Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆకాశవాణి లో 2016 ఏప్రిల్ 24న ప్ర‌ధాన‌ మంత్రి ‘మ‌న్ కీ బాత్’ ప్రసంగ పాఠానికి తెలుగు అనువాదం ఇది.


ప్రియ‌మైన నా దేశ‌ వాసులారా..

న‌మ‌స్కారం.

ఇప్పుడు వేసవి కాలం. ప్రతి ఒక్కరు ఎండాకాలం సెల‌వుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొంటారు. ఇది మామిడి పండ్ల కాలం కూడా కావడంతో, ఈ ఫలాలను రుచి చూడాల‌ని మనం తపిస్తాం. ఒక్కొక్క సారి మధ్యాహ్నం పూట కొంచెం సేపు కునుకు తీస్తే భలేగా ఉంటుందని మనకు అనిపిస్తుంది. కానీ, ఈ సంవత్సరం ఎండలు ఎక్కువై ఉక్కబోత అందరి వినోదాన్నీ నాశనం చేసింది.

ఎడతెగని వేడిమిని గురించి జాతి ఆందోళన చెందడమనేది ఎంతో సహజమైందే. అంతకు మించి, గత రెండు సంవత్సరాలుగా వరుసగా దుర్భిక్షం ఎదురవడంతో, మామూలుగా నీరు నిల్వ ఉండే ప్రదేశాలపై ప్రతికూల ప్రభావం పడింది. కొన్ని సార్లు కబ్జా కార‌ణంగా, మరికొన్ని సార్లు ఇసుక మేట వేసిన కార‌ణంగా, జలాశయాలలోకి, ఇంకా ఇతర జల వనరులలోకి వచ్చే నీటి ప్ర‌వాహానికి అడ్డంకి ఏర్పడింది. ఫలితంగా, జలాశయాలు వాటి సామర్థ్యం కన్నా తక్కువగా మాత్రమే నీటిని నిల్వ ఉంచగలుగుతున్నాయి. ఇంకా అథమమైన విషయం ఏమిటంటే, ఇదే చక్రభ్రమణం ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉండటం. దీనితో ఈ జలాశయాల సామర్థ్యం క్రమంగా తగ్గిపోయింది. కరవు సమస్యను పరిష్కరించడానికి, జల సంక్షోభం నుంచి ఉపశమనం కలిగించడానికి, ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఇదొక్కటే కాదు.. పరిస్థితిని ఎదురించడానికి పౌరులు అభినందనీయమైన కృషికి న‌డుంక‌డుతున్నారు. అనేక గ్రామాలలో ఇప్పుడు చైత‌న్యవ కనుపిస్తోంది. నీటి కొరతను అనుభవించిన వారే జలం సిసలైన విలువను తెలుసుకోగలుగుతారు. కాబట్టి, ఇటువంటి చోట్ల వారు నీళ్ల విషయంలో ఎంతో జాగ్రత్తలతో ఉంటారు; ఇంకా, నీటి కరవును తట్టుకోవడానికి ఏదో ఒక‌టి చేయ‌డంలో జ‌రుగుతుంది.

ఇటీవలే ఎవ‌రో నాతో చెప్పారు.. మహారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ జిల్లా హివ్ రేబ‌జార్ గ్రామ‌ పంచాయ‌తీలో ఆ గ్రామస్తులు నీటి కొర‌త‌ను ప్రధానమైన, ఎంతో సున్నిత‌మైన సమస్యగా ఎంచి ప‌రిష్క‌రించుకున్నారని. నీటిని నిల్వ చేయాలనే ఆస‌క్తి వ్యక్తమయ్యే పల్లెలను ఎవరైనా అనేకంగా చూడవచ్చు. హివ్ రేబ‌జార్ లో వ్యవసాయదారులు పంటలు విత్తే రీతిని మార్చి అ సమస్యను పరిష్కరించారు. నీరు అధికంగా అవసరమయ్యే పంట‌లను.. అంటే చెర‌కు, అర‌టి వంటివి సాగు చేయడాన్ని మానివేయాలని వారు నిర్ణయించుకొన్నారు. విన‌డానికి ఇది చాలా సుల‌భంగా ఉన్నా, కానీ వాస్తవంలో ఇది అంత‌ సుల‌భం కాదు. ఇది ఎంత‌ పెద్ద సమష్టి నిర్ణయం అయి ఉంటుందో? ఎవరైనా నీటిని ఎక్కువగా వాడే క‌ర్మాగారాల యజమానులకు అటువంటి జల వినియోగం పర్యవసానాలను గురించి చెప్పి వారి యూనిట్లను మూసివేయవలసిందిగా అభ్యర్థిస్తే వచ్చే ప్రతిస్పందన ఎలా ఉంటుందదో ఎవరైనా ఇట్టే ఊహించవచ్చు. అయితే ఈ రైతు సోదరుల వివేకాన్ని చూడండి. చెర‌కు పంట‌ సేద్యానికి బోలెడంత నీరు కావలసి వస్తుందని గ్రహించారు కాబట్టి ఆ పంటను వేయవద్దని వారు అనుకొని, అదే ఆలోచనను అమలులో పెట్టారు. చెరకు కాకుండా పండ్లు, కాయగూరల వంటి ఎంతో తక్కువ నీరు ఉపయోగించుకొనే పంటలను వేస్తున్నారు. స్ప్రింక్లర్‌ లు, బిందు సేద్యం మెలకువలు, వాటర్ హార్వెస్టింగ్, వాట‌ర్ రీఛార్జింగ్.. ఇలా అనేక ర‌కాల కార్యక్రమాలను వారు అనుసరించారు. ఇవాళ వారి గ్రామం నీటి స‌మ‌స్యకు ఎదురొడ్డి నిలువగలిగే శ‌క్తి ని సంతరించుకొంది. నేను హివ్ రేబ‌జార్ లాంటి చిన్న ఊరిని గురించి చెప్తుండవచ్చు అయితే, ఇటువంటి గ్రామాలు ఇంకా ఎన్నో ఉండే ఉంటాయి. అటువంటి గ్రామాల నివాసులకు వారు చేస్తున్న మంచి పనికి గాను నేను వారికి నా హృద‌య‌పూర్వ‌క‌మైన‌ అభినందనలను తెలియజేస్తున్నాను.

నాకు ఎవ‌రో చెప్పారు, మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌లోని దేవాస్ జిల్లాలో గోర్ వా గ్రామ‌ పంచాయ‌తీ ఉంద‌ని. ఈ పంచాయ‌తీ ప్ర‌య‌త్నం చేసి పంట‌ చెరువును ఏర్పాటు చేయ‌డానికి ఒక కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. దాదాపు 27 పంట‌ చెరువులను త‌యారు చేశారు. ఇందువ‌ల్ల భూగ‌ర్భ జ‌లాల స్థాయి ఎంత‌గానో పెరిగింది. నీరు పైకి వ‌చ్చింది. పంట‌కు ఎప్పుడు సాగు నీరు అవ‌స‌ర‌మైనా, నీరు ల‌భించేది. సుమారు 20 శాతం వారి వ్య‌వ‌సాయ ఉత్పాద‌న పెరిగింది. అలా నీరైతే పొదుపు అయ్యింది. ఎప్పుడైతే నీటి స్థాయి పైకి వ‌స్తుందో.. అప్పుడు నీటి నాణ్య‌త‌లో కూడా ఎంతో మార్పు వ‌స్తుంది. స్వ‌చ్ఛ‌మైన తాగు నీరు GDP వృద్ధికి కూడా కార‌ణం అవుతుంద‌ని అంటారు. ఆరోగ్యం అయితే త‌ప్ప‌కుండా మెరుగ‌వుతుంది.

