Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వి లో శ్రీ వెంక‌య్య నాయుడు ఒక సంవ‌త్స‌రం పూర్తి చేసుకొన్నందుకు గుర్తు గా జ‌రిగిన గ్రంథావిష్క‌ర‌ణ కార్య‌క్రమం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


కొంత మంది వెంక‌య్య గారి ని కొన్ని కార‌ణాల తో అభినందిస్తూ వ‌స్తున్నారు.  నేను ఆయ‌న ను ఆయన అల‌వాట్ల‌ ను మార్చుకొన్నందుకు గాను అభినందిస్తున్నాను.  దీనికా కారణం స‌భ లో నేను వెంక‌య్య గారిని చూసిన‌ప్పుడు ఆయ‌న త‌న‌ను తాను నిగ్ర‌హించుకొనేందుకు ఎంతగానో ప్ర‌య‌త్నించడాన్ని గ‌మ‌నించే వాడిని.  ఎవ‌రైనా త‌న‌ను తాను నిగ్ర‌హించుకొనేందుకు చేసే ప్ర‌య‌త్నాలు, ఆ ప్రయత్నాలలో స‌ఫ‌లీకృతుడు కావ‌డమంటే అదే ఓ పెద్ద విష‌యం అని నేను న‌మ్ముతాను.  స‌భ గ‌నుక ఒక క్ర‌మ ప‌ద్ధ‌తి లో సాగిందంటే స‌భాధ్య‌క్ష స్థానం లో ఉన్న వ్య‌క్తి ని గురించి ఏ ఒక్క‌రూ ప‌ట్టించుకోరు.  అత‌డు లేదా ఆమె శ‌క్తి సామ‌ర్ధ్యాలు ఏమిటో, ఆ వ్య‌క్తి యొక్క ప్ర‌త్యేక‌త ఏమిటో ప్ర‌జ‌లు పెద్ద‌ గా శ్ర‌ద్ధ వ‌హించ‌రు.  స‌భ్యుల శ‌క్తి సామ‌ర్ధ్యాలు ఏమిట‌నేది, వారి అభిప్రాయాలు ఏమిట‌నేది ఈ విష‌యాలే చాలా వ‌ర‌కు ప్రాధాన్యానికి నోచుకొంటాయి.  అయితే, స‌భ స‌జావుగా సాగ‌ని ప‌క్షంలో అప్పుడు స‌భాధ్య‌క్ష స్థానం లో ఉన్న వ్య‌క్తి మీద, ఆ వ్య‌క్తి క్ర‌మ‌శిక్ష‌ణ ను ఎలా అమ‌లు ప‌రుస్తున్నారో, స‌భ్యుల‌ను ఎలా క‌ట్ట‌డి చేస్తున్నారో అనే అంశాల మీద దృష్టంతా కేంద్రీకృతమవుతుంది.  ఈ కార‌ణంగానే గ‌త సంవ‌త్స‌ర కాలంగా వెంక‌య్య గారి ప‌ట్ల ఒక నిశిత‌మైన దృష్టి ని సారించే అవ‌కాశం ద‌క్క‌డం ఈ దేశం చేసుకున్న అదృష్టం.  స‌భ సాఫీ గా ప‌ని చేసుకు పోయిందంటే గనక ఈ అవ‌కాశం బ‌హుశా ల‌భించి వుండేది కాదు.  అనేక సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి వెంక‌య్య గారితో క‌ల‌సి ప‌ని చేసే అవ‌కాశం నాకు చిక్కింది.  మ‌రి మేం ఒకే విధ‌మైన రాజ‌కీయ సంస్కృతి ని ఒంట‌బ‌ట్టించుకొన్నాం.  వెంక‌య్య గారు ఆంధ్ర ప్ర‌దేశ్ లో పార్టీ కార్య‌ద‌ర్శి గా ఉన్న కాలం లో నేను జాతీయ కార్య‌ద‌ర్శి గా ఉండే వాడిని.  అలాగే, ఆయ‌న పార్టీ కి జాతీయ అధ్య‌క్షుని గా ఉన్న కాలం లో నేను పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదా లో ఆయ‌న‌కు స‌హాయం అందిస్తూ వ‌చ్చాను.  అంటే ఒక ర‌కంగా మేం ఒక జ‌ట్టు గా ప‌ని చేశామ‌న్న మాట‌.  వెంక‌య్య గారికి ప‌ద‌వి క‌న్నా కూడా బాధ్య‌త‌లే మ‌రింత ముఖ్య‌మైనవి.

