పిఎంఇండియా
ఉమ్మడి వృద్ధి, సంపద, స్థిరత్వం కోసం వ్యూహాత్మక ఐక్యత, విశ్వాసంతో కూడిన భాగస్వామ్యాన్ని పెంపొందించటం.
జూలై 1 నుంచి 3, 2026 వరకు జరిగే ఇండియా–జపాన్ 16వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జపాన్ ప్రధానమంత్రి గౌరవ శ్రీమతి తకాయిచి సనాయె భారత్‌కు విచ్చేశారు. ప్రధానమంత్రి తకాయిచితో పాటు ఉన్నతాధికారులు, సీఈఓలు, పరిశ్రమల ప్రముఖులతో పాటు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్ పర్యటనకు వచ్చింది. ప్రధానమంత్రి తకాయిచి భారతదేశంలో అధికారికంగా పర్యటించటం ఇదే తొలిసారి.
గత వార్షిక సదస్సు తర్వాత జరిగిన పరిణామాలను ఇరుదేశాల ప్రధానమంత్రులు సమీక్షించారు. భారత్–జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయటానికి విస్తృతమైన సహకార రంగాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య ఇలాంటి వ్యూహాత్మక, ప్రపంచ స్థాయి సహకారాన్ని బలోపేతం చేయటం పరస్పరం ప్రయోజనకరమని.. ఇండో–పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం, సుసంపన్నత నెలకొనేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
రోజురోజుకూ మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్–జపాన్ భాగస్వామ్యానికున్న వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తిస్తూ… ఇరుదేశాల ప్రధానమంత్రులు పరస్పరం సహకార సంబంధాలను పెంపొందించుకోవటానికి నిబద్ధతను తెలియజేశారు. 15వ భారత్–జపాన్ వార్షిక సదస్సు విజయవంతమైన సందర్భంగా మూడు ప్రాధాన్యతా రంగాల ఆధారంగా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అంగీకరించారు. రక్షణ, భద్రతా సహకారం.. ఆర్థిక భద్రత, ఇంధన స్థిరత్వం, సాంకేతికత, ఆవిష్కరణలతో కూడిన ఆర్థిక భాగస్వామ్యం.. ప్రజల మధ్య పరస్పర సంబంధాలు. జాతీయ ప్రయోజనాలను సాధించే ప్రయత్నాల్లో భారత్, జపాన్‌లు సహజమైన, కీలకమైన భాగస్వాములని ఇరుదేశాల ప్రధానమంత్రులు అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ప్రపంచంలోని అగ్రగామి ప్రజాస్వామ్య దేశాలుగా, ప్రధాన ఆర్థిక వ్యవస్థలు గల దేశాలుగా.. స్వేచ్ఛాయుతమైన, బహిరంగ, చట్టబద్ధమైన అంతర్జాతీయ వ్యవస్థను రూపొందించి, పరిరక్షించటం తమ బాధ్యతని ఇరుదేశాల ప్రధానమంత్రులు స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనకు నవీకరించిన “ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ (ఎఫ్ఓఐపీ)” విధానాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. ఇది భారతదేశంలోని ఇండో–పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ (ఐపీఓఐ), హిందూ మహాసముద్ర పరిధిలోని ప్రాంతాల భద్రత, ఆర్థిక వృద్ధి కోసం పరస్పర, సమగ్ర సహకారం (మహాసాగర్) విధానాలకు దగ్గరగా ఉంటుందన్నారు. ఉమ్మడి వ్యూహాత్మక దృక్పథం ఆధారంగా క్షేత్రస్థాయిలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇరువురు నేతలు స్పష్టం చేశారు.
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, భద్రతా సహకార వృద్ధి పట్ల ఇద్దరు ప్రధానమంత్రులు సంతృప్తిని వ్యక్తం చేశారు. గత వార్షిక సదస్సులో ఆమోదించిన భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన ఆధారంగా ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్న నిబద్ధతను తెలియజేశారు. ఈ ఏడాది చివరి నాటికి టోక్యోలో నాలుగో రౌండ్ 2+2 మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని సంబంధిత మంత్రులను ఇద్దరు ప్రధానమంత్రులు ఆదేశించారు. జపాన్ వైపున్న రెండు దళాల మద్దతుతో విజయవంతంగా నిర్వహించిన నౌకాదళ విన్యాసం “జైమెక్స్ 25″తో సహా ఆయా రక్షణ దళాల మధ్య సహకారంలో సాధించిన పురోగతిని వారు స్వాగతించారు. విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ-2026లో జపాన్ భాగస్వామ్యాన్ని భారత్ స్వాగతించింది. “మేక్ ఇన్ ఇండియా” కార్యాచరణ పరిధిలో రక్షణ పరికరాలు, సాంకేతిక సహకారం, నౌకాదళాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాల్ (ఎంఆర్ఓ) సహకారంతో పాటు… విస్తృతమైన సైనిక విన్యాసాలు, శాటిలైట్ సామర్థ్యాలను ఉపయోగించి సముద్ర తీర నిఘా ద్వారా ద్వైపాక్షిక సముద్ర భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు పరస్పరం అంగీకరించాయి.
