పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో తలెత్తిన కరవు, నీటి ఎద్దడి పరిస్థితులపై ఈ రోజు ఏర్పాటైన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ అఖిలేశ్ యాదవ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి చర్చను ప్రారంభిస్తూ, కరవు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయాలన్నారు. కరవు నివారణకు తీసుకోవలసిన మధ్యకాలిక, దీర్ఘకాలిక పరిష్కారాలపైన దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
జల వనరులను పరిరక్షించేందుకు, భూగర్భ జల మట్టాలు పెరిగేందుకు వీలుగా తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకొనేందుకు రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ ఇమేజింగ్ ల వంటి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకోవాలని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. శాస్త్రీయ సలహాలకు అనుగుణంగా పంటల సాగును మార్చుకోవలసిన అవసరం ఉందన్నారు. నీటిని సమర్ధంగా ఉపయోగించుకొనేందుకు బిందు సేద్యం, తుంపర సేద్యం వంటి పద్ధతులను వినియోగించాలని, ఫెర్టిగేషన్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. మెరుగైన నీటి నిర్వహణ కోసం ప్రజలందరూ నడుం కట్టాలని, మరీ ముఖ్యంగా మహిళలు కొంగు బిగించి ఇందులో పాలు పంచుకోవాలని ప్రధాన మంత్రి చెప్పారు. పట్టణ ప్రాంతాలలోని వ్యర్థ జలాలను శుద్ధి చేసి, చుట్టుపక్కల ప్రాంతాలలో వ్యవసాయానికి ఉపయోగించాలని కూడా ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. నీటి ఎద్దడి ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా చేసే నీటి సరఫరాను జి పి ఎస్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
వర్షాకాలం వచ్చే లోపల.. మిగిలిన సమయాన్ని .. జల సంరక్షణ, భూగర్భ జల మట్టాల పెంపుదల సంబంధిత చర్యలకు ఉపయోగించుకొని ఎంత ఉత్తమమైన ప్రయాసలు చేయవచ్చు అన్నదానిపై సమావేశంలో చర్చించారు. జల వనరులలో పూడికల తొలగింపు, నదుల రీచార్జింగ్, చెక్ డ్యాముల నిర్మాణం, ఇతరత్రా నీటి నిల్వ విధానాలు సమీక్షలో చోటు చేసుకొన్నాయి.
కరవు పరిస్థితుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యలను గురించి ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. వీటిలో.. బుందేల్ ఖండ్ లో తాగు నీటి అందజేత, అవసరమైన వారికి ఆహారం, ఉపాధి, పశువులకు నీరు, దాణా సరఫరా లతో పాటు మధ్య కాలిక, దీర్ఘ కాలిక ప్రాతిపదికన అనుసరిస్తున్న చర్యలు.. ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్రంలో ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ అమలుకు అవసరమైన ప్రాథమిక చర్యలు చేపట్టినట్లు కూడా ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు వంటి 78,000 జల వనరులను పునరుధ్ధరించడానికి, ఒక లక్ష కొత్త జల వనరుల, ఇతర నిర్మాణాల కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను గురించి రాష్ట్ర ప్రభుత్వం సమావేశంలో వివరించింది. ఎమ్ ఎన్ ఆర్ జి ఎ, ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన ల వంటి పథకాల నిధులను వినియోగించుకోవడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తారు.
జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్ డి ఆర్ ఎఫ్ ) కింద రూ.934. 32 కోట్లు రాష్ట్రానికి విడుదల చేశారు. ఇది రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్ డి ఆర్ ఎఫ్) లో కేంద్ర ప్రభుత్వ వాటాగా విడుదల చేసిన రూ.506.25 కోట్లకు అదనం. 2016-17 సంవత్సరానికిగాను ఎస్ డి ఆర్ ఎఫ్ ఒకటో వాయిదా కింద మరో రూ. 265.87 కోట్లు విడుదల చేయడం జరిగింది.
2015-16 రబీ కి సహాయం చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం 2016 మే 5వ తేదీన మరొక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించింది. ప్రక్రియ పూర్తి చేసి, ఎటువంటి జాప్యానికి తావు ఇవ్వకుండా సహాయాన్ని అందజేయాలని ప్రధాన మంత్రి ఆదేశించారు.
బుందేల్ ఖండ్ ప్యాకేజి కింద నిధుల విడుదలకు ఇప్పటికే చేపట్టిన చర్యలను గురించి నీతి ఆయోగ్ కూడా వివరించింది.
ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రధాన మంత్రి కి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. నీటి కొరత వల్ల ప్రజలు.. ముఖ్యంగా బుందేల్ ఖండ్ ప్రాంతంలోని ప్రజలు.. తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇది ఒక శుభ పరిణామమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయాలనే తీర్మానంతో ఈ సమావేశం ముగిసింది.
Had a productive meeting with UP CM @yadavakhilesh on the drought situation in various parts of UP. @CMOfficeUP pic.twitter.com/1pJKedMPbK
— Narendra Modi (@narendramodi) May 7, 2016
The various drought mitigation measures undertaken in the state were discussed extensively in the meeting.
— Narendra Modi (@narendramodi) May 7, 2016
CM @yadavakhilesh & I discussed the need to effectively utilise the period before monsoon for water recharge and conservation efforts.
— Narendra Modi (@narendramodi) May 7, 2016
Usage of latest technology & community participation, particularly of our Nari Shakti can play a key role in effective drought management.
— Narendra Modi (@narendramodi) May 7, 2016