పిఎంఇండియా
ఒడిశా గవర్నరు డాక్టర్ హరిబాబు, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ, నా మంత్రివర్గ సభ్యులు ఎస్.జయశంకర్, జువాల్ ఓరమ్, ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్, శోభా కరంద్లాజే, కీర్తి వర్ధన్ సింగ్, పబిత్రా మార్గరెట్టా, ఒడిశా ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రవతీ పరిదా, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భరతమాత కుమారులు, కుమార్తెలందరికీ! సోదర సోదరీమణులారా! జగన్నాథుడు, లింగరాజుల పవిత్ర భూమిలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన నా ప్రవాస భారతీయులందరికీ స్వాగతం పలుకుతున్నాను. ప్రారంభంలో పాడిన స్వాగత గీతం, భవిష్యత్తులో ప్రపంచం నలుమూలలలో జరిగే భారతీయ సమాజ కార్యక్రమాల్లో మళ్లీ మళ్లీ వినిపిస్తుందనే నాకు పూర్తి నమ్మకం ఉంది. మీకు అభినందనలు. మీ బృందం ప్రవాస భారతీయుని మనోభావాన్ని అద్భుతంగా వ్యక్తీకరించింది. మిమ్మల్ని మరోసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
మిత్రులారా,
ఈ ప్రవాస భారతీయ దినోత్సవం ముఖ్య అతిథి ద్వారా మనం ఇప్పుడే విన్నాం. ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కంగాలూ వీడియో సందేశం మనందరిపై గొప్ప ముద్ర వేసింది. ఆమె కూడా భారత్ పురోగతి గురించి మాట్లాడారు. ఆమె సుహృద్భావ, అనురాగభరిత పలుకులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
భారతదేశంలో ఉత్సాహభరితమైన పండుగలు, సమావేశాలు జరుగుతున్న సమయం ఇది. మరికొద్ది రోజుల్లో ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా ప్రారంభం కానుంది. మకర సంక్రాంతి, లోహ్రీ, పొంగల్, మాఘ్ బిహు పండుగలు కూడా వస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. పైగా, 1915లో ఇదే రోజున మహాత్మాగాంధీ సుదీర్ఘకాలం విదేశాల్లో ఉండి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇంత అద్భుతమైన సమయంలో మీరు భారత్ లో ఉండడం పండుగ ఉత్సాహాన్ని ఇంకా పెంచుతోంది. ప్రవాస భారతీయ దినోత్సవం ప్రస్తుత సంచిక మరో విధంగా ప్రత్యేకమైనది. అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి పూర్తయిన కొద్ది రోజులకే మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఆయన దార్శనికత ఈ కార్యక్రమానికి దోహదపడింది. ఇది విదేశాలలోని భారతీయులకు స్వదేశంతో బంధాన్ని బలోపేతం చేసే ఉత్సవంగా మారింది. మనందరం కలిసి భారతదేశాన్ని, భారతీయతను, మన సంస్కృతిని, మన పురోగతిని వేడుకగా జరుపుకుంటాం. ఇంకా మన మూలాలతో అనుసంధానం అవుతాం.
మిత్రులారా,
ఈరోజు మీరు సమావేశమైన ఒడిశా నేల కూడా సుసంపన్నమైన భారతదేశ వారసత్వానికి ప్రతిబింబం. ఒడిశాలో అడుగడుగునా మన సంస్కృతి కనిపిస్తుంది. అది ఉదయగిరి–ఖండగిరి చారిత్రక గుహలు కావచ్చు, కోణార్క్ సూర్య దేవాలయం కావచ్చు, తామ్రలిప్తి, మాణిక్‌పట్న, పాలూరు వంటి పురాతన ఓడరేవులు కావచ్చు, వీటిని చూస్తే ప్రతి ఒక్కరికీ గర్వం కలుగుతుంది. శతాబ్దాల క్రితం ఒడిశాకు చెందిన మన వ్యాపారులు, వ్యాపారవేత్తలు బాలి, సుమత్రా, జావా వంటి ప్రాంతాలకు సముద్ర ప్రయాణాలు చేసేవారు. దానికి గుర్తుగా నేటికీ ఒడిశాలో బలి జాతరను నిర్వహిస్తున్నారు. ఇక్కడే ఒడిశాలో ధౌలి అనే ప్రదేశం కూడా ఉంది. ఇది శాంతికి గొప్ప చిహ్నం. ప్రపంచం ఖడ్గం ద్వారా సామ్రాజ్యాలను విస్తరించే యుగంలో ఉన్నప్పుడు, మన చక్రవర్తి అశోకుడు ఈ నేలపై శాంతి మార్గాన్ని ఎంచుకున్నారు. మన వారసత్వంలోని ఈ బలమే, ‘భవిష్యత్తు యుద్ధంలో కాదు, బుద్ధ’ లో ఉందని, ప్రపంచానికి భారతదేశం ఈ రోజు అందించే సందేశం. అందుకే, ఈ ఒడిశా భూమికి మీ అందరినీ స్వాగతించడం నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది.
