Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’ 10వ సదస్సు ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’ 10వ సదస్సు  ప్రారంభం   సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం


కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని, వివిధ రాష్ట్రాల మంత్రులు, ‘జీఎస్ఎంఏ’ బోర్డు సభ్యులు, ప్రపంచవ్యాప్త టెలికాం సేవాప్రదాన సంస్థల ప్రతినిధులు, అగ్ర పారిశ్రామికవేత్తలు, నిపుణులు, దేశంలోని వివిధ కళాశాలలు-అంకుర సంస్థల నుంచి వచ్చిన నా యువ మిత్రులు, సోదరీసోదరులారా!

 

   మన దేశానికి అక్టోబరు 8వ తేదీ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే- ఏటా ఈ రోజున మనం వాయుసేన దినోత్సవం నిర్వహించుకుంటాం. ఈ సందర్భంగా మన సాహస వైమానిక దళ యోధులందరికీ నా అభివందనం. అలాగే, యావద్దేశ ప్రజానీకానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

 

మిత్రులారా!

 

శ్రీ సింధియా కొద్ది క్షణాల ముందు ప్రస్తావించిన మేరకు దేశ సేవలో నేను ఒక ప్రభుత్వాధిపతిగా నిన్నటితో 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్నాను. ఇది నాకొక సహజ, నిరంతర సేవా ప్రస్థానం. ఈ నేపథ్యంలో నాకు శుభాకాంక్షలు తెలిపిన దేశ పౌరులందరితోపాటు ప్రపంచవ్యాప్తంగా గల భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

 

మిత్రులారా!

 

ఇక ఇదే సందర్భంలో ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’ పదేళ్లు పూర్తి చేసుకోవడం యాదృచ్ఛికం. ఈ ఏడాది జీఎస్ఎంఏ బోర్డు సమావేశానికి ఆతిథ్యమిచ్చే అవకాశం భారత్‌కు దక్కింది. ఈ సదస్సు కోసం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన టెలికాం సేవాప్రదాన సంస్థల ప్రతినిధులు, అగ్ర పారిశ్రామివేత్తలు, నిపుణులు, విద్యావేత్తలు, అంకుర సంస్థల ప్రతినిధులందరికీ స్వాగతం పలుకుతూ, అభినందనలు తెలుపుతున్నాను.

 

మిత్రులారా!

 

ఇవాళ ఉదయమే దురదృష్టవశాత్తూ ప్రముఖ నటుడు శ్రీ నానా పటేకర్ మనను వీడి వెళ్లిపోయారన్న వర్తమానం మాకు అందింది. ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను చూరగొన్న అద్భుత కళాకారుడాయన. మన మువ్వన్నెల జెండా గౌరవం, దేశ ప్రతిష్ఠ ఇనుమడింపజేయడం కోసం శ్రీ నానా పటేకర్ నిరతం కృషి చేశారు. ఆయనెన్నడూ… ఎలాంటి పరిమితులకూ లోబడిన వారు కాదు. ఆకాశంలో స్వేచ్ఛా విహంగంలా సినీ వినువీధుల్లో విహరించారు. తన చిత్రాల ద్వారా సామాజిక అసమానతలు, అన్యాయంపై శక్తిమంతంగా పోరాడారు. అనేక సామాజిక దురాచారాలను దునుమాడిన నిజమైన విప్లవకారుడు. ఆయన వాక్కు అమిత శక్తిమంతం… ఆయన మౌనం అత్యంత ప్రభావశీలం. దేశ వ్యతిరేకులను ఆయన నిర్ద్వంద్వంగా ఖండిస్తూ, అలాంటివారిపై కఠిన చర్యలను సదా సమర్థించారు. ఈ నేపథ్యంలో శ్రీ నానా పటేకర్ గారికి నివాళి అర్పిస్తూ- ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.

మిత్రులారా!