రక్షణ పరికరాలు, సాంకేతికత బదిలీకి సంబంధించి మూడు సూత్రాలను జపాన్ పునఃసమీక్షించటాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. ఇది ఇరుదేశాల మధ్య రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూనిఫైడ్ కాంప్లెక్స్ రేడియో యాంటెన్నా (యూనికార్న్) ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక వివరాలపై సూత్రప్రాయంగా అంగీకారానికి రావటం పట్ల ఇరుదేశాల ప్రధానమంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. రక్షణ పరికరాలు, సాంకేతిక రంగాల్లో ఇతర ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకెళ్లే మార్గాలను అన్వేషించాలని అంగీకరించారు.
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక భద్రతా రంగాల్లో ఆచరణాత్మక సహకారాన్ని మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఇరుదేశాల ప్రధానమంత్రులు గుర్తించారు. ఆర్థిక భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేయటానికి, స్థిరమైన, సుసంపన్నమైన ప్రాంతాన్ని నిర్మించేందుకు అవసరమైన కీలక కార్యక్రమాలను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆర్థికపరమైన ఒత్తిడి, మార్కెట్ రహిత విధానాలు–పద్ధతుల పట్ల ఆందోళనను వ్యక్తపరిచారు. అరుదైన ఖనిజాలు, కీలక పారిశ్రామిక రంగాల్లో సరఫరా వ్యవస్థల అంతరాయాలకు దారితీసే ఏకపక్ష ఎగుమతి ఆంక్షలు, ధరల్లో మార్పుల వంటి చర్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వైవిధ్యభరితమైన, స్థిరమైన, విశ్వసనీయమైన ప్రపంచ సరఫరా వ్యవస్థల ప్రాముఖ్యతను, పోటీతత్వ ప్రపంచ వాతావరణాన్ని, ఏదైనా ఒక్క దేశంపైనే ఆధారపడటాన్ని నివారించాల్సిన అవసరాన్ని వారు తెలియజేశారు. నిబంధనలు, నియమాలను గౌరవిస్తూనే.. కీలక సాంకేతికతలను ప్రోత్సహించేందుకు, రక్షించేందుకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలిపారు.
ఎగుమతి నియంత్రణ సవాళ్లను పరస్పరం సులభతరం చేసుకుంటూనే, అధునాతన సాంకేతికత రంగానికి సంబంధించిన వాణిజ్యాన్ని పెంపొందించుకునేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇరుదేశాల్లోని సంబంధిత మంత్రిత్వ శాఖల మధ్య చర్చలను ముందుకు తీసుకెళ్లాలని వారు నిర్ణయించారు. గత వార్షిక సదస్సులో ప్రారంభించిన ఆర్థిక భద్రతా కార్యక్రమం ఆధారంగా ఇరుదేశాలు సాధించిన పురోగతిని అభినందించారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మొదటి ప్రైవేట్–సెక్టార్ ఎకనామిక్ సెక్యూరిటీ డైలాగ్, రెండో రౌండ్ ఎకనామిక్ సెక్యూరిటీ డైలాగ్ ను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రస్తావించారు. సెమీ కండక్టర్లు, కీలక ఖనిజాలు, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, స్వచ్ఛ ఇంధనం, ఔషధ రంగాలు వంటి కీలక రంగాల్లో ప్రాజెక్ట్ ఆధారిత సహకారాన్ని మరింత పెంపొందించేందుకు ఆర్థిక భద్రతా సహకారంపై భారత్–జపాన్ సంయుక్త ప్రకటనను ఆమోదించారు.
ప్రపంచ ఇంధన మార్కెట్లోని అస్థిరత వల్ల ప్రభావితమయ్యే ప్రధాన ఇంధన వినియోగ దేశాలుగా తాము ఉన్నట్లు గుర్తిస్తూ… ఇంధన భద్రతపై భారత్–జపాన్ సహకారాన్ని మరింత బలోపేతం చేయవలసిన ఆవశ్యకతను ఇరుదేశాల ప్రధాన మంత్రులు స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధితో సహా అంతర్జాతీయ వాణిజ్యం ఆటంకాలు లేకుండా సాగటం, స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని కల్పించటం కీలకమన్నారు. వాణిజ్య నౌకల రాకపోకలను అడ్డుకునే పరిమితులను వ్యతిరేకించారు. ఇంధన రంగంలోని ప్రతీ దశలోనూ సహకారాన్ని విస్తరించే అవకాశాలను స్వాగతించారు. ఇంధన సరఫరా వ్యవస్థలో స్థిరత్వాన్ని పెంపొందించేందుకు ప్రపంచ ఇంధన మార్కెట్లలో స్థిరత్వాన్ని ప్రోత్సహించటానికి ద్వైపాక్షికంగా వివిధ వేదికల ద్వారా కలిసి పనిచేసేందుకు నిబద్ధతతో ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశారు.
