పిఎంఇండియా
ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి (యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషియల్ కౌన్సిల్.. ఈసీఓఎస్ఓసీ) 70 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని న్యూయార్క్ సిటీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించారు.
ప్రధాని ప్రసంగ పాఠం ఇలా ఉంది.
ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక మండలి (ఈసీఓఎస్ఓసీ) అధ్యక్షుడు, ప్రముఖులు, లేడీస్ అండ్ జెంటిల్ మన్..
ఆర్థిక, సామాజిక మండలి 70 వ వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతూ నన్ను ఆహ్వానించినందుకు ఈసీఓఎస్ఓసీ సంస్థ అధ్యక్షుడికి కృతజ్ణతలు తెలియజేస్తున్నాను.
ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సభ్యులందరికీ శుభాకాంక్షలు అందజేస్తున్నాను.
ఐక్యరాజ్యసమితి నిర్మాణంలో ఓ కీలక స్తంభం లాంటిది ఈసీఓఎస్ఓసీ.
దీనిని ఐక్యరాజ్యసమితిలో ఒక నిర్దిష్ట అంగంగా ఏర్పాటు చేయడం ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపకులు కలలు గన్న సమగ్ర అభివృద్ధికో నిదర్శనం.
శాంతియుతమైన, సంపన్నమైన ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి మనం అన్నింటి కన్నా ముందుగా నెరవేర్చవలసిన విధులలో సత్వర సామాజిక, ఆర్థికాభివృద్ధి కి అనువైన పరిస్థితులు, మానవుల స్థితి గతులలో మెరుగుదల, ఆకలి, వంచనలకు ముగింపు పలకడం వంటివి లెక్కకు వస్తాయి.
ప్రముఖులారా..
ఈ సంస్థ ను ఏర్పాటు చేయడంలో పాలుపంచుకోవడం భారత్ కు గర్వకారణం.
భారత దేశ పౌరులలో ప్రముఖుడు ఆర్కాట్ రామస్వామి మొదలియార్ ఐక్యరాజ్యసమితి ఆర్థిక , సామాజిక మండలి నిర్మాతలలో ప్రముఖ పాత్ర ను పోషించారు.
1946 లో జరిగిన ఈసీఓఎస్ఓసీ ప్రారంభ సదస్సులో ఈసీఓఎస్ఓసీ కి మొట్టమొదటి అధ్యక్షుడిగా సేవ చేసే ప్రత్యేక అధికారం ఆయనకు దక్కింది.
ఈసీఓఎస్ఓసీ మొదటి సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ, రానున్న కాలంలో ఎటువంటి భూమికను ఈసీఓఎస్ఓసీనిర్వహించాలో నిర్వచించారు.
ఆయన ఏమన్నదీ ఆయన మాటల్లోనే చెప్పాలంటే.. “సంక్లిష్టమైనవిగా ఉండే ఆర్థిక పరమైన చిక్కు సమస్యల ముడి విడదీయడంలో కౌన్సిల్ ప్రదర్శించాల్సిన ప్రతిభపైనే భావి ప్రపంచానికి తగిన భద్రత, శాంతి ఆధారపడతాయి”.
కాబట్టి ఈసీఓఎస్ఓసీ విధులు, మరీ ముఖ్యంగా మనుషుల స్థితిగతులను మెరుగుపరచడంలో అది అనుసరించే పద్ధతి, అందరూ గౌరవంగా జీవించేందుకు పూచీ పడటానికి ఈసీఓఎస్ఓసీ చేసే కృషి యే ఐక్యరాజ్య సమితి అజెండాలోకెల్లా ప్రధానాంశం అవుతుందన్న మాట.
ఈసీఓఎస్ఓసీ ఏర్పడి 70 ఏళ్లు అయింది. 21 వ శతాబ్దంలోకి మనం అడుగుపెట్టి 15 సంవత్సరాలైంది. మరి ఈసీఓఎస్ఓసీ తన వ్యవస్థాపకుల అంచనాలను నెరవేర్చగలిగిందా?
ఈ 70 ఏళ్ల లో, మనం ఎంతో ప్రగతిని సాధించాం. అయినా, దారిద్ర్య నిర్మూలన అనేది 20 వ శతాబ్దంలో పూర్తి కాని ఒక గొప్ప పనిగా మిగిలిపోయింది. ఐక్యరాజ్యసమితి ఇంకా సాధించని అత్యంత ముఖ్యమైన లక్ష్యం కూడా ఇదే.