భార‌త ప్ర‌భుత్వ రైల్వే ద్వారా నీరు లాతూర్‌కు చేరుతుంద‌ని తెలిసిన‌ప్పుడు ఇది ప్ర‌పంచానికి ఒక వార్త అవుతుంది. ఇది నిజ‌మే. ఎంత‌ వేగంగా రైల్వే ఈ ప‌ని చేసింది. ఇది త‌ప్ప‌కుండా అభినంద‌నీయ‌మే. అయితే ఆ గ్రామ‌ ప్ర‌జ‌లు కూడా అంతే అభినంద‌నీయులే. ప్ర‌జ‌ల ద్వారా అమ‌ల్లోకి వ‌చ్చే ఇలాంటి యోచ‌న‌లు మ‌న‌కు క‌నిపించ‌వు. ప్ర‌భుత్వం చేసే ప‌నుల గురించి మంచి మాట‌లు అప్పుడ‌ప్పుడు మ‌న‌ ముందుకు వ‌స్తుంటాయి. కానీ మ‌న చుట్టుప‌క్క‌ల ఎంతో మంది అనావృష్టిని ఎదుర్కొనేందుకు ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారో ప‌రిష్కారం కోసం ఎలా కొత్త‌ కొత్త ప‌ద్ధ‌తులను అవ‌లంబిస్తున్నారో మ‌న‌కు గోచ‌రిస్తుంది.

మ‌నిషి ఎంత క‌ష్టంలో ఉన్న‌ప్ప‌టికీ ఎక్క‌డో మంచి జ‌రిగింద‌న్న ఒక శుభ వార్త అంద‌గానే త‌న క‌ష్ట‌మంతా దూర‌మైయింద‌న్న‌ట్టు ఊర‌ట పొంద‌డం స‌హజంగా జ‌రుగుతూ ఉంటుంది. ఈ సారి వ‌ర్షాకాలంలో 106 శాతం నుంచి 110 శాతం వ‌ర‌కు ఎక్కువ‌గా వ‌ర్ష‌పాతం న‌మోదుకావ‌చ్చున‌ని ఎప్పుడైతే సూచ‌న వ‌చ్చిందో వెంట‌నే అంద‌రూ ఒక శాంతి సందేశం పొందిన‌ట్టుగా ఆనందించారు. వ‌ర్షాలు కుర‌వ‌డానికి ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ వ‌ర్షాకాలం బాగుంటుంద‌న్న స‌మాచార‌మే ఎంతో సంతోషాన్ని, చైత‌న్యాన్ని క‌లిగించింది. కానీ ప్రియ‌మైన నా దేశ వాసులారా.. మంచి వ‌ర్షాలు ప‌డ‌తాయ‌నే ఈ స‌మాచారం ఎంత ఆనందాన్ని ఇస్తుందో మ‌నంద‌రికీ అంతే స్థాయిలో ఒక హెచ్చ‌రిక‌ను కూడా ఇస్తుంది. మ‌నం ప్ర‌తి గ్రామంలో నీటిని పొదుపుచేయ‌డానికి ఇప్ప‌టి నుంచే ఒక కార్య‌క్ర‌మాన్ని నిర్వహించ‌గ‌ల‌మా..? రైతుల‌కు మ‌ట్టి అవస‌రం ఉంటుంది. పొలంలో పంట పండించేందుకు ఆ మ‌ట్టి అవ‌స‌రం ఉంటుంది. ఈసారి మ‌నం చెరువులోంచి మ‌ట్టిని త‌వ్వి పండించేందుకు ఆ మ‌ట్టి అవ‌స‌రం ఉంటుంది. ఈసారి మ‌నం చెరువులోంచి మ‌ట్టిని త‌వ్వి తీసుకెళ్లి పొలంలో ఎందుకు వేయ‌కూడ‌దు? పొలం కూడా బాగా ప‌ండుతుంది. పొలానికి నీటిని నిల్వ‌ చేసుకొనే శ‌క్తి కూడా పెరుగుతుంది. అప్పుడ‌ప్పుడు సిమెంట్ సంచులలో, అప్పుడ‌ప్పుడు ఎరువుల ఖాళీ సంచులలో రాళ్లు, మ‌ట్టి నింపి- నీళ్లు వృథాగా పోయే మార్గాల్లో వాటిని అడ్డు పెట్టి ఆ నీరు పోకుండా చేయ‌వ‌చ్చు. ఐదు రోజులు నీరు, ఏడు రోజులు నీరు అంతా నిలచి ఉంటే.. అది భూమిలోకి ఇంకిపోతుంది. దాంతో భూమి లోని నీటిమ‌ట్టం పైకి వ‌స్తుంది. మ‌న బావుల్లోకి నీరు చేరుతుంది. ఎంత‌ నీటిని ఆప‌గ‌లిగితే, అంత నీటిని ఆపి ఉంచాలి. వ‌ర్ష‌పు నీరు, గ్రామ‌పు నీరు గ్రామంలోనే ఉంటుంది. ఇలా మ‌నం ఒక సంక‌ల్పం చేసి, ఏదో ఒక‌టి చేస్తే.. సామాజిక ప్ర‌య‌త్నం ద్వారా అంతా సంభ‌వ‌మే. ఈనాడు నీటికి ఎంతో క‌ష్టంగా ఉంది. అడుగంటిపోయిన ప‌రిస్థితి. కానీ మ‌న‌ వ‌ద్ద నెల‌న్న‌ర రోజులు స‌మ‌యం ఉంది.

నేనైతే ఎప్పుడూ చెబుతుంటాను.. మ‌నం ఎప్పుడైనా మ‌హాత్మా గాంధీ జ‌న్మ‌ స్థ‌ల‌మైన పోర‌బంద‌ర్ కు వెళితే, అక్క‌డ మనం చూసే అనేక ప్ర‌దేశాలలో.. వాన నీటిని దాచి ఉంచడానికి భూమి లోపలి భాగంలో తవ్విన గుంటలను.. కూడా చూడవచ్చు; రమారమి 200 ఏళ్ల‌ క్రిత‌ం నిర్మించారు వీటిని- వాన నీటిని నిల్వ చేయడానికి. ఈ గుంటలలో సేకరించిన నీరు ఎంత పరిశుభ్రంగా ఉండేదో.