సముద్ర ఇంధన రవాణా రంగంలో సంయుక్త పెట్టుబడులతో సహా కలిసి పనిచేసే అవకాశాలను అన్వేషించాలని ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు. ఇంధన స్థిరత్వాన్ని బలోపేతం చేయటానికి ప్రాంతీయ కార్యక్రమాల ప్రాముఖ్యతను వారు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా విస్తృతంగా ఇంధన, వనరుల స్థిరత్వంపై జపాన్ భాగస్వామ్యం (పవర్ ఆసియా), దక్షిణాసియాలో ఇంధన భద్రతకు భారత్ అందిస్తున్న మద్దతు, ఇండో–పసిఫిక్ ఇంధన భద్రతపై క్వాడ్ కార్యక్రమాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఇంధన స్థిరత్వంపై ఉమ్మడి ప్రకటన ఆమోదాన్ని వారు స్వాగతించారు. వ్యూహాత్మక చమురు నిల్వలపై సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు, ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకునేందుకు వ్యూహాత్మక నిల్వల వ్యవస్థపై సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకోవటానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ)లో భారతదేశ సభ్యత్వానికి జపాన్ ప్రధానమంత్రి తకాయిచి మద్దతు తెలిపారు.
స్వచ్ఛ ఇంధన రంగంలో భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇరువురు ప్రధానమంత్రులు అంగీకరించారు. భారత్ వ్యాప్తంగా 1,000 బయోగ్యాస్ ప్లాంట్లు, సేంద్రీయ ఎరువుల ప్లాంట్లను స్థాపించాలనే లక్ష్యానికి అనుగుణంగా బయోగ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు భారత్–జపాన్ సహకారంతో చేపట్టిన నూతన ప్రాజెక్టు భారత్–జపాన్ కోఆపరేటివ్ బయోగ్యాస్ ఫర్ గ్రోత్ ఇనిషియేటివ్ (సీబీజీ కార్యక్రమం) ప్రారంభాన్ని వారు అభినందించారు. జపాన్ ప్రభుత్వ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు.. భారతదేశ సహకార మంత్రిత్వ శాఖ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల శాఖకు మధ్య కుదిరిన సహకార ఒప్పందాన్ని (ఎంఓసీ) స్వాగతించారు. కర్బన ఉద్గారాలను తగ్గించటం కోసమే కాకుండా ఇంధన భద్రతను పెంపొందించటానికి కూడా హైడ్రోజన్, అమ్మోనియా ప్రాముఖ్యతను తెలియజేశారు. రెండు ప్రభుత్వాల నిరంతర మద్దతుతో ఒడిశాలో ప్రతిష్ఠాత్మక క్లీన్ అమ్మోనియా ప్రాజెక్టును ప్రోత్సహిస్తామని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. వీటితో పాటు క్లీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ పీవీ సాంకేతికతలు, అణుశక్తి తదితర రంగాల్లో స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహించటం పట్ల ప్రాముఖ్యతను గుర్తించారు.
భాగస్వామ్య పరిధిని మరింత విస్తృతం చేసుకోవటానికి ఏఐతో సహా నూతన సాంకేతికతల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించటం చాలా కీలకమనే అభిప్రాయాన్ని ఇరుదేశాల ప్రధానమంత్రులు పంచుకున్నారు. ఏఐ రంగంలో జాతీయ సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను.. విశ్వసనీయమైన, స్థిరమైన డిజిటల్ మౌలిక సదుపాయాలపై సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. హిరోషిమా ఏఐ ప్రాసెస్, న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆఫ్ ఏఐ ఇంపాక్ట్ స్ఫూర్తితో.. భౌతిక మౌలిక సదుపాయాల రంగంతో సహా ఏఐ రంగంలో స్థిరమైన, సమగ్రాభివృద్ధికి ఏఐ సాంకేతికత వినియోగం, అప్లికేషన్ ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. దీనికి సంబంధించిన అవకాశాలను ఉపయోగించుకుంటూనే నష్టాలను తగ్గించటం, స్థిరత్వం, క్రియాశీలత, వైవిధ్యం, విశ్వసనీయతతో కూడిన ఏఐ సరఫరా వ్యవస్థల కల్పనకు వారు ఆసక్తి కనబరిచారు. ఈ సందర్భంగా భారత్–జపాన్ ఏఐ వ్యూహాత్మక చర్చల ప్రారంభాన్ని స్వాగతించారు. భారత్–జపాన్ ఏఐ సహకార కార్యక్రమం ద్వారా సాధించిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఏఐ సహకారంపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు.
