Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అనువాదం: హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

అనువాదం: హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం


తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారు, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.. కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు జీ. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కుమార్ గారు.. నా తోటి పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు.. తెలంగాణ ప్రభుత్వ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, సోదరీ సోదరులారా!

 

సైబరాబాద్‌కు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ సామర్థ్యం ఉంది. తెలంగాణ, దేశం సాధిస్తోన్న వేగవంతమైన అభివృద్ధికి ఇది ఒక ప్రధాన కేంద్రం. అందుకే తెలంగాణను దేశపు అతిపెద్ద తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నేడు సైబరాబాద్ నుంచి ఎన్నో భారీ ప్రాజెక్టులను ప్రారంభించాం. ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరిగిన ఈ ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ వేలాది కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర అనుసంధానత కూడా మరింత బలోపేతం అవుతుంది. ఈ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 

మిత్రులారా, 

 

నేడు భారత్ ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్’పై దూసుకుపోతోంది. అదే సమయంలో నేటి భారత్ ఆధునిక మౌలిక సదుపాయాలను కూడా నిర్మిస్తోంది. జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం కూడా ఇదే లక్ష్యంలో భాగం. పారిశ్రామిక కారిడార్‌లను నిర్మించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన జాతీయ కార్యక్రమంలో ఈ పారిశ్రామిక ప్రాంతం ఒక ముఖ్యమైన భాగం. ఇది ఒక రకమైన ‘ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ’గా రూపాంతరం చెందనుంది. ఇక్కడ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అద్భుతమైన విద్యుత్ సరఫరా, అత్యాధునిక ఐసీటీ నెట్‌వర్క్ ఉంటాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతి సౌకర్యం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఈ సౌకర్యాల కల్పన కోసం భారత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. దీనివల్ల తెలంగాణ, హైదరాబాద్‌కు చెందిన వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుంది. ఇక్కడ ఏర్పాటు కాబోయే వాహన తయారీ, యంత్రసామగ్రి, ఆహార శుద్ధి పరిశ్రమలు తెలంగాణలోని కార్మికులు, రైతులను మరింత శక్తిమంతులుగా మారుస్తాయి.

 

మిత్రులారా, 

 

గతంలో భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్నప్పుడు మన వస్త్ర పరిశ్రమ అందులో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మనం ఆ వారసత్వాన్ని మరోసారి బలోపేతం చేస్తున్నాం. వరంగల్‌లో ఏర్పాటు కానున్న పీఎం మిత్ర పార్క్ దేశంలో వస్త్ర విప్లవాన్ని వేగవంతం చేస్తుంది. పీఎం మిత్ర పార్క్‌లో ఏర్పాటు చేసే యూనిట్లు కేంద్ర ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనాలను పొందుతాయి. వీటికి కేంద్ర ప్రభుత్వ పీఎల్ఐ పథకం నుంచి కూడా మద్దతు లభిస్తుంది. ఈ టెక్స్‌టైల్ పార్క్ భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా మన సోదరీమణులు, కుమార్తెలకు అనేక అవకాశాలు లభిస్తాయి.

మిత్రులారా, 

 

గత 12 ఏళ్లుగా భారత ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలలో ఆధునిక అనుసంధానత ఒకటిగా ఉంది. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు.. ఇలా రవాణాకు సంబంధించిన ప్రతి రంగంలోనూ మునుపెన్నడూ లేనంత పెట్టుబడులు పెడుతున్నాం. కేవలం జాతీయ రహదారుల కోసమే సుమారు 1.75 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించాం. దీనివల్ల తెలంగాణకు కూడా ఎంతో మేలు జరిగింది. గత 12 ఏళ్లలో తెలంగాణలోని జాతీయ రహదారుల నెట్‌వర్క్ రెట్టింపు అయ్యింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి విస్తరణ వల్ల ప్రయాణికులకు ఎంతో సౌకర్యం కలుగుతుంది. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ప్రయాణ ఖర్చులు కూడా ఆదా అవుతాయి.

 

మిత్రులారా, 

 

2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్ వెయ్యి కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉండేది. రేవంత్ గారు మీరు వింటున్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో రైల్వే బడ్జెట్ వెయ్యి కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉండేది. ఈ రోజు నేను ఉమ్మడి ఆంధ్ర గురించి మాట్లాడటం లేదు. ఈ రోజు తెలంగాణ రైల్వే బడ్జెట్ మాత్రమే సుమారు ఐదున్నర వేల కోట్ల రూపాయలుగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ సుమారు 50 వేల కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఐదు వందే భారత్, ఆరు అమృత్ భారత్ రైళ్లు కూడా తెలంగాణలో నడుస్తున్నాయి.