శ్రీ కుమార్ కృష్ణ అనే ఆయ‌న MyGovలో రాశారు.. ఒక‌ రక‌మైన కుతూహ‌లాన్ని కూడా వ్య‌క్తం చేశారు; ఆయ‌నంటారు.. మ‌న జీవిత‌ కాలంలో గంగాన‌ది ప్ర‌క్షాళ‌న కార్య‌క్ర‌మం సంవ‌త్స‌రాల నుంచి న‌డుస్తోంది. ఎన్నో ప్ర‌భుత్వాలు వ‌చ్చాయి. ఇంచుమించుగా 30 సంవ‌త్స‌రాల నుంచి ఆ ప‌ని సాగుతోంది. ఎన్నో ప్ర‌భుత్వాలు వ‌చ్చాయి. ఎన్నో ప్రణాళిక‌లు రూపొందించారు. ఎంతో ఖ‌ర్చు కూడా అయింది. అందువ‌ల్ల సోద‌రుడు కుమార్‌ కృష్ణ వంటి దేశంలోని కోట్ల‌ మంది ప్ర‌జ‌ల్లో ఈ ప్ర‌శ్న త‌లెత్త‌డం చాలా స‌హ‌జం. ఎవ‌రైతే ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారో వారికి గంగా న‌ది మోక్ష‌దాయిని. నేను ఈ ఆధ్యాత్మిక స‌త్యాన్ని ఆమోదిస్తాను. కానీ దీని కంటే ముఖ్యంగా నాక‌నిపిస్తుంది ఏంటంటే – గంగా న‌ది జీవ‌న‌దాయిని అని. గంగాన‌ది నుంచి మ‌న‌కు అనుదినం భోజ‌నం ల‌భిస్తుంది. గంగ నుంచి మ‌న‌కు రోజువారీ ప‌ని దొరుకుతుంది. గంగాన‌ది నుంచి మ‌న‌కు బ‌త‌క‌డానికి ఒక కొత్త శ‌క్తి ల‌భిస్తుంది. గంగా న‌ది ప్ర‌వ‌హిస్తూ ఉంటే దేశ ఆర్థిక గ‌తిశీల‌త‌కు కూడా ఒక కొత్త దిక్సూచి ల‌భిస్తుంది. ఒక భ‌గీర‌థుడు మ‌న‌కు గంగ‌ను తెచ్చిపెట్టాడు. కానీ దీనిని కాపాడుకోవ‌డానికి కోట్లాది భ‌గీర‌థుల అవ‌స‌రం ఉంది. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం లేకుండా ఈ ప‌నిలో మ‌నం ఏనాటికీ స‌ఫ‌లం కాలేము. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రికీ శుభ్ర‌త కోసం, స్వ‌చ్ఛ‌త కోసం మార్పు తీసుకొచ్చే ఒక దూత‌గా మార‌వ‌ల‌సి ఉంటుంది. మ‌ళ్లీమ‌ళ్లీ ఇదే విష‌యాన్ని చెప్పాలి, చ‌ర్చించాలి. ప్ర‌భుత్వం త‌ర‌ఫు నుంచి అనేక ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. గంగా తీరం వెంబ‌డి ఉన్న రాష్ట్రాల‌న్నింటి నుంచి పూర్తి స‌హ‌కారం తీసుకునేందుకు కూడా ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఇందులో సామాజిక‌ సంస్థలకు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు కూడా పాత్ర క‌ల్పిస్తున్నాం. ఉప‌రిత‌ల ప‌రిశుభ్ర‌త‌, పారిశ్రామిక కాలుష్యాన్ని ఆపేందుకు అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. ప్ర‌తి రోజూ గంగా న‌దిలోకి కాల్వ‌ల ద్వారా పెద్ద మొత్తంలో చెత్తాచెదారం వ‌చ్చి చేరుతుంది. ఇటువంటి చెత్త‌ను శుభ్రం చేసేందుకు వార‌ణాసి, అల‌హాబాద్‌, కాన్పూర్‌, పట్నా మొద‌లైన చోట్ల ఉప‌రిత‌లం మీద తేలుతుండే చెత్త‌ను తీసివేసే ప‌ని జ‌రుగుతోంది. అన్ని స్థానిక సంస్థ‌ల‌కు ఈ విష‌యాన్ని వివ‌రించి, ఎక్క‌డిక‌క్క‌డ చెత్త‌ను శుభ్రం చేయ‌వ‌ల‌సిందిగా కోర‌డం జ‌రిగింది. ఎక్క‌డైతే ఈ ప‌రిశుభ్ర‌త కార్య‌క్ర‌మం జ‌రుగుతుందో, అక్క‌డ రోజుకు ‌3 ట‌న్నుల నుంచి 11 ట‌న్నుల వ‌ర‌కు చెత్త వెలికి వ‌స్తోంద‌ని తెలిసింది. అంటే ఆ మేర‌కు మురికిని వ్యాపించ‌కుండా ఆప‌గ‌లిగిన‌ట్లే క‌దా. రానున్న రోజులలో మ‌రిన్నిచోట్ల ట్రాష్ స్కిమ్మర్లు పెట్టించే ఆలోచ‌న ఉంది. ఇందువ‌ల్ల క‌లిగే లాభం గంగ, య‌మున న‌దుల ఒడ్డున ఉండే వారికి త‌క్ష‌ణ‌మే అనుభవంలోకి వ‌స్తుంది.

పారిశ్రామిక కాలుష్యం మీద నియంత్ర‌ణ కోసం కాగితం, చ‌క్కెర ప‌రిశ్ర‌మ‌ల‌తో క‌లసి ఒక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేశాం. కొన్నిచోట్ల అది ప్రారంభం కూడా అయ్యింది. దీని ద్వారా కూడా మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని నాకు అనిపిస్తోంది. ఉత్త‌రాఖండ్‌, ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌ల‌లో డిస్టిల్ల‌రీల నుంచి వ‌చ్చే వ్య‌ర్థ ప‌దార్థాల‌ను పూర్తిగా నియంత్రించ‌గ‌లిగామ‌ని కొంద‌రు అధికారులు నాకు చెప్పారు. కాగితం ప‌రిశ్ర‌మ నుంచి వ‌చ్చే కాలుష్యం కూడా దాదాపు ఆగిపోయిన‌ట్లు. మ‌నంద‌రం స‌రైన దిశ‌లో ముందుకు వెళ్తున్నామ‌ని, ఒక జాగృతి క‌లిగింద‌ని దీనివల్ల తెలుస్తోంది. కేవ‌లం గంగా న‌ది ఒడ్డున నివ‌సించేవారే కాదు.. సుదూరంగా ద‌క్షిణ ప్రాంతాల్లోని వారు కూడా అడుగుతుంటారు గంగాన‌ది ప్ర‌క్షాళ‌న జ‌రుగుతుంది క‌దా ప్ర‌ధాన‌ మంత్రి గారు అని. ఈ జ‌న‌ సామాన్యంలో ఉన్న విశ్వాస‌మే, న‌మ్మ‌క‌మే గంగా న‌ది ప్ర‌క్షాళ‌న‌లో మ‌న‌కు స‌త్ఫ‌లితాలు తెచ్చిపెడుతుంద‌ని నేను భావిస్తున్నాను. గంగా ప్ర‌క్షాళ‌న కార్య‌క్ర‌మం కోసం ప్ర‌జ‌లు విరాళాలు కూడా ఇస్తున్నారు. అలాగ ఈ ప్రయత్నం ఎంతో శ్రద్ధగా న‌డుస్తోంది.

ప్రియ‌మైన నా దేశ‌ వాసులారా.. ఈరోజు ఏప్రిల్ 24. భార‌త‌దేశంలో ఈరోజును పంచాయ‌తీ రాజ్ దినంగా జ‌రుపుకొంటున్నాం. దేశంలో పంచాయ‌తీ రాజ్ వ్య‌వ‌స్థ ఇదే రోజు అమలులోకి వచ్చింది. పంచాయతీ రాజ్ వ్యవస్థ క్రమంగా యావత్తు దేశానికి విస్తరించింది. ఇంకా ఇది మ‌న ప్ర‌జాస్వామిక వ్యవ‌స్థలో ఒక ముఖ్యమైన భాగంగా మారి, విజ‌య‌వంతంగా ప‌ని చేస్తోంది కూడాను.

ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జ‌యంతిని మ‌నం జ‌రుపుకొన్నాం. ఈ రోజు 24 ఏప్రిల్ – పంచాయ‌తీ రాజ్ దినం జ‌రుపుకొంటున్నాం. ఇదెంత శుభ‌ప‌రిణామం అంటే, భార‌త రాజ్యాంగం ఇచ్చిన మ‌హాపురుషుని జ‌న్మ‌దినం మొద‌లు.. 24వ తారీఖు రాజ్యాంగంలో అత్యంత ప‌టిష్ట‌మైన భాగం. మ‌న ప‌ల్లెలు.. రెంటినీ క‌లిపే ప్రేర‌ణ. అందుకే రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో క‌లసి కేంద్ర‌ ప్ర‌భుత్వం ఏప్రిల్ 14 నుంచి 24 వ‌ర‌కు ప‌ది రోజుల‌ పాటు ‘గ్రామ ఉద‌య్ సే భార‌త్ ఉద‌య్’ అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాన్ని తీసుకొంది.

