పిఎంఇండియా
నమస్కారం!
ముఖ్యమైన ఈ బడ్జెట్ వెబినార్‌కు హాజరైన మీ అందరికీ స్వాగతం. ప్రజలు, ఆర్థికం, ఆవిష్కరణల్లో పెట్టుబడులు అనే ఈ ఇతివృత్తం అభివృద్ధి చెందిన భారత్‌కు దారి చూపిస్తుంది. ఈ ఏడాది బడ్జెట్లో దీని ప్రభావం విస్తృత స్థాయిలో కనిపించింది. అందుకే ఇది దేశ భవిష్యత్తుకు బ్లూప్రింట్‌గా మారింది. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ప్రజలు, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణల్లో పెట్టుబడులకు సమప్రాధాన్యం ఇస్తున్నాం. సామర్థ్య నిర్మాణం, ప్రతిభను ప్రోత్సహించడం దేశ ప్రగతికి పునాదుల వంటివని మీ అందరికీ తెలుసు. కాబట్టి, తదుపరి దశ అభివృద్ధికి ఈ రంగాల్లో మనం పెట్టుబడులు పెట్టాలి. దీనికోసం పెట్టుబడిదారులు అందరూ ముందుకు రావాలి. ఎందుకంటే ఇది దేశ ఆర్థిక విజయానికి అవసరం. అదే సమయంలో ప్రతి సంస్థ విజయానికి అదే ఆధారం.
స్నేహితులారా,
మూడు ప్రధానాంశాలపై ప్రజలపై పెట్టుబడి అనే అంశం ఆధారపడి ఉంది – విద్య, నైపుణ్యం, ఆరోగ్య సంరక్షణ! చాలా ఏళ్ల తర్వాత భారతీయ విద్యా వ్యవస్థ గణనీయమైన మార్పులను సంతరించుకోవడాన్ని మీరు ప్రస్తుతం చూస్తున్నారు. జాతీయ విద్యా విధానం, ఐఐటీల విస్తరణ, విద్యావ్యవస్థలో సాంకేతికతను ఏకీకృతం చేయడం, ఏఐ సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవడం, పాఠ్య పుస్తకాల డిజిటలీకరణ, 22 భారతీయ భాషల్లో పాఠ్యాంశాలను అందుబాటులో ఉంచడం సహా తదితర ప్రయత్నాలన్నీ యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాం. వీటి కారణంగా భారతీయ విద్యావ్యవస్థ 21వ శతాబ్దపు ప్రపంచ అవసరాలు, ప్రమాణాలకు అనుగుణంగా ఉంది.
మిత్రులారా,
2014 నుంచి ఇప్పటి వరకు మూడు కోట్లకు పైగా యువతకు ప్రభుత్వం నైపుణ్య శిక్షణ అందించింది. 1,000 ఐటీఐ సంస్థలను మెరుగుపరచడానికి, 5 ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు మేం ప్రకటించాం. పారిశ్రామిక అవసరాలకు తగినట్టుగా యువతకు శిక్షణ అందిచాలనేదే మా లక్ష్యం. ఈ అంశంలో ప్రపంచ స్థాయిలో పోటీపడేలా మన యువతను తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ స్థాయి నిపుణుల సాయాన్ని మేం తీసుకుంటున్నాం. ఈ ప్రయత్నాల్లో మన పరిశ్రమలకు, విద్యాసంస్థలు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. పరిశ్రమలు, విద్యా సంస్థలు ఒకరి అవసరాలు ఒకరు అర్థం చేసుకొని దానికి తగినట్టుగా సిద్ధం కావాలి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి అనుగుణంగా మారడానికి, పరిస్థితులపై అవగాహన పెంచుకోవడానికి, ప్రయోగాత్మకంగా నేర్చుకోవడానికి తగిన అవకాశం యువతకు ఇవ్వాలి. అందుకే యువతలో ప్రయోగాత్మక నైపుణ్యాలు పెంపొందించేందుకు పీఎం – ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభించాం. ఈ పథకంలో అన్ని స్థాయుల్లోనూ గరిష్ఠ సంఖ్యలో సంస్థలు భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
స్నేహితులారా,
ఈ బడ్జెట్లో 10 వేల అదనపు మెడికల్ సీట్లను మేం ప్రకటించాం. వైద్య విద్యా సంస్థల్లో రానున్న 5 ఏళ్లలో మరో 75 వేల సీట్లను పెంచడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఈ రంగంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెలి మెడిసిన్ సౌకర్యాలను విస్తరిస్తున్నాం. డే కేర్ క్యాన్సర్ సెంటర్లు, డిజిటల్ ఆరోగ్య సేవల మౌలిక సదుపాయాలను విస్తరించడం ద్వారా సమాజంలోని చివరి వ్యక్తికి సైతం నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మేం భావిస్తున్నాం. ఇది ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో ఒక్కసారి ఊహించండి. ఈ ప్రయత్నం యువతకు ఎన్నో ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది. దీన్ని సాధ్యం చేయడానికి మీరంతా వేగంగా పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే బడ్జెట్ ప్రకటనల ప్రయోజనాలను మరింత ఎక్కువ మందికి చేర్చగలుగుతాం.