మిత్రులారా,
ప్రవాస భారతీయులను నేను ఎల్లప్పుడూ భారత రాయబారులుగా భావిస్తాను. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన మీ అందరినీ కలిసినప్పుడు, మీతో సంభాషించినప్పుడు నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. మీ నుంచి నాకు లభించే ప్రేమను ఎప్పటికీ మరచిపోలేను. మీ అభిమానం, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటాయి.
మిత్రులారా,
ఈరోజు, మీ అందరికీ నా వ్యక్తిగత కృతజ్ఞతలు తెలియజేయాలని, అలాగే మీకు ధన్యవాదాలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మీ వల్లనే, ప్రపంచంలో గర్వంతో తల ఎత్తుకునే అవకాశం నాకు లభిస్తోంది. గత 10 సంవత్సరాలలో నేను ప్రపంచంలోని అనేక మంది నాయకులను కలుసుకున్నాను. ప్రతి ప్రపంచ నాయకుడు భారతీయ ప్రవాసులను, అంటే మీ అందరినీ ప్రశంసిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం, మీరు అక్కడి సమాజాలకు మన విలువలు జోడించడమే. మన భారత్ కేవలం ప్రజాస్వామ్యానికి జన్మభూమి మాత్రమే కాదు, ప్రజాస్వామ్యం మన ప్రజల జీవితాల్లో అంతర్భాగం, ఇది మన జీవన విధానం. మనకు భిన్నత్వాన్ని నేర్పించాల్సిన అవసరం లేదు; భిన్నత్వమే మన జీవితాన్ని నడిపిస్తుంది. అందుకే భారతీయులు ఎక్కడికి వెళ్లినా అక్కడి సమాజంతో మమేకమవుతారు. ఎక్కడికి వెళ్లినా అక్కడి నిబంధనలు, సంప్రదాయాలను గౌరవిస్తారు. ఆ దేశానికి, ఆ సమాజానికి అత్యంత చిత్తశుద్ధితో సేవ చేస్తారు. వారి ఎదుగుదలకు, శ్రేయస్సుకు తోడ్పడతారు. వీటన్నింటితో పాటు భారత్ ను ఎప్పుడూ గుండెల్లో శ్వాసగా ఉంచుకుంటారు. భారతదేశ ప్రతి సంతోషాన్ని పంచుకుంటారు. భారతదేశం సాధించిన ప్రతి విజయాన్ని సంబరంగా జరుపుకుంటారు.