వెంక‌య్య గారు ఒక సంవ‌త్స‌ర కాలం లో ఒక రాష్ట్రం మిన‌హా మిగతా అన్ని రాష్ట్రాల‌ లో ప‌ర్య‌టించారన్న సంగతి ని కొద్ది సేప‌టి క్రితం స‌భ‌ దృష్టి కి తీసుకువ‌చ్చారు.  అయితే, ఆ రాష్ట్రాన్ని ఏ కార్య‌క్ర‌మం రూపొంద‌ని కార‌ణంగా వ‌ద‌లి వేయ‌లేదు.  అక్క‌డ‌కు హెలికాప్టర్ చేరుకోలేని ప‌రిస్థితి ఉన్న కార‌ణం చేతను, అన‌నుకూల వాతావ‌రణం స‌మస్య‌ల‌ను సృష్టించినందువ‌ల్ల‌ను ఆ రాష్ట్రాన్ని వ‌ద‌లివేయ‌డ‌మైంది త‌ప్ప‌ లేకుంటే ఆ రాష్ట్రాన్ని కూడా క‌లుపుకొని పోయే వారు. 

మేం స‌భ‌లో క‌ల‌సి ప‌ని చేస్తాం;  కొన్ని సంద‌ర్భాల‌లో స‌మావేశం నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఆయ‌న‌ ను సంప్ర‌దించాల‌ని మేము అనుకొన్న‌ప్పుడు అప్ప‌టికే అక్క‌డ నుండి ఆయ‌న వెళ్ళిపోయారన్న సంగ‌తి; ఆయ‌న కేర‌ళ కు చేరుకొన్నార‌నో; త‌మిళ‌నాడు కో లేదా ఆంధ్ర కో వెళ్ళార‌ని మాకు తెలిసేది.  అంటే ఆయ‌న‌కు ఎటువంటి బాధ్య‌త‌లను అప్పజెప్పిన‌ప్ప‌టికీ వాటిని ఆయన ఎల్ల‌ వేళ‌లా పూర్తిగా నెర‌వేర్చే వారు.  త‌గిన క‌ఠోర శ్ర‌మ చేసే వారు;  మ‌రి ఆ బాధ్య‌త‌ల‌ను నెర‌వేర్చ‌డం కోసం త‌న‌ను తాను తీర్చిదిద్దుకొనే వారు.  ఈ కార‌ణంగానే ఆయ‌న కృత‌కృత్యులు అవుతూ వ‌స్తున్నారు.  అంతేకాకుండా, ఆ రంగాన్ని సైతం విజ‌య‌వంతంగా నిలుపుతూ వ‌చ్చారు.  ప్ర‌జా జీవ‌నం లో యాభై సంవ‌త్స‌రాలు అనేది చిన్న విష‌యం ఏమీ కాదు.  యాభై సంవ‌త్స‌రాల దీర్ఘకాలం లో ఆయ‌న ఎంతో నేర్చుకొన్నారు.   ప్ర‌జా జీవ‌నంలో ఒక విద్యార్థి గా ప‌ది సంవ‌త్స‌రాలు, అది కూడా ఒక కార్య‌క‌ర్త‌ గానే; మిగతా న‌ల‌భై సంవ‌త్స‌రాల పాటు సుదీర్ఘ రాజ‌కీయ జీవనాన్ని ఆయ‌న గడిపారు.  త‌న స‌హ‌చ‌రుల‌కు అనేక విష‌యాల‌ను నేర్పించారు.  కొన్ని సంద‌ర్భాల‌లో మనం ఎవ‌రి తోనో అతి స‌న్నిహితంగా ప‌ని చేస్తుంటాం.  అది ఎంత స‌న్నిహిత‌ంగా అంటే అయ‌న‌ను గ‌మ‌నించ‌డం, ఆయ‌న‌ ను గురించి అర్థం చేసుకోవ‌డం క‌ష్ట‌మైపోయేటంతగా అన్నమాట.  ఎవ‌రి నుండైనా ప‌ది అడుగులు ఆవ‌ల నిల‌బ‌డి ఉన్న‌ప్పుడు మాత్ర‌మే వారిని గురించి మీరు తెలుసుకొనేందుకు అవ‌కాశం ఉంటుంది.  