Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కర్ణాటక లోని బెళగావి లో జరిగిన కర్ణాటక లింగాయత్ ఎడ్యుకేషన్ సొసైటీ సెంటినరి ఉత్సవాలలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

కర్ణాటక లోని బెళగావి లో జరిగిన కర్ణాటక లింగాయత్ ఎడ్యుకేషన్ సొసైటీ సెంటినరి ఉత్సవాలలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం


ప్రియ‌మైన సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ముందుగా, ఆ ఏడుగురు మ‌హ‌ర్షుల‌కు నేను నా ప్ర‌ణమిల్లుతున్నాను. దేశంలో గురువుల‌కు కొర‌త లేదు. మంచి గురువులు, చాలా మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. అంకిత భావంతో ప‌ని చేసే అధ్యాప‌కులు కూడా ఉన్నారు. అయితే చ‌రిత్ర‌లో మ‌ర‌ణం లేని గురువులు అనే మాటలను ఉప‌యోగించాలంటే, దానిని ఆ ఏడుగురు గురువుల‌కు ఉప‌యోగించాలి. వంద సంవ‌త్స‌రాల తరువాత కూడా అటువంటి గురువులు ఈ త‌రానికి పాఠాలు చెబుతున్నారు. చ‌రిత్ర‌లో మ‌న‌కు కె ఎల్ ఇ సొసైటీ సాధించిన విజ‌యం వంటి విజయం అరుదుగా క‌నిపిస్తుంది. ల‌క్ష‌ల మంది విద్యార్థులు నా ముందున్నారు. ఆ సప్త మ‌హ‌ర్షులు చేసిన అమోఘ‌మైన కృషి కార‌ణంగానే ఇది సాధ్య‌మైంది.

లోక్ మాన్య బాల గంగాధ‌ర తిల‌క్ స్ఫూర్తి తో వంద సంవ‌త్స‌రాల క్రితం మ‌హ‌ర్షి శ్రీ బ‌స‌వేశ్వ‌ర‌ గారు ఈ గ‌డ్డ‌ మీద సామాజిక విప్ల‌వ శంఖాన్ని పూరించారు. ఆ విప్ల‌వం అంద‌రిలో చైత‌న్యాన్ని ర‌గిలించ‌డ‌మే కాకుండా ఆ తరువాత అనేక త‌రాలు విద్య‌ను అభ్య‌సించ‌డానికి కార‌ణ‌మైంది. ఇది దేశం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం. విద్య పైన న‌మ్మ‌కం గ‌ల వారంద‌రికీ ఇది గ‌ర్వ‌కార‌ణం.

సంస్థ‌లు పుట్టుకొస్తుంటాయి. జ‌యాప‌జ‌యాలు సాధిస్తుంటాయి. కొన్ని సార్లు మూత‌ ప‌డుతుంటాయి. అయితే ఆ ఏడుగురు మ‌హ‌ర్షులు వేసిన బ‌ల‌మైన పునాది ఎటువంటిది అంటే, వంద సంవ‌త్స‌రాల తరువాత కూడా వారు స్థాపించిన సంస్థ యావత్తు దేశానికి స్ఫూర్తిని అందిస్తోంది.

ఈ రోజు, ప్ర‌పంచంలో ప్ర‌తి మూల‌నా తాము కె ఎల్ ఇ విద్యార్థుల‌ం అని చెప్పుకొనే వారు ఉన్నారు. కె ఎల్ ఇ విద్యార్థి ఒక ఇంట‌ర్ వ్యూ కు హాజ‌ర‌యితే, ఆ ఉద్యోగానికి సంబంధించిన ప్ర‌శ్న‌లు ఎదుర్కొంటాడు. తాను సాధించిన స‌ర్టిఫికెట్ ల గురించి వివ‌రిస్తాడు; మార్కుల గురించి చెప్పుకొంటాడు. ఇదంతా బాగానే ఉంది. అయితే ఆ విద్యార్థికి సంబంధించిన మ‌హ‌త్త‌ర‌మైన విష‌యం అత‌ను కె ఎల్ ఇ విద్యార్థి కావ‌డ‌మే. తమ ద‌గ్గ‌రకు వ‌చ్చిన అభ్య‌ర్థి కె ఎల్ ఇ విద్యార్థి అని తెలుసుకోగానే ఇంట‌ర్ వ్యూ చేసే వారు వెంటనే వారికి ఆహ్వానం ప‌లుకుతారు. ప‌లు త‌రాల‌కు చెందిన‌ వారు అవిశ్రాంతంగా శ్ర‌మించడం వ‌ల్ల, అనేక మంది కృషి కార‌ణంగా ఒక చైత‌న్య‌వంత‌మైన వ్య‌వ‌స్థ ప్రారంభ‌మై ఇప్ప‌టికీ వెలుగులను ప్రసరిస్తూనే ఉంది.