మిత్రులారా,
21వ శతాబ్దపు భారతదేశం, నేడు పురోగమిస్తున్న వేగం, అభివృద్ధి జరుగుతున్న స్థాయి అపూర్వం. కేవలం పదేళ్లలో భారత్ 25 కోట్ల మందిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చింది. కేవలం పదేళ్లలో ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించే రోజు కూడా ఎంతో దూరంలో లేదు. భారత్ విజయాన్ని ప్రపంచం చూస్తోంది. మన చంద్రయాన్ శివ–శక్తి స్థానానికి చేరుకున్నప్పుడు, మనమందరం గర్వించాం. ఈ రోజు, ప్రపంచం డిజిటల్ ఇండియాను చూసి ఆశ్చర్యపడుతుంటే, మనందరం గర్వపడుతున్నాం. పునరుత్పాదక ఇంధనం, విమాన ప్రయాణ వ్యవస్థలు, విద్యుత్ రవాణా, విస్తృతమైన మెట్రో నెట్వర్క్, లేదా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఇలా ఏ రంగమైనా ఈ రోజు, భారతదేశంలోని ప్రతి రంగం ఆకాశాన్ని తాకే దిశగా పురోగమిస్తోంది. భారతదేశ ప్రగతిక వేగం కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ రోజు, భారతదేశం “మేడ్ ఇన్ ఇండియా” బ్రాండ్ యుద్ధ విమానాలు, రవాణా విమానాలను తయారు చేస్తోంది. మీరు ప్రవాస భారతీయ దినోత్సవానికి “ మేడ్ ఇన్ ఇండియా” విమానంలో భారత్ కు వచ్చే రోజు కూడా ఎంతో దూరం లేదు.
మిత్రులారా,
భారతదేశం సాధించిన ఈ విజయాలు, భారతదేశంలో నేడు ఉద్భవిస్తున్న అవకాశాలు ప్రపంచంలో భారతదేశం ప్రాముఖ్యత పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. ఈ రోజు, భారత్ చెప్పేది వినేందుకు ప్రపంచం ఆసక్తి కనబరుస్తోంది. ఈరోజు భారతదేశం తన వాదనను బలంగా వినిపించడమే కాకుండా, గ్లోబల్ సౌత్ గళాన్ని కూడా గట్టిగా వినిపిస్తోంది. ఆఫ్రికన్ యూనియన్ కు జి-20 శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత్ ప్రతిపాదించినప్పుడు, సభ్య దేశాలన్నీ ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చాయి. ‘మానవత్వానికి తొలి ప్రాధాన్యం‘ అనే స్ఫూర్తితో భారతదేశం అంతర్జాతీయంగా తన పాత్రను విస్తరిస్తోంది.
మిత్రులారా,
ఈరోజు భారతదేశ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. మన నిపుణులు ప్రపంచంలోని ప్రధాన సంస్థల ద్వారా ప్రపంచ ప్రగతికి సహకరిస్తున్నారు. రేపు, మన సహచరుల్లో అనేక మంది గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రవాసి భారతీయ సన్మాన్ పురస్కారాలు స్వీకరించబోతున్నారు. ఈ గౌరవం అందుకోబోతున్న ప్రముఖులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మిత్రులారా,
రాబోయే అనేక దశాబ్దాల పాటు, భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా, అత్యంత నైపుణ్యం కలిగిన జనాభా కలిగిన దేశంగా ఉంటుంది. నైపుణ్యాల కోసం ప్రపంచ డిమాండ్ లో గణనీయమైన భాగాన్ని భారతదేశం తీరుస్తుంది. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు నైపుణ్యం కలిగిన భారత యువతను చేతులు సాచి స్వాగతిస్తున్నాయని మీరు గమనించి ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ భారతీయుడు విదేశాలకు వెళ్లినా వారు అద్భుతమైన నైపుణ్యాలతో రాణించేలా భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. అందుకే యువతలో నైపుణ్యం, రీ స్కిల్, అప్ స్కిల్ పై నిరంతరం దృష్టి సారిస్తున్నాం. మేము మీ సౌలభ్యానికి, సౌకర్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాము. మీ భద్రత, సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తాం. భారతీయులు ఏ దేశంలో ఉన్నా విపత్కర పరిస్థితుల్లో వారికి సహాయం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నాం. ఇది నేటి భారత విదేశాంగ విధానానికి మార్గదర్శక సూత్రాలలో ఒకటి. గత దశాబ్దకాలంగా, ప్రపంచవ్యాప్తంగా మన రాయబార కార్యాలయాలు సునిశితంగా, క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి.