బాబాసాహెబ్ అంబేడ్కర్ జ‌యంతి నాడు బాబాసాహెబ్ జ‌న్మ‌స్థానం ‘మ‌హు’ కు వెళ్లే అవ‌కాశం నాకు ద‌క్క‌డం నా అదృష్టం. ఆ ప‌విత్ర భూమికి న‌మ‌స్క‌రించే అవ‌కాశం ద‌క్కింది. ఇంకా ఈరోజు 24వ తారీఖున ఎక్క‌డైతే గిరిజ‌న సోద‌ర సోద‌రీమ‌ణులు ఎక్కువ‌గా నివ‌సిస్తున్నారో.. ఆ జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లి పంచాయ‌తీరాజ్ దినోత్స‌వాన్ని జ‌రుపుకోబోతున్నాం. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మ‌ళ్లీ ఓసారి పంచాయ‌తీరాజ్ దినోత్స‌వం సంద‌ర్భంగా దేశంలో పంచాయ‌తీల‌న్నింటితో మాట్లాడ‌బోతున్నాను. ఈ కార్య‌క్ర‌మం చాలా పెద్ద అవ‌గాహ‌న‌ను క‌ల్పించే ప‌నిచేసింది. హిందుస్థాన్ మూల‌మూల‌లా ఉన్న గ్రామ‌స్థాయిలో ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయ‌డం ఎలా..? గ్రామాలు త‌మ అభివృద్ధికి కావల‌సిన ప‌థ‌కాలు స్వ‌యంగా తామే ఎలా రూపొందించుకోవాలి… అనే అవ‌గాహ‌న ఇచ్చింది. మౌలిక స‌దుపాయాల‌కు ప్రాధాన్య‌త ఉన్న‌ట్లే సామాజిక మౌలిక స‌దుపాయాల‌కూ ప్రాధాన్య‌త ఉండాలి. గ్రామంలో పాఠ‌శాల నుంచి డ్రాప‌వుట్లు ఉండ‌కూడ‌దు. ‘బేటీ బ‌చావో – బేటీ ప‌ఢావో’ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా న‌డ‌వాలి. ఆడ‌ పిల్ల జ‌న్మ‌దినం గ్రామ‌మంత‌టికీ మ‌హోత్స‌వం కావాలి. ఇలాంటివి ఎన్నో ప‌థ‌కాలు. కొన్ని గ్రామాల్లో అయితే ఆహారం విరాళంగా ఇచ్చే కార్య‌క్ర‌మాలు కూడా జ‌రిగాయి. దేశంలోని ఇన్ని గ్రామాలలో ఇన్ని ర‌కాల కార్య‌క్ర‌మాలు ప‌ది రోజుల పాటు జ‌ర‌గ‌డం చాలా అరుదైన‌ది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వాలు, గ్రామ స‌ర్పంచులంద‌రికీ హార్దిక అభినంద‌న‌లు చెబుతున్నాను. మౌలిక ప‌ద్ధ‌తుల్లో కొత్త‌ద‌నం తెచ్చారు. గ్రామ మంచి కోసం, గ్రామాభివృద్ధి కోసం, ప్ర‌జాస్వామ్య ప‌టిష్ట‌త కోసం ఎన్నో ప‌నులు ఈ ఒక సంద‌ర్భంగా మార్చేశారు. గ్రామాల‌లో ఏ చైత‌న్య‌మైతే వ‌చ్చిందో.. అదే భార‌త ప్ర‌గ‌తికి హామీగా ఉంటుంది. భార‌త ప్ర‌గ‌తికి ఆధారం గ్రామాల ప్ర‌గ‌తే. అందుకే మ‌న‌మంతా గ్రామ ప్ర‌గ‌తిని బ‌లోపేతం చేస్తూ ఉంటే ఆశించిన ప‌రిణామాన్ని పొంది తీరుతాం.

ముంబై నుంచి శ‌ర్మిలా ధార్‌పురే – ఆమె ఫోన్ ద్వారా త‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.. (ఆమె మాటలు..)

”ప్ర‌ధాన‌ మంత్రి గారు.. నమ‌స్కారం. నేను ముంబై నుంచి శ‌ర్మిలా ధార్‌పురేను మాట్లాడుతున్నాను. మీకు పాఠ‌శాల‌, క‌ళాశాల విద్య గురించిన ప్ర‌శ్న ఇది. విద్యారంగంలో గ‌త చాలా ఏళ్లుగా ప్ర‌క్షాళ‌న‌కు అవ‌స‌రం ఏర్ప‌డింది. పాఠ‌శాల‌లు గానీ, క‌ళాశాల‌లు గానీ త‌గిన‌న్ని లేక‌పోవ‌డం, లేదా ఇంకా విద్య‌ నాణ్య‌త లేక‌పోవ‌డం.. ఎలా ఉందంటే.. పిల్ల‌లు విద్య‌ను పూర్తిచేస్తూనే ఉన్నారు. కానీ, చాలా సార్లు వారికి మౌలిక అంశాల గురించి కూడా తెలియ‌డం లేదు. దీని వ‌ల్ల ప్ర‌పంచ పోటీలో మ‌న పిల్ల‌లు వెనుక‌బ‌డిపోతారు. దీని గురించి మీ ఆలోచ‌న ఏమిటి.. ఈ రంగంలో ఏ ర‌కంగా దిద్దుబాటు తీసుకురావాల‌నుకుంటున్నారు..?

దీని గురించి ద‌య‌చేసి మాకు చెప్పండి” అని.

శర్మిలాజీ, మీ ఆందోళ‌న ఎంతో స‌హ‌జ‌మైన‌ది. ఇప్పుడు ప్ర‌తి కుటుంబంలో త‌ల్లితండ్రుల‌కు ఒక‌వేళ ఏదైనా స్వ‌ప్నం ఉంటుందంటే, అది పిల్ల‌ల‌ను బాగా చ‌దివించ‌డ‌మే అవుతుంది. ఇల్లు వాకిలి, వాహ‌నం.. ఇవ‌న్నీ ఆ త‌రువాతే వ‌స్తాయి. భార‌తదేశం వంటి దేశంలో అయితే ఇదే ప్ర‌తి ఒక్క‌రి భావ‌న‌. ఇదే చాలా పెద్ద బ‌లం కూడా. పిల్ల‌ల‌ను చ‌దివించ‌డం.. అదీ బాగా చ‌దివించ‌డం, మంచి విద్య ల‌భించ‌డం గురించిన ఆందోళ‌న చెంద‌డం.. ఇది ఇంకా పెర‌గాలి. ఇంకా దాని గురించిన మ‌రింత అవ‌గాహ‌న రావాలి. ఇంకా నేనేమ‌నుకుంటానంటే – ఈ అవ‌గాహ‌న ఏ కుటుంబాల‌లో ఉంటుందో, దాని ప్ర‌భావం పాఠ‌శాల‌ల‌ పైన ప‌డుతుంది. ఉపాధ్యాయుల మీదా వ‌స్తుంది. నేను దేని కోసం స్కూలుకు వెళ్తున్నాను అని పిల్ల‌లు కూడా అప్ర‌మ‌త్త‌మ‌వుతారు. అందుకే త‌ల్లితండ్రులు, అలానే ఈ విష‌యం గురించి ఆలోచించే అంద‌రినీ, ముందుగా నేను కోరేది ఏమిటంటే- స్కూల్లో జ‌రిగే అన్ని అంశాల గురించి విస్తృతంగా పిల్ల‌ల‌తో మాట్లాడండి. ఏదైనా విష‌యం మీ దృష్టికి వ‌స్తే, స్వ‌యంగా బడికి వెళ్లి ఉపాధ్యాయుల‌తో మాట్లాడండి. ఈ నిఘా వ్య‌వ‌స్థ మ‌న విద్యా వ్య‌వ‌స్థ‌లో చాలా లోటుపాట్లను తగ్గించగలుగుతుంది. దీనిని సాధించుకోవడంలో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం పాత్ర ఎంతగానో ఉంది.