జపాన్ నుంచి భారత్‌కు పెరుగుతున్న ప్రైవేట్ పెట్టుబడులను ఇరువురు ప్రధానమంత్రులు స్వాగతించారు. భారతదేశ జాతీయ లక్ష్యం వికసిత్ భారత్‌కు ఈ పెట్టుబడులు అందిస్తున్న సహకారాన్ని గుర్తించారు. గత వార్షిక సదస్సులో నిర్దేశించుకున్న 5 ట్రిలియన్ యెన్ల లక్ష్య సాధన దిశగా సాధించిన పురోగతిని ప్రశంసించారు. భారత్–జపాన్ పారిశ్రామిక పోటీతత్వ భాగస్వామ్యం (ఐజేఐసీపీ) పరిధిలోని ఫాస్ట్ ట్రాక్ విధానాన్ని ఉపయోగిస్తూ… పెట్టుబడి వాతావరణాన్ని మరింత మెరుగుపరచాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఇరుదేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కుదుర్చుకుని 15 ఏళ్లకు పైబడిందని.. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించటం, వైవిధ్యభరితం చేయవలసిన అవసరాన్ని గుర్తిస్తూ… ఈ ఒప్పందాన్ని భవిష్యత్తు–ఆధారితంగా మార్చేందుకు, అమలును వేగవంతం చేసేందుకు, సీఈపీఏను పూర్తిస్థాయిలో, సమర్థవంతంగా వినియోగించుకోవాలని వారు అంగీకరించారు. భారతదేశ బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో జపాన్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల ఉనికిని బలోపేతం చేసుకునేందుకు అందించిన సహాయాన్ని జపాన్ ప్రశంసించింది. ఐజేఐసీపీ ద్వారా రవాణా, వస్త్రాలు, ఆహార శుద్ధి, వ్యవసాయం, ఆటోమొబైల్స్, పారిశ్రామిక వస్తువుల రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకునేందుకు ఇరుదేశాలు చేస్తున్న ప్రయత్నాలను సమర్థించారు. స్థానిక కరెన్సీల్లో లావాదేవీలు జరపటంతో పాటు చెల్లింపు విధానాల్లో భారత్–జపాన్ల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యతను తెలియజేశారు. ఫార్మా సరఫరా వ్యవస్థలతో సహా ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయటం కూడా కీలకమని గుర్తించారు.
భారత్–జపాన్ ఎస్ఎంఈ ఫోరమ్ ప్రారంభాన్ని, జపాన్ నుంచి భారతదేశానికి వచ్చిన ఏరోనాటికల్ రంగానికి చెందిన ఎస్ఎంఈ మిషన్ పర్యటనను ఇరుదేశాల ప్రధానమంత్రులు స్వాగతించారు. వ్యాపార వ్యవస్థను మెరుగుపరిచేందుకు.. జపాన్, భారత్ మధ్య వాణిజ్యం.. ముఖ్యంగా ఎస్ఎంఈలు, అంకుర సంస్థల మధ్య వ్యవస్థను బలోపేతం చేయటానికి జరుగుతున్న వివిధ ప్రయత్నాల స్థిరమైన పురోగతి పట్ల హర్షం వ్యక్తం చేశారు. జపాన్–ఇండియా స్టార్టప్ సపోర్ట్ ఇనిషియేటివ్ (జేఐఎస్‌ఎస్‌ఐ) ప్రాతిపదికన.. వివిధ విశ్వవిద్యాలయాల సహకారంతో భారత మార్కెట్లో జపనీస్ ఎస్ఎంఈలు, అంకుర సంస్థల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈలు) భాగస్వామ్య ప్రాముఖ్యతను, జపనీస్ సంస్థలకు భారతదేశంలోని టైర్-2, టైర్-3 సరఫరాదారుల వ్యవస్థతో అనుసంధాన అవసరాన్ని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పెట్టుబడులను, పారిశ్రామిక సహకారాలను, సాంకేతిక భాగస్వామ్యాలను మరింత సులభతరం చేసేందుకు నిబద్ధతను తెలియజేశారు.
భారతదేశ సామాజిక–ఆర్థిక అభివృద్ధికి జపాన్ అందిస్తున్న అభివృద్ధి సహకార మద్దతు పట్ల ఇద్దరు ప్రధానమంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. అనుసంధానాన్ని బలోపేతం చేయటానికి స్వచ్ఛమైన, స్థిరమైన సామాజిక–ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించటానికి దోహదపడే నాలుగు ప్రాజెక్టులు… ముంబయి మెట్రో (లైన్-11), బెంగళూరు మెట్రో (ఫేజ్-3), మహారాష్ట్రలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కల్పన, విద్యా వ్యవస్థ, పంజాబ్‌లో స్థిరమైన హార్టికల్చర్ పురోగతిని వారు స్వాగతించారు. ఆర్థిక వృద్ధిని ఉమ్మడిగా సృష్టించేందుకు దోహదపడేలా అభివృద్ధి సహకారాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశాన్ని పంచుకున్నారు.