 

ఇండియా మొబైల్ కాంగ్రెస్ సంబంధిత అనేక సదస్సులలో మీతో కలసి పాల్గొనే అవకాశం నాకు చాలాసార్లు లభించింది. టెలికాం రంగం, డిజిటల్ అనుసంధానం రూపాంతరీకరణకు ఈ వేదిక సాక్ష్యంగా నిలుస్తోంది. లోగడ 2022లో సరిగ్గా ఇదే వేదిక నుంచి మనం దేశంలో 5జీ సేవలకు శ్రీకారం చుట్టాం. అటుపైన 2023లో భారత్‌ 5జీ ఆరంభ దశ నుంచి విస్తరణ దిశగా దూసుకెళ్తున్న తీరును నేను ప్రస్తావించాను. ఇక నేడు దేశంలోని ప్రతి జిల్లాకూ 5జీ అనుసంధానం విస్తరించడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,50,000కు పైగా బేస్ స్టేషన్ల ద్వారా 5జీ సేవలు ప్రజలకు అందుతున్నాయి. ఇక 2022తో పోలిస్తే మొబైల్ ఇంటర్నెట్ వేగం ఇవాళ 10 రెట్లు పెరిగింది.

 

మిత్రులారా!

 

అనంతరం 2024 నాటి ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) భాగస్వామ్యాన్ని మనం చూశాం. అప్పట్లో డిజిటల్ ప్రపంచానికి అంతర్జాతీయ ప్రమాణాల ఆవశ్యకతపై మనం కూలంకషంగా చర్చించాం. గత ఏడాది ‘ఇన్వెస్ట్-ఇన్నొవేట్, మేక్ ఇన్ ఇండియా’ అంశాలపైనా సంభాషించుకున్నాం. టెలికాం రంగంలో భారత్‌ నేడు సాధించిన విజయాలకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎంతగానో దోహదం చేసింది. ఆ విధంగా భారత ప్రగతికి, ఆకాంక్షలకు ఇది క్రమేణా ఒక వేదికగా రూపొందడంపై మీకందరికీ నా ప్రత్యేక అభినందనలు.

 

మిత్రులారా!

 

ఈ ఏడాది “అవధులు లేని విస్తరణ” ఇతివృత్తంగా సాగే చర్చలలలో సరిహద్దులకు అతీతంగా విస్తరణపై భారత స్వప్న సాకార అనుభవాన్ని మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.

 

మిత్రులారా!

 

టెలికాం రంగంలో తరచూ నెట్‌వర్కులు, స్పెక్ట్రమ్ వాదనలు, టవర్లు, విస్తృతి, వేగం చుట్టూ చర్చలు నడుస్తుంటాయి. అయితే, భారత ప్రజానీకానికి టెలికాం ప్రాధాన్యం అంతకుమించినది. గడచిన దశాబ్దంలో మొబైల్ ఫోన్ ఆధునిక సమాచార సాధనంగానే కాకుండా, సుపరిపాలనకు కీలక ఉపకరణంగానూ రూపొందింది. తద్వారా మా ‘డిజిటల్ ఇండియా’ దార్శనికతలో అగ్రభాగాన నిలిచింది.

 

మిత్రులారా!

 

భారత్‌లో నేడు డేటా, మొబైల్ ఫోన్లు అందుబాటు ధరలో ఉండటమే కాకుండా వినియోగదారుల సంఖ్య భారీగా పెరగడం గురించి మనం వింటున్నాం. ఇది నిజమేగానీ, ఈ పరిణామం ఎలా సాధ్యమైంది? అసలు ఇదంతా ఎందుకు..? వంటి ప్రశ్నలకు సమాధానాలను మనం అర్థం చేసుకుంటే భారత్‌ దృక్కోణం, ప్రాథమ్యాలు తేటతెల్లమవుతాయి.

 

మిత్రులారా!

 

దశాబ్దం కిందటిదాకా దేశంలో డిజిటల్ అంతరం పెనుసవాలుగా ఉండేది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతకంతకూ ఒక ప్రత్యేక హక్కుగా మారుతోంది. ఎందుకంటే- వనరులున్నవారికే ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ప్రయోజనం పొందడం సాధ్యమవుతోంది. దేశం కూడా అదే దిశగా పయనిస్తోంది.. అయితే, డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ఈ పరిస్థితిని చక్కదిద్దాలని మేం సంకల్పించాం. మొబైల్ ఫోన్‌ కేంద్రకంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రధానంగా కృషి చేశాం. ఈ ధ్యేయంతో టెలికాం రంగంలో అవసరమైన మేర సంస్కరణలన్నీ ప్రవేశపెట్టి, మౌలిక సదుపాయాలను విస్తరించాం. మొబైల్ ఫోన్లు, ఇతర టెలికాం హార్డ్‌వేర్‌ దేశంలోనే తయారయ్యేలా నిశితంగా దృష్టి సారించాం.

