Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇరాన్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ప్రసార మాధ్యమాలను ఉద్దేశించి చేసిన ప్రకటన

ఇరాన్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ప్రసార మాధ్యమాలను ఉద్దేశించి చేసిన ప్రకటన

ఇరాన్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ప్రసార మాధ్యమాలను ఉద్దేశించి చేసిన ప్రకటన


యువర్ ఎక్స్ లెన్సీ శ్రీ రూహానీ,

మిత్రులారా,

మీకు ఇవే నా కృత‌జ్ఞ‌త‌లు.

ఎక్స్ లెన్సీ మీ ఆప్యాయతకు, వివేకవంతమైన మాటలకు ధన్యవాదములు.

నాకూ, నా వెంట వ‌చ్చిన ప్రతినిధి బృందానికి అనుగ్రహపూర్ణమైన ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు కూడా నేను కృత‌జ్ఞ‌ుడిని. 125 కోట్ల మంది భార‌తీయుల త‌ర‌ఫున స్నేహ‌పూర్వకమైన ఇరాన్ ప్ర‌జానీకానికి నేను ఆత్మీయతతో కూడిన శుభాభినంద‌న‌లను తెలియ‌జేస్తున్నాను. పర్షియాకు చెందిన ఘనత, అంద చందాలు ప్ర‌పంచాన్ని త‌ర‌ త‌రాలుగా ఇరాన్ వైపు ఆక‌ర్షిస్తూ వచ్చాయి. ఇరాన్‌ ను సందర్శించడం నిజంగా నాకొక గొప్ప గౌరవం.

ఎక్స్ లెన్సీ,

భార‌త్‌, ఇరాన్ కొత్త మిత్రులేమీ కావు. చ‌రిత్ర ఎంత ప్రాచీనమైందో మ‌న స్నేహం అంత ప్రాచీనమైంది. శతాబ్దాల తరబడి మ‌న స‌మాజాలు క‌ళ‌లు, వాస్తుక‌ళ, ఆలోచ‌న‌లు, సంప్ర‌దాయాలు, సంస్కృతులు మరియు వాణిజ్యం.. వీటి సాయంతో పెనవేసుకొని ఉన్నాయి. మిత్రులుగాను, ఇరుగు పొరుగు వారి లాగాను మనం ఒకరి వృద్ధిలోను, సౌభాగ్యంలోను, సంతోషంలోను, విచారంలోను మరొక‌రం ప్రయోజనాలను పంచుకొంటున్నాం. 2001లో నా రాష్ట్రం గుజ‌రాత్‌ను భూకంపం గడగడలాడించిన‌ప్పుడు అండదండలు అందించడానికి ముందుకు వచ్చిన మొట్టమొదటి దేశాలలో ఇరాన్ కూడా కలసి ఉన్నద‌నే సంగ‌తిని మేం ఎప్పటికీ మ‌రచిపోలేము. అలాగే, ఇరాన్ ప్రజలకు వారి క‌ష్ట‌ కాలంలో తోడుగా నిలబడినందుకు భార‌తదేశం గ‌ర్విస్తోంది. దూర‌దృష్టితో కూడిన దౌత్య‌ నీతిని అనుసరిస్తున్న ఇరాన్ నాయకత్వాన్ని అభినందిస్తున్నాను.

ఎక్స్ లెన్సీ,

మ‌నం ఆఖరుగా 2015లో యుఫాలో భేటీ అయ్యాం. మీ నాయ‌క‌త్వం, భ‌విష్య‌త్ పట్ల మీకున్న స్పష్టత న‌న్ను ఎం తగానో ప్రభావితుడిని చేశాయి. ఇవాళ్టి స‌మావేశంలో మనం మన పూర్తి శ్రేణి ద్వైపాక్షిక సంబంధాల‌పైన దృష్టి సారించాం. ఇరు దేశాల‌కూ ఉమ్మడి ఆసక్తి కలిగిన ప్రాపంచిక అంశాల‌ పైనా, చోటు చేసుకొంటున్న ప్రాంతీయ ప‌రిస్థితుల‌ పైనా మనం మన అభిప్రాయాల‌ను పరస్పరం తెలియజేసుకొన్నాం. చర్చాంశాలు, మన భాగస్వామ్య పరిధి నిజంగా చెప్పుకోదగినటువంటిది. ఈ రోజు ఒనగూడిన పర్యవసానాలు, సంతకాలు చేసి కుదుర్చుకొన్న ఒప్పందాలు మన వ్యూహాత్మ‌క భాగస్వామ్యంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయి. మన ప్ర‌జ‌ల సంక్షేమం విస్తృత‌ ప్రాతిపదిక కలిగిన ఆర్థిక బంధాలకు మార్గదర్శనం చేస్తోంది. విస్తరించిన వ్యాపార బంధం, చమురు – గ్యాస్ రంగంలో రైల్వేల భాగస్వామ్యం, ఎరువులు, విద్య, సాంస్కృతిక రంగాలలో పెంపొందుతున్న అనుసంధానం మొత్తంమీద మన ఆర్థిక అనుబంధాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఇరాన్‌లోని చాబ‌హార్ ఓడరేవు, దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కోసం ఉద్దేశించిన ద్వైపాక్షిక ఒప్పందం, ఇందుకోసం భార‌తదేశం నుంచి లభించనున్న 500 మిలియ‌న్ యు ఎస్ డాల‌ర్లు ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ప్రధాన ప్ర‌య‌త్నం ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధికి ఊత‌ం అందించేదే. ఈ రోజు సంతకాలు జ‌రిగిన ఒప్పందాలను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా అమ‌లుపరచడానికి చ‌ర్య‌లు తీసుకోవడానికి మేం కట్టుబడివుంటాం.