భారత్–జపాన్ మధ్య ప్రతిష్ఠాత్మకమైన ముంబయి–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ ప్రాధాన్యతను ఇరుదేశాల ప్రధానమంత్రులు స్పష్టం చేశారు. 2027 నాటికి ఈ ప్రాజెక్టులోని ప్రాధాన్యతా విభాగాల్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలనే భారత్ లక్ష్యాన్ని జపాన్ అర్థం చేసుకుందని… దీనికి అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని జపాన్ ప్రధానమంత్రి తకాయిచి స్పష్టం చేశారు. అలాగే ఈ ప్రాజెక్టులో ‘ఈ10′ సిరీస్ రైళ్లను ప్రవేశపెట్టాలనే లక్ష్యాన్ని ఇరుపక్షాలు అంగీకరించాయి. భారతదేశంలో 7,000 కిలోమీటర్ల మేర జాతీయ హైస్పీడ్ రైలు వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యానికి అనుగుణంగా భవిష్యత్ కారిడార్లపై కలిసి పనిచేసే మార్గాలను అన్వేషించేందుకు ఇరుపక్షాలు సుముఖత వ్యక్తం చేశాయి. ఈ భవిష్యత్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని జపాన్ కంపెనీలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించగా, జపాన్ అంగీకారం తెలిపింది. జపాన్ అధునాతన మొబిలిటీ సాంకేతికతను, భారత్‌లోని అద్భుతమైన మానవ వనరులు, మార్కెట్ సామర్థ్యంతో అనుసంధానించేందుకు వీలుగా భవిష్యత్ తరం మొబిలిటీ భాగస్వామ్యంపై ఎంఓసీ కుదరటం పట్ల ఇరుపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. వీటితో పాటు నౌకా నిర్మాణ రంగంలో మానవ వనరుల సహకారంతో సహా ఇతర భాగస్వామ్యాల ప్రాధాన్యతను ఇరువురు నేతలు గుర్తించారు.
అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం, మార్పిడి ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలకు కీలకమని ప్రధానమంత్రులు స్పష్టం చేశారు. విద్యా సంస్థల మధ్య జరుగుతున్న ఉమ్మడి పరిశోధనలు, శాస్త్రవేత్తలు, పరిశోధకుల పరస్పర పర్యటనలు, జపాన్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాల ద్వారా పరిశ్రమ–విద్యాసంస్థల మధ్య కుదిరిన సహకారంపై సంతృప్తి వ్యక్తం చేశారు. లోటస్ కార్యక్రమం, సకురా సైన్స్ ఎక్స్ఛేంజ్ వంటి జపాన్ కార్యక్రమాల ద్వారా భారతదేశంలోని ప్రతిభావంతులకు లభిస్తున్న అవకాశాలను.. శాస్త్ర, సాంకేతికత విభాగం (డీఎస్టీ) ద్వారా జపాన్ హైస్కూల్ విద్యార్థులను భారత్‌కు ఆహ్వానించటాన్ని వారు ప్రస్తావించారు. ఇండో–జపాన్ కోఆపరేటివ్ సైన్స్ ప్రోగ్రామ్ (ఐజేసీఎస్‌పీ), జపాన్ సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ సైన్స్ (జేఎస్ పీఎస్), ఎంఈఎక్స్‌టీ స్కాలర్షిప్, ఇంటర్–యూనివర్సిటీ ఎక్స్ఛేంజ్ ప్రాజెక్టు వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, విశ్వవిద్యాలయాల పరస్పర మార్పిడిని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ సంయుక్తంగా చేపడుతున్న లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ (లూపెక్స్) చంద్రుని ఉపరితల పరిశోధన మిషన్ పురోగతిపై ఇద్దరు ప్రధానమంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. క్వాంటం టెక్నాలజీస్ రంగంలో భారతదేశ డీఎస్టీ, జపాన్ కేబినెట్ ఆఫీస్ మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందాన్ని స్వాగతించారు.
ఇరుదేశాల మధ్య ప్రతిభావంతులను పరస్పరం మార్చుకోవటం ద్వారా సవాళ్లను పరిష్కరించుకోవటానికి, సహకారానికి సహాయపడుతుందని పేర్కొంటూ.. ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని ఇద్దరు ప్రధానమంత్రులు నిబద్ధతను తెలియజేశారు. ఇప్పటి వరకు జరిగిన పురోగతిని, నిహోంగో పార్ట్‌నర్స్ కార్యక్రమాన్ని అభినందిస్తూ… భారతదేశంలో జపనీస్ భాషా విద్యా బోధనను మరింత ప్రోత్సహించాలని నిర్ణయించారు. 2025లో ఇరుదేశాల మధ్య ప్రయాణించిన సందర్శకుల సంఖ్య 5.40 లక్షలు దాటటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ… ఇరుదేశాల్లో పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఇరుదేశాల మధ్య సంస్థాగత, ప్రజల మధ్య బంధాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతున్న మేధో, సాంస్కృతిక మార్పిడిని అభినందించారు. ముఖ్యంగా యువతలో బాగా ఆదరణ పొందుతున్న యానిమే, మాంగా, గేమింగ్, చలనచిత్రాల వంటి సృజనాత్మక పరిశ్రమలు పోషిస్తున్న కీలక పాత్రను స్పష్టం చేశారు. పర్యాటకులతో సహా ప్రజల రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారుల మధ్య దౌత్య వ్యవహారాలపై చర్చలను ప్రోత్సహించాల్సిన ప్రాధాన్యతను తెలియజేశారు.