మిత్రులారా!

 

ఈ నిర్విరామ కృషి ఫలితంగా మొబైల్ ఫోన్లే కాకుండా డేటా కూడా మరింత సులభంగా, చౌకగా సామాన్యులకూ చేరువైంది. ఈ సౌకర్యం ఇవాళ మన పౌరుల జీవన సౌలభ్యాన్ని ఇనుమడింపజేస్తోంది. కోవిడ్ విజృంభించిన వేళ దాదాపు ప్రతిదీ ఎలా స్తంభించిందో మనం చూశాం. అయినప్పటికీ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాలయాలు పనిచేస్తూనే వచ్చాయి. దేశంలో డిజిటల్ వ్యవస్థ విస్తృత వ్యాప్తి కారణంగానే ఇదంతా సాధ్యమైంది. మొబైల్, ఇంటర్నెట్ సంధానంతో విద్య, ఆరోగ్య సంరక్షణ, చెల్లింపులు, ప్రభుత్వ సేవల ప్రదానం నిరంతరాయంగా సాగాయి. ఈనాడు మారుమూల గ్రామాల్లోని ప్రజలు, వెనుకబడిన వర్గాల బాలలకూ నాణ్యమైన జ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఈ విధంగా డిజిటల్ విద్య కాలక్రమేణా ప్రతి ఒక్కరికీ చేరువవుతోంది.

 

మిత్రులారా!

 

డిజిటల్ ఇండియా ప్రభావాన్ని మరింత ప్రస్ఫుటం చేసే గణాంకాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఆన్‌లైన్ విద్యా ప్రదానం కోసం ‘దీక్ష’ పేరిట మాకొక వేదిక ఉంది. కోవిడ్ సమయంలో 2022 జూలై నాటికి ఈ వేదిక ద్వారా 5 బిలియన్లకు పైగా అభ్యసన కార్యక్రమాల్లో దాదాపు 600 బిలియన్‌ నిమిషాల మేర అభ్యసన సమయం నమోదైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దాదాపు 25 కోట్ల మంది విద్యార్థులను దేశంలోని అన్ని డిజిటల్, ఆన్‌లైన్ విద్యా వేదికలతో అనుసంధానించడమే మా తదుపరి కర్తవ్యం.

 

మిత్రులారా.. మరో మాటలో చెబితే…

 

టెలికాం రంగంలో వచ్చిన ఈ విప్లవం భారత పౌరులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చింది. ఈ దేశం భాష, భౌగోళికం వంటి అన్ని రూపాల్లోనూ ఎంతో వైవిధ్యభరితమని మీకందరికీ తెలిసిందే. ఇదే వైవిధ్యం జన జీవనంలో అనేక అసౌకర్యాలకూ కారణం కాగలదుగానా, మొబైల్ అనుసంధానంతో ఇది సౌలభ్యంగా మారింది. లోగడ చాలా బ్యాంకులు నగరాలకే పరిమితం కాగా, ఆసుపత్రులు పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉండేవి. ఇక ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా సమితి లేదా జిల్లా కేంద్రాల్లో మాత్రమే పనిచేస్తూండేవి. ప్రభుత్వపరంగా ఏ సేవ కోసమైనా సమయం, డబ్బు రెండూ తప్పేవి కావు. అయితే, నేటి డిజిటల్ పాలన ఈ పరిస్థితులను ఆమూలాగ్రం మార్చేసింది. నేడు వందలాది ప్రభుత్వ సేవలు మొబైల్ ఫోన్‌ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ సహాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ అవుతోంది. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) ద్వారా దాదాపు ₹50 లక్షల కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు చేరాయి. అంతేకాదు… దాదాపు ₹5 లక్షల కోట్ల ప్రజాధనం- ఇదేమీ చిన్న మొత్తం కాదు.. దళారుల చేతిలోకి వెళ్లకుండా నివారించగలిగాం.

