పిఎంఇండియా
సైబర్ అంశాలలో సహకారం అనేది భారతదేశం, అమెరికా ల ద్వైపాక్షిక సంబంధాలలో ఒక కీలకమైన అంశం. ఉమ్మడి విలువలు, ఉమ్మడి దృక్పథం, సైబర్ విభాగంలో భాగస్వామ్య విలువతో కూడిన వ్యూహాత్మక సహకారమిది. సైబర్ అంశాల్లో ఇప్పటికే తమ మధ్య ఉన్న విస్తృత సహకారాన్ని వ్యవస్థీకృతం చేయాల్సిన అవసరాన్ని ఉభయ వర్గాలు గుర్తించాయి. ఈ దిశగా కింద పేర్కొన్న సిద్ధాంతాల ఆధారంగా సైబర్ సహకార వ్యవస్థకు రూపకల్పన చేయాలని భావిస్తున్నాయి.
భారత- అమెరికా సైబర్ సహకారపు ఉమ్మడి సిద్ధాంతాలలోని ముఖ్య అంశాలు.. :
• సైబర్ స్పేస్ లో సురక్షితమైన, విశ్వసనీయమైన, పరస్పర మార్పిడికి అవకాశం గల వాతావరణ కల్పనకు కట్టుబాటు;
• నవ్య ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధి, వ్యాపార వాణిజ్య విస్తరణకు ఒక చోదక శక్తిగా ఇంటర్ నెట్ అభివృద్ధి;
• సమాచారం స్వేచ్ఛగా అందించుకునే వాతావరణం కల్పన;
• సైబర్ సంబంధ నేరాలు, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల మధ్య సహకారం;
• సైబర్ సంబంధ ముప్పులను దీటుగా ఎదుర్కొనడం, సైబర్ సెక్యూరిటీని మరింత ప్రోత్సహించే విధంగా ద్వైపాక్షిక, అంతర్జాతీయ సహకారాల ప్రాముఖ్యాన్ని గుర్తించడం;
• సంస్కృతిపరమైన వైవిధ్యాన్ని, భాషాపరమైన వైవిధ్యాన్ని పరస్పరం గౌరవించుకొనేందుకు కట్టుబాటు;
• అంతర్జాతీయ చట్టాలు.. ప్రత్యేకించి ఐక్య రాజ్య సమితి అధికార పత్రానికి అనుగుణంగా సైబర్ విభాగంలో అంతర్జాతీయ భద్రతను, స్థిరత్వాన్ని సాధించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, సైబర్ రంగంలో ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు స్వచ్ఛంద నియమావళికి రూపకల్పన చేయడం;
• ప్రభుత్వాలు, పౌర సమాజం, ప్రైవేటు రంగం వంటి బహుళ భాగస్వామ్యాలు గల పారదర్శకమైన, బాధ్యతాయుతమైన ఇంటరె నెట్ గవర్నెన్స్ కు రూపకల్పన, అందరి మధ్య సహకార సాధన;
జాతీయ భద్రతకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ అంశాల్లో ప్రభుత్వాలకే ప్రధాన పాత్ర ఉండేందుకు అంగీకారం;
• సైబర్ సెక్యూరిటీ, దానికి సంబంధించిన పరిశోధన, అభివృద్ధి విభాగాల ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, ఆ విభాగంలో సహకారానికి అవసరమైన సామర్థ్యాల విస్తరణ;
• ఉభయ దేశాల మధ్య సైబర్ నేరాల నిరోధంలో చట్టాన్ని అమలు పరిచే ఏజెన్సీల మధ్య సన్నిహిత సహకారం విస్తరణకు కట్టుబాటు;
• ఆన్ లైన్ లో మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ పరిరక్షణకు కట్టుబాటు;
• అత్యంత కీలకమైన సమాచార మౌలిక వసతుల రక్షణలో సహకారానికి కట్టుబాటు.
ఉమ్మడి భాగస్వామ్య సిద్ధాంతాలను ఆచరణాత్మకం చేయడంలో ఉభయుల సహకారంలో ప్రధానాంశాలు..:
– సైబర్ సెక్యూరిటీలో అత్యుత్తమ ప్రమాణాలను గుర్తించి, సమన్వయపరిచి, పరస్పరం అందించుకోవడం;
– వాస్తవిక దృక్పథంతో లేదా అందుబాటులో ఉన్న వసతుల ఆధారంగా ప్రస్తుత ద్వైపాక్షిక ఒప్పందాల పరిధిలో ఆచరణీయ సహకారం విస్తరణ, ఇలాంటి సమాచారం మార్పిడికి అవసరమైన యంత్రాంగం ఏర్పాటు;
– ఐ సి టి మౌలిక సదుపాయాలు, సమాచార వ్యవస్థలను దేశీయ, అంతర్జాతీయ చట్టాల పరిధిలో కాపాడుకొనేందుకు అవసరమైన ఆచణీయ యంత్రాంగాన్ని అభివృద్ధిపరచడం;
– సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టడంతో పాటు సైబర్ సెక్యూరిటీకి ప్రమాణాలను రూపొందించడం, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఉత్పత్తుల అభివృద్ధి, అక్రెడిటేషన్ విధానం రూపకల్పన, ఈ తరహా అంశాల్లో మరింతగా సంప్రదింపుల విస్తరణ;
– స్వచ్ఛంద, పరస్పర సహకారం ప్రాతిపదికన ఐ సి టి మౌలిక సదుపాయాల పరిరక్షణకు కావలసిన ఆచరణీయ చర్యల అమలు;
– సైబర్ నేరాల నిరోధానికి కృషి చేసే విభాగాల మధ్య సహకారం విస్తృతిలో భాగంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించుకోవడం, చర్చలు, సంప్రదింపుల ప్రక్రియను విస్తరించుకోవడం;
– ఉమ్మడి శిక్షణ కార్యక్రమాల ద్వారా చట్టపరమైన సంస్థల సామర్థ్యాల నిర్మాణం, భారత్ లోను, అంతర్జాతీయంగాను అమలులో ఉన్న చట్టాలకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ ఆధారాల సేకరణకు ఆయా సంస్థలకు అనుమతి;
– సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్స్, డిజిటల్ ఫోరెన్సిక్, చట్ట విభాగాల మధ్య నైపుణ్యాల వృద్ధి, సామర్థ్యాల విస్తరణకు ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణ;
– ప్రభుత్వాల ప్రవర్తనకు అంతర్జాతీయ చట్టాలను వర్తింపచేసే విషయంలో సహకారం, ఈ సహకారం మరింత విస్తరించుకునేందుకు గల అవకాశాల అన్వేషణ;
– అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన కోణంలో ప్రభుత్వాల బాధ్యతాయుత ధోరణికి అవసరమైన నియమావళి స్వచ్చందంగా రూపొందించుకోవడం.