అయితే ఎవ‌రినైనా మీరు హ‌త్తుకున్నారంటే వారిని గురించి తెలుసుకోవ‌డం క‌ష్టం.  దీనికి అర్థం ఏమిటంటే మనం అతి స‌న్నిహితంగా ఉన్నామ‌న్న అంశం తాలూకు గ్ర‌హింపు ఎంతో క‌ష్టం అని;  కానీ ఇత‌రుల వ‌ద్ద నుండి ఈ విష‌యాన్ని విన్న‌ప్పుడు.. మా స‌హ‌చ‌రుడు ఫ‌లానా అంశం లో స‌మ‌ర్ధుడు అనేది, ఆయ‌న లో ఈ ఈ ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌నేది తెలిసిన‌ప్పుడు ఆ సంగ‌తి మాకు అమితమైన గ‌ర్వాన్ని అందిస్తుంది.  అంతేకాకుండా, అటువంటి ప్ర‌ముఖుని తో ఒక కార్య‌క‌ర్త‌గా క‌ల‌సి ప‌ని చేసే అవ‌కాశం మాకు ద‌క్కింద‌న్న సంతోషం కూడా క‌లుగుతుంది.

వెంక‌య్య గారు క్ర‌మ‌శిక్ష‌ణ‌కు చాలా ప్రాధాన్యాన్ని ఇస్తారు.  మ‌రి మ‌న దేశం లో ఉన్న ప‌రిస్థితి ని చూడ‌బోతే క్ర‌మ‌శిక్ష‌ణ ను అప్ర‌జాస్వామిక‌మైందిగా పేర్కొన‌డం ఎంతో సుల‌భ‌మైన‌టువంటి విష‌యంగా ఉంది.  ఎవ‌రైనా ఒకింత క్ర‌మ‌శిక్ష‌ణ కోసం ప‌ట్టుబ‌డితే ఇక అత‌డి ప‌ని అయిపోయినట్లే.  ప్ర‌జ‌లు అత‌డి నిరంకుశుడని, ఇంకా ఏమేమో అంటారు.  ప్ర‌జ‌లు అత‌డి పైన దుమ్మెత్తి పోయ‌డానికి నిఘంటువులో  ఉన్న పదజాలాన్నంతటినీ వినియోగిస్తారు.  అయితే, వెంక‌య్య గారు ఇత‌రుల వ‌ద్ద నుండి తాను ఆశించేట‌టువంటి క్ర‌మ‌శిక్ష‌ణ ను స్వ‌యంగా అనుస‌రిస్తారు.  ఎవ‌రైనా వెంక‌య్య గారితో పాటు, ఒక ప‌ర్య‌ట‌న‌ కు వెళ్ళ‌వ‌ల‌సి వ‌స్తే చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాలి.  ఒక‌టి, ఆయ‌న త‌న ద‌గ్గ‌ర గ‌డియారాన్ని అట్టిపెట్టికోరు;  ఒక క‌లాన్నో లేదా కొంత డ‌బ్బునైనా త‌న ద‌గ్గ‌ర ఉంచుకోరు.  మీరు గ‌నుక ఆయ‌న‌ తో పాటు ప్ర‌యాణించ‌వ‌ల‌సి వ‌స్తే ఇవ‌న్నీ మీతో పాటు తీసుకుపోవాల‌ని మీరు అర్థం చేసుకోవాలి.  మంచి విష‌యం ఏమిటంటే ఆయ‌న త‌న‌తో ఒక గ‌డియారాన్ని ఎన్న‌డూ ఉంచుకోక‌పోయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఎంత‌టి క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన వ్య‌క్తి అంటే కార్య‌క్ర‌మానికి ఆయ‌న స‌కాలం లో చేరుకొంటారు.  ఇది ప్ర‌శంసాపాత్రమైన విషయం.  