మ‌న దేశంలో ప్రతి ప్ర‌భుత్వం విద్యా రంగానికి ప్రాధాన్య‌త నిచ్చింది. కానీ ప్ర‌తి ప్ర‌భుత్వం – త‌నదైన ప‌ద్ధ‌తుల్లో కృషి చేసింది కూడా. చాలా స‌మ‌యం వ‌ర‌కు మ‌న దృష్టి విద్యావ్య‌వ‌స్థ‌ను నిల‌బెట్ట‌డం పైనే ఉంద‌న్న‌ది కూడా వాస్త‌వం. విద్యా వ్య‌వ‌స్థను విస్త‌రించ‌డం, స్కూళ్లు పెట్ట‌డం, క‌ళాశాల‌లు ఏర్పాటు చేయ‌డం, టీచ‌ర్ల‌ను భ‌ర్తీ చేయ‌డం, ఎక్కువ‌ మంది పిల్లలు పాఠ‌శాల‌ల‌కు వ‌చ్చేలా చేయ‌డం – అంటే ఒక ర‌కంగా విద్య‌ను న‌లు దిశ‌లా వ్యాపింజేసే ప్ర‌య‌త్నం జ‌రిగింది. అదే ప్రాధాన్య‌త‌గా ఉంది. అది అవ‌స‌రం కూడా. కానీ ఇప్పుడు విస్త‌ర‌ణ‌కు ఎంత ప్రాధాన్య‌ముందో, అంత‌కంటే ఎక్కువ ప్రాధాన్య‌త విద్యా రంగంలో దిద్దుబాటుకు ఏర్ప‌డింది. విస్త‌రించే పెద్ద‌ ప‌ని మ‌నం పూర్తిచేశాం. ఇప్పుడు మ‌నం నాణ్య‌మైన విద్య‌పై దృష్టి పెట్టి తీరాల్సిందే. సాక్ష‌ర‌తా అభియాన్ నుంచి మంచి విద్య‌ను మ‌న మౌలిక అవ‌స‌రంగా మార్చుకోవాల్సివుంది. ఇప్ప‌టివ‌ర‌కు లెక్కలు ‘ఔట్‌లే’ గా ఉంటుండేవి. ఇప్పుడు ఔట్‌క‌మ్ ఫ‌లితాల పైనే ద‌ష్టి సారించాల్సి వుంది. ఇప్ప‌టి వ‌ర‌కు స్కూలుకు ఎంత‌ మంది వ‌చ్చారు అన్న‌ దాని పైనే దృష్టి ఉండేది. ఇప్పుడు స్కూలింగ్ కంటే ఎక్కువగా నేర్చుకోవ‌డం (లెర్నింగ్‌)పై శ్రద్ధ తీసుకోవాలి. స్కూలులో చేర్చ‌డం.. చేర్చ‌డం. ఈ మంత్రం నిరంత‌రం జ‌పిస్తూ వ‌చ్చాం. కానీ ఇప్పుడు స్కూలులో చేరిన పిల్ల‌ల‌కు మంచి విద్య‌.. యోగ్య‌మైన విద్య‌.. దీనిపై మ‌న దృష్టి కేంద్రీకృతం కావాలి. ప్ర‌స్తుత ప్ర‌భుత్వ బ‌డ్జెటును మీరు చూశారు క‌దా. విద్య‌ను బ‌లోపేతం చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. మ‌నం ఇందులో చాలా దూరం ప్ర‌యాణించాల్సి ఉంద‌న్న‌ది వాస్త‌వ‌మే. కానీ మ‌నం.. 125 కోట్ల మంది దేశ‌ ప్ర‌జ‌లం.. నిర్ణ‌యించుకుంటే సుదూర ప్ర‌యాణం కూడా చేసేయ్య‌గ‌లం. కానీ శ‌ర్మిలాజీ మాట నిజ‌మే. ఆసాంతం దిద్దుబాటు తీసుకురావ‌డం అవ‌స‌రం.

ఈసారి బ‌డ్జెటులో మీరు చూసే ఉంటారు – మేం మూస‌ ప‌ద్ధ‌తికి భిన్నంగా ప‌ని చేశాం. ప‌ది ప్ర‌భుత్వ విశ్వ‌విద్యాల‌యాలు, ప‌ది ప్రైవేట్ విశ్వ‌విద్యాల‌యాలను ఈసారి బ‌డ్జెట్‌లో ప్ర‌భుత్వ బంధ‌నాల నుంచి విముక్తి చేసి మ‌రింత స‌వాళ్ల‌తో కూడిన మార్గం ద్వారా రావాల‌ని వాటికి చెప్పాం. మీరు అత్యుత్త‌మ విశ్వ‌విద్యాల‌యం కావ‌డానికి మీరేం చేస్తారో చెయ్య‌మ‌న్నాం. వాటికి స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తిని ఇచ్చేందుకు ఆ కార్య‌క్ర‌మాన్ని తీసుకొన్నాం. భార‌త విశ్వ‌విద్యాల‌యాలు కూడా విశ్వ పోటీని ఎదుర్కోగ‌ల‌వి కాగ‌ల‌వు, అలా అవ్వాలి కూడా. దీనితో పాటు విద్య‌కు ఎంత ప్రాధాన్య‌త ఉంటుందో.. అంతే ప్రాధాన్య‌త నైపుణ్యానికీ ఉంది. అలాగే విద్య‌లో సాంకేతిక ప‌రిజ్ఞానం చాలా పెద్ద భూమిక‌నే పోషిస్తుంది. దూర‌ విద్య‌, సాంకేతిక ప‌రిజ్ఞానం – ఇవి మ‌న విద్యావ్య‌వ‌స్థ‌ను స‌ర‌ళ‌త‌ర‌మూ చేస్తాయి. ఇంకా చాలా తొంద‌ర‌లోనే వాటి ఫ‌లితాలు క‌నిపిస్తాయ‌ని నా విశ్వాసం.

చాలా రోజులుగా ఒక విష‌యం మీద ప్ర‌జ‌లు న‌న్ను అడుగుతూ వస్తున్నారు. కొంద‌రు నా వెబ్‌పోర్ట‌ల్ mygov.in మీద రాస్తూ ఉంటారు. ఇంకొంద‌రు నాకు NarendraModiApp మీద రాస్తూ ఉంటారు. అందులోనూ యువ‌తీ యువ‌కులు ఎక్కువగా రాస్తారు.

సౌండ్ బైట్-

”ప్ర‌ధాన‌ మంత్రి గారు, న‌మ‌స్కారం.. నేను మోనా క‌ర్ణ‌వాల్ ను మాట్లాడుతున్నాను బిజ్ నోర్ నుంచి. ఇప్ప‌టి త‌రంలో యువ‌జ‌నుల‌కు చ‌దువుకోవ‌డంతో పాటు.. క్రీడ‌ల‌కు కూడా చాలా ప్రాముఖ్య‌ం ఉంది. వారిలో టీం స్పిరిట్ భావ‌న కూడా ఉండాలి. అలాగే మంచి నాయ‌కుల‌య్యే గుణం కూడా ఉండాలి. అప్పుడే వారి వ్య‌క్తిత్వ వికాసం సాధ్యం అవుతుంది. దీన్ని నా అనుభ‌వంతో చెబుతున్నాను. ఎందుకంటే – స్వ‌యంగా నేను భార‌త్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉన్నాను . నా జీవితం మీద అది ఎంతో మంచి ప్ర‌భావాన్ని చూపించింది. యువ‌తీయవుకులను మీరు ఎక్కువ‌గా చైత‌న్య‌ప‌ర్చాల‌ని కోరుకుంటున్నాను. ప్ర‌భుత్వం కూడా ఎన్ సిసి , భార‌త్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను ప్రోత్స‌హించాల‌ని కోరుకుంటున్నాను.”