మిత్రులారా,
గతంలో, అనేక దేశాల్లో ప్రజలు దౌత్యసంబంధ సేవలను పొందడానికి చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. సహాయం కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ సమస్యలను పరిష్కరిస్తున్నారు. కేవలం గత రెండేళ్లలోనే 14 కొత్త రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు ప్రారంభమయ్యాయి. ఒసిఐ కార్డుల పరిధిని కూడా విస్తరించారు. ఇప్పుడు ఇది మారిషస్ 7వ తరానికి చెందిన పిఐఒలకు, అలాగే సురినామ్, మార్టినిక్, గ్వాడెలోప్ల 6వ తరానికి చెందిన పిఐఒలకు వర్తిస్తుంది.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ప్రవాస భారతీయుల చరిత్ర, వివిధ దేశాలకు వారి ప్రయాణం, ఆ దేశాల్లో భారత పతాకాన్ని ఎగురవేసిన వారి కథలు భారతదేశ వారసత్వంలో ముఖ్యమైన భాగం. ఇలాంటి ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన ఎన్నో కథలను మీరు పంచుకోవాలి, ప్రదర్శించాలి, భద్రపరచాలి.ఇవి మన ఉమ్మడి వారసత్వం, మన ఉమ్మడి సంపద. కొద్ది రోజుల క్రితం నా ‘మన్ కీ బాత్‘ ప్రసంగంలో దీనికి సంబంధించిన ఒక కార్యక్రమం గురించి వివరంగా మాట్లాడాను. కొన్ని శతాబ్దాల క్రితం గుజరాత్ కు చెందిన అనేక కుటుంబాలు ఒమన్ లో స్థిరపడ్డాయి. వారి 250 ఏళ్ల ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. డిజిటలైజ్ చేసిన ఈ కమ్యూనిటీకి సంబంధించిన వేలాది డాక్యుమెంట్లను ప్రదర్శిస్తూ దీనికి సంబంధించిన ఎగ్జిబిషన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా కమ్యూనిటీ పెద్దలతో, ముఖ్యంగా ఇప్పుడు వయస్సులో పెద్దవారైన అనేక మంది సభ్యుల అనుభవాలను పంచుకోవడానికి ఒక ‘ఓరల్ హిస్టరీ ప్రాజెక్ట్’ కూడా చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వారు తమ అనుభవాలు పంచుకున్నారు. ఆ కుటుంబాల్లో అనేకమంది ఈరోజు ఇక్కడ మనతో ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.
మిత్రులారా,
ఇలాంటి ప్రయత్నాలు వివిధ దేశాలలోని ప్రవాస భారతీయులతో కూడా చేయాలి. ఉదాహరణకు, మనకు గిర్మిటియా సోదరులు, సోదరీమణులు ఉన్నారు. ఎందుకు గిర్మిటియా సమాజానికి సంబంధించిన ఒక డేటాబేస్‌ను ఎందుకు సృష్టించకూడదు? వారు భారతదేశంలోని ఏ గ్రామాలు లేదా నగరాల నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్లి స్థిరపడ్డారో గుర్తించాలి. వారు ఏ విధమైన జీవితాన్ని గడిపారు, ఎలా సవాళ్లను అవకాశాలుగా మార్చుకున్నారు—ఇవన్నీ సినిమాలు లేదా డాక్యుమెంటరీల రూపంలో చూపించవచ్చు. గిర్మిటియా వారసత్వంపై అధ్యయనం చేపట్టవచ్చు, అలాగే దీని మీద సమగ్రమైన పరిశోధనలు చేయవచ్చు. విశ్వవిద్యాలయాల్లో దీని కోసం ప్రత్యేకమైన విభాగాలు స్థాపించవచ్చు. అలాగే, విశ్వ గిర్మిటియా సమావేశాలను నిర్ణీత సమయాల్లో నిర్వహించవచ్చు. దీని కోసం అవకాశాలను పరిశీలించి, దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు నా బృందాన్ని పనిచేయమని నేను వారిని కోరుతాను.
