పిఎంఇండియా
అంతరిక్ష విభాగం/ భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (డిఒఎస్/ఐఎస్ ఆర్ ఒ)కు, కువైట్ శాస్త్రీయ పరిశోధనా సంస్థ (కె ఐ ఎస్ ఆర్)కు మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పంద వివరాలను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది. శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్షంలో చేసే పరిశోధనల విషయంలో ఇరు దేశాల మధ్య సహకారం ఏర్పడటానికి ఈ అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఓయూ) వీలు కల్పిస్తుంది.
సహకారపరంగాను, వాణిజ్యపరంగాను రెండు దేశాలకు ఆసక్తి ఉన్న అంశాల్లో సహకారానికి ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. 1. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ( ఐఆర్ ఎస్) కు చెందిన ఉపగ్రహాలు అందించే సమాచారాన్ని కెఐ ఎస్ ఆర్ సంస్థ తమ పరిశోధనల ప్రాజెక్టుల్లో ఉపయోగించుకుంటుంది. 2. శిక్షణ 3.వాణిజ్య సరళిలో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను, కమ్యూనికేషన్ ఉపగ్రహాలను తయారు చేయడం, వాటిని అంతరిక్షంలోకి పంపడం.. మొదలైన అంశాల్లో ఈ ఎంఓయూ ద్వారా ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుంది.
ఈ ఎంఓయూ ప్రకారం ఇస్రో, కెఐఎస్ ఆర్ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే సభ్యులతో సంయుక్త కార్యాచరణ బృందాన్ని (జాయింట్ వర్కింగ్ గ్రూప్) ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ గ్రూప్ ఎంఓయూను ఎంత లోపు అమలు చేయాలనే కాలపరిమితిని, ఎంఓయూ అమలు చేయడానికి గల మార్గాలను, కార్యాచరణను రూపొందిస్తుంది.
మానవాళి సంక్షేమం కోసం అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించుకోవాలనే తలంపుతో ఇరు దేశాల సంస్థలు ఈ ఉమ్మడి కార్యక్రమానికి ఎంఓయూ ద్వారా శ్రీకారం చుట్టాయి. తద్వారా దేశంలోని అన్ని వర్గాలు, ప్రాంతాలు లబ్ధి పొందుతాయి.
భూగోళ రిమోట్ సెన్సింగ్ విభాగంలో కొత్త పరిశోధనలకు, వాటి ఉపయోగానికి ఈ ఎంఓయూ ద్వారా నూతన అవకాశాలు ఏర్పడతాయి. అలాగే ఉపగ్రహ కమ్యూనికేషన్, శాటిలైట్ నావిగేషన్, అంతరిక్ష శాస్త్రం, ఖగోళంలో పరిశోధనలకు ఈ ఎంఓయూ మరింత ఊతమిస్తుంది.