స‌రి అయిన కాలానికి కార్య‌క్ర‌మానికి చేరుకోవ‌డం అలాగే నిర్దేశిత కాలానికల్లా కార్య‌క్ర‌మం ముగియ‌కపోతే ఆయ‌న ఎంత అసౌక‌ర్యంగా ఉంటారో మీరే చూస్తారు.  మ‌రి, కార్య‌క్ర‌మాన్ని అతి త్వ‌ర‌గా ముగించాల‌ని మీరు అనుకొంటారు.  అంటే క్ర‌మ‌శిక్ష‌ణ అనేది ఆయ‌న స్వ‌భావం లో ఒక భాగం అన్న మాట.  అంతేకాదు, ఈ విష‌యాన్ని బ‌ట్టి ఆయ‌న‌ కు అప్ప‌గించినటువంటి ఏ బాధ్య‌త‌నైనా సరే ఆయ‌న ఎల్ల‌ప్పుడూ ఒక దార్శ‌నిక‌త‌ తో ప‌ని చేస్తారు.  ఒక మార్గ‌సూచి ని రూపొందించుకొనేందుకు ఆయ‌న వ‌ద్ద ఒక సంపూర్ణ‌మైనటువంటి ఆలోచ‌న ఉంటుంది.  ఒక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ ను రూపొందించాల‌ని, ఒక వ్యూహాన్ని సిద్ధం చేయాల‌ని, మ‌రి వాటికి త‌గిన వ‌న‌రుల‌ను స‌మ‌కూర్చుకోవ‌డం ద్వారా అందుకు స‌మ‌ర్ధులైన వారిని క‌లుపుకు పోవ‌డం ద్వారా ఆ ప‌నిని ఆయన విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తారు. 

మొట్ట‌మొద‌టి సారి ఆయ‌న ఒక మంత్రి గా నియ‌మితుడైన‌ప్పుడు ఆయ‌న‌కు ఒక ఉన్న‌త‌మైన మంత్రిత్వ శాఖ ను అప్ప‌గించాల‌ని అట‌ల్ గారు ఒక ప్ర‌ణాళిక వేసుకొన్నారు.  ఆయ‌న‌ కు ఆంగ్ల భాష లో ప‌ట్టు ఉంది.  ద‌క్షిణాది కి ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు కాబ‌ట్టి ఆయ‌న‌ ను మంత్రివ‌ర్గం లోకి తీసుకోవాల‌ని అట‌ల్ గారు అనుకొన్నారు.  అప్ప‌ట్లో నేను ఒక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ని.  ఈ ప్ర‌ణాళిక ఒక‌టి ఉంద‌న్న సంగ‌తి ఆయ‌న‌కు తెలిసిన‌ప్పుడు ఆయ‌న న‌న్ను ‘‘మీరు ఈ భారాన్ని నా మీద వేయాల‌ని ఎందుకు అనుకుంటున్నారు?’’ అని అడిగారు.   ‘‘ఏం జ‌రిగింది?’’ అని ఆయ‌న‌ను నేను అడిగాను.  ‘‘అది నా ప‌ని కాదు’’ అని ఆయ‌న బ‌దులిచ్చారు.  అప్పుడు నేను ‘‘మరి మీరు ఏం చేస్తారు?’’ అని అన్నాను.  దానికి ఆయ‌న ‘‘ఈ సంగ‌తిని నేను అట‌ల్ గారికి చెబుతాను’’ అంటూ స‌మాధాన‌మిచ్చారు.  ఆయ‌న తో నేను అన్నాను, ‘‘ద‌య‌చేసి మీరు ఆయ‌న‌ను క‌ల‌సి మీ అభిప్రాయాలు వెల్ల‌డించండి’’ అని.  ఆయ‌న అట‌ల్ గారి వ‌ద్ద‌కు వెళ్ళి, త‌న‌కు అటువంటి పెద్ద బాధ్య‌త క‌లిగిన మంత్రిత్వ శాఖ‌ ల‌ను కేటాయించకండి అంటూ విజ్ఞ‌ప్తి చేశార‌ని తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు.  