 

ఇప్పుడు చెప్పండి.. ఎవరి అక్రమ సంపాదన ఆగిపోయిందో వారు మోదీని ప్రేమిస్తారా? నేను సరైన పని చేశానా లేదా? ఇది జరిగి ఉండాలా.. వద్దా? ఇలాంటి తప్పుడు పద్ధతులు ఆగిపోవాలా.. వద్దా? వారు ఎంతగా అరిచినా.. కేకలు వేసినా సరే నేను నా మనసును దృఢపరుచుకున్నాను. ఇదే మార్గంలో ముందుకు సాగుతాను.

 

ఒకవేళ పాత వ్యవస్థే గనుక అలాగే

ఉండి ఉంటే దాదాపు 5 లక్షల

కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము లీకేజీల ద్వారా పోయి అటువంటి వాళ్ల జేబులను నింపేది.

మేం దీనికి అడ్డుకట్ట వేశాం. ఇప్పుడు ఆ డబ్బు నేరుగా అర్హులైన లబ్ధిదారులకు

చేరుతోంది. ఆ ఆదా అయిన నిధులను ఉత్పాదక రంగాల అభివృద్ధికి వినియోగిస్తున్నాం.

మిత్రులారా, 

 

పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకం

కింద మేం ఇప్పటికే 4 లక్షల

కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. ఈ

మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకొకసారి బదిలీ చేస్తున్నాం. రైతుకు నేరుగా తన మొబైల్

ఫోన్‌లోనే సమాచారం వస్తుంది. గతంలో ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉండిపోయిన కోట్లాది

మంది చిన్న రైతులకు ఈ డబ్బు చేరింది.

 

మరో రకంగా చెప్పాలంటే మిత్రులారా,

 

మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు కేవలం

సమాచార మాధ్యమం మాత్రమే కాదు. తక్కువ ప్రయాణం, తక్కువ వేచి ఉండే సమయం, తక్కువ ఖర్చు, ఎక్కువ సౌకర్యాలను ఇది

నిర్ధారిస్తోంది. సాంకేతికత అందించగల అత్యుత్తమ ప్రజా ప్రయోజనం ఇదే. 

 

మిత్రులారా, 

 

గత దశాబ్ద కాలంలో భారతదేశ టెలికాం

మౌలిక సదుపాయాలు నిరంతరాయంగా పెరిగాయి. మారుమూల ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటయ్యాయి.

అపూర్వమైన స్థాయిలో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌లు విస్తరించాయి. డేటా చాలా తక్కువ

ధరకే అందుబాటులోకి వచ్చింది. ఇది ఆర్థిక వ్యవస్థలో సరికొత్త రంగాల ఆవిర్భావానికి

కూడా దారితీసింది. ఇది సాంకేతికత, వినోదం, విద్యారంగంలో

కొత్త వినియోగదారులను సృష్టించడంతో పాటు అదే సమయంలో సరికొత్త తరం క్రియేటర్లను

ప్రోత్సహిస్తోంది. ఉదాహరణకు గేమింగ్‌ను తీసుకుందాం. నేడు భారత్‌లో 50 కోట్ల మందికి పైగా ప్రజలు ఏదో ఒక

రూపంలో గేమింగ్ రంగంతో అనుసంధనమై ఉన్నారని అంచనా. వారిలో ఎక్కువ మంది యువ

భారతీయులే ఉన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల యువత కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొంటోంది.

వారు కేవలం గేమ్స్ ఆడటమే కాకుండా ఈ-స్పోర్ట్స్‌లో పోటీపడుతున్నారు.. గేమింగ్

కంటెంట్‌ను సృష్టిస్తున్నారు.. కొత్త గేమింగ్ వ్యాపారాలను నిర్మిస్తున్నారు. మరో

రకంగా చెప్పాలంటే భారత్‌లో మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు ఒక గేమింగ్ కన్సోల్‌గా, ఒక క్రియేషన్ స్టూడియోగా..

రెండింటిలా మారింది.

 

మిత్రులారా, 

 

భారత్‌లో టెలికాం విప్లవం..

కంటెంట్ ప్రపంచంలోనూ ఇలాంటి మార్పునే తెచ్చింది. మెరుగైన- వేగవంతమైన కనెక్టివిటీతో

పాటు తక్కువ ధరకే లభిస్తున్న డేటా.. వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా, ప్రాంతీయ ఓటీటీ సేవలను పల్లెలకు, చిన్న పట్టణాలకు చేర్చాయి.