ప్ర‌స్తుతం విద్యారంగం వ్యాపార‌మ‌యం కావ‌డంపై దేశ‌వ్యాప్తంగా వాడిగా వేడిగా చ‌ర్చ జ‌రుగుతోంది. విద్యావ్యాపారంలో చేరి లాభాలు పొందాల‌ని పెద్ద పెద్ద వ్యాపారులు కూడా ఆలోచిస్తున్నారు. అటువంటి వారంద‌రికీ ఆ ఏడుగురు మ‌హ‌ర్షుల కృషి ఒక గుణ‌పాఠం వంటిది. వంద సంవత్సరాల కిందట వారి జీతం ఎంత ఉండ‌వ‌చ్చు; మ‌హా అంటే 30, 35 లేదా 50 రూపాయ‌లు ఉండ‌వ‌చ్చు. వంద ఏళ్ల క్రితం ప్ర‌తి నెలా 30, 35 లేదా 50 రూపాయ‌లు జీతంగా తీసుకున్న‌ వారు స‌మాజానికి అపార‌మైన సేవ‌లను అందించారు. విద్యారంగంలో సేవ‌లు అందించాల‌నుకునేవారికి ఇది స్ఫూర్తిగా, ఉదాహ‌ర‌ణ నిలుస్తుంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, రాజ‌కీయ పార్టీలు కూడా 100 సంవత్సరాల పాటు మ‌నుగ‌డ సాగించ‌ లేవు. కాల‌ క్ర‌మంలో అవి వ‌ర్గాలుగా విడిపోతాయి. కుటుంబాలు కూడా 100 సంవ‌త్స‌రాలు కొన‌సాగ‌ లేవు. అటువంటిది ఒక సంస్థ 100 సంవ‌త్స‌రాలుగా కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించ‌డం విశేష‌మే. ఈ సంస్థ నిర్వాహ‌కుల‌ను ప్ర‌జాస్వామికంగా జ‌రిగే ఎన్నిక ద్వారా ఎన్నుకొంటారు. ప్ర‌జ‌ల డ‌బ్బుతో ఈ సంస్థ ప‌ని చేస్తోంది. పూర్వ విద్యార్థుల స‌హాయం ఉంది. ఎంతో ఘ‌న‌ చ‌రిత్ర‌ కలిగిన ఈ సంస్థ దేశంలో మంచి ఆద‌ర్శ‌ప్రాయ‌మైనటువంటి ఒక సంస్థ‌.

ఢిల్లీ లోని మన వివేకవంతులైన మిత్రులకు, ప్రసార మాధ్యమాల లోని మన స్నేహితుల‌కు నేను ఈ రోజు ప్రత్యేకంగా విజ్ఞ‌ప్తి చేయదలచాను; వారిని నేను బ‌హిరంగంగా వేడుకొంటున్నాను.. ఎవ‌రైనా ష‌ష్టి పూర్తి చేసుకొంటే గనక వారిని గురించి మంచి వ్యాసం ప‌త్రిక‌ల్లో ప్ర‌చుర‌ణ అవుతోంది. ఏదైనా ప్ర‌భుత్వం అధికారం లోకి వ‌చ్చి 100 ఏళ్ల‌యిన సంద‌ర్భంగా ప‌త్రిక‌ల్లో దాని గురించి మంచి వ్యాసం ప‌త్రిక‌ల్లో వ‌స్తుంది. ఎవ‌రికైనా 75 ఏళ్లు నిండితే, వారిని ప్ర‌శంస‌ల్లో ముంచెత్తుతాం. ఇదే కోవ లో భార‌తీయ ప్రసార మాధ్యమాలు కూడా ఆ ఏడుగురు మ‌హ‌ర్షుల కృషి పైన క‌థ‌నాలను, వ్యాసాలను ప్ర‌చురిస్తే ఎంతో బాగుంటుంది. ఎంతో గొప్ప‌దైన ఈ సంస్థ ఇప్పుడు శ‌తాబ్ది ఉత్స‌వాలను జ‌రుపుకొంటోంది. దీనిపైన మీడియా దృష్టి పెడితే, ఈ సంస్థను గురించి యావత్తు దేశానికి తెలుస్తుంది. ఈ ప‌ని ఎందుకు చేయాలంటే, దేశం లోని వివిధ ప్రాంతాల‌కు చెందిన‌ వారిలో త‌మ జీవితాల‌ను విద్యారంగానికి అంకితం చేసే వారు ఉన్నారు. స‌మాజానికి త‌మ జీవితాల‌ను అంకితం చేయాల‌నుకొనే వారు ఉన్నారు. ఇటువంటి వారు అంద‌రూ గొప్ప సంస్థ‌ల కార్య‌క్ర‌మాల‌ నుండి స్ఫూర్తి ని పొంది బ‌లోపేత‌ం అవుతారు. ఇటువంటి ఉద్య‌మాన్ని దేశంలోని ఇత‌ర ప్రాంతాలలో ప్రారంభించ‌డానికి కృషి చేస్తారు.