించాలా ? వద్దా ? అని ఆలోచించడానికి కూడా సామాన్యుడు తటపటాయిస్తాడు. అందుకే మేం అధికారంలోకి రాగానే మొదటగా ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా తెరవడాన్ని ఒక ఉద్యమంలా ప్రారంభించాం. కానీ, అక్కడ డబ్బు లేదు.. ఖాతాను నిర్వహించాలంటే కనీసం కాగితపు ఖర్చులు ఉంటాయి. చివరకు, ఒక దరఖాస్తు కాగితానికైనా 50 పైసలు లేదా రూపాయి ఖర్చు అవుతుంది. అయినప్పటికీ పైసా కూడా లేకుండానే ఖాతాలు తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉచితంగా ఖాతాను తెరవాలని నిర్దేశించింది. కొన్ని రోజుల పాటు ఏం జరిగి ఉంటుందో మీకు తెలుసు. అయితే, ప్రభుత్వ స్థాయిలో ప్రతి ఒక్కరూ అంగీకరించారు. మేం పేదలందరికీ చెప్పాం. అసలు డబ్బేమీ లేకపోయినా, ఖాతా తెరవవచ్చునని. తరువాత దేశం లోని దాదాపు ప్రతి పేద కుటుంబానికీ ఒక ఖాతా ప్రారంభమైంది. ఒక్క రూపాయి కూడా లేకుండా ఖాతా తెరవబడిందన్న నిజాన్ని ప్రజలకు వివరించాం. అయితే, ఏమైందో తెలుసా ! పేదలందరూ వారి పెద్ద మనస్సును ప్రదర్శించారు.. ఇదే భారతదేశం విశిష్టత. అనేక సందర్భాలలో సంపన్నులు కూడా పిసినారితనం ప్రదర్శించడం మనం చూస్తూ ఉంటాం. కానీ, మీరు రూపాయి కూడా జమ చేయకపోయినా పర్వా లేదని పేదలకు చెప్పినా, బ్యాంకు ముఖం ఎన్నడూ చూడనైనా చూడని, ఖాతా తెరవడమన్న మాటే ఎరుగని నిరుపేదలు మా మాట మేరకు ఖాతాలను తెరవడమే కాకుండా 45 వేల కోట్ల రూపాయలకు పైగా వాటిలో జమ చేశారు. ఇదీ పేదల సుసంపన్న మనస్తత్వం. దేశానికి అతి పెద్ద బలం ఇదే. మేం కలలుగంటున్న దేశాన్ని నిర్మించగల సామర్థ్యం ఇదే!
జపాన్ కూడా 2011లో భారీ ప్రకృతి విపత్తుకు గురైంది. భారీ భూకంపం దేశాన్ని కుదుపేసింది. దాని వెంట సునామీ తరుముకొచ్చింది. ఫలితంగా మీ దేశాన్ని ఫుకుషిమా ముప్పు ముంచెత్తింది. ఆ రోజులను మీరు ఒక్కసారి గుర్తుకుతెచ్చుకొంటే.. ఎడతెగని విద్యుత్తు కోత, నాలుగు సీసాల నీళ్లు అవసరమైన చోట ఒక్క సీసా తో సరిపెట్టుకోవలసి రావడం, జున్ను అవసరమైతే సాధ్యమైనంత వరకు కొనకుండా ఉండడమో లేదా అతి కొద్దిగా కొనడమో వంటి అనుభవాలను చూసి ఉంటారు. దేశవ్యాప్తంగా గల ప్రభుత్వ కార్యాలయాలకు జపాన్ ప్రభుత్వం తన మనోభావాన్ని తెలియజేసింది. అయితే, ప్రజలు వారి సొంత బాధ్యతగా భావించారు. ఉదాహరణకు, కోటు వేసుకోవద్దు.. శరీరానికి కోటు పెయింట్ వేయించుకొని, టై కట్టుకు రమ్మంటే ప్రతి ఒక్కరూ తు.చ. తప్పకుండా దానిని పాటించారు. ఏసీలను వాడవద్దని కోరితే, అలాగే చేశారు. అవసరమైన దాని కన్నా ఎక్కువ నీరు వాడవద్దంటే, తప్పక అనుసరించారు. కుటుంబాలను తక్కువ వస్తువులతో నడపాలని సలహా ఇస్తే మారు మాట లేకుండా అలాగే చేశారు. రోజుకు మూడు సార్లు కూరగాయలతో వంటకాలు చేసుకొనే వీలు ఉన్నా రోజుకు ఒక్కసారితో సరిపెట్టుకోమంటే, ఆ మేరకు సర్దుకుపోయారు. ఇదంతా చేయగలిగింది మీరే.. జపాన్ ప్రజలు వారి బాధ్యతగా భావించి ఇలాంటివన్నీ చేశారు. వీటన్నింటి