ప్రముఖులారా..
ఈసీఓఎస్ఓసీ 70 వార్షికోత్సవం తగిన సమయంలోనే మనముందుకు వచ్చింది.
అభివృద్ధి విషయంలో ఒక సమగ్ర విజన్ ను అంతర్జాతీయ సమాజం తన ముందు ఉంచుకొన్నది.
‘నిలకడైన అభివృద్ది కోసం 2030 అజెండా’ ఐక్యరాజ్యసమితి వ్యవస్థలకు వాటి స్థాపన ఉద్దేశాలు, వాటి పాత్ర పై పునరాలోచన చేసుకోవడానికి ఒక అమూల్య అవకాశాన్ని అందిస్తోంది. ఈ సవాలును స్వీకరించడానికి, ఈ అజెండాను విజయవంతంగా ముగించడానికి సంసిద్ధం కావలసిన బాధ్యత ఈసీఓఎస్ఓసీ దే.
2030 అజెండా పేద దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లకు ప్రతిబింబం.
అభివృద్ధి చెందిన దేశాలు పేదరికానికి, ఆకలికి ముగింపు పలకడమే కాదు, మరింత మంచి జీవనం కావాలని కోరుకుంటున్న మన ప్రజల న్యాయమైన ఆకాంక్షలను కూడా నెరవేర్చవలసి ఉంది. ఈ కర్తవ్యాన్ని మనం భూగోళానికి, పర్యావరణానికి కీడు వాటిల్లని రీతిలో పాలించాల్సి ఉంది.
మరో పక్క, అభివృద్ధి చెందిన దేశాలు సైతం తమ తమ ఆర్థిక వ్యవస్థలను సుస్థిరమైన బాటలో మరింత వేగంగా పయనించేలా, మేలైన జీవన శైలులను అనుసరించేలా చూసుకోవలసిన భారీ బాధ్యతలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులను, సాంకేతిక విజ్ఞానాన్ని అందజేస్తూ ఆదుకోవలసిన బాధ్యతను కూడా వహించాల్సి ఉంది.
అంతే కాదు, అదే సమయంలో మన వద్ద అపారమైన వనరులు ఉన్నాయి. మనకు ఇదివరకు ఆలోచనకు కూడా సాధ్యం కాని పరిష్కారాలను నేటి సాంకేతికత మనకు అందిస్తోంది.
అందుబాటులో ఉన్న వనరులను, సాంకేతిక
విజ్ఞానాన్ని మనను చుట్టుముట్టిన తక్షణ సమస్యలను పరిష్కరించడానికి వినియోగించడమే మన ముందు నిలచిన సవాలు.
దీనిని ఒక అవకాశంగా చూడమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. కౌన్సిల్ కు పునరుత్తేజాన్ని ప్రసాదించడానికి, దానిని మరింత కార్యసాధకంగా మలచటానికి, మన ప్రజల అవసరాలకు, కోరికలకు మరింత చురుగ్గా ప్రతిస్పందించేలా చేయడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
పేదలలోకెల్లా పేదలైనవారి సంక్షేమం అన్నదొక్కటే ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంలో ఈసీఓఎస్ఓసీ కి మార్గదర్శకంగా నిలవాలి. దీనినే భారతదేశ ఆలోచనావిధానం ‘అంత్యోదయ’ అంటోంది.
ప్రపంచంలో పేదరికం ఉన్నంత కాలం, మన ప్రజలు కనీస సదుపాయాలకు, స్వేచ్ఛకు, మౌలిక హక్కులకు, అవకాశాలకు నోచుకోనంత కాలం.. ఈసీఓఎస్ఓసీ బాధ్యత పూర్తి కానట్లే.
ఈసీఓఎస్ఓసీ ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపకుల కలలను సాకారం చేయగలుగుతుందన్న నమ్మకం నాకుంది.
మీకు ఇవే నా ధన్యవాదాలు.
Happening now: PM @narendramodi addressing ECOSOC. Watch. https://t.co/Sakjbw8j25
— PMO India (@PMOIndia) January 22, 2016
Highlighted ECOSOC's importance in @UN structure, its role today & India's association with it during my address. https://t.co/IDGIowmvkt
— Narendra Modi (@narendramodi) January 23, 2016