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, దేశ స్వాతంత్ర్య పోరాటం జ‌రుగుతున్న రోజుల్లో గాంధీ గారు కూడా ఒక విద్యాసంస్థ‌ను ప్రారంభించారు. దాని పేరు గుజ‌రాత్ విద్యాపీఠ్‌. స్వాతంత్ర్య స‌మ‌రానికి సైనికుల‌ను త‌యారు చేయ‌డానికే ఆయ‌న ఈ సంస్థ‌ను ప్రారంభించారు. స్వాతంత్ర్య ఉద్య‌మానికి సైనికుల‌ను త‌యారు చేయ‌గ‌లిగే విద్య కోసం, దేశం స్వ‌యం స‌మృద్ధిని సాధించ క‌లిగే చ‌దువు కోసం లోక్ మాన్య బాల గంగాధ‌ర తిల‌క్ ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ఈ 21 వ శ‌తాబ్దంలో కూడా ప్ర‌పంచంపైన భార‌త‌దేశం త‌న ముద్ర‌ను వేయాలంటే ఆ ప‌నిని యువ‌త ద్వారా మాత్ర‌మే చేయ‌గ‌లం. వారు నైపుణ్యాలను సాధించ‌డం విద్య‌ ద్వారా మాత్ర‌మే సాధ్యం.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, ఒక స‌మ‌యంలో ప్ర‌పంచం భార‌త‌దేశం గురించి ఏమ‌ని అనుకొనేది ? పాములు ప‌ట్టే వాళ్ల దేశ‌మ‌ని, మంత్ర‌గాళ్ల నిల‌య‌మ‌ని విదేశీయులు మ‌న గురించి చెప్పుకొనే వారు. దేశంలో విజ్ఞానం లేద‌ని పాములతో, ఎలుక‌లతో నిండి ఉంద‌ని భావించే వారు. అయితే 18- 20 ఏళ్ల యువ‌తీయవ‌కులు కీ బోర్డు మీద వారి ప్ర‌తిభను ప్రదర్శించడం మొద‌లుపెట్ట‌డంతోనే అప్పుడు ప్ర‌పంచం మ‌న చుట్టూ తిర‌గ‌డం మొద‌లుపెట్టింది. విదేశాలలో మ‌న గురించి ఉన్న ఆలోచ‌న‌లో మార్పు వ‌చ్చింది. భారతదేశాన్ని తాను చూస్తున్న దృష్టి కోణాన్ని ప్ర‌పంచం మార్చుకోవలసి వ‌చ్చింది. భార‌త‌దేశానికి వినూత్న‌మైన సామ‌ర్థ్య‌ం ఉంద‌ని, ప్ర‌త్యేక‌మైన బ‌ల‌ం ఉంద‌ని, దానికి ప్ర‌ధాన కార‌ణం విద్య‌యేన‌ని గ్ర‌హించారు. గ‌త 100 ఏళ్ల‌లో ఈ ప్రాంతం లోని స‌మాజాల్లో మార్పులు తేవ‌డంలో మీరు చేసిన కృషి చాలా ముఖ్యమైంది. విద్య‌ ద్వారా క‌ర్ణాట‌క జన‌ జీవితాన్ని బ‌లోపేతం చేశారు. త‌ద్వారా జాతికి సాధికారిత క‌లిగింది. చివ‌రి సారి ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ప్పుడు నాతో ప్ర‌భాక‌ర్ గారు మాట్లాడారు. త‌న‌కు ప్ర‌జ‌లు బాధ్య‌త‌లు అప్ప‌గించి 32 సంవ‌త్స‌రాలు గ‌డిచాయ‌ని ఆయ‌న నాతో అన్నారు. ప్ర‌భాక‌ర్ గారూ, ఇది చిన్న విష‌యం కాదు. మీకు, మీ బృంద స‌భ్యుల‌కు నా అభినంద‌న‌లు. ప్ర‌జాస్వామ్య విధానంలో ఇది సాధ్య‌మవుతోంది. అనేక మంది ప‌లు త‌రాల‌ పాటు శ్ర‌మించారు. ఎటువంటి రాజీ లేకుండా సంస్థ సంక్షేమాన్ని కోరుకొంటూ, విద్యారంగ సంక్షేమాన్ని, విద్యార్థుల సంక్షేమాన్ని ఆశిస్తూ ప‌ని చేయ‌డ‌ం అంటే అది చాలా గొప్ప విష‌య‌మేన‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ రోజు ఈ గొప్ప ప‌నిని ప్ర‌త్య‌క్షంగా చూస్తుంటే, మిమ్మ‌ల్ని నేను ఒక విష‌యం అడ‌గాల‌ని అనుకొంటున్నాను. నేను మిమ్మ‌ల్ని ఒక‌టి కోర‌వ‌చ్చా ? మీ ద‌గ్గ‌ర‌ నుండి నేను దాన్ని పొంద‌లేనా ? ఈయ‌నేం ప్రధాన‌ మంత్రి.. ఎందుకు ఇలా బ‌తిమ‌లాడుతున్నాడ‌ని అనుకుంటున్నారా ? ప్ర‌ధాన మంత్రి మ‌నుగ‌డ సాగించేది ప్ర‌జల స‌హాయం తోనే. మిమ్మ‌ల్ని నేను ఒక‌టి అడ‌గాల‌నుకొంటున్నాను. ఆ ఏడుగురు మ‌హ‌ర్షుల మీద నాకు న‌మ్మ‌కం ఉంది. ఈ ప్ర‌స్తుత వ్య‌వ‌స్థ‌ మీద న‌మ్మ‌కం ఉంది. నా ముందు కూర్చొన్న ల‌క్ష‌లాది విద్యార్థుల మీద నాకు న‌మ్మ‌కం ఉంది. కాబ‌ట్టే నేను ధైర్యంగా మిమ్మ‌ల్ని అభ్య‌ర్థిస్తున్నాను. నేను కోర‌వ‌చ్చా ? బిగ్గరగా స‌మాధాన‌ం ఇవ్వండి. నిజంగానే నేను దానిని కోర‌వ‌చ్చా ?