మిత్రులారా,
గడచిన దశాబ్దంలో భవిష్యత్ లక్ష్యాలకు తగినట్టుగా ఆర్థిక రంగంలో పెట్టుబడులు తీసుకువచ్చాం. మీ అందరికీ తెలుసు, 2047 నాటికి భారతీయ పట్టణ జనాభా 90 కోట్లకు చేరుకుంటుంది. ఇంత పెద్ద మొత్తంలోని జనాభాకు ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ చాలా అవసరం. దీని కోసమే, రూ. లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టాం. ఇది పరిపాలన, మౌలిక సదుపాయాలు, ఆర్థిక స్థిరత్వంతో పాటు ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. మన ప్రైవేటు రంగం ముఖ్యంగా రియల్ ఎస్టేట్, పరిశ్రమలు ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణపై దృష్టి సారించి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్ లాంటి పథకాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసి పనిచేయాలి.
మిత్రులారా,
ప్రస్తుతం ఆర్థికరంగంలో పెట్టుబడుల గురించి ఆలోచించేటప్పుడు, పర్యాటకంలో ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. మన జీడీపీకి పర్యాటక రంగం 10 శాతం వరకు తోడ్పాటు అందించగలదని అంచనా వేస్తున్నారు. కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించే సామర్థ్యం ఈ రంగానికి ఉంది. అందుకే దేశీయ, అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ఈ బడ్జెట్లో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా 50 పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయనున్నాం. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా హోటళ్లను అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా ఉపాధిని మెరుగుపరచవచ్చు. హోం–స్టేలకు ఊతమిచ్చేలా ముద్ర యోజన పథకాన్ని విస్తరించాం. ‘హీల్ ఇన్ ఇండియా’, ‘ల్యాండ్ ఆఫ్ బుద్ధ’ తరహా ప్రచార కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తాయి. అంతర్జాతీయ పర్యాటక, ఆరోగ్య కేంద్రంగా భారత్‌ను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు చేపడుతున్నాం.
స్నేహితులారా,
హోటల్, రవాణా మాత్రమే కాకుండా టూరిజానికి సంబంధించిన ఇతర రంగాల్లో సైతం నూతన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన దేశంలో ఆరోగ్య పర్యాటకాన్ని పెంపొందించేలా ఆ రంగానికి సంబంధించిన నిపుణులు పెట్టుబడులు పెట్టి, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. యోగా, వెల్నెస్ టూరిజానికి ఉన్న సంపూర్ణ సామర్థ్యాన్ని మనం వినియోగించుకోవాలి. ఈ దిశగా సమగ్ర చర్చలు సమర్థమైన ప్రణాళిక దిశగా మనం ముందుకు సాగాలి.
