Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అక్టోబర్ 27న ‘ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సదస్సు 2026’ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి


ఢిల్లీలోని భారత్ మంటపంలో జరగనున్న ‘ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సదస్సు 2026’ను 2026 అక్టోబర్ 27న సాయంత్రం 5:30 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

అక్టోబర్ 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు, విధానకర్తలు, పరిశ్రమల అధిపతులు, అంకురాలు, అంతర్జాతీయ నిపుణులు పాల్గొని వర్ధమాన సాంకేతికతలు.. భారతదేశ శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల ప్రాధాన్యతలపై చర్చించనున్నారు.

కృత్రిమ మేధ(ఏఐ), బయోటెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, తయారీ, ఆరోగ్య సంరక్షణ, ఇంధనాలు, వాతావరణం, సముద్ర శాస్త్ర విజ్ఞానం సహా 12 ప్రధాన అంశాలపై ఈ చర్చలు సాగనున్నాయి. పరిశోధనా ప్రాధాన్యతలు, జాతీయ సామర్థ్యాలు, శాస్త్రీయ పురోగతిని ఆచరణాత్మక వినియోగంలోకి తీసుకురావడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

ఈ సదస్సులో దేశీయ శాస్త్రీయ రంగం సాధించిన పురోగతిని, వర్ధమాన సాంకేతికతలను ప్రదర్శించే విస్తృతమైన శాస్త్రవిజ్ఞాన ప్రదర్శన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులో దాదాపు 150 డీప్-టెక్ అంకుర స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇవి సాంకేతిక రంగాభివృద్ధిని, వివిధ రంగాల్లో వాటి ఆచరణాత్మక ఉపయోగాలను తెలియజేస్తాయి.

శాస్త్రీయ పురోగతి, దాని క్షేత్ర స్థాయి ఉపయోగాలపై ప్రతినిధులకు మరింత లోతైన అవగాహన కల్పించేందుకు థీమాటిక్ వీడియోలు, సాంకేతిక ప్రత్యక్ష ప్రదర్శనలు (డెమోలు), డాక్యుమెంటరీలు, సమాచార కియోస్క్‌లు, ఆగ్మెంటెడ్- వర్చువల్ రియాలిటీ (ఏఆర్/వీఆర్) అనుభూతులను ఈ సదస్సులో భాగం చేయనున్నారు.

ఒక కొత్త కార్యక్రమమైన ‘గ్లోబల్ కనెక్ట్ నెట్‌వర్కింగ్ ఈవెంట్’ భారత్, విదేశాల్లోని విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల నుంచి 300 కంటే ఎక్కువ మంది ఆహ్వానిత ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకురానుంది. అంతర్జాతీయ పరిశోధన భాగస్వామ్యాలు, పరిశ్రమ-విద్యా సంస్థల మధ్య సహకారం, ప్రయోగశాలల్లో రూపుదిద్దుకున్న ఆవిష్కరణలను మార్కెట్‌లకు చేరవేసే మార్గాలను అన్వేషించడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది.

 

***