భారతదేశంలోని రాష్ట్రాలు, జపాన్‌లోని ప్రిఫెక్చర్, మున్సిపాలిటీలు ఇరుదేశాల మధ్య ఆర్థిక, ప్రజా సంబంధాలను బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఇరువురు ప్రధానమంత్రులు గుర్తించారు. ప్రాంతీయ స్థాయిలో నిరంతరం పెరుగుతున్న బంధాలను స్వాగతించారు. ఇందులో భాగంగా ఇండియా–జపాన్ గవర్నర్స్ నెట్‌వర్క్ ఫర్ ఫ్రెండ్‌షిప్ అండ్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటును ఇటీవల కాలంలో ఇరుదేశాల ప్రాంతాల మధ్య కుదిరిన ఉన్నత స్థాయి భాగస్వామ్యాలను ప్రశంసించారు. ముఖ్యంగా యామనాషి ప్రిఫెక్చర్ – ఉత్తరప్రదేశ్, తోయామా ప్రిఫెక్చర్ – ఆంధ్రప్రదేశ్, షిజుయోకా ప్రిఫెక్చర్ – గుజరాత్, హమామట్సు సిటీ – అహ్మదాబాద్, వకాయామా ప్రిఫెక్చర్ – మహారాష్ట్ర, శాన్–ఇన్ రీజియన్ – కేరళ, ఎహిమే ప్రిఫెక్చర్ – తమిళనాడు, ఫుకుయోకా ప్రిఫెక్చర్ – ఢిల్లీలతో పాటు కిటాక్యుషు సిటీ – తెలంగాణ మధ్య జరిగిన ప్రాంతీయ స్థాయి భాగస్వామ్యాలు, సహకారాలను ప్రత్యేకంగా అభినందించారు.
ప్రాంతీయ, ప్రపంచవ్యాప్త అంశాలు
నవీకరించిన ఎఫ్ఓఐపీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ ఆధారంగా బలమైన, సంపన్నమైన ఇండో–పసిఫిక్ ప్రాంత నిర్మాణానికి భారత ఈశాన్య ప్రాంతం (ఎన్ఈఆర్) కీలకమని ఇరుదేశాల ప్రధానమంత్రులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో రహదారులు, వంతెనలు, ఆరోగ్య సంరక్షణ, అడవుల నిర్వహణ, విపత్తుల నివారణ వంటి రంగాల్లో జపాన్ అందిస్తున్న సహాయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. సెమీ కండక్టర్లు, జీవ ఇంధన రంగాల్లో… నైపుణ్యాభివృద్ధి, జపనీస్ భాషా శిక్షణ, మానవ వనరులను మార్చుకోవటంలో ఇరుదేశాల కంపెనీల భాగస్వామ్యాన్ని వారు స్వాగతించారు. ఈశాన్య భారతాన్ని బంగాళాఖాతం ప్రాంతంతో అనుసంధానించే పారిశ్రామిక విలువ వ్యవస్థను అభివృద్ధి చేయటానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఫిబ్రవరి-2026లో మేఘాలయలోని షిల్లాంగ్‌లో జరిగిన ఆరో భారత్–జపాన్ మేధావుల సదస్సు విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ… తదుపరి యాక్ట్ ఈస్ట్ ఫోరమ్ (ఏఈఎఫ్) సమావేశాన్ని త్వరలోనే నిర్వహించాలని నిర్ణయించారు.
ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సుసంపన్నతకు ఒకే విధమైన ఆలోచనలు గల దేశాల మధ్య సహకారాన్ని పెంచాలని ఇరువురు ప్రధానమంత్రులు స్పష్టం చేశారు. క్వాడ్ కూటమి ద్వారా జరుగుతున్న పురోగతిని స్వాగతించారు. సముద్ర భద్రత, ఆర్థిక సంక్షేమం, కీలక ఖనిజాలు, సరికొత్త సాంకేతికతలు, మానవతా సహాయం వంటి నాలుగు ముఖ్యమైన అంశాల పట్ల క్వాడ్ సహకార ప్రాధాన్యతను తెలియజేశారు. తదుపరి క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌ను వీలైనంత త్వరగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆసియాన్ దేశాలతో సహకారం కూడా ముఖ్యమని చెబుతూ… ఫిలిప్పీన్స్‌తో కలిసి మొదటి త్రైపాక్షిక 1.5 ట్రాక్ విధాన చర్చలను ప్రారంభించేందుకు అంగీకరించారు. ఆసియాన్ స్థానానికి, ఐక్యతకు బలమైన మద్దతును, “ఆసియాన్ అవుట్‌లుక్ ఆన్ ది ఇండో–పసిఫిక్ (ఏఓఐపీ)” కి తిరుగులేని మద్దతును మరోసారి స్పష్టం చేశారు. ఒకే రకమైన ఆలోచనలు గల దేశాల మధ్య కీలకమైన ఖనిజాల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయటంలో సహకార ప్రాముఖ్యతను వారు స్పష్టం చేశారు. దీని కోసం వరల్డ్ బ్యాంక్ గ్రూప్ స్థిరమైన, సమ్మిళిత సరఫరా వ్యవస్థల ప్రోత్సాహ (రైజ్) భాగస్వామ్యం, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) క్రిటికల్ మినరల్స్–టు–మాన్యుఫాక్చరింగ్ ఫైనాన్సింగ్ పార్ట్‌నర్‌షిప్ ఫెసిలిటీ (సీఎంఎం–ఎఫ్‌పీఎఫ్) వంటి వివిధ అభివృద్ధి బ్యాంకుల (ఎంబీడీల) ద్వారా సహకరించుకోవాలని తెలిపారు.
తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్న పరిస్థితులపై ఇరుదేశాల ప్రధానమంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నౌకాయానం, విమాన ప్రయాణాల స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఏకపక్షంగా వ్యవహరించటం, బల ప్రయోగంతో ప్రస్తుత స్థితిని మార్చేందుకు ప్రయత్నించటాన్ని వ్యతిరేకించారు. వివాదాస్పద ప్రాంతాల్లో సైనిక మోహరింపు పెరగటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. సముద్ర వివాదాలను అంతర్జాతీయ చట్టాల ప్రకారం శాంతియుతంగా పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు.
ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమాలపై ఇరుదేశాల ప్రధానమంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) తీర్మానాల ప్రకారం ఉత్తర కొరియాను పూర్తిగా అణ్వాయుధ రహిత దేశంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఉత్తర కొరియాకు అణ్వాయుధ సాంకేతికత చేరటం లేదా అక్కడ నుండి బయటకు వెళ్లటం వంటి అంశాలపై నిఘా ఉంచాలని, ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నీ ఉత్తర కొరియాపై ఉన్న ఆంక్షలను ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు. అలాగే గతంలో జరిగిన అపహరణలకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
మయన్మార్‌లోని పరిస్థితులు, వాటి వల్ల పొరుగున ఉన్న ప్రాంతాలపై పడుతున్న ప్రభావంపై ఇరుదేశాల ప్రధానమంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ తక్షణమే హింసను నిలిపివేయాలని… శాంతియుతమైన, శాశ్వతమైన పరిష్కారానికి అన్ని వర్గాల మధ్య చర్చలు జరిగేలా అనుకూల వాతావరణాన్ని కల్పించాలని పిలుపునిచ్చారు.
మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతి, స్థిరత్వం పట్ల ఇరుదేశాల ప్రధానమంత్రులు నిబద్ధతను తెలియజేశారు. ఇరాన్ పరిసరాల్లో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడుతూ.. హర్మూజ్ జలసంధి ద్వారా స్వేచ్ఛా, సురక్షితమైన నౌకాయానాన్ని కల్పించటం, ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం కలగకుండా చూడటం, ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాల్లో పేర్కొన్న విధంగా అంతర్జాతీయ చట్టాలను గౌరవించటం ముఖ్యమని చెప్పారు. గాజా పునర్నిర్మాణానికి సమగ్ర ప్రణాళికను ముందుకు తీసుకువెళ్లటం, రెండు దేశాల పరిష్కారానికి కట్టుబడి ఉండటం అత్యవసరమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు.
భారత్–ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ (ఐఏఎఫ్ఎస్) విధానం, జపాన్ కు చెందిన టోక్యో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆఫ్రికన్ డెవలప్‌మెంట్(టీఐసీఏడీ), ఎకనామిక్ రీజియన్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇండియన్ ఓషియన్–ఆఫ్రికా వంటి వాటిల్లో భావించినట్లుగా… ఆఫ్రికాతో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవటానికి కట్టుబడి ఉన్నట్లు ఇద్దరు ప్రధానమంత్రులు స్పష్టం చేశారు. ఆఫ్రికాలో స్థిరమైన ఆర్థికాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు వాణిజ్యం, పెట్టుబడుల కోసం భారతదేశంలో ఒక హబ్‌ను ఏర్పాటు చేసేందుకు వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించినట్లు వెల్లడించారు.
అంతర్జాతీయ చట్టాలు, యూఎన్ నిబంధనలకు లోబడి ఉక్రెయిన్‌లో న్యాయమైన, శాశ్వతమైన శాంతి నెలకొల్పేందుకు ఇద్దరు ప్రధానమంత్రులు మద్దతు ప్రకటించారు. శాంతి స్థాపనకు వివిధ దేశాలు చేస్తున్న దౌత్య ప్రయత్నాలను వారు స్వాగతించారు.