ఇప్పుడు చెప్పండి.. ఏ విద్యా సంస్థ 1 ల‌క్షా 25 వేల మంది విద్యార్థుల‌ను క‌లిగి అనేక సంస్థ‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ది ? 2020 లో టోక్యో లో జ‌రిగే ఒలంపిక్స్ లో భార‌త‌దేశం త‌ర‌ఫున కొన్ని బంగారు ప‌థకాల‌ను కె ఎల్ ఇ తీసుకొస్తుందా ? స్నేహితుల‌రా, మీరు చేయ‌గ‌ల‌రు. స్నేహితులారా ఇది సాధ్యం. మీకు.. ఇది త‌ప్ప‌కుండా సాధ్యపడుతుంది. నా ప్రియ‌మైన యువ‌తీ యువ‌కుల్లారా, నేను మ‌రో విష‌యం చెప్పాల‌నుకొంటున్నాను. నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు అభివృద్ధికి మూలాధారం. నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు లేక‌పోతే, ప‌రిశోధ‌న జ‌ర‌గ‌క‌పోతే.. అప్పుడు జీవితంలో స్త‌బ్ధ‌త అనేది ఏర్ప‌డుతుంది. ఎవ‌రైతే ప‌రిశోధ‌న‌లు చేస్తారో, వారు మ‌న‌ల్ని దాటి ముందుకు వెళ్లిపోతారు. దాంతో వారు అమ్మే వ‌స్తువుల‌ను కొనే వారిగా మ‌నం మిగిలిపోతాం. గ‌తంలో నేను ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ప్పుడు మీలో చాలా మంచి శాస్త్ర‌వేత్త‌ల‌ను చూశాను. మీకు మంచి సంస్థ‌లు ఉన్నాయి. అంతే కాదు, మీకు నాణ్య‌మైన సాంకేతిక విజ్ఞానం ఉంది. కాబ‌ట్టి అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగల నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లను ప్ర‌తి సంవ‌త్స‌రం ప్ర‌పంచానికి అందించే సమ‌ర్థ‌త మీకు ఉంది. కె ఎల్ ఇ ఆ ప‌ని చేయ‌గ‌ల‌దు. మీరు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లను అందిస్తారు క‌దూ. త‌ప్ప‌క ఆ పని చేస్తారు క‌దూ.

