పిఎంఇండియా
బహిరంగ, సమ్మిళిత, సంపన్న ఇండో–పసిఫిక్ ప్రాంతం కోసం ఉమ్మడి దార్శనికత కలిగిన ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వాములు భారత్, కొరియా.
మా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రధాన ఆధారం సుదీర్ఘమైన, విశ్వసనీయమైన ఆర్థిక, ఇంధన వనరుల భాగస్వామ్యం. ఇది బహిరంగ మార్కెట్లు, నియమాల ఆధారిత వాణిజ్యంపై ఉమ్మడి నిబద్ధతతో కూడుకున్నది. ఇది మా శ్రేయస్సు, ఆర్థిక భద్రతకు మూలాధారం. ప్రస్తుత తరుణంలో ఈ ఉమ్మడి సూత్రాలను పునరుద్ఘాటించడం.. పరిశ్రమలు, మార్కెట్లపై ప్రస్తుత పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం ఎంతో అవసరం.
భారత–కొరియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ), సంబంధిత ద్వైపాక్షిక విధానాల ద్వారా మా ఇంధన వనరుల వాణిజ్యం, పెట్టుబడుల సహకారాన్ని పెంపొందించడానికి మేం కృషి చేస్తున్నాం. కొరియాకు ఇతర పెట్రోలియం ఫీడ్‌స్టాక్‌లను సరఫరా చేసే కీలక దేశంగా భారత్ ఉండగా.. భారతదేశానికి పెట్రోలియం ఉత్పత్తులు, లూబ్రికెంట్ బేస్ ఆయిల్స్‌ను సరఫరా చేసే ప్రముఖ దేశంగా కొరియా ఉంది.
ఇంధన వనరుల సరఫరా వ్యవస్థ దృఢత్వాన్ని బలోపేతం చేయడానికి ప్రాంతీయ సహకారాన్ని మరింత పటిష్ఠం చేయటం, ఇంధన పరివర్తనను వేగవంతం చేయడం, ఇంధన వనరుల కోసం బహిరంగ వాణిజ్య ఏర్పాట్లకు మద్దతు ఇవ్వడం ద్వారా మేం కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాం. మార్కెట్ స్థిరత్వం, పారదర్శకతను పెంపొందించడానికి.. అలాగే కొనుగోలుదారుల దృక్పథాలను మెరుగ్గా ప్రతిబింబించేలా చేయడానికి ప్రధాన ఎల్‌ఎన్‌జీ వినియోగదారులుగా మరింత సన్నిహిత సహకారాన్ని అన్వేషించాల్సిన అవసరాన్ని మేం గుర్తించాం.
ఇంధన వాణిజ్యంలో దృఢత్వం పట్ల మాకున్న ఉమ్మడి నిబద్ధతను మేం గుర్తిస్తున్నాం. నౌకల నిర్మాణంతో సహా దృఢమైన సముద్ర మౌలిక సదుపాయాలు రెండు దేశాల ఇంధన భద్రతను నిర్ధారించడంలో కీలకమని మేం గుర్తిస్తున్నాం. ఇంధన వనరుల సురక్షితమైన, నమ్మదగిన, సమర్థవంతమైన రవాణాకు మద్దతు ఇవ్వడంలో పటిష్ఠమైన, వైవిధ్యభరితమైన నౌకా నిర్మాణ వ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యతను మేం అంగీకరిస్తున్నాం.
ఈ నేపథ్యంలో భారత్, కొరియా (రిపబ్లిక్ ఆఫ్ కొరియా) కింది విషయాలకు కట్టుబడి ఉన్నాయి లేదా కృషి చేస్తున్నాయి
పరస్పరం స్థిరమైన, సురక్షితమైన, నమ్మదగిన ఇంధన వనరుల సరఫరాను నిర్వహించడం. ఇందులో నాఫ్తా, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల బహిరంగ వాణిజ్యాన్ని కొనసాగించేందుకు రెండు దేశాలూ ప్రయత్నిస్తాయి. మొత్తం ఇంధన విలువ పరిధిలో సహకరించుకుంటాయి.
ఎల్‌ఎన్‌జీ వినియోగించే దేశాల మధ్య మరింత సన్నిహిత సహకారాన్ని అన్వేషించడం.
నౌకానిర్మాణ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం. ఇందులో భారతదేశంలో ఓడరేవుల ఏర్పాటు, వాటి ఆధునీకరణ, మానవ వనరుల అభివృద్ధి, సాంకేతిక భాగస్వామ్యం వంటివి ఉన్నాయి. అయితే ఈ విషయంలో వీటికే వీటికి మాత్రమే పరిమితం కాదు.
మా ప్రజల భద్రత, శ్రేయస్సు ప్రయోజనం కోసం ప్రపంచ ఇంధన వనరుల సరఫరా గొలుసులు తెరిచి ఉండేలా చూడటంలో భాగస్వాములు కావాలని భారతదేశం, కొరియా ప్రాంతీయ భాగస్వాములకు పిలుపునిస్తున్నాయి.
***