ఫలితంగా భాషా పరమైన అనేక అడ్డంకులు, పరిమితులు తొలగిపోయాయి. నేడు

భారత్‌లో ఒక్క కంటెంట్ క్రియేషన్ పరిశ్రమనే వేల కోట్ల రూపాయల విలువ కలిగి ఉంది..

కోట్లాది మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. మరో రకంగా చెప్పాలంటే భారత్‌లో

మొబైల్ ఫోన్ అనేది కంటెంట్ సృష్టిని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చింది.

 

మిత్రులారా, 

 

టెలికాం, డిజిటల్ సాంకేతికత ఇంతటి కీలకమైన

పాత్ర పోషిస్తున్న తరుణంలో వాటికి సంబంధించిన భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం కూడా

అంతే ముఖ్యం. ఫోన్లు, నెట్‌వర్క్‌ల

భద్రత మనందరి ప్రాధాన్యతలు. సాధారణ పౌరుడు ప్రొటోకాల్స్ లేదా ఆర్కిటెక్చర్ గురించి

ఆలోచించడు. అతనికి నమ్మకం మాత్రమే ముఖ్యం. అతనికి ఒక కాల్ వచ్చినప్పుడు ఎవరు కాల్

చేస్తున్నారో అతనికి తెలియాలి. ఒక సందేశం వచ్చినప్పుడు అది అసలైనదా లేక నకిలీదా

అనేది అతనికి స్పష్టంగా తెలియాలి. అతను చెల్లింపు చేసినప్పుడు తన డబ్బు

సురక్షితంగా ఉందనే భరోసా అతనికి ఉండాలి. ఒక ఫారమ్ ద్వారా తన డేటాను అందించినప్పుడు

తన సమాచారం పూర్తిగా రక్షణలో ఉంటుందని అతను నమ్మగలగాలి.

మిత్రులారా, 

 

సాంకేతికత ఎప్పుడైతే నమ్మకాన్ని

సంపాదిస్తుందో అప్పుడే అది విస్తృత స్థాయిలో విజయవంతం అవుతుంది. సైబర్ మోసాలు, సైబర్ నేరాలకు సరిహద్దులతో సంబంధం

లేదని మనందరికీ తెలుసు. ఇవి ఇప్పటికే సరిహద్దులను దాటిపోయాయి. ఒక దేశంలో కూర్చున్న

వ్యక్తి రెండో దేశం సహాయంతో మూడో దేశంలో నేరానికి పాల్పడొచ్చు. డీప్‌ఫేక్‌లు ఎంత

తీవ్రమైన సవాలుగా మారుతున్నాయో కూడా మనం చూస్తున్నాం. అందువల్ల ఈ సమస్యలను

పరిష్కరించడానికి మనం ఒక గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌పై పని చేయడం ఎంతో అవసరం.

ప్రభుత్వాలు, సాంకేతిక

కంపెనీలు, టెలికాం

సంస్థలు, ఆర్థిక

సంస్థలు అన్నీ కలిసి ఇటువంటి వ్యవస్థలో భాగం కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీఎస్‌ఎంఏ, టెలికాం ఆపరేటర్లు అందరూ ఏకమై

ప్రజల దగ్గరకు చేరకముందే అటువంటి మోసాలను అడ్డుకోగల ఒక ప్రపంచ స్థాయి

యంత్రాంగాన్ని రూపొందించాలని నేను కోరుతున్నాను. భారత్ తన సొంత అనుభవాల ద్వారా

చాలా నేర్చుకుంది. ఆ అనుభవాలను ప్రపంచంతో పంచుకోవడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా

ఉంది.

 

మిత్రులారా, 

 

ఈ దశాబ్దంలో కేవలం నాలుగేళ్లు

మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రస్తుత సంచికలో జరిగే చర్చలు

రాబోయే దశాబ్దపు రోడ్‌మ్యాప్‌ను మరింత బలపరుస్తాయి. ఈ రోడ్‌మ్యాప్ భారత్‌ను

మాత్రమే కాకుండా ప్రపంచ మొబైల్ మార్కెట్‌కు కూడా మార్గనిర్దేశం చేస్తుంది. గత

కొన్నేళ్లలో భారత్ కేవలం వినియోగదారునిగా ఉండే స్థితి నుంచి సృష్టికర్తగా

ఎదిగింది. ఇప్పుడు భారత్ ఒక భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోంది. అక్కడ ఉత్పత్తులు, డిజైన్‌లు భారత్‌లోనే

రూపుదిద్దుకుంటాయి.. వాటి సాంకేతికత, మేధో సంపత్తి కూడా మన దేశానికే చెందుతాయి.