ఇక మూడో విష‌యం, సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూసిన‌ప్పుడు అగ్ర‌భాగాన నిలిచే 100 విశ్వవిద్యాల‌యాల జాబితాలో మ‌న విశ్వ‌విద్యాల‌యం లేదు. ఇది మ‌నం సిగ్గుప‌డవలసినటువంటి విష‌యం. ఈ సారి బ‌డ్జెటు లో కేంద్ర ప్ర‌భుత్వం ఒక ముఖ్య‌మైన నిర్ణ‌యాన్ని తీసుకొంది. ప్ర‌పంచ ఉత్త‌మ విశ్వ‌విద్యాల‌యాల జాబితాలో భార‌త‌దేశానికి స్థానం ల‌భించేలా చేస్తామంటూ పది ప్ర‌భ‌త్వ విశ్వ‌విద్యాల‌యాలు, ప‌ది ప్రైవేటు విశ్వ‌విద్యాల‌యాలు ప్ర‌తిన బూనాల‌ని చెప్ప‌డం జ‌రిగింది. ఈ విష‌యంలో ముందుకు వ‌చ్చే విశ్వ‌విద్యాలయాల‌కు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఆర్ధిక స‌హాయం చేస్తుంది. అలాంటి విశ్వ‌విద్యాల‌యాల‌కు ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల నుండి స‌డ‌లింపును ఇవ్వ‌డం జ‌రుగుతుంది. అది, ఇది అంటూ పెట్టే ష‌ర‌తుల‌ నుండి మిన‌హాయింపు దొరుకుతుంది. వారికి పూర్తి స్వేచ్ఛ‌ను ఇవ్వ‌డం జ‌రుగుతుంది. ఈ దేశంలోని ప‌ది ప్రైవేటు విశ్వ‌విద్యాల‌యాల‌ను ఆహ్వానిస్తున్నాను. అలాగే, ప‌ది ప్ర‌భుత్వ విశ్వ‌వ‌ద్యాల‌యాల‌కు కూడా స్వాగ‌తం పలుకుతున్నాను. ధైర్యంగా ముందుకు రండి. 100 ప్ర‌పంచ ఉత్తమ విశ్వ‌విద్యాల‌యాల్లో ఉన్నది ఏమిటి ? మ‌న ద‌గ్గ‌ర లోపించిన‌ది ఏమిటి ? మ‌నం కూడా వారి స్థాయికి చేరుకొని మ‌న స‌త్తాను చాటాలి. గ‌తంతో పోల్చిన‌ప్పుడు మ‌న దేశం కొంత‌మేరకు ప్ర‌గ‌తి సాధించింది అంటూ పోలిక చేసుకొని సంతృప్తి చెందే త‌త్వం ఇక ముందు ప‌ని చేయ‌దు. ప్ర‌పంచంలో అత్యుత్త‌మ‌మైన జాబితాలో మ‌నం కూడా ఉండాలి. ఇదే మ‌న స్వ‌ప్నం కావాలి. ఇటువంటి క‌ల‌ల‌ తోనే మనం ముందుకు సాగాలి.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, ఈ రోజు నేను క‌ర్ణాట‌క కు వ‌చ్చాను. నేను ఏం చెబుతున్నానో దేశ ప్ర‌జ‌లు టెలివిజన్ ద్వారా తెలుసుకొంటున్నారు. కాబ‌ట్టి ఈ సంద‌ర్భంగా నేను మ‌రో విష‌యాన్ని చ‌ర్చించ‌ద‌లుచుకొన్నాను. దానిని నేను చ‌ర్చించ‌వ‌చ్చా ? దానిని మీరు వినాల‌నుకుంటున్నారా ? 8వ తేదీ రాత్రి 8 గంట‌ల‌కు మీరు ఈ విష‌యాన్ని చూసే ఉంటారు.. బొగ్గు కుంభ‌కోణంలో ల‌క్ష‌లాది కోట్ల రూపాయ‌లు ప‌క్క‌దారి ప‌ట్టాయంటూ, 2 జి స్కామ్‌ లో ల‌క్ష‌లాది కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం దుర్వినియోగం అయింద‌నే వార్త‌లను 2012వ, 2013వ, 2014వ సంవ‌త్స‌రాలలో ప‌త్రిక‌లు ప్ర‌చురించ‌డం మీకు తెలుసును. 8వ తేదీ తరువాత వారి ప‌రిస్థితి ఏమిటో చూసే ఉంటారు. 4,000 రూపాయల కోసం వారు క్యూల‌లో నిల‌బ‌డవలసి వ‌చ్చింది. ప్రియ‌మైన నా దేశ ప్ర‌జ‌లారా, నిజాయతీప‌రులను ఇబ్బందుల‌కు గురిచేయాల‌ని ఈ ప్ర‌భుత్వం అనుకోవ‌డం లేదు. అయితే నా ప్రియ‌మైన సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, అవినీతిప‌రుల‌ను మాత్రం మా ప్ర‌భుత్వం వ‌దిలిపెట్ట‌దు. డెబ్బ‌యి సంవ‌త్స‌రాలు పూర్త‌ి అయ్యాయి. మీరు చెప్పండి.. ఈ దేశం దోపిడీకి గుర‌యిందా, లేదా ? దేశంలో అవినీతి జ‌రిగిందా, లేదా ? అవినీతిప‌రులు భారీ మొత్తంలో న‌గ‌దును త‌మ ఇళ్ల‌లో దాచుకున్నారా, లేదా ? 500 రూపాయల, 1000 రూపాయల నోట్ల‌ను ఎందుకు ర‌ద్దు చేశారంటూ కాంగ్రెస్‌ లోని మ‌న స్నేహితులు అడ‌గ‌డం నాకు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. సోద‌రులారా 25 పైస‌ల నాణేన్ని ఎప్పుడు ర‌ద్దు చేశారో వారిని నేను అడిగానా ? మీకు తెలిసే ఉంటుంది.. 25 పైస‌ల నాణేన్ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఆ స‌మ‌యంలోఈ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ఎవ‌రూ నిర‌స‌న తెలియ‌జేయ‌లేదు. వారికి ఆ మాత్రమే ధైర్యం ఉండ‌డం త‌ప్పేమీ కాదు. వారు కూడా నోట్ల‌ను ర‌ద్దు చేశారు. అయితే వారికి పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసే ధైర్యం లేక‌పోయింది. 25 పైస‌ల్ని ర‌ద్దు చేసి ప‌రిస్థితుల్నిఎలాగోలా నెట్టుకు వచ్చారు. అటువంటి వారు ఈ రోజు న‌న్ను అడుగుతున్నారు 1000 రూపాయ‌ల నోటును ర‌ద్దు చేసి మోదీ ఏమైనా అద్భుతాలు చేశారా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, నా ఉపన్యాసాల‌ను విన్న‌ వారికి, నేను మాట్లాడుతుంటే విన్న‌ వారికి తెలుసు, ఇలా చెప్ప‌డం ఇదే మొద‌లు కాద‌ని. ఈ విష‌యాన్ని గ‌తంలో నేను ఒక సార్వజనీన కార్యక్రమంలో చెప్పాను. కాంగ్రెస్ ర్టీకి ధైర్యం లేక‌నే 25 పైస‌ల నాణేన్ని ర‌ద్దు చేస్తోంది. అదే నాకు గనక అవ‌కాశ‌ం ఉంటే, 1000 రూపాయ‌ల నోటును ర‌ద్దు చేస్తాన‌ని గ‌తంలో అన్నాను. దీనికి సంబంధించిన వీడియో ఇప్ప‌టికీ అందుబాటులో ఉంది. మీరు దానిని చూడవచ్చు.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, ప్ర‌జ‌ల‌ నుండి నేను ఏదీ దాచ‌లేదు. ప్రియ‌మైన నా సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, నేను ఏదైనా అబ‌ద్ధం చెబుతే నాపైన కోపపడే హ‌క్కు మీకు ఉంది. మొద‌టి రోజునే నేను చెప్పాను.. దీని కోసం నాకు 50 రోజుల స‌మ‌యాన్ని ఇవ్వండి అని. 30 డిసెంబ‌ర్ వ‌ర‌కు స‌మ‌యం ఇవ్వండి అని కోరాను. నేను చెప్పానా, లేదా ? మొద‌టి రోజునే నేను చెప్పాను. డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు కొన్ని స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని అన్నాను. అన్నానా, లేదా ? సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, దేశ ప్ర‌జ‌ల మీద న‌మ్మ‌కం తోనే నేను ఈ విష‌యాన్ని చెప్పాను.

దేశంలో కోట్లాది ప్ర‌జ‌లు నిజాయతీగా బతుకుతున్నారు. వారు అవినీతిప‌రుల కార‌ణంగా బాధ‌లు ప‌డుతున్నారు. నిజాయతీ గ‌ల‌ వారిని ర‌క్షించే బాధ్య‌త ప్ర‌భుత్వానికి ఉందా, లేదా? మీరే చెప్పండి.. నిజాయతీ గ‌ల వ్య‌క్తికి ర‌క్ష‌ణ ఉండాలా, వ‌ద్దా ? అవినీతిప‌రుల‌ను శిక్షించ‌డంలో కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవలసి వ‌స్తే ఆ విష‌యంలో మీరు నాకు సాయం చేస్తారా, లేదా ? మీ రెండు చేతులు పైకి ఎత్తి, ఈ విష‌యాన్ని నాకు తెలియ‌జేయండి. ఈ స‌భాప్రాంగ‌ణం మారుమోగేలా చ‌ప్ప‌ట్లు కొట్టి మీ స్పంద‌నను వ్యక్తం చేయండి. ఈ కార్య‌క్ర‌మాన్ని దేశం మొత్తం గ‌మ‌నిస్తోంది. ప్ర‌తి భార‌తీయుడు, ప్ర‌తి భార‌తీయ యువ‌తీయువకులు సందేహాలు ఉన్న వారు ద‌య‌చేసి ఇది చూడండి. ఏర్ కండిషన్ డ్ గ‌దులలో కూర్చొని నిజాయతీ లేని వ్య‌క్తుల‌కు మ‌ద్ద‌తు ప‌లికే వారు ఈ దేశ ప్ర‌జ‌లు ఏమి కోరుకొంటున్నదీ చూడాలి.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, మ‌న దేశంలో ఎన్నిక‌ల కాలంలో వోట‌ర్ల జాబితా అనేది ర‌హ‌స్యంగా ఉంచవలసిన విష‌యం కాదు. అయితే నోట్ల ర‌ద్దు విష‌యాన్ని తీసుకుంటే నోట్లను ర‌ద్దు చేసేంత‌ వ‌ర‌కు ఆ సంగతిని ర‌హ‌స్యంగా ఉంచ‌డం త‌ప్ప‌నిస‌రి. నోట్ల ర‌ద్దు విష‌యం ముందే బయటకు పొక్కి ఉంటే, అప్పుడు అక్ర‌మార్కులు ఏదో విధంగా ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకొని ఉండే వారు. నోట్ల‌ ర‌ద్దుతో దేశం సంతోషంగా వుంది. 8 వ తేదీ రాత్రి పూట దేశం లోని పేద ప్ర‌జ‌లు హాయిగా నిద్ర‌పోయారు. ధ‌న‌వంతులు మాత్రం అదో రోజు రాత్రి నిద్ర‌ మాత్ర‌ల‌ కోసం మార్కెట్ కు వెళ్లారు. అయితే వారికి సాయం చేయ‌డానికి ఎవ‌రూ లేరు.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, ఎన్నిక‌ల స‌మ‌యంలో వోట‌ర్ల జాబితాను త‌యారు చేయ‌డం జ‌రుగుతుంది. అది ర‌హ‌స్య‌మేమీ కాదు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కోసం ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంది. టీచ‌ర్లు, ఆశా వ‌ర్క‌ర్ లను రంగంలోకి దింప‌డం జ‌రుగుతుంది. మొత్తం ప్ర‌భుత్వ‌మే క‌దలి, ఎన్నిక‌లను నిర్వ‌హిస్తుంది. ఇంత జ‌రిగినా స‌రే, పోలింగ్ రోజు మ‌నం అనేక ఫిర్యాదుల‌ను వింటున్నాం. వోట‌ర్ల జాబితా లో నా పేరు క‌నిపించడం లేదు, నా ప్రాంతం పేరు లేదు, నా ఇంటి పేరు లేదు, అది లేదు ఇది లేదు వంటి ఫిర్యాదులు అనేకం వ‌స్తున్నాయి. వ‌స్తున్నాయా, లేదా ? ఎంతో బ‌హిరంగంగా భారీ స్థాయిలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది. అయినా స‌మ‌స్య‌లు ఉంటూనే ఉన్నాయి. ఉంటున్నాయా, లేదా ? దేశంలో సాధార‌ణ ఎన్నిక‌లను నిర్వ‌హించిన‌ప్పుడు దేశ‌మంతా అవి అయిపోవాలంటే మూడు నెల‌ల స‌మ‌యం పడుతుంది. 90 రోజుల‌ పాటు ప్ర‌తిదీ ఆగిపోతుంది. ప్ర‌భుత్వ విభాగాల‌కు చెందిన ప్ర‌తి అధికారి ఎన్నిక‌ల‌ కోసం ప‌ని చేస్తుంటారు.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో ప్రభుత్వం అన్ని వ‌న‌రుల‌ను మోహ‌రించినా, రాజ‌కీయ పార్టీలు త‌మ శ‌క్తియుక్తుల‌న్నిటినీ ప్ర‌ద‌ర్శించినా, ప్రసార మాధ్యమాలు కూడా స‌హాయం చేసినా 60- 70 శాతం మాత్ర‌మే పోలింగ్ జ‌రుగుతోంది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ 90 రోజుల‌ పాటు కొన‌సాగుతుంది. ప్రియమైన నా దేశ ప్ర‌జ‌లారా, నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో నేను అడిగింది కేవ‌లం 50 రోజులు. నా సోద‌రులారా దేశం కోసమే ఈ గడువును అడిగాను.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, ఈ విష‌యాన్ని మీరు చూసే ఉంటారు. ఈ సారి బ‌డ్జెటు లో మేం ఒక ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించాం. రేడియో లో నా కార్య‌క్రమం ‘మ‌న్ కీ బాత్’ (మనసులో మాట) ను విన్న‌ వారికి కూడా ఇది తెలిసి ఉంటుంది. ఆ కార్య‌క్ర‌మంలో నేను ఏమ‌న్నానంటే, దేశంలో అవినీతి పైన పోరాటం చేయాలంటే న‌గ‌దు ర‌హిత స‌మాజాన్ని స్థాపించ‌డం ఒక విధానం అని అన్నాను. నోట్ల మీద ఆధార‌పడ్డ‌, న‌గ‌దు మీద ఆధార‌ప‌డ్డ వ్యాపారాన్ని క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గించాలి. క్రెడిట్ కార్డులను, డెబిట్ కార్డులను, ప్లాస్టిక్ క‌రెన్సీ ని ఉప‌యోగించే దిశ‌గా అడుగులు వేయాలి. అందుకే ఈ బ‌డ్జెటు లో కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకొంది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల మీద వేసే ప‌న్నును తీసేసింది. ఈ ప‌న్నును త‌గ్గించాల‌ని, లేదా పూర్తిగా త‌గ్గించాల‌ని ప్ర‌భుత్వ విభాగాల‌ను కోర‌డం జ‌రిగింది. కొన్ని ప్ర‌భుత్వ విభాగాలు త‌గ్గించాయి, కొన్ని ఈ ప‌న్నును తొల‌గించాయి. ఈ ప‌ని ఎందుకు చేశామంటే, నోట్ల ర‌ద్దును చేప‌ట్టాల‌ని నేను ప్ర‌ణాళిక రూపొందించాను. ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ధ‌న్ ఖాతాలను ప్రారంభించిన‌ప్పుడు పేద ప్ర‌జ‌ల‌ కోసం ఖాతాలను తెరచిన‌ప్పుడు వారికి రూపే కార్డు రూపంలో క్రెడిట్‌ కార్డును, డెబిట్ కార్డును కూడా ఇవ్వ‌డం జ‌రిగింది. దేశంలో దాదాపు 20 కోట్ల మందికి రూపే కార్డుల‌ను ఇవ్వ‌డం జ‌రిగింది. పేద ప్ర‌జ‌లు కూడా క్ర‌మ‌క్ర‌మంగా వాటిని ఉప‌యోగించ‌డం నేర్చుకోవాల‌నేది మా ఆలోచ‌న‌. సోద‌రులారా, ఈ ప‌నిని రెండు సంవ‌త్స‌రాల క్రితం చేయ‌డం జ‌రిగింది. నేను అక‌స్మాత్తుగా ఈ ప‌నిని చేయ‌లేదు. ఏది ఏమైనా, ఈ స‌మ‌స్య చాలా లోతైంది అనే విష‌యం మాత్రం నిజం. ఇది 70 సంవ‌త్స‌రాలుగా ఉన్న స‌మ‌స్య‌. అందుకే అంద‌రికీ ఆందోళ‌న క‌లిగించింది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, నేను మందు మోతాదును పెంచుతున్నాను. మొద‌ట ఒక డోసును ఇచ్చాను. ఆ తరువాత రెండో డోసు ను ఇచ్చాను. ఈ సారి కాస్త బ‌ల‌మైన డోసును ఇచ్చాను. నిజాయతీ లేని వారు, అవినీతిప‌రుల‌ను ర‌క్షించే వారు శ్ర‌ద్ధ పెట్టి వినాలి. డిసెంబ‌ర్ 30 తరువాత కూడా మోదీ త‌న ప‌నిని తాను చేస్తూ పోతాడు. ఆగే ప్ర‌స‌క్తే లేదు. గంగా న‌దిలో 25 పైస‌లు వేయ‌నివారు కూడా ఇప్పుడు నోట్ల క‌ట్ట‌ల్ని వేస్తున్నారు. చెత్త‌ను ఊడ్చే పారిశుధ్య కార్మికురాలు ఓ చెత్త‌కుప్ప‌ లో 57,000 రూపాయ‌లను చూసింది. వెంట‌నే ఆమె ఆ నోట్ల క‌ట్ట‌ల్ని తీసుకొని పోలీసు ఠాణా లో ఇచ్చింది. కాసేప‌టి క్రితం నేను ఇక్క‌డ‌కు వ‌స్తున్న స‌మ‌యంలో ప్ర‌జ‌ల మీద శ్రీ ప్ర‌భాక‌ర్ గారు పూల‌ను చ‌ల్ల‌డం చూశాను. ప‌ర్య‌ట‌న‌కు వచ్చే రాజ‌కీయ నాయ‌కుల మీద 1,000 రూపాయ‌ల నోట్ల‌ను వెద‌జ‌ల్లే రోజు ఎంతో దూరంలో లేద‌ని నేను అన్నాను.