మీరు ఎన్ని సూచ‌న‌లు ఇస్తున్నారంటే, మీ అంద‌రితో మాట్లాడే ముందు.. వీళ్ల‌తో మాట్లాడాల‌నిపించింది. మీ అంద‌రి ఒత్తిడి, మీ అంద‌రి సూచ‌న‌లు, వీట‌న్నిటి ప‌రిణామం ఏమైందంటే ఎన్ సిసి, ఎన్ ఎస్ ఎస్, భారత్ స్కౌట్స్‌ అండ్ గైడ్స్‌, రెడ్‌ క్రాస్ ప్ర‌ముఖులు, నెహ్రూ యువ‌ కేంద్ర ముఖ్యులు ఉండేలా ఒక స‌మావేశాన్ని ఏర్పాటు చేశాను. ఇంత‌కు ముందు ఎప్పుడు స‌మావేశ‌మ‌య్యార‌ని అడిగితే, వాళ్లు ఏమ‌న్నారంటే – దేశ స్వాతంత్ర్యం వ‌చ్చాక ఇలాంటి స‌మావేశం జ‌ర‌గ‌డం ఇదే మొద‌టి సారి అని చెప్పారు. అందుకే ఈ ప‌నుల‌న్నింటి విష‌యంలో నాపై ఒత్తిడి తెచ్చిన యువ‌ మిత్రుల‌కు నేను ముందుగా అభినంద‌న‌లు చెబుతాను. వారి కార‌ణంగానే నేను స‌మావేశం పెట్టాను. అలా చేయ‌డం మంచికే జ‌రిగింద‌ని అనిపించింది. ఎంతో సమ‌న్వ‌యం అవ‌స‌రం క‌న్పించింది నాకు. వాళ్ల వాళ్ల ప‌ద్ధ‌తుల్లో చాలా చేస్తున్నారు. కానీ ఒక‌వేళ సామూహిక రంగంలో సంఘ‌టితంగా మ‌న విభిన్న ప‌ద్ధ‌తుల‌ను సంఘ‌టితం చేసి ప‌నిచేస్తే ఎంత‌ పెద్ద ఫ‌లితం చూడగ‌ల‌మో. దాని విస్తృతి ఎంతో ఎక్కువో. ఎన్ని కుటుంబాల‌ను అది స్పృశించ‌గ‌ల‌దో. దాని విస్తృతిని చూసిన త‌రువాత నాకు పెద్ద ప‌రిష్కార‌మే ల‌భించింది. దాని ఘ‌నత కూడా ఎక్కువే. ఏదో ఒక‌టి చెయ్యాలి. ఇంకా నేను స్వ‌యంగా ఎన్ సిసి కేడెట్‌గా ఉన్నాన‌న్న మాట వాస్త‌వం. అందుకే ఇలాంటి సంఘ‌టిత వ్య‌వ‌స్థల వ‌ల్ల ఒక కొత్త దృష్టికోణం దొరుకుతుంద‌ని నాకు తెలుసు. ప్రేర‌ణ ల‌భిస్తుంది; ఒక జాతీయ దృక్ప‌థం పెరుగుతుంది. నాకైతే ఆ లాభం చిన్న‌తనంలో ల‌భించ‌నే ల‌భించింది. ఈ సంస్థ‌లలో ఒక న‌వ‌జీవ‌ం నింపాల‌ని కూడా నేననుకుంటాను. కొత్త శ‌క్తిని నింపాలి. ఈసారి వారి ముందు ఏదో విష‌యాన్ని ఉంచాను. నేను చెప్పాను చూడండి. ఈ సీజ‌న్‌లో జ‌ల‌ సంర‌క్ష‌ణ పెద్ద ఎత్తున ఎందుకు చేయ‌కూడ‌దు..? మ‌నం కృషి చేసి ఎన్ని బ్లాకులు, ఎన్ని జిల్లాలలో బ‌హిరంగ మ‌ల‌ విస‌ర్జ‌నను మాన్పించ‌గ‌లం..? ఈ ప్ర‌దేశాల‌ను బ‌హిరంగ మ‌ల‌ విస‌ర్జ‌న ర‌హిత ప్ర‌దేశాలుగా చేయ‌గ‌ల‌మా..? దేశాన్ని ఏకం చేయ‌డానికి ఎలాంటి కార్య‌క్ర‌మాన్ని రూపొందించ‌గ‌లం. ఈ సంస్థ‌ల‌న్నింటికీ ఉమ్మ‌డి యువ‌ గీతాన్ని పెట్టుకోగ‌ల‌మా.. ఇలాంటి ఎన్నో చ‌ర్చ‌లు వారితో జ‌రిగాయి.

ఇవాళ, నేను మీకందరికీ ఒక విన్నపం చేస్తున్నాను. దయచేసి ఈ యువజన సంస్థలకు పక్కాగా ఉండే ఉపాయాలను సూచించండి. వారి పనితీరులోను, వారి కార్యక్రమాలలోను ఏదైనా ఒక కొత్తదనాన్ని మనం జత చేయాలా? మీరు నాకు నా NarendraModiApp మీద రాస్తే, నేను వాటిని సరైన చోటుకు పంపిస్తాను. ఇంకా ఈ స‌మావేశం అనంతరం వారు ఒక కొత్త వేగాన్ని అందుకోగలుగుతారని నేను భావిస్తున్నాను. ఇక, మీరు కూడా వారితో క‌లసి ప‌నిచేయాల‌ని కోరుకుంటారు.

ప్రియ‌మైన నా దేశ‌ వాసులారా.. ఈ రోజు మ‌నందరినీ ఆలోచింప‌జేసే విష‌యం చెప్పాలి. దీనిని మ‌న‌ల్నంద‌రినీ పున‌రాలోచింప‌జేసే విష‌యంగా కూడా ప‌రిగ‌ణిస్తారు. మీరు చూసే ఉంటారు; దేశ రాజ‌కీయ స్థితిగ‌తులు ఎలాంటివంటే – గ‌త కొన్ని ఎన్నిక‌ల్లో ఈ విష‌యం గురించి చ‌ర్చ జ‌రుగుతూ ఉండేది. ఏ పార్టీ ఎన్ని గ్యాస్ సిలిండ‌ర్లు ఇస్తోంది. 12 సిలిండ‌ర్లా.. లేక 9 సిలిండ‌ర్లా.. అనేది ఎన్నిక‌ల్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశం అయ్యేది. అలాగే మ‌ధ్య‌ త‌ర‌గ‌తి స‌మాజాన్ని ఎన్నిక‌ల దృష్టితో అందుకోవాలంటే గ్యాస్ సిలిండ‌ర్ పెద్ద అంశం అని రాజ‌కీయ పార్టీల‌కు అనిపిస్తూ ఉండేది. ఇంకో వైపు రాయితీలు త‌గ్గించాల‌ని ఆర్థిక శాస్త్ర‌వేత్త‌ల ఒత్తిడి ఉండేది. ఆ కార‌ణంగానే ఎన్నో క‌మిటీలు ఏర్పాట‌య్యాయి. ఆ కమిటీలకు వంట‌ గ్యాస్ రాయితీని త‌గ్గించ‌డంపైన పలు ప్రతిపాదనలు అందేవి. గ్యాస్ సబ్సిడీని తగ్గించాలనే అంశంపైన సలహాలు వచ్చేవి. ఈ క‌మిటీల పై కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చ‌య్యేది. కానీ విష‌యం ఎక్కడిది అక్క‌డే ఉండిపోయేది. ఇది ప్రతి ఒక్కరికీ అనుభ‌వంలోనిదే. ఎవ్వరూ దీనికి మించి ఆలోచించనే లేదు.

ఈ రోజు, ప్రియమైన నా దేశ వాసులారా, ఈ విషయంలో నా సొంత విషయాన్నే మీ ముందు ఉంచడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను మూడో మార్గాన్ని ఎంచుకొన్నాను. మూడో మార్గం ఏదంటే, ప్ర‌జలు, సామాన్య జనం మీద విశ్వాసాన్ని ఉంచ‌డం. కొన్ని సార్లు రాజ‌కీయ నాయ‌కులు త‌మ‌ మీద న‌మ్మ‌కం పెట్టుకోవ‌డం కంటే త‌మ ప్రజల పైన న‌మ్మ‌కం పెట్టుకోవాలి. మనం ప్రజలలో ప్రగాఢ నమ్మకాన్ని ఉంచాలి. నేను ఒకసారి అన్నాను కదా.. మీరు ఏడాదికి ఒక 1500- 2000 రూపాయ‌ల ఖ‌ర్చును భ‌రించ‌గ‌లిగే ప‌క్షంలో, మీ గ్యాస్ స‌బ్సిడీని ఎందుకు విడిచిపెట్ట‌రు? అని. ఇది పేద‌ కుటుంబాలకు ఉపయోగపడవచ్చు. నేను ఆ మాటలు య‌థాలాపంగా చెప్పినవే, అయినా.. ఈ విష‌యంలో నేను ఈరోజు స‌గ‌ర్వంగా చెప్ప‌గ‌లుగుతున్నాను. నా దేశ‌ వాసులు నా న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌లేదు. ఒక కోటి కుటుంబాలు స్వ‌చ్ఛందంగా త‌మ గ్యాస్ స‌బ్సిడీని స‌రెండ‌ర్ చేశాయి. ఈ కోటి కుటుంబాలు సంప‌న్న కుటుంబాలు కావు. ఒక రిటైర్ అయిన టీచ‌ర్‌, రిటైరైన గుమాస్తా, రైతు లేదా చిన్న దుకాణం న‌డుపుకొనే వారు.. ఇలా మ‌ధ్య‌ త‌ర‌గ‌తి వారు, దిగువ మ‌ధ్య‌ త‌ర‌గ‌తి వారు, వీరు త‌మ స‌బ్సిడీని విడిచిపెట్టారు. పైగా స‌బ్సిడీని వదులుకోవడం ఎంతో తేలిక కూడా. మొబైల్ ఫోన్‌లో యాప్ ద్వారా చేయ‌వ‌చ్చు. ఆన్‌లైన్ లో చేయ‌వ‌చ్చు. టెలిఫోన్ నంబరుకు మిస్ డ్ కాల్ ఇచ్చి కూడా స‌బ్సిడీని విడిచిపెట్ట‌వ‌చ్చు. ఇలా బోలెడు ప‌ద్ధ‌తులు ఉన్నాయి. కానీ ప‌రిశీలిస్తే తెలిసిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే – స‌బ్సిడీని వద్దనుకున్న కోటి కుటుంబాలలోను 80 శాతం కంటే ఎక్కువ‌ మంది పంపిణీదారు వ‌ద్ద‌కు వెళ్లి, వరుసలో నిల‌బ‌డి మరీ తాము స‌బ్సిడీని స‌రెండ‌ర్ చేయదల్చుకొన్నామ‌ంటూ రాత‌పూర్వ‌కంగా సమాచారమిచ్చారని అంచనా వేయడం జరిగింది.