ఈ దిగువ అంశాల ఆధారంగా స్వచ్ఛంద నియమావళి రూపకల్పన :-
– అంతర్జాతీయంగా అమలులో ఉన్న, ప్రజాసేవకు కీలకమైన మౌలిక వసతులను ఆన్ లైన్లో విధ్వంసం చేసేందుకు తెలిసి గాని, లేదా తెలియక గాని ఎవరినీ అనుమతించకూడదు
– సైబర్ సంఘటనలపై చర్యకు ఉపక్రమించే విషయంలో జాతీయ సి ఎస్ ఐ ఆర్ టి లను ప్రభుత్వాలు తెలిసి గాని, తెలియక గాని నిరోధించకూడదు. ఇతరులకు నష్టం చేకూర్చే ఆన్ లైన్ చర్యలకు సి ఎస్ ఐ ఆర్ టి లు పాల్పడకుండా నిరోధించడం
– జాతీయ చట్టాల, అంతర్జాతీయ చట్టాల పరిధిలోనే సహకారం విస్తరించుకోవడం, అవసరం అయినప్పుడు ఇతర దేశాల సైబర్ నేరాల విచారణ వ్యవస్థల సహకారం కోరడం
– మేధోసంపత్తికి సంబంధించిన హక్కులు, వాణిజ్య రహస్యాలు, ఇతర కీలక వాణిజ్య సహకారాన్ని ఐ సి టి పరికరాల ఆధారంగా చోరీ చేయడాన్ని తెలిసి గాని, తెలియక గాని ఆమోదించకపోవడం
– టెలికాం పరికరాల భద్రత, టెస్టింగ్, అక్రెడిటేషన్ లకు సంబంధించిన వ్యవహారాల్లో పరస్పర సహకారం
– అంతర్జాతీయ సైబర్ స్థిరత్వం, సైబర్ కార్యకలాపాల విధ్వంసానికి సంబంధించిన అంశాల్లో పరిజ్ఞానం పెంచుకోడం
– ఐ సి టి ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన అంశాల్లో వినియోగదారుల విశ్వాసం పెంచేందుకు వీలుగా వ్యూహాల విస్తరణపై చర్చల నిర్వహణ
– అవాంఛనీయ సంఘటనలు జరిగిన సమయంలో వాటికి సత్వరం స్పందించే విషయంలో చర్చలు విస్తరించుకోవడం
– సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాల్లో నిర్దిష్ట సహకారానికి జాయింట్ టేబుల్ టాప్ కార్యకలాపాల అమలు
– ఇంటర్ నెట్ గవర్నెన్స్ లో బహుళ భాగస్వామ్య నమూనాకు మద్దతు
– ఐ సి ఎ ఎన్ ఎన్, ఐ జి ఎఫ్ ల వంటి ఇంటర్ నెట్ గవర్నెన్స్ వేదికల ద్వారా చర్చలు, సహకారం కొనసాగింపు, ఆయా వేదికల ద్వారా ఉభయ దేశాలకు చెందిన సంస్థల క్రియాశీల భాగస్వామ్యానికి అనుకూల వాతావరణం ఏర్పాటు
– అంతర్జాతీయ సైబర్ నేరాల అదుపునకు తీసుకోవలసిన చర్యలపై సంప్రదింపుల నిర్వహణ
– భారత్ లో ఇంటర్ నెట్ మౌలిక సదుపాయాల పటిష్ఠీకరణ
– టెక్నాలజీ ఏక్సెస్ పాలసీని పరస్పర అవగాహన కలిగి పంచుకొనే దిశగా కసరత్తు.. ఇందులో రెండు పక్షాలలోను ఏదో ఒక పక్షం నియంత్రణలో ఉండే విధంగా రెండు విధాలైన టెక్నాలజీల వినియోగం, ఇంకా.. ద్వైపాక్షిక హై టెక్నాలజీ కో ఆపరేషన్ గ్రూప్ వంటి యంత్రాంగాల ఏర్పాటు భాగంగా ఉంటాయి.
యు ఎస్ – ఇండియా సైబర్ రిలేషన్ షిప్ అంశానికి సంబంధించి పూర్తి స్థాయి ఫ్రేమ్ వర్క్ పై 60 రోజుల లోగా సంతకాలు జరగగలవని ఆశిస్తున్నారు.