Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈశాన్య మండలి సర్వ సభ్య సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం

ఈశాన్య మండలి సర్వ సభ్య సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం


నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (ఈశాన్య మండలి) సర్వ సభ్య సదస్సులో పాల్గొంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సమావేశానికి మీ అందరినీ ఆహ్వానించడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకొంటున్నాను. ఇక్కడ ఇప్పటికే జరిగిన చర్చలు, ఈ రోజు జరుగనున్న చర్చలు ఈశాన్య ప్రాంతం సత్వర అభివృద్ధికి సహాయకారి కాగలవని ఆశిస్తున్నాను.

ఈశాన్య ప్రాంతం అభివృద్ధిలో ఈశాన్య మండలి పాత్ర పట్ల నేను ఆనందం ప్రకటిస్తున్నాను. ఈశాన్య రాష్ట్రాలలో పలు ప్రాజెక్టులు ఏర్పాటు కావడంలోను, పలు ఇన్ ఫ్రా ప్రాజెక్టులు చేపట్టడంలోను ఈ మండలి పాత్ర అత్యంత కీలకం.

ఈశాన్య మండలిని 1972లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ఈ మండలి ఎంతగానో పాటు పడింది. నానాటికీ పెరుగుతున్న ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఈశాన్య మండలి ఇప్పుడు ఆత్మావలోకనం చేసుకుని లక్ష్యసాధనలో ఎంత మేరకు పురోగమించిందో కూడా మదింపు చేసుకోవలసిన అవసరం ఉంది. ఈశాన్య మండలిని మరింతగా విస్తరించి కొత్త దిశను నిర్దేశించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈశాన్య మండలిని తగినన్ని వనరులతో ఈశాన్య రాష్ట్రాలన్నింటికీ అత్యాధునిక సౌకర్యాలు గల రీసోర్స్ సెంటర్ గాను, మేధో, నైపుణ్యాల కేంద్రంగాను తీర్చి దిద్దే అంశం పరిశీలించడం అవసరం. ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, ప్రాజెక్టులను అమలు పరిచే సంస్థలు చేతిలో ఉన్నప్రాజెక్టులను సమర్థవంతంగా అమలుపరిచేందుకు, పరిశోధనా కార్యకలాపాలు, నవ్యతను ప్రోత్సహించేందుకు చక్కని ప్రణాళికలు రూపొందించేందుకు, ఈశాన్య ప్రాంతాలకు అవసరం అయిన వ్యూహాత్మక విధాన రూపకల్పనకు ఈ రీసోర్స్ సెంటర్ సహాయకారి కావాలి.

ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు రూపొందించే బాధ్యత ఉన్న కేంద్ర మంత్రిత్వ శాఖలు, సంబంధిత రాష్ట్రాలు సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు ప్రత్యేక నైపుణ్యాలు గల ఏజెన్సీ తరహా వ్యవస్థ ఒకటి కావాలని ఈశాన్య రాష్ర్ట మండలి ఆశిస్తూ ఉండవచ్చు. సత్పరిపాలన, అత్యుత్తమ ప్రమాణాల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు, ఔత్సాహిక పారిశ్రామిక ధోరణులు, వెంచర్ ఫండ్ లు, స్టార్టప్ లు, నైపుణ్యాల అభివృద్ధి వంటి అంశాలన్నింటి పైన దృష్టి పెట్టే విషయం ఈశాన్య మండలి పరిశీలించాలి. ఈ చర్యల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

“యాక్ట్ ఈస్ట్ పాలసీ” పేరిట అమలులో ఉన్నప్రత్యేక విధానం కింద ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తున్నదని ప్రధాని ప్రకటించారు. ఇందులో భాగంగా రైలు, రోడ్డు, టెలికాం, విద్యుత్, జలమార్గాల కనెక్టివిటీ ద్వారా ఈశాన్య రాష్ట్రాల దూరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు.

దేశంలోని పశ్చిమ ప్రాంతం, ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందగా లేనిది ఈశాన్య ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏదీ తనకు కనిపించడంలేదని ప్రధాని అన్నారు. ఈశాన్యంతో పాటు అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందినప్పుడే భారత్ పురోగమనం సాధ్యమని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. వ్యూహాత్మకంగా కూడా ఈశాన్య ప్రాంతం మనకి అత్యంత కీలకం. అందుకే ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి గట్టిగా కృషి చేసి ఈ ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకు దీటుగా నిలపాలన్నది నా నమ్మకం.

వర్తమాన బడ్జెట్లో కూడా ఈశాన్య ప్రాంతానికి 30 వేల కోట్ల రూపాయలు పైగా కేటాయించాం. ఈ సొమ్ము ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి పూర్తిగా ఉపయోగపడేలా చూడాల్సిన బాధ్యత మనందరిదీ.

