Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇతర దేశాలకు చెందిన ఎన్నికల నిర్వహణ సంస్థలు/ఇంటర్ నేషనల్ ఏజెన్సీ లతో భారతదేశ ఎన్నికల సంఘం అవగాహన పూర్వక ఒప్పందం కుదుర్చుకొనేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ఎన్నికల నిర్వహణ మరియు పరిపాలన సంబంధ అంశాలలో సహకారానికి సంబంధించి ఇతర దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థలు/ఇంటర్ నేషనల్ ఏజెన్సీలతో భారతదేశ ఎన్నికల సంఘం అవగాహన పూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) కుదుర్చుకోవాలనే ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ‌ నరేంద్ర మోదీ అధ్యక్ష‌తన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆయా సంస్థలలో:

1) ఈక్వెడార్ లోని నేషనల్ ఎలక్టోరల్ కౌన్సిల్;

2) అల్బేనియా లోని కేంద్ర ఎన్నికల సంఘం;

3) భూటాన్ లోని ఎన్నికల సంఘం;

4) అఫ్గానిస్తాన్ లోని ఇండిపెండెంట్ ఎలక్ష‌న్ కమిషన్;

5) గినియాలోని నేషనల్ ఇండిపెండెంట్ ఎలక్టోరల్ కమిషన్;

6) మయన్మార్ లోని యూనియన్ ఎలక్ష‌న్ కమిషన్ మరియు

7) ది ఇండియా ఇంటర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్ష‌న్ మేనేజ్ మెంట్ (ఐఐఐడిఇఎమ్) మరియు ద ఇంటర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ (ఇంటర్ నేషనల్ ఐడిఇఎ) లు ఉన్నాయి.

ఈ ఎమ్ఒయు లలో- ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సంస్థాగత మరియు సాంకేతిక అభివృద్ధి తాలూకు విజ్ఞానాన్ని, అనుభవాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో; సమాచార మార్పిడిలో; సంస్థాగతమైన పటిష్టీకరణ ప్రక్రియలో; కెపాసిటీ బిల్డింగ్ లో, సిబ్బందికి శిక్ష‌ణలో; మరియు క్రమం తప్పక సంప్రదింపులు జరపడం తదితర అంశాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకొనే దిశగా అధికరణాలు/ఉప నిబంధనలు- చోటు చేసుకొంటాయి.

ఆయా ఎన్నికల నిర్వహణ సంస్థలకు సాంకేతిక సహాయాన్ని సమకూర్చడంలో ఈ ఎమ్ఒయులు తోడ్పడుతూ, ద్వైపాక్ష‌ిక సహకారాన్ని పెంచి పోషించగలుగుతాయి.

పూర్వరంగం:

కొన్ని విదేశాలతో మరియు సంస్థలతో భారతదేశ ఎన్నికల సంఘం ఎమ్ఒయులను కుదుర్చుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల సంబంధ అంశాలు మరియు ప్రక్రియల రంగంలో సహకారాన్ని పెంపొందింప చేయడంలో పాలుపంచుకొంటోంది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన భారతదేశ ఎన్నికల సంఘం ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి ఎన్నికల కసరత్తును నిర్వహిస్తూ వస్తోంది. విభిన్నమైన సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక నేపథ్యాలను కలిగివున్న దాదాపు 85 కోట్ల మంది ఓటర్లతో కూడిన సువిశాల దేశంలో ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్ష‌ికంగా నిర్వహించడం భారతదేశ ఎన్నికల సంఘం బాధ్యతగా ఉంది. ఇటీవలి కాలంలో భారతదేశ ఎన్నికల సంఘం పోషిస్తున్న పాత్ర దేశ ప్రజలను- మరింత అధిక స్థాయిలో- రాజకీయ వ్యవహారాలలో పాల్గొనేటట్లుగా చేస్తోంది. భారతదేశాన్ని ప్రస్తుతం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా పరిగణిస్తున్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం సాధించిన విజయం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి ఒక్క రాజకీయ వ్యవస్థ దృష్టిని ఆకర్షించింది.