ఆయ‌న గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ‌ ను త‌న‌కు ఇవ్వాల్సిందిగా అట‌ల్ గారిని కోరారు.  దీని కోసం త‌న జీవితాన్ని అంకితం చేయాల‌నుకొంటున్నాన‌ని వారితో చెప్పారు.  దీనికి అర్థం ఏమిటంటే కొంత విలువ ఉందనుకొంటున్న ఉన్న‌త‌ మంత్రిత్వ శాఖ‌ ల‌ను స్వీక‌రించ‌క‌పోవ‌డం ద్వారా గ్రామీణాభివృద్ధి ని కోరుకొంటున్న‌ట్లు ఆయన సూచించారు అని.  ఆయ‌న స్వ‌భావ‌రీత్యా ఒక రైతు.  ఆయ‌న వృత్తి మ‌రియు అభిమతం సైతం వ్యవసాయమే.  రైతుల కోసం ఏదో ఒక‌టి చేయ‌డం, రైతుల‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌డం.. ఈ అంశాలు ఆయ‌న మ‌స్తిష్కం లోప‌ల ఎంత లోతైన ముద్ర ను వేసుకొన్నాయంటే ఆయ‌న త‌న జీవితాన్ని ఇందుకోస‌మే జీవించారు.  మ‌రి ఈ కార‌ణంగా ఆయ‌న గ్రామీణాభివృద్ధి ప‌ట్ల ఆస‌క్తి ని చూపించారు.  అరుణ్ గారు చెప్పిన‌ట్లుగా ప్ర‌ధాన మంత్రి గ్రామీణ ర‌హ‌దారుల కార్య‌క్ర‌మం అన్ని ప్ర‌భుత్వాల లోను అత్యంత స‌ఫ‌లీకృత‌మైన కార్య‌క్ర‌మం గా ఉంది.  ప్ర‌ధాన మంత్రి గ్రామీణ ర‌హ‌దారి ప‌థ‌కం త‌మ ప్రాంతం లో అమ‌ల‌వ్వాల‌ని ఎంపీ లంద‌రూ కోరుకొంటారు.  దీనిని ఎంపీ ల మ‌స్తిష్కం లోకి ప్ర‌వేశ‌పెట్టిన ఘ‌న‌త శ్రీ‌మాన్ వెంక‌య్య గారికి ద‌క్కుతుంది.  ఇదే విధంగా నీరు, జలం.. గ్రామీణుల జీవ‌నం లో త్రాగునీరు.. ఇది ఆయ‌న త‌న‌ను తాను అంకితం చేసుకున్న ప‌నుల‌ లో మ‌రొక ప‌ని.  దీని కోసం ఆయ‌న త‌న కాలాన్ని మ‌రియు శ‌క్తి ని ధార‌ పోసే వారు.  ఈ రోజు కు కూడా స‌భ‌ లో అటువంటి అంశాల‌ పైన చ‌ర్చ వాయిదా ప‌డుతూ ఉంటే అత్యంత గాభ‌రా ప‌డిపోయేది ఆయ‌నే.   ప‌ల్లెలు మ‌రియు రైతుల వంటి అంశాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న అభిప్రాయాలు ఇలా ఉంటాయి:  ‘‘ఇక్క‌డ జ‌రుగుతున్న‌ది ఏమిటో అనే అంశం పై స‌భ‌లో క‌నీసం చ‌ర్చ ను చేప‌డుదాం’’ అని.  అంటే ఆయ‌న లో ఉన్న‌టువంటి అసౌక‌ర్యం.. అది సామాన్య మాన‌వుడి సంక్షేమానికి, సామాన్య మాన‌వుడి ఆకాంక్ష‌ల‌కు సంబంధించింద‌న్న మాట‌.  