స్నేహితులారా,
ఆవిష్కరణల్లో పెట్టుబడులే దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. భారత ఆర్థిక వ్యవస్థకు కొన్ని లక్షల కోట్ల రూపాయలను జోడించగల సామర్థ్యం ఏఐకు ఉంది. అందుకే ఈ దిశగా మనం వేగంగా ముందుకు సాగాలి. ఏఐ ఆధారిత విద్య, పరిశోధనకు ఈ బడ్జెట్లో రూ.500 కోట్లను కేటాయించాం. ఏఐ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు నేషనల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను ప్రారంభిస్తాం. ఈ అంశంలో మన ప్రైవేటు రంగం ప్రపంచం కంటే ఒక అడుగు ముందుండాల్సిన అవసరం ఉంది. ఏఐ ఆధారిత పరిష్కారాలు అందించే నమ్మకమైన, సురక్షితమైన, ప్రజాస్వామ్య దేశం కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ రంగంలో మీరు ఎంత పెట్టుబడి పెడితే, భవిష్యత్తులో మీకు అంత మేలు జరుగుతుంది.
స్నేహితులారా,
ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా భారత్ ఎదిగింది. ఈ అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రూ. లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశాం. ఇది డీప్ టెక్ అంకుర సంస్థలకు కేటాయించిన నిధులతో పాటుగా నూతనంగా ఆవిర్భవిస్తున్న రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఐఐటీలు, ఐఐఎస్సీల్లో 10 వేల రీసెర్చి ఫెలోషిప్‌లు అందించాం. ఇది పరిశోధనను ప్రోత్సహించడంతో పాటు, ప్రతిభ గల యువతకు అవకాశాలను కల్పిస్తుంది. జాతీయ జియో–స్పేషియల్ మిషన్, నేషనల్ రీసెర్చి ఫౌండేషన్ ద్వారా ఆవిష్కరణలు వేగాన్ని అందుకుంటాయి. పరిశోధన, ఆవిష్కరణల రంగంలో భారత్‌ను ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు అన్ని స్థాయుల్లోనూ మనం కలసి పనిచేయాలి.
స్నేహితులారా,
జ్ఞాన భారతం కార్యక్రమంలో పాల్గొనేందుకు మీరంతా ముందుకు వస్తారని ఆశిస్తున్నారు. జ్ఞాన భారతం ద్వారా పురాతన రాత ప్రతులను పరిరక్షించడం చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం ద్వారా కోటికి పైగా రాతప్రతులను డిజిటలీకరించనున్నాం. ఆ తర్వాత ఏర్పాటయ్యే జాతీయ డిజిటల్ భాండాగారం ద్వారా భారతీయ చారిత్రక, సంప్రదాయ విజ్ఞానం, మేధస్సు గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులు తెలుసుకుంటారు. మొక్కల జన్యు వనరులను సంరక్షించేందుకు జాతీయ జన్యు బ్యాంకును ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. భవిష్యత్తు తరాలకు జన్యు వనరులు అందించడంతో పాటు ఆహార భద్రతకు భరోసా ఇవ్వడమే కార్యక్రమ లక్ష్యం. ఈ తరహా ప్రయత్నాల పరిధిని మేం విస్తరించాం. విభిన్న సంస్థలు, రంగాలు ఈ తరహా ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలి.
స్నేహితులారా,
గత నెలలో భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఐఎంఎఫ్ చేసిన గొప్ప విశ్లేషణను మనం చూశాం. ఈ నివేదిక ఆధారంగా 2015 నుంచి 2025 వరకు ఉన్న పదేళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ 66 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇప్పుడు భారత్ 3.8 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. పెద్ద ఆర్థిక వ్యవస్థలు సాధించిన దానికంటే ఈ వృద్ధి చాలా ఎక్కువ. అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగే రోజు ఎంతో దూరంలో లేదు. మనం సరైన మార్గంలో, సరిగా పెట్టుబడులు పెడుతూ మన ఆర్థిక వ్యవస్థను విస్తరించాలి. బడ్జెట్లో ప్రకటించిన అంశాలను అమలు చేయడం కూడా ఈ అంశంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో మీకు కూడా కీలకమైన పాత్ర ఉంది.