అంతర్జాతీయ వేదికలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) తక్షణ సంస్కరణల కోసం ఇతర జీ4 దేశాలతో కలిసి పనిచేసేందుకు ఇరుదేశాల ప్రధానమంత్రులు నిబద్ధతను తెలియజేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్యత్వాల విస్తరణ జరగాలని ఆకాంక్షించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) సంస్కరణలను వేగవంతం చేయాలని ఇరుదేశాలు దృఢ సంకల్పాన్ని చాటాయి. నిర్దిష్ట కాలపరిమితిలో స్పష్టమైన ఫలితాలను సాధించటమే ప్రధాన లక్ష్యంగా… అంతర–ప్రభుత్వ చర్చల (ఐజీఎన్) వ్యవస్థలో భాగంగా, తక్షణమే లిఖితపూర్వక చర్చలను ప్రారంభించాలని ఇరుపక్షాలు ఆకాంక్షించాయి. శాశ్వత సభ్యత్వం కోసం ఒకరికొకరు పరస్పరం మద్దతు ఇచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. 2028-29, 2033-34 సంవత్సరాలకు గానూ తాత్కాలిక సభ్యత్వ స్థానాల కోసం పరస్పరం మద్దతు ఇచ్చుకోవాలని అవగాహనకు వచ్చారు. మారుతున్న ప్రపంచంలో ఐక్యరాజ్యసమితి మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు.
భారతదేశం 2030లో నిర్వహించబోయే 4వ ఐక్యరాజ్యసమితి ప్రపంచ విపత్తు ప్రమాద తగ్గింపు సదస్సుకు జపాన్ మద్దతివ్వటంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. విపత్తుల నివారణ పెట్టుబడులు, “బిల్డ్ బ్యాక్ బెటర్” వంటి సూత్రాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. 2027లో జపాన్‌లోని సెండాయ్‌లో జరిగే విపత్తు ప్రమాద తగ్గింపు ఆసియా–పసిఫిక్ మంత్రివర్గ సదస్సు ద్వారా ఈ రంగంలో సహకారాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్యం, పశ్చిమాసియా వంటి ప్రాంతీయ వ్యవహారాలు.. అంతరిక్షం, సైబర్ భద్రత, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి అంశాలపై ఇరుదేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య చర్చలను మరింత పెంచాలని నిర్ణయించారు.
పాకిస్తాన్ నుంచి సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని ఇరుదేశాల ప్రధానమంత్రులు తీవ్రంగా ఖండించారు. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని వారు ఖండించారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ఉనికిని ప్రస్తావిస్తూ.. జూలై 29, 2025న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మానిటరింగ్ టీమ్ సమర్పించిన నివేదికను గుర్తు చేశారు. నవంబర్ 10, 2025న ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద ఘటనను కూడా ఖండించారు. ఈ దాడులకు పాల్పడిన వారిని, వీటికి నిధులు సమకూర్చిన వారిని ఆలస్యం చేయకుండా శిక్షించాలని డిమాండ్ చేశారు. అల్ ఖైదా, ఐఎస్ఐఎస్, లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం) వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు, వాటి అనుబంధ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలను, నిధుల మార్గాలను, సరిహద్దుల గుండా వారి కదలికలను పూర్తిగా అణచివేయాలని పిలుపునిచ్చారు.
భారత్–జపాన్ మధ్య వివిధ రంగాల్లో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వార్షిక శిఖరాగ్ర సమావేశం చాలా ముఖ్యమైనదని ఇరుదేశాల ప్రధానమంత్రులు స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని భారత్–జపాన్ ఉమ్మడి హారిజన్స్ సంవత్సరంగా జరుపుకుంటూ.. ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ఏడాది పొడవునా స్మారక కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు నిబద్ధతను తెలియజేశారు.
భారత పర్యటనలో లభించిన ఆతిథ్యానికి జపాన్ ప్రధానమంత్రి తకాయిచి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది జపాన్‌లో జరగబోయే 17వ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఆహ్వానించగా.. ఆ ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించారు.
***
These outcomes reflect the commitment to deepening the India-Japan cooperation across key sectors and unlocking new opportunities for growth, innovation and development. https://t.co/sGmcNFW0fy
— Narendra Modi (@narendramodi) July 2, 2026
It is wonderful to meet Prime Minister Sanae Takaichi in Delhi. Japan is an important partner of India and we are confident that our ties will get even stronger in the times to come. Our talks today covered the full range of the India-Japan Special Strategic and Global… pic.twitter.com/uxVvrOj2u6
— Narendra Modi (@narendramodi) July 2, 2026
Prime Minister Takaichi and I believe that technology partnership will become the strongest pillar of our cooperation. To realise this vision, we have today issued a Joint Statement in the field of AI. Several leading institutions of India’s AI ecosystem have also signed… pic.twitter.com/KoqrFdzYCI
— Narendra Modi (@narendramodi) July 2, 2026