పిఎంఇండియా
ఇటీవలే ముగిసిన కామన్‌వెల్త్ గేమ్స్ లో పతకాలను గెలుచుకొన్న వారు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఈ రోజు లోక్ కళ్యాణ్ మార్గ్ లో కలుసుకొన్నారు. ఈ సందర్భంగా వారితో ఆయన సంభాషించారు.
పతక విజేతలందరికీ ప్రధాన మంత్రి ప్రశంసించారు. అంతేకాకుండా, పతకాలను గెలుచుకోలేకపోయినప్పటికీ గౌరవప్రదమైన ప్రదర్శన ను ఇచ్చిన వారిని సైతం ఆయన అభినందించారు.
క్రీడాంగణంలో సిద్ధించే సాఫల్యాలు ప్రతి ఒక్కరిలోనూ ప్రేరణను కలిగిస్తాయని ఆయన అన్నారు. పతక విజేతలు వారి యొక్క క్రీడా విన్యాసాలతో భారతదేశం యొక్క స్థాయి ని పెంచారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ క్రీడా రంగస్థలంలో ఒక భారతీయ క్రీడాకారుడు/క్రీడాకారిణి విజయాన్ని సాధించినప్పుడల్లా ఎగసేది భారతీయ పతాకమేనని ఆయన చెప్పారు.
ప్రస్తుతం ఒక క్రీడాకారుడు/క‌్రీడాకారిణి యొక్క జీవితం పలు దశాబ్దాలకు విస్తరిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భంలో మేరీ కామ్ గారు పార్లమెంటు సభ్యురాలుగా ఉండి కూడా బంగారు పతకాలను కైవసం చేసుకొంటున్నారని ఆయన ఉదాహరించారు. అలాగే, పుల్లెల గోపీచంద్ గారు ఒక ఆటగాడిగా ఎంతో విజయవంతమైనటువంటి వృత్తి జీవనాన్ని గడిపిన అనంతరం అనేక మంది వేరు వేరు ఆటగాళ్ళకు శిక్షణను ఇస్తూ, మార్గదర్శకుడుగా ఉంటున్నారని ఆయన ప్రస్తావించారు.
ఇవాళ క్రీడాకారులకు ప్రతిభ, శిక్షణ, ఏకాగ్రత మరియు కఠోర శ్రమ లతో పాటు మానసిక పటుత్వం కూడా ముఖ్యమని ప్రధాన మంత్రి వివరించారు. ఈ సందర్భంలో యోగ యొక్క ప్రయోజనాలను గురించి ఆయన వల్లించారు.
క్రీడాకారులు వారి బాల్యం నాటి నుండి దారిని చూపించిన వివిధ గురువులను, సలహాదారులను మరియు ఉపాధ్యాయులను జ్ఞాపకం పెట్టుకొని వారితో అనుబంధాన్ని కొనసాగించాలని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) కర్నల్ రాజ్యవర్ధన్ సింహ్ రాఠౌడ్ పాలుపంచుకొన్నారు.
****