గురించి నేను చదువుతున్నప్పుడు, ఇక్కడకు నేను వచ్చినప్పుడు వీటిని గురించి విన్నప్పుడు- ఇక్కడి ప్రజలు ఎంత గొప్ప వారు, దేశం కోసం వారు ఎన్ని కష్టాలనైనా సహించగలరు కదా అని అనిపించింది. ఇది మా దేశంలో సాధ్యమేనా అని కొన్ని స్లారు నాకు అనిపిస్తుంది. అయితే, ఇవాళ నేను ఈ విషయాన్ని గట్టి ఆత్మవిశ్వాసంతో నొక్కి పలుకుతున్నాను.. సామాన్య భారతీయుడు తన బాధ్యతను నెరవేర్చవలసి వస్తే, అవకాశం ఉన్నప్పుడల్లా మీరు జపాన్ ప్రభుత్వానికి సహకరించిన రీతిలో తాము కూడా కర్తవ్య నిర్వహణలో త్యాగాలకు వెనుకాడబోమని వారు నిరూపించారు. ఇది నా అనుభవంతో చెబుతున్న మాట.
ఇటీవలే ఇలాంటి అనుభవం నాకు ఎదురైంది. అదేమిటంటే.. 500 రూపాయల, 1000 రూపాయల నోట్లు చెల్లుబాటు కావంటూ నవంబరు 8వ తేదీ రాత్రి 8 గంటలకు హఠాత్తుగా ప్రకటించబడిన సంగతి మీకూ తెలుసు. ఈ సమయంలో భారతీయులు చూపిన సహనం చూశాక నా 125 కోట్ల మంది సహ పౌరులకు శిరస్సు వంచి అభివాదం చేశాను. వారికి ప్రణమిల్లాను. ఒక ఇంట్లో పెళ్లి జరుగుతున్నా డబ్బు అందుబాటులో లేకుండాపోయింది. తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటే, చికిత్సకు డబ్బు కొరత ఎదురైంది. ఎన్నో సమస్యలు.. తాము కష్టాల్లో పడ్డామని వారికి తెలుసు.. తాము అగచాట్లు పడుతున్నామని వారికి తెలుసు. తమతో పాటు ఇరుగుపొరుగు పడుతున్న తిప్పలు కూడా వారికి తెలుసు. ఇదే అదనుగా నాకు వ్యతిరేకంగా కొందరు వారిని రెచ్చగొట్టారు; వారు కూడా నాకు వ్యతిరేకంగా గళమెత్తేలా చేయాలని ప్రయత్నించారు. కానీ, బ్యాంకుల ముందు గంటల కొద్దీ నిలబడవలసి వచ్చినప్పటికీ, నోట్ల బందు వల్ల ఎన్నో కష్టాలు పడవలసి వచ్చినప్పటికీ నా దేశ ప్రజలు చెక్కు చెదరలేదు. ఆనాడు 2011లో జపాన్ ప్రజలు చూపిన చొరవనే ప్రదర్శిస్తూ జాతిహితం కోసం తీసుకున్న నా నిర్ణయాన్ని అంగీకరించి, ఆమోదించిన నా దేశ జనులకు నమస్కరిస్తున్నాను. కొన్నిచోట్ల అయిదారు గంటల పాటు వరుసలో నిలబడి తీరా లోపలికి వెళ్లిన తరువాత ఎటిఎం లు హఠాత్తుగా మొరాయించాయి. అప్పుడు కూడా.. పర్వాలేదు.. అది రేపు పని చేస్తుందని ప్రజలు సమాధానపడ్డారు. దేశానికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉందని చెప్పడానికి ఇదే తిరుగులేని సంకేతం. తప్పుడు పనులు చేసే వారి సంఖ్య తక్కువేనన్నది నిజమే కావచ్చు. అది ఓ లక్ష.. రెండు లక్షలు.. లేదా అయిదు లక్షలకు మాత్రమే పరిమితమై ఉండొచ్చు. కానీ, నా నిర్ణయం 125 కోట్ల మంది ప్రజలకు కష్టాలు కొనితెచ్చింది. అయితే, 125 కోట్ల మంది భారతీయులు అగచాట్లు పడుతున్నా వారు చూపిన సహనం అనుపమానం. ఇక నేను ఇప్పుడు చెప్పబోయే సంగతిని మీరు వాట్సాప్ ద్వారా అందరికీ పంపాల్సిందే.. నోట్ల రద్దుకు ముందు గంగానదిని శుభ్రం చేసేందుకు పావలా కూడా విరాళం ఇవ్వడానికి ఇచ్చగించని పరిస్థితి ఉండగా, ఆ తరువాత గంగా నదీ ప్రవాహంలో నోట్లు తేలుతూ కనిపించాయి!