మిత్రులారా,
ఈ మంత్రం కింద నేటి భారతదేశం అభివృద్ధి, వారసత్వం రెండింటితో ముందుకు సాగుతోంది. జీ-20 సదస్సు సందర్భంగా భారతదేశ వైవిధ్యాన్ని ప్రపంచానికి ప్రత్యక్షంగా తెలిసేలా దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించాం. కాశీ–తమిళ సంగమం, కాశీ–తెలుగు సంగమం, సౌరాష్ట్ర–తమిళ సంగమం వంటి కార్యక్రమాలను సగర్వంగా నిర్వహించాం. మరికొద్ది రోజుల్లో సెయింట్ తిరువళ్లువర్ డే జరుపుకోబోతున్నాం. సెయింట్ తిరువళ్లువర్ బోధనలను వ్యాప్తి చేయడానికి మా ప్రభుత్వం తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సింగపూర్ లో తొలి కేంద్రం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అమెరికాలోని హ్యూస్టన్ విశ్వవిద్యాలయంలో తిరువళ్లువర్ పీఠాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ తమిళ భాషను, తమిళ వారసత్వాన్ని, భారతదేశ వారసత్వాన్ని ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకువెడుతున్నాయి.
మిత్రులారా,
భారతదేశంలోని మన వారసత్వ ప్రదేశాలను అనుసంధానించడానికి మేము అనేక చర్యలు తీసుకున్నాం. ఉదాహరణకు, రాముడు, సీతామాత తో సంబంధం ఉన్న ప్రదేశాలను సందర్శించడానికి ప్రత్యేక రామాయణ ఎక్స్ ప్రెస్ రైలు ఉంది. భారత్ గౌరవ్ రైళ్లు దేశంలోని ముఖ్యమైన వారసత్వ ప్రదేశాలను కూడా కలుపుతాయి. సెమీ–హైస్పీడ్ వందే భారత్ రైళ్లతో, మేము దేశంలోని ప్రధాన వారసత్వ కేంద్రాలను అనుసంధానించాం. కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక ప్రవాసీ భారతీయ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించే అవకాశం వచ్చింది. పదిహేడు పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడానికి సుమారు 150 మంది ఈ రైలులో ప్రయాణిస్తారు. ఒడిశాలో కూడా మీరు తప్పక సందర్శించవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా త్వరలో ప్రారంభం కానుంది. ఇలాంటి అవకాశం జీవితంలో ఎప్పుడో గాని రాదు. మీరు కూడా కుంభమేళా సందర్శించాలని కోరుకుంటున్నాను.
మిత్రులారా,
1947లో, భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందింది. ఇందులో మన ప్రవాసులు ప్రధాన పాత్ర పోషించారు. వారు విదేశాలలో ఉంటూనే భారత స్వాతంత్ర్యం కోసం తమ వంతు కృషి చేశారు. ఇప్పుడు, మన లక్ష్యం 2047. మనం భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి. మీరు భారతదేశం అభివృద్ధికి ఇప్పటికీ అసాధారణమైన సహకారం అందిస్తున్నారు. ధన్యవాదాలు. మీరు కష్టపడి చేస్తున్న పని వల్ల, భారతదేశం ప్రపంచంలో రెమిటెన్స్ విషయంలో అగ్రస్థానాన్ని సాధించింది. ఇప్పుడు, మనం ఇంతకు మించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మీరు భారతదేశంలో మాత్రమే కాదు, ఇతర దేశాలలో కూడా పెట్టుబడులు పెట్టుతున్నారు.మన గిఫ్ట్ సిటీ వ్యవస్థ మీ ఆర్థిక సేవలు, పెట్టుబడి అవసరాలను తీర్చడంలో సహాయపడవచ్చు. మీరు అందరూ దీనిని ఉపయోగించుకుని, భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత బలపరచవచ్చు. మీరు చేసే ప్రతి ప్రయత్నం భారతదేశాన్ని బలోపేతం చేసేందుకు, దాని అభివృద్ధికీ సహాయపడుతుంది.
