పిఎంఇండియా
ఇండియా, బ్రెజిల్, సౌతాఫ్రికా (ఐ.బి.ఎస్.ఏ)లు కలసి ఆకలి, పేదరికం నిర్మూలనకు ఐ.బి.ఎస్.ఏ ఫండ్ ఏర్పాటుచేసేందుకు ఉద్దేశించిన ఒక త్రైపాక్షిక ఒప్పందం పై సంతకాలు చేయడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు ఆమోదించింది. ఆయా దేశాల మధ్య సహకారం ఇనుమడించడంలో ఐ.బి.ఎస్.ఏ ఫండ్ ప్రాముఖ్యత ఎంతో ఉంది. కేబినెట్ నిర్ణయం ఈ ఫండ్ ను మరింత పటిష్టం చేయనుంది. ఫండ్‌కు ఐ.బి.ఎస్.ఏ దేశాలు యేటా 1 మిలియన్ అమెరికా డాలర్లను సమకూరుస్తున్నాయి. ఈ ఏడాది జనవరినాటికి ఈ ఫండ్‌లో మొత్తం 28.2 మిలియన్ అమెరికా డాలర్లు పోగయ్యాయి. ఇందులో 26.2 మిలియన్ అమెరికన్ డాలర్లకు సమానమైన పథకాలను అమలుచేయడమో/ ఆమోదించమో జరిగింది. మిగిలిన 2.09 మిలియన్ అమెరికా డాలర్లను వెచ్చించవలసి ఉంది. భారత్ తన వంతుగా ఇంతవరకు 9.1 మిలియన్ అమెరికా డాలర్లను ఈ నిధికి అందించింది. మూడవ ప్రపంచ దేశాలలో వివిధ అభివృద్ధి పథకాలను ఐ.బి.ఎస్.ఏ ఫండ్ అమలుపరుస్తోంది. ఐ.బి.ఎస్.ఏ ఫండ్ మొట్టమొదటిసారిగా వ్యవసాయం, పశుగణాభివృద్ధిలకు ఆర్థిక సహాయం అందజేసింది. ఐ.బి.ఎస్.ఏ చర్చల వేదిక ఆధ్వర్యంలో 2004లో ఐ.బి.ఎస్.ఏ ఫండ్‌ను ఏర్పాటుచేశారు.