పిఎంఇండియా
వరిష్ఠ నేతలారా…..
ఉగ్రవాదమనేది మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు. సంక్షోభ ప్రాంతాల నుంచి మొదలుకొని సుదూర పట్టణాల్లోని వీధుల్లోనూ ఉగ్రభూతం మారణహోమం సృష్టిస్తోంది. ఉగ్రవాద పురాతన కట్టడాలింకా అలాగే ఉన్నాయి. ఇంకా కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని తమ విదేశాంగ విధానంలో పావుగా వాడుకుంటున్నాయి.
అయితే ఉగ్రవాద స్వరూపం మారుతున్న తీరు కూడా మన కళ్ళముందే కనిపిస్తోంది. అంతర్జాతీయ బంధాలు, ఉగ్రగ్రూపుల గొలుసుకట్టు సహకారం, ఉగ్రవాద ప్రచారానికి, కొత్తవారిని బుట్టలో వేసుకొని తమ సంస్థల్లో నియమించుకోవటానికి సైబర్ స్పేస్‌ను ఉపయోగించుకోవటం చూస్తునే ఉన్నాం.
ప్రజాబాహుళ్య సమాజాలకు కొత్త సవాలు ఎదురవుతోంది. అదే గడ్డపై నియమించుకొని అదే సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. మన ప్రపంచ భద్రత కార్యాచరణ మరో శకం కోసం, ఇతరత్రా సవాళ్ళ కోసం నిర్వచించబడింది. ఉగ్రవాదంపై పోరాడటానికి మనకో సమగ్ర అంతర్జాతీయ వ్యూహమంటూ లేదు. ఉన్న వాటినీ ఆచితూచి వాడుతున్నాం.
వరిష్టులారా…! మనం ఎదుర్కొంటున్న ముప్పుకంటే కూడా ఆ ముప్పుకు మనం ఎలా స్పందిస్తున్నామన్నది ప్రధానం.
ఉగ్రభూతంపై ప్రపంచమంతా ముక్తకంఠంతో మాట్లాడాలి. కలసికట్టుగా చర్యలు తీసుకోవాలి. ఇందులో రాజకీయ శషబిషలకు స్థానం లేదు. ఉగ్రవాద గ్రూపుల మధ్య గానీ, దేశాల మధ్యగానీ మనం తేడా చూపించాల్సిన అవసరం లేదు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే, ప్రోత్సహించే వారిని ఏకాకులను చేద్దాం. మనం నమ్మే మానవత్వపు విలువలను పంచుకునేవారికి అండగా నిలుద్దాం. ఉగ్రవాద సవాల్‌ను ఎదుర్కోవటానికి అవసరమైన అంతర్జాతీయ న్యాయ కార్యాచరణ ప్రణాళికను పునర్‌నిర్మించుకోవాల్సిన అవసరముంది. ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణమే ఉగ్రవాదంపై అంతర్జాతీయ తీర్మానం చేయాలి. ఇంటెలిజెన్స్, ఉగ్రవాదాన్ని అణచివేసే చర్యల్లో అంతర్జాతీయ పరస్పర సహకారం పెంచుకోవాలి. ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరాను అడ్డుకునే ప్రయత్నాలను మరింత బలోపేతం చేయాలి. ఉగ్రవాద ఉద్యమాలను దెబ్బతీసి, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందజేసేవారిని మట్టుపెట్టాలి.
మన సైబర్‌స్పేస్‌ను రక్షించుకునేలా పరస్పర సహకారం అందించుకోవటంతోపాటు ఉగ్రవాద పనులకు ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల వాడకం తగ్గేలా చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదంపై సామాజిక ఉద్యమం రూపొందించేందుకు మతగురువులు, మేథావులులను భాగస్వాములను చేయాలి. ముఖ్యంగా యువతరం ఉగ్రవాదంవైపు అడుగులు వేయకుండా ఈ చర్యలు అవసరం. ఏదేశాల్లోనైతే ఈ సమస్య ఎక్కువుందో అక్కడిది అవసరం. ఉగ్రవాదాన్ని మతాన్ని వేరు చేసి చూసి, ఉగ్రవాదం వైపు వెళుతున్న వారిని ఆపటానికి అంతా కలసి కట్టుగా కృషి చేయాలి. అంతేగాకుండా పశ్చిమాసియా, ఆఫ్రికాల్లో శాంతి, సుస్థిరతలను ప్రోత్సహించటం చాలా అవసరం. ప్రస్తుత శరణార్థుల సమస్యను పరిష్కరించటానికి కూడా ఇది అవసరం.
వరిష్టులారా….!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60 మిలియన్ల మంది రక్షణ కోరుతున్నారు. పశ్చిమాసియా సంక్షోభం సృష్టించిన ఈ మానవత్వపు సవాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సాయానికి ముందుకొచ్చే దేశాలపై విస్తృత ప్రభావం కూడా ఉంటోంది. శరణార్థులను ఆదుకోవటానికి తమ సరిహద్దులను తెరచి, రక్షణనిచ్చిన దేశాలకు కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సవాలను ఐక్యరాజ్యసమితి బలంగా ఎదుర్కోవటానికి వీలుగా మనం ఓ దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది.