Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అంత‌ర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) క‌నీస వ‌య‌స్సు ఒడంబ‌డిక 1973 (నం. 138), మరియు దారుణ‌మైన వృత్తులలో బాల‌కార్మికుల ఒడంబ‌డిక 1999 (నం. 182) ధ్రువీక‌ర‌ణ‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


అంత‌ర్జాతీయ కార్మిక సంస్థ‌ (ఐఎల్ఒ)కు చెందిన రెండు ప్ర‌ధాన ఒడంబ‌డిక‌లు క‌నీస వ‌య‌స్సు (నం 138), దారుణ‌మైన వృత్తులలో బాల‌ కార్మికుల (నం 182) ఒడంబ‌డిక ధ్రువీక‌ర‌ణ‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన‌ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో క‌నీస వ‌య‌స్సు ఒడంబ‌డిక అనేది బాల‌ల‌ను ఉద్యోగాల్లో పెట్టుకోవ‌డంతో క‌నీస వ‌య‌స్సుకు సంబంధించిన‌ది కాగా, దారుణ‌మైన వృత్తులలో బాల‌ కార్మికుల‌ను నియ‌మించ‌డాన్ని నిషేధించ‌డంతో పాటు అలాంటి సంఘ‌ట‌న‌ల్లో తీసుకోవాల్సిన త‌క్ష‌ణ చ‌ర్య‌ల‌కు కూడా సంబంధించిన‌టువంటిది. 1919లో ఏర్పాటైన అంత‌ర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) వ్య‌వ‌స్థాప‌క దేశాలలో భార‌తదేశం కూడా ఒక‌టి. ఈ సంస్థ‌లో ప్ర‌స్తుతం 187 స‌భ్య‌త్వ దేశాలు ఉన్నాయి. ఒప్పందాలు, సిఫార‌సులు, నియ‌మావ‌ళి నిర్దేశించ‌డం ద్వారా అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌ను రూపొందించ‌డం ఈ సంస్థ ల‌క్ష్యం. భార‌తదేశం ఇప్ప‌టివ‌ర‌కు ఇలాంటి 45 ఒడంబ‌డిక‌ల‌ను ధ్రువీక‌రించ‌గా, 42 అమ‌లులో ఉన్నాయి. వాటిలో నాలుగు అత్యంత ప్ర‌ధాన‌మైన‌, మౌలిక ఒడంబ‌డిక‌లు.

పూర్వ‌రంగం

బాల‌ కార్మిక వ్య‌వ‌స్థ‌పై వెలువ‌డుతున్న ఆందోళ‌న‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు క‌ట్టుదిట్ట‌మైన చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న‌, ప్రాజెక్టు ఆధారిత విధానం ఆచ‌రించ‌డం వంటి బ‌హుముఖ వ్యూహాన్ని ప్ర‌భుత్వం అమలుచేస్తోంది. అయిన‌ప్ప‌టికీ 14 సంవ‌త్స‌రాల లోపు బాల‌ల‌ల‌ను ఏ విధ‌మైన వృత్తుల్లోకి పెట్టుకోవ‌డాన్నిఅయినా పూర్తిగా నిషేధిస్తున్న బాల్య‌, కౌమార‌ ద‌శ‌లోని బాల‌ల (నిషేధం మ‌రియు నియంత్ర‌ణ‌) చ‌ట్టం-1986 నిర్దేశించిన నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా అనుస‌రించ‌డం ద్వారా బాల‌ల‌కు సుర‌క్షిత‌మైన‌, ఫ‌ల‌వంత‌మైన భ‌విష్య‌త్తును అందించే కార్య‌క‌లాపాల్లో వేగాన్ని పెంచవలసిన అవ‌స‌రం ఉంది. 2030 కల్లా స్థిర అభివృద్ధి ల‌క్ష్యాలు సాధించాలంటే బాల‌ కార్మిక వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా నిర్మూలించే దిశ‌గా ఇటీవ‌ల తీసుకున్న చ‌ర్య‌ల‌ను ప‌టిష్ఠంగా అమ‌లుప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఉంది. దేశంలో బాల కార్మిక వ్య‌వ‌స్థ‌ను సంపూర్ణంగా నిర్మూలించాల‌న్న ల‌క్ష్యాన్ని చేర‌డానికి, ఈ ఒడంబ‌డిక‌లలోని నిబంధ‌న‌ల క‌ట్టుబాటుకు 138, 182 ఒడంబ‌డిక‌ల ధ్రువీక‌ర‌ణ ఒక ముంద‌డుగు. ప్ర‌స్తుతం 138వ ఒడంబ‌డిక‌ను 169 దేశాలు ధ్రువీక‌రించ‌గా, 182 ఒడంబ‌డిక‌ను 180 దేశాలు ధ్రువీక‌రించాయి. ఈ రెండు ఒడంబ‌డిక‌ల‌ను ధ్రువీక‌రించ‌డం ద్వారా భార‌తదేశం బాల‌ల‌ను ప‌నుల్లో పెట్టుకోవ‌డాన్ని నిషేధించే చ‌ట్టాల‌ను ఆమోదించిన‌ ప్ర‌ధాన దేశాల స‌ర‌స‌న స్థానం సంపాదించుకోగ‌లిగింది.

***