పిఎంఇండియా
ఉగ్రవాదం మరియు వ్యవస్థీకృత నేరాల తాలూకు అన్ని రూపాలతో పోరాడేందుకు భారతదేశం, రష్యా ల మధ్య సహకారానికి సంబంధించిన ఒక ఒప్పంద పత్రంపై సంతకాలు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
హోం శాఖ మంత్రి నాయకత్వంలో ఒక భారతీయ ప్రతినిధి వర్గం 2017 నవంబర్ 27 – 29 తేదీల మధ్య రష్యా లో పర్యటించనున్న సందర్భంలో ఈ ప్రతిపాదిత ఒప్పందపత్రంపై సంతకాలు జరగాలన్న ప్రతిపాదన ఉంది.
పూర్వరంగం:
పరస్పర ప్రయోజనాలు ముడిపడి ఉన్న అంశాలపై అంతర్జాతీయ వేదికలలో సన్నిహితంగా సహకరించుకొనే సుదీర్ఘ చరిత్ర భారతదేశానికి మరియు రష్యా కు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, ఇంకా వ్యవస్థీకృత నేరాలు పెచ్చు పెరుగుతున్న కారణంగా ఉగ్రవాదం యొక్క అన్నిరూపాల పైనా పోరాటం చేయడం కోసం దేశాలు కలిసి పని చేయడం అనివార్యం అయిపోయింది. 1993 అక్టోబర్ లో కుదిరిన ఒప్పందం స్థానంలో, ప్రతిపాదిత ఒప్పందం అమలులోకి రానుంది. భద్రత రంగంలో సిద్ధించినటువంటి ప్రయోజనాలను ఏకీకృతం చేసుకొనే దిశగా ఈ ప్రతిపాదిత ఒప్పందం ఒక ముందంజ అవుతుంది. అంతేకాదు, కొత్త మరియు రూపుదాల్చుతున్నటువంటి రిస్కులతోను, బెదరింపులతోను సంయుక్తంగా పోరు సల్పేందుకు కూడా ఉద్దేశించిందే ఈ ప్రతిపాదిత ఒప్పందం. సమాచారాన్ని, ప్రావీణ్యాన్ని మరియు ఉత్తమమైన పద్ధతులను పంచుకోవడం, ఇంకా మార్పిడి చేసుకోవడం ద్వారా భారతదేశం మురియు రష్యా ల మధ్య సంబంధాన్ని మరింత పటిష్ట పరచుకోవడం కోసమే కాకుండా ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని అరికట్టడంలో, భద్రతను పెంపొందించడంలో కూడా ఈ ఒప్పందం తోడ్పడనుంది.