సహకార, పోటీ ఫెడరలిజంను మేం ప్రగాఢంగా విశ్వసిస్తాం. ఇప్పటికే బలంగా ఉన్న రాష్ట్రాలు మరింత శక్తివంతంగా ఎదిగేందుకు అవసరమైన అధికారం, వనరుల కల్పన అత్యంత అవసరం. అదే సమయంలో శక్తివంతంగా లేని రాష్ట్రాల అభివృద్ధికి కూడా అవసరమైన చేయూత అందించాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర నిర్వహణలోని ప్రధాన పథకాలకు 90:10 నిష్పత్తిలోను, సాధారణ పథకాలకు 80:20 నిష్పత్తిలోను నిధులు కేటాయించే విధానం కొనసాగించాలని నిర్ణయించాం.

ఇటీవల కాలంలో అస్సాంలో రెండు ప్రధాన ప్రాజెక్టులు – బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్, నుమాలిగఢ్ రిఫైనరీకి చెందిన వాక్స్ యూనిట్లను ప్రారంభించాం. ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా ఉపాధి అవకాశాలు కల్పించే పెద్ద ప్రాజెక్టులు ఇవి. ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఎన్నో సంవత్సరాల వ్యవధి పట్టింది. వ్యయ భారం పెరిగిపోకుండా సకాలంలో మనం ప్రాజెక్టులు పూర్తి చేయగలగాలి. అప్పుడే ఆ ప్రాజెక్టుల పూర్తి ప్రయోజనం మనకు లభిస్తుంది.

ఆగ్నేయాసియాకు ముఖ ద్వారం ఈశాన్యం. ఈ అవకాశాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఈశాన్యం ద్వారా మనం పొరుగు దేశాలకు రోడ్డు, రైలు మార్గాలు తెరుస్తున్నాం. ఈశాన్య ప్రాంతం ఆర్థికాభివృద్ధికి ఇది ఉత్తేజం ఇస్తుంది.

ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక రహదారులు నిర్మించేందుకు “నేషనల్ హైవేస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్” పేరిట ఒక సంస్థను 2014 జూలై 18న ఏర్పాటు చేశాం. ఆ తర్వాత ఆ సంస్థ ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ ఒక్కో బ్రాంచి కార్యాలయం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ సంస్థ 1001 కిలోమీటర్ల నిడివి గల 34 రహదారులు 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తోంది.

ఈశాన్య ప్రాంతంలో రోడ్లు నిర్మించే సమయంలో దీనికి సంబంధించిన భౌగోళిక, వాతావరణ ప్రత్యేక లక్షణాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఈశాన్య రాష్ట్రాల్లో అధిక ప్రాంతాల్లో వర్షపాతం అధికం. అలాగే ప్రకృతి వైపరీత్యాలు, కొండచరియలు విరిగి పడడం పరిపాటి. ఈ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్ల నిర్మాణంలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాలు ఉపయోగించాల్సి ఉంటుంది.

బంగ్లాదేశ్ సహకారంతో ఈశాన్య ప్రాంతాల్లో మరింత మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రాజెక్టును ఇటీవల చేపట్టాం. ఈ ప్రాజెక్టు వల్ల ఈశాన్య ప్రాంతం యావత్తుకు 10 జిబి ప్రత్యామ్నాయ నిరంతరాయ ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ అందుబాటులోకి వస్తుంది. ఇది ఈశాన్య ప్రాంతానికి ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది.

ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లోను విద్యుత్ ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టుల్లో ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్రాజెక్టుల విలువ పది వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో మరిన్ని ప్రాంతాలకు విద్యుత్ సదుపాయం లభిస్తుంది. ఇటీవలే ప్రారంభించిన బిశ్వనాథ్-చరియాలి-ఆగ్రా ట్రాన్స్ మిషన్ లైన్ వల్ల ఈశాన్య ప్రాంతానికి అదనంగా 500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది.

పది వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రైల్వే శాఖ ఈ ప్రాంతంలో భారీ విస్తరణ చేపట్టింది. 2014 నవంబర్ లో అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ తొలి సారిగా రైల్వే చిత్రపటంలోకి వచ్చాయి. త్రిపురకు చెందిన అగర్తలకు బ్రాడ్ గేజ్ కనెక్టివిటీ ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ త్వరలోనే రైల్వే చిత్రపటంలో కనిపించేలా చేసే దిశగా మేం ముందడుగు వేస్తున్నాం.

గత రెండేళ్ళ కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో 900 కిలోమీటర్ల నిడివి గల బ్రాడ్ గేజ్ రైల్వేలైన్లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కేవలం 50 కిలోమీటర్ల మీటర్ గేజ్ మార్గాలు మాత్రమే ఉన్నాయి. 2016-17 నాటికి అవి కూడా బ్రాడ్ గేజ్ గా మారిపోతాయి. ఇది కాకుండా 132 కిలోమీటర్ల నిడివి గల మూడో ప్రత్యామ్నాయ కనెక్టివిటీ రూట్ (న్యూ మైనాగురి-జోగిఘోపా మధ్య) కూడా ప్రారంభమయింది.

