పిఎంఇండియా
భారత ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు అత్యున్నతమైన ప్రాధాన్యాన్నిస్తోంది. ఉద్యోగాలపై విశ్వసనీయమైనటువంటి, సకాలంలో అందవలసిన సమాచారం అందకపోతుండడం అనే సమస్యతో భారతదేశం సతమతం అవుతోంది. ఈ కారణంగా వేరు వేరు కాలమాన పరిస్థితులలో ఏ మేరకు ఉద్యోగాల కల్పన జరగాలనేది అంచనా వేయడం అటు విధాన రూపకర్తలకు, ఇటు స్వతంత్ర పరిశీలకులకు కూడా కష్టమైపోతోంది. లేబర్ బ్యూరో తో సహా కొన్ని ఏజెన్సీలు కొంత సమాచారాన్ని సేకరించి ప్రచురించినప్పటికీ, ఆ విధమైన సమాచారం చాలా తక్కువగా ఉంటోంది. లేబర్ బ్యూరో కేవలం కొన్ని రంగాల సమాచారాన్ని మాత్రమే సమీకరిస్తోంది. పైపెచ్చు ఆ సమాచార సేకరణ పద్ధతి, సర్వేక్షణలో పాలుపంచుకొని వివరాలు తెలియజేసిన వర్గాల తాలూకు తాజాపరచిన పట్టికపైన ఆధారపడి ఉన్నది కూడా కాదు. మొత్తంమీద చూస్తే, విధాన రూపకల్పన మరియు విశ్లేషణ అనే ప్రక్రియలు సమాచార లోపంతోనే సాగుతున్నాయని చెప్పాలి.
ఉద్యోగాల విషయంలో నమ్మదగిన మరియు సకాలంలో అందవలసిన సమాచారం యొక్క ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశంలోని గణాంక వ్యవస్థలో చిర కాలంగా ఉన్నటువంటి ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనవలసిందిగా సంబంధిత మంత్రిత్వ శాఖలను, ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఆదేశించారు. దీనికి అనుగుణంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ అరవింద్ పాన్ గఢియా అధ్యక్షతన కార్మిక శాఖ కార్యదర్శి సత్యవతి, గణాంక శాఖ కార్యదర్శి డాక్టర్ టి.సి.ఎ. అనంత్, నీతి ఆయోగ్ కు చెందిన ప్రొఫెసర్ పులాక్ ఘోష్, ఆర్ బిఐ బోర్డు సభ్యుడు శ్రీ మనీశ్ సభర్వాల్ లు సభ్యులుగా ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడమైంది. ఈ టాస్క్ ఫోర్స్ ఒక నిర్దిష్ట కాలావధిలో అమలుచేసేందుకు వీలు ఉండేటటువంటి కొన్ని పరిష్కారాలను సూచిస్తుంది. ఈ పనిని- నమ్మదగిన సమాచారం ఆలంబనగా ఉండే, ప్రభావవంతమైన ఉద్యోగ కల్పన సంబంధిత విధానాలను రూపొందించడం సాధ్యపడగలిగేందుకు అనువుగా- త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా ప్రధాన మంత్రి ఆదేశాలు ఇచ్చారు.
***