సోద‌ర సోదరీ మ‌ణులారా, వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేయ‌డం చాలా ముఖ్యం. ఇందుకోసం మీ మ‌ద్దతు కావాలి. ఈ ప‌ని చేయ‌డం క‌ష్టంగా అనిపించ‌వ‌చ్చు. ఎటువంటి స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని నేను ఏనాడూ చెప్ప‌లేదు. ప్ర‌తి ఒక్క‌రి కృషితో వాటిని ప‌రిష్క‌రించుకొందాం. బ్యాంకు ఉద్యోగులు ఈ రోజులలో.. వారు ఒక ఏడాదిలో చేసే ప‌ని కన్నా మిన్నగా.. చేసినట్లు పేర్కొన్న ఒక నివేదికను నేను నిన్ననే చూశాను. బ్యాంకు ఉద్యోగులకు శెభాష్ చెప్పడం కోసం మనమంతా క‌ర‌తాళ ధ్వ‌నుల‌ు చేయాలి. ఈ మ‌ధ్య‌ కాలంలో మ‌న బ్యాంకు ఉద్యోగులు మంచి ప‌ని చేస్తున్నారు. వారికి మ‌నం గౌర‌వం ఇవ్వాలి.

బ్యాంకు ఉద్యోగాల‌ నుండి పదవీవిరమణ చేసిన ఉద్యోగులు సైతం వృద్ధాప్యాన్ని లెక్క చేయ‌కుండా బ్యాంకుల‌కు వెళ్లి ప‌ని చేస్తుండ‌డం నేను చూస్తున్నాను. బ్యాంకింగ్ రంగంలో త‌మ‌కు ఉన్న అనుభ‌వాన్ని ఉప‌యోగించుకోవాల‌ని, ఉచితంగానే ప‌ని చేస్తామ‌ని వారు బ్యాంకుల‌కు చెబుతున్నారు. ఇది మ‌న‌ దేశం లోనే జ‌రుగుతుంది. క్యూల‌లో నిల‌బ‌డుతున్న సీనియ‌ర్ సిటిజ‌న్ ల కోసం త‌మ ఇళ్ల‌ నుండి కుర్చీల‌ను తెచ్చి అందిస్తున్న యువ‌తీయువ‌కుల‌ను నేను చూశాను. ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కుండా వారు కూర్చోవ‌డానికి వీలుగా సాయం చేస్తున్నారు. క్యూల‌లో నిల‌బ‌డుతున్న‌ వారికి నీళ్ల‌ను అందించే మాతృమూర్తుల‌ను, సోద‌రీమ‌ణుల‌ను నేను చూశాను.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, కొన్నిసార్లు సినిమా టికెట్ల‌ను కొనుగోలు చేసే విష‌యంలో సినిమా థియేట‌ర్ల ద‌గ్గ‌ర గొడ‌వ‌లు జ‌రుగుతాయి. కానీ ఈ అతి పెద్ద భార‌త‌దేశంలో పౌరులు ఎటువంటి గొడ‌వ‌లు పడకుండా క్యూలో నిల‌బ‌డి వారి వంతు డబ్బు ఉపసంహరణ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ దేశం నిజాయతీ లోపించిన వారితో పడి పడి, అలసిపోయింది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, బాధ‌ ఉంటుందన్న సంగతిని నేను అంగీకరిస్తున్నాను. నా నిర్ణ‌యం వ‌ల్ల ఇబ్బంది క‌లుగుతుంది. కానీ, దేశానికి ముందు ముందు అనేక ప్ర‌యోజ‌నాలు సిద్ధిస్తాయి. నేను హామీ ఇస్తున్నాను.. నేను మీతోనే ఉంటాను. నేను నిజాయతీప‌రుల‌ను కోరుతున్నాను. ద‌య‌చేసి తొంద‌ర‌పడి మీ ద‌గ్గ‌ర ఉన్న రూ.500, రూ.1000 నోట్ల‌ను అవినీతిప‌రుల‌కు ఇవ్వ‌కండి. మీకు డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు స‌మ‌యం ఉంది. మీ ద‌గ్గ‌రున్న రూ.500 నోటు తీసుకొని మీ చేతిలో 400 రూపాయ‌లు పెడ‌తారు. మ‌రొక‌రు మీ ద‌గ్గ‌ర‌కు వచ్చి మీ చేతి లోని రూ.1,000 నోటును తీసుకొని మీ చేతిలో 800 రూపాయ‌లు పెడ‌తారు. మీ ద‌గ్గ‌ర 500 రూపాయ‌ల నోటు ఉందంటే అది 499 రూపాలయ‌ల వంద పైస‌లు.. అంటే మొత్తం డ‌బ్బు మీదే. ఆ మేర‌క మీకు చెల్లించాల్సిన బాధ్య‌త ప్రభుత్వం మీద ఉంది. నిజాయతీగా మీరు సంపాదించిన 1,000 రూపాయ‌ నోటు మీద మీకే హ‌క్కు ఉంటుంది. దానికి స‌మాన‌మైన డ‌బ్బును మీకు ఇచ్చే బాధ్య‌త ప్ర‌భుత్వం మీద ఉంది. ఈ కార్య‌క్ర‌మం డిసెంబర్ 30 వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఈ కార్య‌క్ర‌మం సంతృప్తిక‌రంగా కొన‌సాగుతుంది. కొంత‌మంది వారి ద‌గ్గ‌ర ఉన్న న‌ల్ల‌ధ‌నాన్ని గంగాన‌దిలో పారవేయ‌డం జ‌రుగుతుంది. మ‌రి కొంత‌మంది చెత్త‌కుప్ప‌లలో పారవేయ‌డ‌మో, ముక్క ముక్క‌లుగా చించేయ‌డ‌మో జ‌రుగుతుంది. వారు త‌మ‌ను తాము ర‌క్షించుకోవ‌చ్చు. కానీ, వారి రూ.200 కోట్లు, రూ.400 కోట్లు వృథా అవుతాయి. ఎవ‌రైనా మ‌రో మార్గాన్ని అనుసరించవచ్చు. నిజాయతీప‌రుడిని అనే భ్ర‌మ క‌ల్పించ‌డానికి ఎవ‌రైనా బ్యాంకులో జమ చేస్తే స్వాతంత్ర్యం వ‌చ్చిన తరువాత‌ నుండి ఇంత‌వ‌ర‌కు వారు చేసిన ప‌నుల‌న్నింటినీ నేను బయట‌పెడ‌తాను. 200 శాతం పెనాల్టీ మీద 200 శాతం పెనాల్టీ విధిస్తాను. దేశం చాలా ఘోరంగా దోపిడీకి గురైంది.

ప్రియ‌మైన నా దేశ పౌరులారా, మీరు దోపిడిదొంగ‌ల‌ను చూశారు. 70 సంవ‌త్స‌రాలుగా దేశం దోచుకోబడింది. నాకు 70 నెల‌లు ఇవ్వండి. దేశాన్నిప్ర‌క్షాళ‌న చేస్తాను. మోదీ ఏం చేశాడ‌ని వారు ప్ర‌శ్నించ‌వ‌చ్చు; 8వ తేదీ నాటి రాత్రి 8 గంట‌ల‌కు ప్ర‌సార‌మైన వీడియోను చూపించండి చాలు, మోదీ ఏం చేసిందీ తెలుస్తుంది.

ప్రియమైన నా దేశ వాసులారా, క‌ర్ణాట‌క‌కు చెందిన నా సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, ఇక్కడ ఎక్కువ‌గా గ్రామీణ ప్ర‌జ‌లు ఉన్నారు. మీకు నేను స‌వినయంగా తెలియ‌జేసుకొంటున్నాను. ప‌విత్ర‌మైన కార్యం కోసం నేను ఇక్క‌డ‌కు వ‌చ్చాను. దేశంలో నీతి నిజాయితీల‌ను నెల‌కొల్ప‌డానికి నేను వ‌చ్చాను. మీకు నా నిజాయతీ మీద న‌మ్మ‌క‌ం ఉంటే.. నా ప‌ని విధానం మీకు న‌చ్చితే, మీకు నాపైన న‌మ్మ‌కం ఉంటే న‌న్ను ఆశీర్వ‌దించండి. ఆర్ధిక రంగాన్ని ప్ర‌క్షాళ‌న చేయ‌డానికి స‌హ‌క‌రించండి. మీరు కూర్చున్న చోట‌ే నిల‌బ‌డి క‌ర‌తాళ ధ్వ‌నుల‌తో న‌న్ను ఆశీర్వ‌దించండి. నిజాయతీ తో కూడిన‌టువంటి, ప‌విత్ర‌మైన ఈ ప‌ని కోసం లేచి నిల‌బ‌డి చ‌ప్ప‌ట్ల‌తో మ‌ద్ద‌తు తెలపండి. ఇక రోజంతా ఏర్ కండిషన్ డ్ గదుల‌లో కూర్చొని విమ‌ర్శ‌ించే వారికి నేను చెప్పేదేమిటంటే, ఇదుగో ఈ గ్రామీణ ప్ర‌జ‌లను చూడండి, ఈ విద్యావంతులు, దేశంలో అవినీతి కార‌ణంగా క‌ష్టాలు ప‌డుతూ ఉన్న వీరంతా నాకు ఆశీస్సులను అందిస్తున్నారు. మీ ఆశీస్సుల కార‌ణంగా ఈ దేశంలో ప్ర‌క్షాళ‌న జ‌రుగుతుంది. మీకు ఇవే నా హృద‌యపూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. మీకు నా అభినంద‌న‌లు. నాకు సంతోషంగా ఉంది. సాధార‌ణంగా జ‌ర్న‌లిస్టులు లేచి నిల‌బ‌డరు. మరి ఈ రోజు జ‌ర్న‌లిస్టులు సైతం నిల‌బ‌డ్డారు. మీకు వంద‌ సార్లు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. ఇది గొప్ప సద్భావ సంకేతం. వారికి నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు.

మీ అంద‌రికీ ధన్యవాదాలు.