ఈశాన్య ప్రాంతానికి ఎన్నో బలాలున్నాయి. ఈ ప్రాంతం చక్కగా అభివృద్ధి చెందడానికి వాటన్నింటినీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాల్సి ఉంది. ఈశాన్య రాష్ట్రాలన్నింటికీ చక్కని ప్రకృతి సౌందర్యం, చారిత్రక సంస్కృతి, ప్రాంతీయ వారసత్వ సంపద ప్రత్యేకతలు. ఇవన్నీ ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధికి చక్కని అవకాశాలు కల్పిస్తున్నాయి. పర్వతారోహణ, ట్రెక్కింగ్, సాహసయాత్రలకు చక్కని అవకాశం ఉంది. వీటిని ప్రోత్సహించి అభివృద్ధి చేసినట్టయితే ఈ ప్రాంతంలో అధిక ఉపాధి అవకాశాలు కల్పించగల రంగం ఇదే అవుతుందనడంలో సందేహం లేదు. ఈశాన్య ప్రాంతాల వృద్ధకి, ఆదాయాల వృద్ధికి కూడా ఇది దోహదపడుతుంది.

ఈశాన్య ప్రాంతాల్లోఒక థీమాటిక్ సర్క్యూట్ ను కూడా టూరిజం మంత్రిత్వ శాఖ గుర్తించిందని నాకు తెలిసింది. టూరిజం సర్క్యూట్లను గుర్తించడం ద్వారా ప్రపంచ పర్యాటకులందరినీ ఆకర్షించేందుకు రూపొందించిన స్కీమ్ ను ఈశాన్య రాష్ట్రాలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటాయని నేను భావిస్తున్నాను. పొరుగు దేశాల్లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలను తమ టూరిజం సర్క్యూట్లతో అనుసంధానం చేసే అంశం కూడా ఈశాన్య ప్రాంతం పరిశీలించవచ్చు. పర్యాటకులకు ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ కూడా అవుతుంది.

ఈశాన్య ప్రాంతాల్లోని యువతలో ఎక్కువ మంది ఆంగ్ల భాష మాట్లాడతారు. మరింత మెరుగైన కనెక్టివిటీ, భాషా నైపుణ్యాల ద్వారా ఈశాన్యంలో బిపిఓ పరిశ్రమను ఏర్పాటు చేసే విషయం కూడా పరిశీలించవచ్చు.

డిజిటల్ ఇండియాలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు పెంచేందుకు దోహదపడే బిపిఓ ప్రోత్సాహక పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఈశాన్య రాష్ట్రాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమతమ రాష్ట్రాల్లో బిపిఓ ఆచరణీయం చేయాల్సిన అవసరం ఉంది. ఇది వృద్ధికి ఊతం ఇవ్వడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి తెస్తుంది.

ఎన్నో విదేశీ ఫలాలు, పూలు, కూరగాయలు, సుగంధ పరిమళాలు వెదజల్లే మొక్కలు, ఓషధులకు ఈశాన్య ప్రాంతాలు పుట్టినిల్లు. ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టినట్టయితే ఈ ప్రాంతానికి అది మరింతగా ఉపయోగపడుతుంది.

కొద్ది నెలల క్రితం నేను సిక్కింను దేశంలోనే తొలి సేంద్రియ రాష్ర్టంగా ప్రకటించే కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈశాన్య ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయం అభివృద్ధిలో ఈశాన్య మండలి కీలక పాత్ర పోషించాలి. ఈశాన్య ప్రాంతం దేశానికే ఆర్గానిక్ ఆహార అక్షయపాత్ర కావాలి. దేశంలో ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఇక్కడ ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించినట్టయితే ఈ ప్రాంత ప్రజల ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయి.

ఈశాన్య రాష్ట్రాల్లో గ్రామీణ జనాభా అధిక సంఖ్యలో ఉంది. ఒక్క అస్సాంనే తీసుకున్నా 86 శాతం మంది జనాభా గ్రామీణులే. క్లస్టర్ నమూనాలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థిక, సామాజిక పరివర్తన తీసుకువచ్చేందుకు శ్యామ ప్రసాద్ ముఖర్జీ మిషన్ ను ప్రభుత్వం ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల సంపూర్ణ అభివృద్ధికి ఉద్దేశించిన ఈ మిషన్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం ఈశాన్య రాష్ట్రాల బాధ్యత.

షిల్లాంగ్ లో ఈ సర్వ సభ్య సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు ఈశాన్య మండలి చైర్మన్ ను, సభ్యులను నేను అభినందిస్తున్నాను.

ఈ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినందుకు మేఘాలయ గవర్నర్ కు, ముఖ్యమంత్రికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సదస్సులో జరిగిన చర్చలు ఈ ప్రాంత అభివృద్ధికి ఒక దిశను నిర్దేశిస్తాయన్నది నా ప్రగాఢ విశ్వాసం.

కృతజ్ఞతలు…