పిఎంఇండియా
బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీల (ఎన్ బి ఎఫ్ సి ల)లో విదేశీ పెట్టుబడుల నియంత్రణకు సంబంధించిన నిబంధనలో సవరణ చేసే ప్రతిపాదనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తన ఆమోదాన్ని తెలియజేసింది.
ప్రస్తుతం ఎన్ బి ఎఫ్ సిలకు అమలులో ఉన్న ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్ మెంట్ (ట్రాన్స్ ఫర్ ఆర్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీ బై ది పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా) నిబంధనలలో ప్రతిపాదించిన సవరణ “ఇతర ఆర్థిక సేవల” లోకి విదేశీ పెట్టుబడులు ఆటోమేటిక్ రూట్ లో వచ్చేటందుకు వీలు కల్పిస్తుంది. అయితే, అటువంటి సేవలు ఏదైనా ఆర్థిక రంగ నియంత్రణ సంస్థల (ఆర్ బి ఐ, ఎస్ ఇ బి ఐ, పి ఎఫ్ ఆర్ డి ఎ వంటివి) నియంత్రణలో ఉండాలి. ఏ నియంత్రణ సంస్థల/ప్రభుత్వ ఏజెన్సీ నియంత్రణ లో లేని “ఇతర ఆర్థిక సేవల”లోకి విదేశీ పెట్టుబడులను మాత్రం అప్రూవల్ రూట్ ద్వారా తీసుకువచ్చేందుకు వీలు ఉంది.
అంతే కాకుండా, నియంత్రణ సంస్థలలో అనేకం కనీస మూలధనీకరణానికి సంబంధించిన నిబంధనలను ఇప్పటికే ఖరారు చేసినందువల్ల ఎఫ్ డి ఐ విధానంలో నిర్దేశించిన కనీస మూలధనీకరణం నిబంధనలను తొలగించడం జరిగింది. ఇది ఎఫ్ డి ఐ ని, ఆర్థిక సంబంధి కార్యకలాపాలను మరింత పుంజుకొనేటట్లు చేయగలదు. ఇది ఏ రాష్ట్రానికో / జిల్లాలకో పరిమితం కాకుండా యావత్తు భారతదేశానికి వర్తిస్తుంది.
పూర్వ రంగం :
”ఎన్ బి ఎఫ్ సి లకు నిర్దేశించిన 18 కార్యకలాపాలు కాక ఆర్థిక రంగ నియంత్రణ సంస్థల నియంత్రణలో ఉన్న ఇతర కార్యకలాపాలలో ఎఫ్ డి ఐ ని ఆటోమేటిక్ రూట్ లో అనుమతించడం జరుగుతుంది” అని మాన్య ఆర్థిక మంత్రి 2016-17 బడ్జెటు ఉపన్యాసంలో ప్రకటించారు. ‘బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీల’కు ప్రస్తుతం అమలవుతున్న నిబంధనలు కేవలం 18 నిర్దేశిత ఎన్ బి ఎఫ్ సి కార్యకలాపాలకు మాత్రమే ఎఫ్ డి ఐ ని ఆటోమేటిక్ రూట్ లో అనుమతించడం జరుగుతుందని, అయితే ఇందుకోసం ప్రత్యేకంగా పేర్కొన్న కనీస మూలధనీకరణం నియమాలను పాటించవలసి ఉంటుందని కూడా స్పష్టంచేస్తున్నాయి. ప్రతిపాదిత నిబంధనలలో, ఎఫ్ డి ఐ ని అన్ని ఇతర ఆర్థిక సేవలకు ఆటోమేటిక్ రూట్ లో అనుమతించడం జరుగుతుందని, అయితే ఇందుకోసం ఆయా సేవలు ఏదైనా నియంత్రణ సంస్థ (ఆర్ బి ఐ, ఎస్ ఇ బి ఐ, పి ఎఫ్ ఆర్ డి ఎ వంటివి) ల నియంత్రణలో ఉండాలి అని పేర్కొనడమైంది. అంతే కాక, ఎఫ్ డి ఐ విధానంలో భాగంగా ప్రస్తావించిన కనీస మూలధనీకరణం నియమాలను తొలగించడం జరిగింది; పలు నియంత్రణ సంస్థలు కనీస మూలధనీకరణం నియమాలను ఈసరికే ఖాయపరచడమే ఇందుకు దారి తీసింది.