ప్రియ‌మైన నా దేశ‌ వాసులారా, ఇది చిన్న విష‌యం ఏమీ కాదు. ప్ర‌భుత్వం ఎప్పుడ‌న్నా ఒక ప‌న్నులో రాయితీ, లేదా మిన‌హాయింపు ఇస్తే వారం రోజుల పాటు టీవీలో, ప‌త్రిక‌లలో ప్ర‌భుత్వాన్ని మెచ్చుకుంటూ వార్త‌ల ప‌రంప‌ర వ‌స్తుంది. కానీ ఇది చూడండి. ఒక కోటి కుటుంబాలు స‌బ్సిడీని వ‌దులుకున్నాయి. మ‌న దేశంలో ఒక‌ విధంగా ఒక హ‌క్కుగా మారిన స‌బ్సిడీని ఈ కుటుంబాలు విడిచిపెట్టాయి.

నేను ఆ కోటి కుటుంబాల వారికి శ‌త‌ స‌హ‌స్ర ప్ర‌ణామాలు చేస్తున్నాను.. వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే, వారు రాజ‌కీయ నాయ‌కులు కొత్తగా ఆలోచించేలా చేశారు. ఈ ఒక్క విష‌యం మ‌న దేశంలో ఆర్ధిక శాస్త్ర‌వేత్త‌లు కూడా భిన్నంగా ఆలోచించేలా చేసింది. ఇలా చేస్తే.. అలా జ‌రుగుతుంది. ఇటువంటి ప్ర‌య‌త్నంలో అటువంటి ఫ‌లితం వ‌స్తుంది అని ఆర్థిక స‌మీక‌ర‌ణాలు, లెక్క‌లు, గుణింతాలు వేసే ఆర్థిక నిపుణులు కూడా త‌మ ప‌రిధి దాటి ఆలోచించేలా చేసింది ఈ స‌బ్సిడీని విడిచిపెట్టే ప‌ర్వం. ఈ విష‌యంలో ఎప్పుడో ఒక‌ప్పుడు లోతుగా ఆలోచించాలి. ఒక కోటి కుటుంబాలు స‌బ్సిడీని వ‌దులుకొన్నందుకు బ‌దులుగా మరొక కోటి పేద కుటుంబాల‌కు గ్యాస్ సిలిండ‌ర్లు ల‌భించ‌డం. స‌బ్సిడీ వ‌ద‌లుకోవ‌డం వ‌ల్ల డ‌బ్బు మిగిలింది అన్న‌ది బ‌య‌టి నుంచి చూసే వారికి పెద్ద చెప్పుకోద‌గ్గ విష‌యం కాదు. కానీ ప్ర‌జల పైన విశ్వాసంతో ప‌నిచేస్తే, ఎంత పెద్ద ఫ‌లిత‌మైనా సాధించ‌గ‌ల‌మ‌న్న‌ది అసాధార‌ణ‌మైన పాఠం.

రాజ‌కీయ శ్రేణులన్నింటికీ ప్రత్యేకంగా నాదొక విజ్ఞ‌ప్తి. ప్ర‌జ‌ల పైన న‌మ్మ‌కం ఉంచాల‌న్న విష‌యాన్ని క‌చ్చితంగా ఒక‌సారి ప్ర‌స్తావించండి. ఇలాంటి ఫ‌లితాలు మ‌న‌కి ల‌భిస్తాయి అని మీరు అస‌లు ఊహించి ఉండ‌రు. మ‌నం ఈ దిశ‌లోనే ముందుకు సాగాలి. నాకు ఇంకో విష‌యం ప‌దేప‌దే స్ఫుర‌ణ‌కు వ‌స్తుంటుంది. 3వ తరగతి, 4వ త‌ర‌గ‌తి ఉద్యోగార్థుల‌ను ఎందుకు ఇంట‌ర్వ్యూ చేయడం..? ప‌రీక్ష రాసి, మార్కుల‌ జాబితాను సమర్పిస్తున్న వ్యక్తిని మనం నమ్మాలి.

కొన్ని సార్లు నాకు ఇంకొకటి అనిపిస్తుంది.. రైలు ప్ర‌యాణాలలో కొన్ని మార్గాలలో ఎవ‌రూ టికెట్ త‌నిఖీ చేసే వారు ఉండ‌ర‌ని ప్ర‌క‌టిద్దాం. దేశ ప్ర‌జ‌ల పైన భరోసా ఉంచుదాం. ఇలా ఎన్నో ర‌కాల ప్ర‌యోగాలు చేయ‌వ‌చ్చు. ఒక్క‌సారి అలాంటి న‌మ్మ‌కం పెట్టుకుంటే, తిరుగులేని ఫ‌లితాలు ల‌భిస్తాయి. స‌రే, ఇవి నా మ‌న‌సులో ఆలోచ‌న‌లు, వీటిని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లుగా మార్చ‌లేం కదా. కానీ ఇటువంటి వాటికి వీలు ఉండే వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌వ‌చ్చు. ఈ సానుకూల వాతావ‌ర‌ణాన్ని రాజ‌కీయ నాయ‌కులు కాదు.. మ‌న దేశంలో కోటి కుటుంబాలే క‌ల్పించాయి.

ర‌వి అనే వ్యక్తి ఒకరు నాకు ఒక లేఖను రాశారు.. ”ప్ర‌తి రోజు శుభవార్తే.. అంటూ ఆయన ఇంకా ఇలా రాశారు.. దయచేసి ప్రతి రోజూ ఏద‌న్నా ఒక మంచి సంఘటనను గురించి పోస్ట్ చేయ‌మ‌ని మీ అధికారుల‌ను ఆదేశించండి అంటున్నారు ఆయ‌న‌. ప్ర‌తి వార్తాప‌త్రిక‌లోను, టీవీ ఛాన‌ల్ లోను బ్రేకింగ్ న్యూస్ అంటే అన్నీ దుర్వార్త‌లే ఉంటున్నాయి. 125 కోట్ల మంది జ‌నాభా ఉన్న ఈ దేశంలో మ‌న చుట్టుప‌క్క‌ల అస‌లు మంచి విష‌యమేదీ జ‌ర‌గ‌డమే లేదా..? ఈ ప‌రిస్థితిని మార్చండి” అని.

ర‌వి గారు తన కోపాన్ని వ్య‌క్తం చేశారు. కానీ, ఆయ‌న ఆగ్రహం నా మీద కాదు.. ఇప్పుడు నెలకొన్న ప‌రిస్థితుల మీద అని నేను అనుకుంటున్నాను. మీకు గుర్తుండే ఉంటుంది, మ‌న పూర్వ రాష్ట్ర‌ప‌తి డాక్ట‌ర్ ఎ.పి.జె. అబ్దుల్ క‌లామ్ ఎప్పుడు చెప్తుండే వారు- ”దయచేసి వార్తాప‌త్రిక మొద‌టి పేజీలో కేవ‌లం మంచి వార్త‌లే అచ్చు వేయాలి” అని. ఆయ‌న ఇదే సంగతిని ప్రతి సారి మళ్లీ మళ్లీ చెప్తుండే వారు.

