పిఎంఇండియా
ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియమ్ & ఎనర్జీ (ఐఐపిఇ)ని పార్లమెంటులో చట్టం చేయడం ద్వారా ‘‘జాతీయ ప్రాధాన్యం కలిగిన సంస్థ’’గా ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సంస్థ ఐఐటి మాదిరిగానే డిగ్రీలను ఇవ్వడానికి తగిన పాలన స్వరూపాన్ని మరియు శాసన సంబంధమైన ఆదేశాన్ని కలిగివుంటుంది. పెట్రోలియమ్ మరియు శక్తి అధ్యయనాలలో ఒక ‘‘శ్రేష్ఠతా కేంద్రం’’గా రూపొందడానికి ఈ సంస్థకు తగిన ప్రతిపత్తిని దఖలుపరచేందుకుగాను ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకువస్తారు.
ఐఐపిఇ ని ఏర్పాటు చేయడానికి రూ. 655.46 మూలధన వ్యయంగాను మరియు ఎండోమెంట్ ఫండ్ రూపంలో రూ. 200 కోట్లు సమకూర్చేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది (చమురు కంపెనీల నుండి ఎండోమెంట్ నిధికి అందే రూ. 200 కోట్లకు ఇది అదనం).
ఈ విధమైన ఒక సంస్థను నెలకొల్పాలని ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం- 2014 లోని 13వ షెడ్యూలులో భాగంగా వాగ్దానం చేయడమైంది. పెట్రోలియమ్ రంగానికి నైపుణ్యం కలిగిన కార్మికులను సమకూర్చడంలో సంఖ్యాత్మకమైన మరియు గుణాత్మకమైన అంతరాన్ని భర్తీ చేయడంతో పాటు ఈ రంగం ఎదుగుదలకు అవసరమైన పరిశోధన కార్యకలాపాలను ప్రోత్సహించడం దీని ఉద్దేశం. కెజి-బేసిన్, విశాఖపట్నం శుద్ధి కర్మాగారం మరియు కాకినాడలో ఏర్పాటు చేయదలుస్తున్న పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ల వంటి చమురు మరియు గ్యాస్ రంగ సంబంధిత కార్యకలాపాలకు సన్నిహితంగా ఈ ఇన్ స్టిట్యూట్ నెలకొననున్నందున ఐఐపిఇ యొక్క విద్యా సంబంధమైన కార్యక్రమాలకు, పరిశోధన సంబంధమైన కార్యక్రమాలకు తగిన అండదండలు లభించగలవని ఆశిస్తున్నారు.
పూర్వరంగం:
విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరం మండలంలో ఐఐపిఇ ని ఏర్పాటుచేయడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 200 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించింది. ఎపి సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001లో భాగంగా ఒక సొసైటీగా 2016 ఏప్రిల్ 18వ తేదీన ఐఐపిఇ ని రిజిస్టర్ చేశారు. 2016-17 విద్యా సంవత్సరం కోసం ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో ఒక తాత్కాలిక క్యాంపస్ ను పెట్రోలియమ్ ఇంజినీరింగ్, ఇంకా కెమికల్ ఇంజినీరింగ్ అనే రెండు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లను (ప్రతి విభాగంలో 50 యేసి మంది విద్యార్థులతో) ఏర్పాటు చేయడమైంది. ఈ ఇన్ స్టిట్యూట్ కు మార్గదర్శకత్వం వహించే బాధ్యతను ఖరగ్ పూర్ లోని ఐఐటి స్వీకరించింది.