Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇంధన రంగ కంపెనీల సీఈఓలతో చర్చించిన ప్రధాని

ఇంధన రంగ కంపెనీల సీఈఓలతో చర్చించిన ప్రధాని


ప్రస్తుతం జరుగుతున్న ‘ఇండియా ఎనర్జీ వీక్ (ఐఈడబ్ల్యూ) 2026’లో భాగంగా ప్రపంచ ఇంధన రంగ సీఈఓలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చర్చించారు. ఈ రోజు ప్రధాని నివాసమైన లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. 

ఈ చర్చల సందర్భంగా భారతదేశ అభివృద్ధి పథంపై సీఈఓలు బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విధానపరమైన స్థిరత్వం, సంస్కరణల వేగం, దీర్ఘకాలిక డిమాండ్‌లోని స్పష్టతను ప్రస్తావించిన సీఈఓలు.. తమ వ్యాపార ఉనికిని భారత్‌‍లో విస్తరించడం, మరింత దృష్టి సారించటంపై ఆసక్తిని వ్యక్తం చేశారు. 

సీఈఓలను ఆహ్వానిస్తూ ప్రధానమంత్రి.. పరిశ్రమ-ప్రభుత్వ సమన్వయం కోసం ఈ రౌండ్‌టేబుల్ సమావేశాలు ఒక కీలక వేదికగా ఉద్భవించాయని అన్నారు. ప్రపంచ పరిశ్రమ నాయకుల నుంచి వచ్చే ప్రత్యక్ష అభిప్రాయాలు.. విధాన చట్రాలను మెరుగుపరచడానికి, రంగాల వారీ సవాళ్లను మరింత సమర్థవంతంగా పరిష్కరించేందుకు, ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా భారత్‌ స్థానాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతాయని ఆయన ప్రముఖంగా చెప్పారు. 

పటిష్ఠమైన భారత ఆర్థిక వేగాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వేగంగా దేశం ఎదుగుతోందని, ప్రపంచ ఇంధన డిమాండ్-సరఫరా సమతుల్యతలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

భారత ఇంధన రంగంలో ఉన్న గణనీయమైన పెట్టుబడి అవకాశాలపై ప్రధానమంత్రి దృష్టి సారించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టుబడిదారుల అనుకూల విధాన సంస్కరణలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. చమురు అన్వేషణ, ఉత్పత్తిలో సుమారు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి సామర్థ్యం ఉన్నట్లు ఆయన చెప్పారు. కంప్రెస్డ్ బయో-గ్యాస్ (సీబీజీ) రంగంలో కూడా 30 బిలియన్ డాలర్ల అవకాశం ఉందని సీఈఓలకు తెలియజేశారు. వీటితో పాటు గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, రిఫైనరీ-పెట్రోకెమికల్ ఇంటిగ్రేషన్, సముద్రయాన- నౌకానిర్మాణ రంగాలతో సహా విస్తృతమైన ఇంధన విలువ గొలుసులో ఉన్న భారీ అవకాశాలను ఆయన వివరించారు. 

ప్రపంచ ఇంధన ముఖచిత్రం అస్థిరతతో కూడి ఉన్నప్పటికీ అపారమైన అవకాశాలను కూడా అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఆవిష్కరణలు, సహకారం, లోతైన భాగస్వామ్యాల కోసం పిలుపునిచ్చిన ఆయన.. ఇంధన విలువ వ్యవస్థ అంతటా భారత్‌ ఒక నమ్మకమైన, విశ్వసనీయ భాగస్వామిగా సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. 

ఈ ఉన్నత స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశంలో టోటల్ ఎనర్జీస్, బీపీ, విటోల్, హెచ్‌డీ హ్యుందాయ్, హెచ్‌డీ కేఎస్‌ఓఈ, అకెర్, లాంజాటెక్, వేదాంత, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరం (ఐఈఎఫ్), ఎక్సెల్రేట్, వుడ్ మెకెంజీ, ట్రాఫిగురా, స్టాట్సోలీ, ప్రజ్, రీన్యూ, ఎంఓఎల్, తదితర ప్రముఖ అంతర్జాతీయ, భారతీయ ఇంధన సంస్థలకు చెందిన 27 మంది సీఈఓలు, సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ చర్చలో కేంద్ర పెట్రోలియం- సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్‌ సింగ్‌ పురి, సహాయ మంత్రి శ్రీ సురేష్ గోపి, మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. 

 

***