పిఎంఇండియా
ఉత్పాదక వస్తువుల రంగంలో ‘భారత్‌లో తయారీ’ (మేకిన్ ఇండియా) ని అమలు చేసేందుకు గాను భారత్, జర్మనీల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి (ఎంఓయూ) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మేకిన్ ఇండియా కార్యక్రమ అమలుకు ఉద్దేశించి భారత భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, జర్మనీలోని ప్రముఖ సంస్థ ఫ్రాన్‌హోఫర్ గెసెల్లెషాఫ్ట్ (ఫ్రాన్‌హోఫర్)తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. యూరప్‌లో అప్లయిడ్ ఇండస్ట్రీస్ పరిశోధనకు సంబంధించిన 65 సంస్థలతో కూడిన సంస్థే ఈ ఫ్రాన్‌హోఫర్.
పన్నెండో పంచవర్ష ప్రణాళికలో భాగంగా భారత్‌లోని వివిధ ప్రభుత్వరంగ సంస్థలు, ఉత్పాదక వస్తువుల రంగాల సాంకేతికతల్లో లోటుపాట్లను మెరుగుపర్చటంలో ఫ్రాన్‌హోఫర్ అనుభవం, నైపుణ్యాలను వినియోగించుకోవటం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. తయారీ రంగంలో ఎంపిక చేసిన ప్రాజెక్టుల్లో సాంకేతిక వనరుల భాగస్వామిగా ఫ్రాన్‌హోఫర్ ఉపయోగపడుతుంది. భారత ప్రభుత్వంలోని వివిధ సంస్థలతో ఇది కలసి పనిచేస్తుంది. అంతేగాకుండా అప్లయిడ్ ఇండస్ట్రీస్ పరిశోధనాభివృద్ధిలో పరిశ్రమలు, విశ్వవిద్యాలయాల పరిశోధనలకు మరింత సహకారం, నైపుణ్యాల ఆదాన ప్రదానం జరుగుతాయి. భారత ఉత్పాదక వస్తువుల రంగానికి కావాల్సిన ఆధునిక పారిశ్రామిక సాంకేతికతలను అందించే సామర్థ్యం ఫ్రాన్‌హోఫర్‌కుంది.