మీరు ఇప్పుడు చెప్పండి.. అక్రమంగా సంపాదించి దాచిన సొమ్మును బయటకు తేవాలా.. వద్దా ? సాధారణంగా ఒక నిర్ణయం కొందరికి లబ్ధిని చేకూర్చి మరికొందరికి హాని చేస్తే సామాన్యులు వ్యతిరేకిస్తారు. రూ.500, రూ.1000 నోట్లు చెల్లుబాటు అయ్యేలా చట్టం అందరికీ సమానంగా ఉండాలని సాధారణ ప్రజలు భావిస్తారు. అయితే, చివరకు మోదీకి చెందిన వెయ్యి రూపాయల నోట్లు కూడా మార్కెట్ లో పనికి రాకుండా పోయాయి. ఇటువంటి వాటిని ప్రజలు హర్షిస్తారు. ఇటువంటి చర్యలు అవసరమేనంటారు.. దీని వల్ల ప్రతి ఒక్కరి పైనా సమాన ప్రభావం పడింది. నాకు ఈ విధంగా ప్రజల ఆశీర్వాదం లభిస్తుందని ఈ నిర్ణయం గురించి వివరిస్తున్నప్పుడు చివరకు నేను కూడా ఊహించలేకపోయాను. దీనివల్ల కలిగే కష్టనష్టాలు ఏమిటో, లభించే ప్రయోజనాలు ఏమిటో కూడా నేను ఆలోచించలేదు. ఇటువంటి పనిని గురించి ప్రజలతో చర్చించకుండా ఎలా చేయాలా అని మేధోమధనం చేసుకుంటూ వచ్చాను. ఇది హఠాత్తుగా జరిగి ఉండకపోతే చేసిన మొత్తం కసరత్తు బూడిదలో పోసిన పన్నీరు అయ్యేది. అక్రమ మార్గంలో భారీ సంపదను కూడబెట్టిన వారు కూడా ఏదో ఒక మార్గంలో దానిని రహస్యంగా దాచే ప్రయత్నం చేసి ఉండే వారు. అందుకే కొన్ని కష్టాలు ఎదురవుతాయని, ఇబ్బందులు పడవలసి వస్తుందని నేను ఆలోచించాను. అందుకే వీలైనంత తక్కువ మంది బృందంతో మార్గాన్వేషణ చేసేందుకు యత్నించాను. అయితే, నాకు ఇలా ప్రజల దీవెనలు కూడా దక్కుతాయని నేను ఆలోచించలేదు. ప్రజలకు దీనిని గురించి తెలియగానే గృహిణులు కలవరపడ్డారు. మహిళలు మార్కెట్ లో కాయగూరలు కొనడానికి వెళ్లినప్పుడు ఎంతో కొంత పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అలా వారు పొదుపు చేసిన సొమ్ము కుటుంబం ఇబ్బందులలో ఉన్నప్పుడు వాడుకోవడానికి పనికివస్తుంది. మన దేశంలో మహిళలు ఇలా దాచిన సొమ్ము ఎంతో స్వచ్ఛమైంది. అది అక్రమ మార్గంలో వచ్చింది కాదు.. అందుకే ఓ గృహిణి రూ.2.5 లక్షలు బ్యాంకు ఖాతాలో వేస్తే అడి ఎక్కడ నుండి వచ్చింది అంటూ ప్రభుత్వం అడగబోదని మేం ప్రకటించాం. అయితే, దాని ఫలితంగా ఏమైందో తెలుసా ? తమ తల్లులును, అత్తలను వృద్ధాశ్రమాలకు తరిమివేసిన కొడుకులు, కోడళ్లు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.2.5 లక్షల వంతున జమ చేశారు. ఇప్పుడు చెప్పండి.. ఆ వృద్ధ మాతృ మూర్తులు నన్ను ఆశీర్వదిస్తారా, లేదా ? అలాంటి ఎందరో అమ్మల ఆశీస్సులు నాకు లభించడాన్ని బట్టి ఈ పథకం విజయవంతం అయిందనడంలో ఏదైనా సందేహం ఉంటుందా?