మిత్రులారా, 

 

కొద్దిసేపటి క్రితమే కాజీపేట-విజయవాడ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులోని కొన్ని విభాగాలను ప్రారంభించాను. దీనితో పాటు కాజీపేట రైల్ అండర్ బైపాస్ లైన్‌ను కూడా జాతికి అంకితం చేశాను. ఈ సౌకర్యాలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయటంతో పాటు రవాణా వేగాన్ని పెంచుతాయి.

 

మిత్రులారా, 

 

21వ శతాబ్దపు ప్రపంచంలో ఇంధనం లేనిదే ఏదీ ముందుకు సాగదు.. అంతా నిలిచిపోతుంది. ఇంధన భద్రతను ఉన్న ప్రాముఖ్యతను ఈ రోజు ప్రతి ఒక్కరూ గుర్తించగలుగుతున్నారు. అందుకే భారతదేశ ఇంధన భద్రత కోసం మన కేంద్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేనంత వ్యయం చేస్తోంది. మల్కాపూర్‌లో ఇండియన్ ఆయిల్‌కు సంబంధించిన కొత్త టెర్మినల్‌ను ప్రారంభించడం ఈ దిశలో ఒక ప్రధాన అడుగు. ఈ టెర్మినల్ తెలంగాణలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.

 

మిత్రులారా, 

 

గడిచిన కొన్నేళ్లలో సౌరశక్తి వినియోగంలో ప్రపంచ దేశాల్లోనే భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపే విషయంలో మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన కృషి చేశాం. మొదట మేం ప్రతి ఇంటికీ 100 శాతం ఎల్‌పీజీ కనెక్షన్లు అందించడంపై దృష్టి సారించాం. ఇప్పుడు తక్కువ ధరకే పైపుల ద్వారా గ్యాస్ అందించడం, సీఎన్‌జీ ఆధారిత వ్యవస్థలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతున్నాం. ఇటువంటి ప్రయత్నాల వల్లనే నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ ఇంధన సంక్షోభాన్ని భారత్ గట్టిగా ఎదుర్కోగలుగుతోంది. అయితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి వాటిని మనం చాలా పొదుపుగా వాడాలని ప్రస్తుత కాలం కోరుతోంది. మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇంధన ఉత్పత్తులను అవసరమైన మేరకే ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. దీనివల్ల మన విదేశీ మారకద్రవ్యం ఆదా అవ్వటమే కాకుండా యుద్ధం కారణంగా తలెత్తే సంక్షోభ ప్రభావాలను కూడా తగ్గించొచ్చు.

మిత్రులారా, 

 

నేడు తెలంగాణ యువత సరికొత్త కలలు కంటున్నారు. ఇక్కడి రైతులు నూతన ఆశలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. ఇక్కడి పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, అంకురాలు.. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని ఆశిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి చెందుతుంది. మీ కలలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత వేగంతో పని చేస్తుందని తెలంగాణలోని ప్రతి కుటుంబానికి నేను భరోసా ఇస్తున్నాను. ఇప్పుడే మన రేవంత్ గారు మాట్లాడుతూ మనం రాజకీయం మాట్లాడొద్దని అన్నారు.. అందుకే నేను కూడా మాట్లాడను. కాబట్టి ఒక రాజకీయేతర కోణంలో నేను రేవంత్ గారితో ఒక మాట చెబుతున్నాను.. గత 10 ఏళ్ల పరిపాలనలో భారత ప్రభుత్వం గుజరాత్‌కు ఏమైతే ఇచ్చిందో అవన్నీ మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నాకున్న అనుభవంతో ఒక విషయం చెబుతున్నాను. నేను గనుక అలా చేస్తే ప్రస్తుతం మీకు అందుతున్నది సగానికి తగ్గిపోతుంది. మీరు చేరుకోవాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు. అందుకే మీరు నాతో సంప్రదింపుల్లో ఉండటం మంచిది.

 

మిత్రులారా, 

 

ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉండటం తప్పు కాదని మేం బలంగా నమ్ముతాం. అయితే దేశాభివృద్ధికి రాష్ట్రాల అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. రాష్ట్రాల అభివృద్ధి లేకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదు. అందుకే మా ప్రణాళికలన్నింటికీ కేంద్రబిందువు రాష్ట్రాల అభివృద్ధి.. వాటి వేగవంతమైన పురోగతే. ఇదే స్ఫూర్తితో మనమందరం కలిసి ముందుకు సాగుదాం. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ కల సాకారం కావడాన్ని మన కళ్లారా చూద్దాం. అందరికీ ఇవే నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు!

 

గమనిక: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగం అనువాదం ఇది. 

***