మిత్రులారా!

ఈ రోజు ఇరాన్‌, భార‌తదేశం, అఫ్గానిస్తాన్‌ల ప్రాతినిధ్యంతో త్రైపాక్షిక రవాణా, రహదారి ఒప్పందంపై సంత‌కాలు చేయ‌బోతున్నాం. ఇది ఒక చ‌రిత్రాత్మ‌క సందర్భంగా నిల‌వ‌నుంది. ఇది భార‌తదేశం, ఇరాన్‌, అఫ్గానిస్తాన్‌లు ఒక దేశంతో మరొక దేశం పెనవేసుకోవడానికి కొత్త మార్గాల‌ను తెరుస్తుంది. ఈ ప్రాంతపు శాంతి, సుస్థిర‌త‌, సౌభాగ్యాలలో భార‌తదేశం, ఇరాన్ లు ఒక కీల‌క‌ పాత్రను పోషిస్తున్నాయి. అస్థిర‌తా శ‌క్తులు వ్యాప్తి చెందడం, విప్ల‌వ‌ వాదం, ఉగ్ర‌ వాదాల‌పై ఆందోళ‌న‌లను కూడా మనం పంచుకొన్నాం. సైబ‌ర్ నేరాలు, ఉగ్ర‌వాదం, విప్ల‌వ‌ వాదం, మాద‌క‌ ద్ర‌వ్యాల దొంగ ర‌వాణా లపై పోరాడడంలో క్రమం తప్పక స‌న్నిహితంగా సంప్ర‌దించుకొంటుండాల‌ని మనం అంగీకారానికి వచ్చాం. ప్రాంతీయ సంబంధి భద్రతపైనా, స‌ముద్ర సంబంధి భ‌ద్ర‌తపైనా మన ర‌క్ష‌ణ‌ సంస్థలు, భ‌ద్ర‌త సంస్థ‌ల మ‌ధ్య సమన్వయాన్ని పెంచుకోవడానికి కూడా మనం అంగీకారానికి వచ్చాం.

మిత్రులారా!

మన సంబంధాల గత చ‌రిత్ర ఎంతో ఘనమైనది. దీనిని ఇక ముందు కూడా మరింత సమున్నత స్థాయికి తీసుకు వెళ్లేందుకు అధ్య‌క్షుడు శ్రీ రూహానీ, నేను శాయశక్తులా కృషి చేస్తాం. మన స్నేహం ఈ ప్రాంతంలో సుస్థిర‌త‌కు ప్ర‌తీక‌గా ఉండగలదు. మన సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేటందుకు మరి కొద్ది సేపట్లో నేను గౌరవనీయ సర్వోన్నత నాయకుడితో భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నాను.

ఎక్స్ లెన్సీ శ్రీ రూహానీ,

మ‌న ఒప్పందాల‌లోని చర్చాంశాలను మునుముందుకు తీసుకువెళ్ళే క్ర‌మంలో భార‌తదేశానికి మీరు వస్తే మీకు స్వాగతం పలకడానికి నేను ఎదురుచూస్తుంటాను. మ‌నం ఇప్పుడు ఎక్క‌డున్నాం .. ఎక్క‌డికి చేరుకోగలమనేదానిపై శ్రీ గాలిబ్ రెండు పాదాల పద్యంలో ఎంతో అందంగా చెప్పడం జరిగింది. దీనితో నన్ను ఈ ప్రసంగాన్ని ముగించనివ్వండి.. :

जनूनत गरबे नफ्से-खुद तमाम अस्त

ज़े-काशी पा-बे काशान नीम गाम अस्त

[ దీనికి అర్థం : ఒక్క‌సారి మనం మన మ‌న‌సులో సంక‌ల్పం తీసుకొన్నామంటే, కాశీకి, కాశాన్‌కు మ‌ధ్య దూరం అర అడుగే అవుతుంది.. అని]

ఎక్స్ లెన్సీ ఇరాన్‌కు రమ్మని నన్ను ఆహ్వానించినందుకు మ‌రొక్కమారు నేను మీకు మ‌న‌సారా కృత‌జ్ఞ‌త‌లు తెలియజేస్తున్నాను.

మీ అంద‌రికీ నమస్కారములు.