తెలుగు లో ఆయ‌న మాట్లాడ‌డం విన్న వారికి ఆయ‌న వాగ్ధాటి తో తుల‌ తూగ‌లేం అని అనిపిస్తుంది.  ఆయ‌న ఎంత వేగంగా మాడుతారంటే మీరు ఒక లోక‌ల్ ట్రైన్ లో కూర్చున్నారనుకోండి, దానిని ఆయ‌న ఒక సూప‌ర్ ఫాస్ట్ ట్రైన్ గా న‌డుపుతున్న‌ట్లుగా మీకు తోస్తుంది.  ఆయ‌న అంత వేగంగా మాట్లాడుతారు మరి!  ఆయ‌న త‌న ఉప‌న్యాసం లో అత్యంత ప్ర‌భావ‌శీల‌మైన రీతిలో మాట్లాడ‌డాన్ని చూసి తీరాలి.  ఆయ‌న ప్రాస తో మాట్లాడ‌డం ఎంతో స్వాభావికం గా ఉంటుంది.  అది ఒక్క బ‌హిరంగ ఉప‌న్యాసాల్లోనే జ‌రుగుతుంద‌ని కాదు.  త‌న ప‌క్క‌న కూర్చున్న ఎవ‌రితో నైనా స‌రే ఆయ‌న అలాగే సంభాషిస్తారు.  దీనితో స‌భ‌లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రు లాభ ప‌డుతున్నారు.  ప‌ద‌వి లో ఆయ‌న తొలి సంవ‌త్స‌రం ఏమి చేశార‌నేది యావ‌త్తు దేశానికి తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో ఈ చిన్ని ప్ర‌య‌త్నాన్ని చేసిన యావత్తు బృందాన్ని నేను అభినందిస్తున్నాను.  అంతేకాక ఈ సంస్థ ను స‌మాజ సంక్షేమానికి ఎలా వాడుకోవాల‌నేది, ఈ కార్యాల‌యం ద్వారా వినూత్న‌త‌ను, వేగ‌ గ‌తిని ఎలా తీసుకు రావ‌చ్చ‌నేది మీరు గ్ర‌హించే విధంగా ఈ పుస్తకం చేస్తుంద‌ని నేను న‌మ్ముతున్నాను.  ఈ సంస్థ ఎలా ముందుకు పోతోంద‌నేది, దేశం తాలూకు ఇత‌ర కార్య భారాల‌ను నెర‌వేర్చ‌డం లో స‌హ‌క‌రిస్తోంద‌నేది ఈ పుస్తకం  వివ‌రిస్తుంది.  

ఒక ర‌కంగా ఉప రాష్ట్రప‌తి ప‌దవి తాలూకు ఒక ఏడాది వివ‌రాలు ఇందులో ఉన్నాయ‌ని అనిపించిన ఈ పుస్త‌కాన్ని మీరు చూసిన‌ప్పుడు- ఈ కుటుంబ ఛాయాచిత్రాల సంక‌లనం లో ఏదో ఒక చోట మ‌నమూ క‌నిపిస్తాం.  కొంద‌రు ఎంపీ ల‌ను లేదా ఏ ఉప కుల‌ప‌తి నో లేదా కొంత మంది ముఖ్య‌మంత్రుల‌ నో, లేదా కొంత మంది గ‌వ‌ర్న‌ర్ల‌ నో మీరు గుర్తిస్తారు.  అంటే మారు మూల ప్రాంతాల తో స‌న్నిహితం కావ‌డానికి ఎటువంటి ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌నేది కూడా ఇందులో చూడ‌వ‌చ్చన్న మాట.

వెంక‌య్య గారికి నేను నా శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నాను.  స‌భ ఉచిత‌మైన రీతిలో సాగాల‌ని, స‌భ‌లో ఒక పరిపూర్ణ చ‌ర్చ జ‌ర‌గాల‌ని, మ‌రి స‌భ‌ లో దేశానికి ఉప‌యోగ‌ప‌డేటటువంటి అంశాల‌ను ప్ర‌స్తావించాల‌ని ఆయ‌న మ‌ది లో ఓ కోరిక వుంద‌ని నేను భావిస్తున్నాను.  ఈ విష‌యాలను గురించిన ఆయ‌న క‌ల త‌న నిరంత‌ర ప్ర‌య‌త్నాల ద్వారా నెర‌వేరగలదనే నేను న‌మ్ముతాను.  వెంక‌య్య గారికి ఇవే నా శుభాకాంక్ష‌లు.  మీకు అనేకానేక ధ‌న్య‌వాదాలు.

**