Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐపిఆర్ ల‌ పైన ఇండియా, స్వీడ‌న్ ల మ‌ధ్య‌ కుదిరిన ఎంఓయు కు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం


మేధోసంప‌త్తి హ‌క్కుల రంగంలో స‌హ‌కారానికి సంబంధించి భార‌త‌దేశం, స్వీడ‌న్ ల మ‌ధ్య‌ కుదిరిన అవ‌గాహ‌నాపూర్వ‌క ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు స‌మావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఈ ఎంఓయు కార‌ణంగా విస్తృత‌మైన అనుకూల వ్య‌వ‌స్థ ఏర్పాట‌వుతుంది. దీని ద్వారా ఇరు దేశాలు ఉత్త‌మ విధానాల‌ను అమ‌లు చేయ‌వ‌చ్చు. అంతే కాదు ఈ రంగానికి సంబంధించిన శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల్ని ఇరు దేశాలు క‌లిసి నిర్వ‌హించుకోవ‌చ్చు. సాంకేతిక‌ప‌ర‌మైన అంశాల్ని ఇచ్చిపుచ్చుకోవ‌చ్చు. త‌ద్వారా ఐపిఆర్ ల‌పైన త‌గిన చైత‌న్యం క‌లుగుతుంది. దాంతో మేధోప‌ర‌మైన సంప‌త్తి హ‌క్కుల‌ను ఉత్త‌మ‌మైన ప‌ద్ధ‌తుల్లో ర‌క్షించుకోవ‌చ్చు.

ప్ర‌భావం:

ఈ ఎంఓయు కార‌ణంగా నూత‌న అంశాల ప‌రిశోధ‌న‌, ఐపీ ఎకోసిస్ట‌మ్స్ ల విష‌యంలో భార‌త‌దేశం స్వీడ‌న్ తో త‌న అనుభ‌వాల‌ను పంచుకుంటుంది. త‌ద్వారా ఇరు దేశాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్త‌లు, పెట్టుబ‌డిదారులు, వ్యాపార వ‌ర్గాలు చెప్పుకోద‌గ్గ స్థాయిలో ల‌బ్ధి పొందుతారు. భార‌త‌దేశ జ‌నాభాలో ఎంత వైవిధ్య‌త వుందో అంతే వైవిధ్య‌త దేశ మేధోప‌ర‌మైన సృజ‌నాత్మ‌క అంశాల్లోను ఉంది. ఇరు దేశాలు త‌మ ఉత్త‌మ విధానాల‌ను ఇచ్చిపుచ్చుకోవ‌డంవ‌ల్ల భార‌త‌దేశ మేధోప‌ర‌మైన వైవిధ్య‌తకు మెరుగైన భ‌ద్ర‌త‌ ల‌భించ‌డ‌మే కాకుండా వీటిపైన చైత‌న్యం కూడా పెరుగుతుంది. నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల రంగంలో అంత‌ర్జాతీయంగా ప్ర‌ముఖ పాత్ర‌ను పోషించ‌డానికిగాను భార‌త‌దేశం చేస్తున్న ప్ర‌యాణంలో ఈ ఎంఓయు ఒక మైలురాయిగా నిలుస్తుంది. జాతీయ ఐపిఆర్ విధానం 2016 ల‌క్ష్యాల‌ను మ‌రింత ముందుకు తీసుకుపోవ‌డానికి దోహ‌దం చేస్తుంది.

ముఖ్యాంశాలు:

ఇరుదేశాల స‌భ్యుల‌తో కూడిన ఉమ్మ‌డి స‌మ‌న్వ‌య క‌మిటీని ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది. ఎంఓయు ప్ర‌కారం కింద తెలిపిన విభాగాల్లో అమ‌లు చేయ‌డానికిగాను చేప‌ట్టాల్సిన స‌హ‌కార కార్య‌క్ర‌మాల‌ను ఈ క‌మిటీ నిర్ణ‌యిస్తుంది.