మీ అందరికీ నా శుభాకాంక్షలు. బడ్జెట్ ప్రకటించిన అనంతరం… మా పని మేం చేశాం, మీ పని మీరు చేయండి అనే సంస్కృతిని కొన్నేళ్లలో రూపుమాపగలిగామని నేను నమ్ముతున్నాను. బడ్జెట్ రూపొందించడానికి ముందు, ప్రకటించిన తర్వాత మీతో మేం చర్చిస్తున్నాం. ఏదైనా అమలు చేయాల్సి వచ్చిన సందర్భంలోనూ మీతో చర్చలు జరుపుతున్నాం. బహుశా ప్రజలను భాగస్వామ్యం చేసే ఇలాంటి పద్ధతులు అరుదు. ఈ మేధోమథన కార్యక్రమంలో ప్రతి ఏటా ప్రజల భాగస్వామ్యం పెరుగుతోంది. బడ్జెట్ తర్వాత అమలులో ఉపయోగపడే అంశాల కంటే బడ్జెట్ ముందు చర్చించే అంశాలే చాలా ముఖ్యమైనవని అందరూ భావిస్తున్నారు. ఈ మేధో మథనం మన, 140 కోట్ల మంది దేశ ప్రజల కలలను నెరవేరుస్తుందని నమ్ముతున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు.
ధన్యవాదాలు
సూచన: ప్రధాని హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.
***
This year's Union Budget paves the way for a stronger workforce and a growing economy. Addressing a post-budget webinar on boosting job creation. https://t.co/ymjiCeZoVb
— Narendra Modi (@narendramodi) March 5, 2025
हमने इनवेस्टमेंट में जितनी प्राथमिकता infrastructure और industries को दी है… उतनी ही प्राथमिकता People, Economy और Innovation को भी दी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 5, 2025
Investment in people का विज़न तीन पिलर्स पर खड़ा होता है- एजुकेशन, स्किल और हेल्थकेयर!
— PMO India (@PMOIndia) March 5, 2025
आज आप देख रहे हैं, भारत का Education system कई दशक के बाद कितने बड़े transformation से गुजर रहा है: PM @narendramodi
सभी Primary Health Centres में टेलीमेडिसिन सुविधा का विस्तार हो रहा है।
— PMO India (@PMOIndia) March 5, 2025
डे-केयर कैंसर सेंटर और digital healthcare infrastructure के जरिए हम quality healthcare को लास्ट माइल तक पहुंचाना चाहते हैं: PM @narendramodi
इस बजट में घरेलू और अंतर्राष्ट्रीय टूरिज़्म को बढ़ावा देने के लिए कई फैसले लिए गए हैं।
— PMO India (@PMOIndia) March 5, 2025
देश भर में 50 destinations को टूरिज्म पर फोकस करते हुए विकसित किया जाएगा।
इन destinations में होटलों को infrastructure का दर्जा दिए जाने से Ease of Tourism बढ़ेगा, स्थानीय रोजगार को भी बढ़ावा…
भारत AI की क्षमताओं को विकसित करने के लिए national Large Language Model की स्थापना भी करेगा।
— PMO India (@PMOIndia) March 5, 2025
इस दिशा में हमारे प्राइवेट सेक्टर को भी दुनिया से एक कदम आगे रहने की जरूरत है।
एक reliable, safe और democratic देश, जो AI में economical solutions दे सके, विश्व को उसका इंतज़ार है: PM…
स्टार्टअप्स को बढ़ावा देने के लिए सरकार ने इस बजट में कई कदम उठाए हैं।
— PMO India (@PMOIndia) March 5, 2025
रिसर्च और इनोवेशन को बढ़ाने के लिए 1 लाख करोड़ रुपये का corpus fund पास किया गया है।
इससे डीप टेक फंड ऑफ फंड्स के साथ उभरते सेक्टर्स में निवेश बढ़ेगा: PM @narendramodi
ज्ञान भारतम मिशन के माध्यम से भारत की समृद्ध manuscript heritage को संरक्षित करने की घोषणा बहुत ही अहम है।
— PMO India (@PMOIndia) March 5, 2025
इस मिशन के माध्यम से एक करोड़ से अधिक manuscript...पांडुलिपियों को डिजिटल फॉर्म में बदला जाएगा: PM @narendramodi