సోదరులు మరియు సోదరీమణులారా,
ఇది ప్రక్షాళన కోసం చేపట్టిన భారీ ఉద్యమం. ఇది ఎవరినీ వేధించడం కోసం కాదు. ఇది అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతుందన్న సంగతి నాకు తెలుసు. మొదటి రోజునే- అంటే- నవంబరు 8వ తేదీన దీనిని గురించి ప్రకటించి, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ నేను చెప్పాను.. మనది ఎంతో పెద్ద దేశం, 50 రోజుల సమయం ఉన్నందున ప్రజలు గందరగోళంలో పడవలసిన పని లేదు అని. నిజాయతీగా సంపాదించిన సొమ్మును 50 రోజుల లోగా బ్యాంకులలో జమ చేసుకోవచ్చని సూచించాను. వారి నిజాయతీ వారి బ్యాంకు ఖాతాలలో ప్రతిఫలిస్తుందని చెప్పాను. కానీ, లెక్కలు చెప్పని సొమ్ము ఉటే దానిని పట్టుకోవడం ఖాయమని కూడా స్పష్టం చేశాను. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు అన్ని ఖాతాలను నేను పరిశీలించబోతున్నాను. ఇందుకోసం ఎంత మందిని నియమించవలసి వచ్చినా సరే, నేను సిద్ధమే. బ్యాంకులలో జమ చేసింది స్వచ్ఛమైంది, నిజాయతీగా ఆర్జించిన సొమ్మే అయితే గనక వారిని ప్రజలు ప్రశంసిస్తారు.. వారికి ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ, అక్రమం దాచిన వారు ఇవాళ బ్యాంకులో జమ చేసి, తరువాత ఎలాగో ఒక లాగా తప్పించుకోవచ్చని భావిస్తే తప్పే. అటువంటి వారిలో ఒక్కరిని కూడా వదలం. ఇక నా గురించి తెలిసిన కొందరు.. వారు తెలివైన వారు కూడా అయి ఉంటే అక్రమార్జనను బ్యాంకులలో వేయడం కన్నా గంగలో కలిపేయడం నయమని భావించారు. వారికి ఆ డబ్బు తిరిగి దక్కుతుందో లేదో గానీ, పవిత్రులుగా మిగిలిపోయే అవకాశం మాత్రం లభించినట్టే. కాబట్టే నేను మరొక్క సారి దేశానికి చెప్పబోతున్నాను.. నేను భారతదేశానికి వెళ్లగానే ప్రజలకు పదే పదే చెప్పబోతున్నాను.. నిజాయతీపరులను రక్షించడానికి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంది. కానీ, అవినీతిపరులను ఎట్టి పరిస్థితుల్లో వదలిపెట్టబోదని.
వాస్తవానికి ఇది ఒక్క రాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదు.. మొదటగా మేం ఒక పథకాన్ని ప్రవేశపెట్టాం. అదేమిటంటే.. మీ దగ్గర ఉన్న సంపదనంతా ప్రకటించండి; దానిపై నిర్దేశించిన మేర అపరాధ రుసుమును చెల్లించండని వెసులుబాటు కల్పించాం. దాంతో దాదాపు 67 వేల కోట్ల రూపాయల సొమ్ము జమ అయింది. అప్పుడు కూడా మోదీ విఫలం అవుతాడని కొందరు అన్నారు. కానీ, మోదీకి ఏమీ కాలేదు. అంతిమంగా జరగాల్సిందేదో జరిగిన తరువాత అందరి నోళ్లూ మూతపడ్డాయి.