ఎ. ఇరు దేశాల ప్ర‌జ‌ల్లోను, వ్యాపార వ‌ర్గాల్లోను, విద్యాసంస్థ‌ల్లోను మేధోప‌ర‌మైన సంప‌త్తిపైన చైత‌న్యం పెంచ‌డానికిగాను రెండు దేశాలు త‌మ ఉత్త‌మ విధానాల‌ను, అనుభ‌వాల‌ను, విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి.

బి. శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల్లో ఉమ్మ‌డి భాగ‌స్వామ్యం వుంటుంది. నిపుణుల‌ను, సాంకేతిక‌త‌ను, ప్ర‌జ‌ల‌ను చేరువ‌య్యే కార్య‌క్ర‌మాల‌ను ఇచ్చిపుచ్చుకోవ‌డం జ‌రుగుతుంది.

సి. మేధోప‌ర‌మైన సంప‌త్తికి సంబంధించి ఉత్త‌మ విధానాల‌ను, అనుభ‌వాల‌ను, విజ్ఞానాన్ని ప‌రిశ్ర‌మ‌లు, విశ్వ‌విద్యాల‌యాల‌తో, ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి సంస్థ‌ల‌తో, చిన్న‌ మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌తోను ఇచ్చిపుచ్చుకోవ‌డం, విస్త‌రించ‌డం జ‌రుగుతుంది. స్వ‌తంత్రంగా గానీ, ఉమ్మ‌డిగా గానీ ఇరు దేశాల సంస్థలు నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం ద్వారా ఈ ప‌ని చేయ‌డం జ‌రుగుతుంది.

డి. పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, వాణిజ్యప‌ర‌మైన డిజైన్లు, కాపీరైట్లు, భౌగోళిక‌ప‌ర‌మైన సూచ‌న‌లకోసం ద‌ర‌ఖాస్తులను త‌యారు చేసి పంప‌డానికిగాను స‌మాచారాన్ని, ఉత్త‌మ విధానాల‌ను ప‌ర‌స్ప‌రం ఇచ్చి పుచ్చుకోవ‌డం జ‌రుగుతుంది. అంతే కాదు ఈ ప‌నిని మేధోసంప‌త్తి హ‌క్కుల సంర‌క్ష‌ణ‌, అమ‌లు, వినియోగంలో కూడా చేయ‌డం జ‌రుగుతుంది.

ఇ. ఆటోమేష‌న్ అభివృద్ధిలో స‌హ‌కారం వుంటుంది. ప్రాజెక్టుల ఆధునీక‌ర‌ణ‌ను అమ‌లు చేయ‌డంలో, కొత్త‌గా చేసే డాక్యుమెంటేష‌న్, ఐపీ ఇన్ఫ‌ర్మేష‌న్ వ్య‌వ‌స్థ‌ల్లోను, ఐపీ నిర్వ‌హ‌ణ విధానంలోను స‌హ‌కారం వుంటుంది.
ఎఫ్‌. సంప్ర‌దాయ విజ్ఞానాన్ని భ‌ద్రంగా కాపాడుకోవ‌డం, అవ‌గాహ‌న చేసుకోవ‌డంలో స‌హ‌కారం వుంటుంది. ఇప్ప‌టికే ఉనికిలో వున్న ఐపీ వ్య‌వ‌స్థ‌ల పైన చైత‌న్యాన్ని పెంచ‌డం జ‌రుగుతుంది. సంప్ర‌దాయ విజ్ఞానానికి సంబంధించి ఇదివ‌ర‌కే వున్న స‌మాచారంతో పాటు ఉత్త‌మ విధానాల‌ను ఇచ్చిపుచ్చుకోవ‌డం జ‌రుగుతుంది.

జి. డిజిట‌ల్ రంగంలో మేధోసంప‌త్తి చ‌ట్టాల ఉల్లంఘ‌న‌కు సంబంధించి ముఖ్యంగా కాపీరైట్ స‌మ‌స్య‌లకు సంబంధించి అమ‌లు చేయాల్సిన ఉత్త‌మ‌ విధానాల‌ను ఇరు దేశాలు పంచుకుంటాయి.

హెచ్‌. స‌హ‌కార కార్య‌క్ర‌మాలను ఇరు దేశాల సంస్థ‌లు ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌తో చేప‌డ‌తాయి.