దీన్ని సాధించడానికి ప్రతి అవసరమైన ప్రోత్సాహకాన్ని అందిస్తున్నాం. ప్రతి అవసరమైన

సంస్కరణను చేపడుతున్నాం. మరో రకంగా చెప్పాలంటే టెలికాం రంగంలో కూడా ‘సంస్కరణల రైలు’ వేగంగా ముందుకు

దూసుకుపోతోంది. దశాబ్దాల నాటి పాత చట్టాలను మేం అధునికీకరిస్తున్నాం. ‘టెలికమ్యూనికేషన్స్ చట్టం’ ద్వారా ఒక ఆధునిక నియంత్రణ

వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఏజీఆర్, బ్యాంక్ గ్యారెంటీలు వంటి వ్యవస్థీకృత భారాలను కూడా

హేతుబద్ధీకరించి వాటిని అవకాశాలుగా మారుస్తున్నాం. డిజిటల్ ప్రక్రియల ద్వారా ‘గతిశక్తి సంచార్ పోర్టల్’.. ‘రైట్ ఆఫ్ వే’ అనుమతులను మరింత వేగవంతం చేసింది.

మిత్రులారా, 

 

భారతదేశ సెమీకండక్టర్, సెమీకండక్టర్ తయారీ రంగానికి

సంబంధించిన వ్యవస్థ కూడా వేగంగా పుంజుకుంటోంది. ఇప్పటికే ఐదు ప్రాంతాల్లో వాణిజ్య

ఉత్పత్తి ప్రారంభమైంది. ‘ఇండియా

సెమీకండక్టర్ మిషన్’ తదుపరి

దశలో మా పూర్తి దృష్టి మొత్తం సరఫరా గొలుసు పైనే ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే.. టెలికాం రంగానికి సంబంధించిన ప్రతి

విషయంలోనూ భారత్ అద్భుతంగా ముందుకెళ్తోంది.

 

మిత్రులారా, 

 

గత కొన్ని సంవత్సరాలుగా ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’ ఎంతో పురోగతి సాధించింది. అయితే

అభివృద్ధి ప్రయాణం అనేది నిరంతరం కొత్త మైలురాళ్లను అధిగమించే ఒక నిరంతర ప్రక్రియ.

మన ముందు ‘వికసిత్

భారత్’ అనే

మహోన్నత సంకల్పం ఉంది. దానికోసం మనం మన ప్రయత్నాలను నిరంతరం పెంచుకోవాలి. ఇక్కడ

ప్రదర్శించిన సాంకేతికతలకు నిస్సందేహంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కానీ ఐఎంసీ

దేనికి గుర్తుండిపోవాలంటే.. ఇక్కడ కుదిరిన భాగస్వామ్యాల కోసం, ఇక్కడ ప్రారంభించిన పరిశోధన

ప్రాజెక్ట్‌ల కోసం, ఇక్కడి నుంచే

ప్రపంచానికి చేరుకున్న ఉత్పత్తుల కోసం, భారత్ నుండి వెలువడి మానవాళికి

సేవ చేసిన ఆవిష్కరణల కోసం ఇది చిరస్మరణీయంగా నిలవాలి. మనం ఐఎంసీని సాంకేతికత, పరిశోధన, పరిశ్రమలు, పెట్టుబడులు, నూతన ఆలోచనలకు ఒక ప్రధాన సంగమ

కేంద్రంగా మార్చాలి. మీరందరూ పూర్తి అంకితభావంతో ఈ లక్ష్యం వైపు పనిచేయడం

కొనసాగిస్తారన్న పూర్తి విశ్వాసం నాకు ఉంది. ఇదే ఆశయంతో మీ అందరికీ మరోసారి నా

హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

ధన్యవాదాలు!!

 

గమనిక: ప్రధానమంత్రి హిందీలో ప్రసంగించారు.