అటుపైన గడచిన రెండు సంవత్సరాలుగా చేపట్టిన వివిధ చర్యల వల్ల దాదాపు రూ.1.25 లక్షల కోట్లు సంప్రదాయక వ్యవస్థ లోకి వచ్చి చేరాయి. కాబట్టి మేం తగిన అవకాశం ఇచ్చాం గనుక ఇవ్వలేదని ఇప్పుడు ఎవరూ అనలేరు. అయినా మీరు అలా భావిస్తూ పాత బాటలోనే నడుస్తామంటే, అది నా తప్పు కాదు. మీ వంటి వారికి డిసెంబరు 30 వరకూ సమయం ఉంది. ఆ రోజు లోగా వారు ఎటువంటి కష్టం లేకుండా చేయవలసింది చేయవచ్చు. అంతే తప్ప తొందరపడి ఏదో ఒకటి చేస్తే, కష్టాలు తప్పవు అని స్పష్టం చేస్తున్నాను. దేశ ప్రజలు డిసెంబరు 30 దాకా ఇబ్బందులు పడనక్కర్లేదు. వారికి దక్కవలసింది దక్కుతుంది. అయితే, డిసెంబరు 30 తరువాత చూద్దాంలే అని కొందరు అనుకుంటున్నారేమో.. అలాగైతే ఈ పథకం గడువు ముగిసిపోతే వారిని పట్టుకోవడానికి మరో పథకంతో ముందుకు రాబోనన్న హామీ ఇవ్వలేనని ఇప్పుడే చెబుతున్నా.
ప్రపంచం చాలా మారిపోయింది.. మనమంతా ప్రధాన స్రవంతి లోకి తిరిగి రావాలి. మీరు చేసిందంతా ఇక మునుపటి సంగతి; మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకొనే అవకాశాన్ని నేను ఇచ్చాను. అయితే, నా దేశ ప్రజలారా.. మీరు ఎంతో శ్రమిస్తూ భారతదేశం గర్వపడేలా చేస్తున్నారు. మీ కష్టించే తత్వం దేశానికి ఎంతో పేరు తెస్తోంది. ప్రపంచంలో ఎక్కడకు నేను వెళ్లినా, అక్కడి భారతీయ సమాజం గురించి ప్రశంసాపూర్వక వ్యాఖ్యలే ఆ దేశాల్లో నాకు వినిపిస్తుంటాయి. అది భారతదేశం ప్రతిష్టను ఇనుమడింపజేస్తుంది. దేశం తల ఎత్తుకు నిలబడుతోంది.. ఇందుకు మీ వంతు కృషి తోడ్పడుతోంది. మిమ్మల్ని నేను మరొక్క సారి కలుసుకొనే అవకాశం లభించడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. అనేకానేక కృతజ్ఞతలు. ఇక మీదట భారతదేశం ముందడుగు వేస్తుందని, ప్రగతి పథంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. దేశం వదలిపెట్టాక మాతృభూమిని గురించి మీరు కంటున్న కలలు, దేశంలో మీరు చూడాలనుకున్న కొత్త మార్పులు.. అన్ని శుభాలూ సంభవించడం భారతదేశంలో ఇక సుసాధ్యమే. అవన్నీ సాకారం కావడం తథ్యం. మీకందరికీ నా కృతజ్ఞతలు.
***
I am sure whatever happens in India makes you very proud. The good in India is happening due to 125 crore Indians: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 12, 2016
India is getting historically high FDI and is moving quickly on the path of economic progress: PM @narendramodi at the community programme
— PMO India (@PMOIndia) November 12, 2016
We need to free India from the menace of poverty: PM @narendramodi pic.twitter.com/jkwn4wzdAa
— PMO India (@PMOIndia) November 12, 2016
When we assumed office what did we do first- we opened bank accounts for the poor: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 12, 2016
Money that has been looted has to be recovered. And the rules have to be same for everyone: PM @narendramodi pic.twitter.com/fyO3WOTEVz
— PMO India (@PMOIndia) November 12, 2016
This government will do everything to protect the interests of honest citizens: PM @narendramodi pic.twitter.com/TwfibBUAH3
— PMO India (@PMOIndia) November 12, 2016