అలాంటి రంగాల్లో హెరిటేజ్ టూరిజం ఒకటి. ప్రస్తుతం, భారతదేశం ప్రధానంగా దాని పెద్ద మెట్రో నగరాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. అయినా భారతదేశం ఈ పెద్ద నగరాలకే పరిమితం కాదు. భారతదేశంలో ఎక్కువ భాగం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల లోనూ, గ్రామాలలోనూ ఉంది, ఇక్కడ మీరు భారతదేశ వారసత్వాన్ని చూడవచ్చు. ఈ వారసత్వంతో ప్రపంచాన్ని అనుసంధానం చేయాలి. మీ పిల్లలను భారతదేశంలోని ఈ చిన్న నగరాలు, గ్రామాలకు తీసుకెళ్లాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీరు తిరిగి వచ్చిన తర్వాత మీ అనుభవాలను మీ స్నేహితులతో పంచుకోండి. వచ్చేసారి మీరు భారతదేశానికి వచ్చినప్పుడు, భారతేతర మూలాలున్న కనీసం ఐదుగురు స్నేహితులను మీతో తీసుకురండి అని నేను సూచించాలనుకుంటున్నాను. భారతదేశాన్ని సందర్శించడానికి, భారతదేశాన్ని అనుభూతి చెందడానికి మీతో నివసిస్తున్న మీ స్నేహితులను ప్రేరేపించండి.
మిత్రులారా,
ప్రత్యేకంగా ప్రవాస యువ స్నేహితులందరికీ నేను ఒక అభ్యర్థన చేస్తున్నాను. భారతదేశం గురించి ఎక్కువగా తెలుసుకునేందుకు క్విజ్‌లో పాల్గొనండి. ఇది భారతదేశాన్ని మీకు మరింత అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. మీరు ‘స్టడీ ఇన్ ఇండియా’ ప్రోగ్రామ్ నుండి కూడా ప్రయోజనం పొందేలా చూసుకోవాలి. ఐసిసిఆర్ స్కాలర్షిప్ పథకం ప్రవాస యువతకు మరొక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలి.
మిత్రులారా,
మీరు నివసించే దేశాలలో భారతదేశ వాస్తవ చరిత్రను ప్రచారం చేయడంలో కూడా మీరు ముందుండాలి. అనేక దేశాలలో ప్రస్తుతం ఉన్న తరానికి మన సంపద, సుదీర్ఘకాల బానిసత్వం, మన పోరాటాలు గురించి తెలియదు. మీరు భారతదేశ నిజమైన చరిత్రను ప్రపంచానికి తెలియచేయడంలో సహాయం చేయవచ్చు.
మిత్రులారా,
నేడు భారతదేశాన్ని ‘విశ్వ బంధు‘ అని పిలుస్తారు. ఈ అంతర్జాతీయ అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి మీరు మీ ప్రయత్నాలను పెంచాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు, మీరు నివసిస్తున్న దేశంలో, మీరు అవార్డు ఫంక్షన్లను నిర్వహించవచ్చు. ఈ అవార్డులు మీరు నివసిస్తున్న దేశంలోని స్థానిక నివాసితులకు సంబంధించినవి కావచ్చు. మీరు సాహిత్యం, కళలు, చేతివృత్తులు, సినిమా, థియేటర్ లేదా మరే ఇతర రంగమైనా వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను గౌరవించవచ్చు. ఈ సాధకులను ఆహ్వానించండి. భారతదేశ ప్రవాసుల తరపున వారికి అవార్డులు, సర్టిఫికేట్లను అందించండి. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్ మీకు సహాయం చేయడానికి మరింత సంతోషిస్తాయి. ఇది ఆ దేశ ప్రజలతో మీ వ్యక్తిగత సంబంధాన్ని బలోపేతం చేస్తుంది వారితో మీ భావోద్వేగ బంధాన్ని పటిష్టం చేస్తుంది. .
మిత్రులారా,
స్థానిక ఉత్పత్తులను గ్లోబల్‌గా మార్చడంలో కూడా మీరు ముఖ్యమైన పాత్ర పోషించగలరు. మేడ్ ఇన్ ఇండియా ఫుడ్ ప్యాకెట్లు, బట్టలు, లేదా ఇతర ఉత్పత్తులను కొనడానికి ప్రయత్నించండి. కొన్ని వస్తువులు మీ దేశంలో అందుబాటులో లేకపోతే, వాటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోండి. మీ వంటగదిలో, మీ డ్రాయింగ్ రూమ్‌లో, ఇంకా బహుమతులుగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను చేర్చండి. ఇది ఒక అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో మీరు అందించే గొప్ప సహకారం అవుతుంది.