కొద్ది రోజుల క్రితం ఒక వార్తాప‌త్రిక నాకో ఉత్త‌రం రాసింది.. ”ప్ర‌తి సోమ‌వారం మేము ఎటువంటి చెడ్డ‌ వార్త‌లను కాకుండా కేవలం మంచి వార్తలను మాత్రమే ఇస్తాం అని నిర్ణయించుకొన్నాం’’ అనేది అందులోని సారాంశం. ఈ రోజులలో కొన్ని టి.వి. ఛానల్స్ మంచి వార్తల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నాయని నేను గమనించాను.

సానుకూలమైన వార్త‌లకు అంతటా ఒక వాతావ‌ర‌ణం ఏర్ప‌డింద‌ని చెప్పడం సరైందే. మంచి వార్త‌లు, స‌రైన వార్త‌లు ప్ర‌జ‌ల‌కు అంద‌డం అవ‌స‌ర‌మ‌ని ప్రతి ఒక్కరికీ అనిపిస్తోంది. ఎంత గొప్ప వ్య‌క్తి అయినా.. ఎంత ఉత్త‌మోత్త‌మ‌మైన మాట మాట్లాడినా.. ఎంత అద్భుత‌మైన ప‌ద్ధ‌తిలో చెప్పినా.. ఆ మాట‌ల‌కు ఒక శుభ‌ వార్త కంటే ఎక్కువ శ‌క్తి, ప్ర‌భావం ఉంటాయ‌ని అన‌లేము. ఒక మంచి వార్త మ‌నల్ని మంచి ప‌ని చేసేలా ప్రేరేపించే శ‌క్తిని క‌లిగి ఉంటుంది.

అందువ‌ల్ల మ‌నం మంచికి బ‌లం చేకూరుస్తామో.. అక్క‌డ చెడుకు స‌హ‌జంగానే స్థానం లేకుండా పోతుంది. ఒక దీపం వెలిగిస్తే చీక‌టి తొలగిపోతుంది. తొలగి తీరుతుంది. మీకు తెలిసే ఉంటుంది. ప్ర‌భుత్వం transforming india అనే ఒక వెబ్‌సైట్ ను న‌డిపిస్తోంది. ఈ వెబ్‌సైట్‌లో అన్ని సానుకూల‌మైన వార్త‌లే ఉంటాయి. అంటే ప్రభుత్వం వైపు నుంచే కాదు.. ప్ర‌జ‌ల నుంచి కూడా మంచి వార్త‌లు, క‌థ‌నాలు అందులో ఉంటాయి. అంతే కాదు.. మీకు ఏదైనా మంచి విష‌యాలు తెలిస్తే మీరు కూడా మీకు సంబంధించిన మంచి వార్త‌లు పంప‌వ‌చ్చు.

ర‌వి గారు, మీరు ఎంతో మంచి సూచ‌న చేశారు; కానీ, ద‌య‌చేసి నా మీద అంత కోపం వద్దండి. ఏదైనా సకారాత్మకమైనది చేయడానికి, సకారాత్మకమైన మాటలు మాట్లాడడానికి, సకారాత్మకమైన విషయాలను వ్యాప్తి లోకి తీసుకు రావడానికి మనం కలసి పాటు పడవలసివుంది.

మ‌న దేశంలో చెప్పుకోద‌గ్గ విశేష ఉత్స‌వం ‘కుంభ‌ మేళ‌’. కుంభ‌ మేళ ప‌ర్యాటక ప‌రంగా కూడా ఒక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. ఇన్నిరోజుల పాటు కోట్లాది మంది ఒక న‌దీ తీరంలో చేరి, ప‌విత్ర స్నానాలు చేస్తార‌ని ప్ర‌పంచంలో చాలా త‌క్కువ మందికి తెలిసి ఉంటుంది. ప్ర‌శాంత‌మైన, శాంతిపూర్వ‌క‌మైన వాతావ‌ర‌ణంలో ఈ ఉత్స‌వం ముగియాలి. నిర్వ‌హ‌ణ దృష్ట్యా.. ఉత్స‌వ ఏర్పాట్ల దృష్ట్యా.. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం దృష్ట్యా.. ఇటువంటి ఉత్స‌వాలు అతి భారీ స్థాయిలో కొత్త ప్ర‌మాణాలను నిర్దేశిస్తాయి, సాధిస్తాయి. గ‌త కొద్ది రోజులుగా చాలా మంది సింహ‌స్థ కుంభ్ మేళా ఫొటోలను అప్‌లోడ్ చేయడం నేను గ‌మ‌నించాను. కేంద్ర‌, రాష్ట్ర‌ ప్ర‌భుత్వాల ప‌ర్యాట‌క సంస్థ‌లు ఒక ఛాయాచిత్ర పోటీని నిర్వ‌హించాల‌ని నేను భావిస్తున్నాను. మంచి ఫొటోలు తీసి, అప్‌లోడ్ చేసేటట్లు ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హించాలి. ఇటువంటి ఫొటోల‌తో ఒక్క‌సారి ఉత్తేజ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం, చైత‌న్యం ఏర్ప‌డి.. కుంభ‌ మేళాలో అడుగు అడుగునా ఎంత వైవిధ్యం నెల‌కొని ఉందో.. ఎంత అద్భుత‌మైన సంగ‌తులు జ‌రుగుతున్నాయో తెలుస్తుంది. ఇది త‌ప్ప‌నిస‌రిగా చేయాలి.

ఇటీవల మ‌ధ్య‌ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నన్ను క‌లిశారు. మ‌నం స్వ‌చ్ఛ‌త ను గురించిన సందేశాలను ఇస్తున్నాం. కానీ, అది ఉన్న‌ చోట పాటించ‌డ‌మే కాదు.. మ‌నం ఎక్క‌డ‌కు వెళితే అక్క‌డ‌కు ఆ సందేశాన్ని మోసుకుపోవాల‌ని, ప్ర‌జ‌ల‌కు చెప్పాలి అని అన్నారు ఆయ‌న‌. కుంభ‌ మేళ మ‌త‌ప‌ర‌మైన‌, ఆధ్యాత్మికమైన ఉత్స‌వ‌మే అయినప్ప‌టికీ – మ‌నం దానిని ఒక సామాజిక సంద‌ర్భంగా కూడా భావించాలి. కొన్ని ప‌ద్ధ‌తులు పాటించే సంద‌ర్భంగా మార్చుకోవాలి. ఈ ఉత్స‌వాల్లో మ‌నం మంచి సంక‌ల్పాలు, మంచి అల‌వాట్లు సొంతం చేసుకుని వాటిని ఆ త‌రువాత గ్రామ‌ గ్రామాలలో ప్ర‌చారం చేసే బాధ్య‌తను వ‌హించ‌వ‌చ్చు. నీరు అంటే ప్రేమ ఎలా పెర‌గాలి.. జ‌లం ప‌ట్ల విశ్వాసం ఎలా పెర‌గాలి.. నీటి సేక‌ర‌ణ‌, నిల్వ ఎలా జ‌ర‌పాలి.. ఎలా వినియోగించుకోవాల‌నే సంగ‌తుల‌ను మ‌నం కుంభ‌ మేళ ద్వారా ఈ మేళా సంద‌ర్భంగా నేర్చుకోవ‌చ్చు. ఈ కుంభ‌ మేళా అనే సంద‌ర్భాన్ని ఈ ల‌క్ష్యంతో ఎలా ఉప‌యోగించుకోవ‌చ్చో ఆలోచించాలి.

ప్రియ‌మైన నా దేశ‌ వాసులారా… పంచాయ‌తీ రాజ్ దినం వంటి ముఖ్యమైన సంద‌ర్భంలో నేను ఈ రోజు సాయంత్రం మీ అందరితోను తప్పక సమావేశమవుతాను. మీ అంద‌రికీ ఇవే నా హృద‌య‌పూర్వ‌క‌ ధ‌న్య‌వాదాలు. ఎప్ప‌టి లాగే, మీ మ‌న‌సులోని ఆలోచనలకు, నా మ‌న‌సులోని ఆలోచనలకు మధ్య ఏర్పడిన విడదీయరాని బంధం నాకు అంతులేని ఆనందాన్ని ఇస్తోంది.

మీకివే నా ధ‌న్య‌వాదాలు.