మిత్రులారా,
తల్లి, భూమికీ సంబంధించి నాకు మరో విన్నపం ఉంది. కొన్ని రోజుల క్రితం గయానాలో మా అమ్మ పేరు మీద ఒక మొక్కను నాటడానికి రాష్ట్రపతితో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను. భారత్ లో ఇప్పటికే లక్షలాది మంది ఇలా అమ్మ పేరుతో మొక్కలు నాటుతున్నారు. మీరు ఎక్కడున్నా, మీ తల్లి పేరు మీద ఒక చెట్టు లేదా మొక్కను నాటాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీరు భారతదేశం నుండి తిరిగి వెళ్ళేటప్పుడు, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పం మీతో పాటు ఉంటుందని నేను నమ్ముతున్నాను. అందరం కలిసి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించుకుందాం.
2025 నూతన సంవత్సరం మీ అందరికీ ఆరోగ్య, ఆర్థిక సౌభాగ్యాన్ని అందించాలి. కొత్త సంవత్సరంలో మీరు సంతోషం, సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మరోసారి మీ అందరినీ భారతదేశానికి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
శుభాభినందనలు, అందరికీ ధన్యవాదాలు.
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం.
***
Pleased to speak at the Pravasi Bharatiya Divas convention in Bhubaneswar. The Indian diaspora has excelled worldwide. Their accomplishments make us proud. https://t.co/dr3jarPSF4
— Narendra Modi (@narendramodi) January 9, 2025
Pravasi Bharatiya Divas has become an institution to strengthen the bond between India and its diaspora. pic.twitter.com/PgX3OtiZO0
— PMO India (@PMOIndia) January 9, 2025
भविष्य युद्ध में नहीं है, बुद्ध में है। pic.twitter.com/7dBzcnVKnS
— PMO India (@PMOIndia) January 9, 2025
We are not just the Mother of Democracy; democracy is an integral part of our lives. pic.twitter.com/oyZjOUpUhm
— PMO India (@PMOIndia) January 9, 2025
21st century India is progressing at an incredible speed and scale. pic.twitter.com/6SJGXpY7pA
— PMO India (@PMOIndia) January 9, 2025
Today's India not only firmly asserts its own point but also strongly amplifies the voice of the Global South. pic.twitter.com/bdQJZn77Gb
— PMO India (@PMOIndia) January 9, 2025
India has the potential to fulfill the world's demand for skilled talent. pic.twitter.com/llhwA1dTA8
— PMO India (@PMOIndia) January 9, 2025
We consider it our responsibility to help our diaspora during crisis situations, no matter where they are. pic.twitter.com/QS37yd8zYD
— PMO India (@PMOIndia) January 9, 2025
PM @narendramodi's requests to Indian diaspora... pic.twitter.com/XcUT7GatZ0
— PMO India (@PMOIndia) January 9, 2025
I have always believed that our diaspora is our Rashtradoot, and I closely interact with them during my visits overseas. pic.twitter.com/s7YUABrTGQ
— Narendra Modi (@narendramodi) January 9, 2025
India is scaling new heights of progress and there are many examples to illustrate this… pic.twitter.com/ySJ18GbplR
— Narendra Modi (@narendramodi) January 9, 2025
The Government of India is actively working towards skilling, re-skilling and up-skilling, which enables our youth to be self-reliant. pic.twitter.com/sLv214YBwV
— Narendra Modi (@narendramodi) January 9, 2025
An appeal to our diaspora on ways to preserve and celebrate our history as well as heritage… pic.twitter.com/idFAVr2Wcu
— Narendra Modi (@narendramodi) January 9, 2025
I invite the Indian diaspora and people from all over the world to visit the Mahakumbh at Prayagraj. pic.twitter.com/Emu9tRkeVR
— Narendra Modi (@narendramodi) January 9, 2025