Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కీలకమైన మౌలిక స‌దుపాయాల‌ రంగ ప్రాజెక్టుల అమ‌లులో ద్వైపాక్షిక ఆధికారిక అభివృద్ధి స‌హాయ ఏజెన్సీల నుండి రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు నేరుగా రుణం పొందేందుకు వీలు క‌ల్పించే విధాన‌ప‌ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


మౌలిక స‌దుపాయాల‌కు సంబంధించిన కీలక ప్రాజెక్టుల అమ‌లుకు ద్వైపాక్షిక ఆధికారిక అభివృద్ధి స‌హాయ (ఒడిఎ) భాగ‌స్వాముల నుండి నేరుగా రుణం పొందేందుకు ఆర్థికంగా బ‌లంగా ఉన్న రాష్ట్ర‌ ప్ర‌భుత్వాల‌కు వీలు క‌ల్పించే విధాన‌ప‌ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు ప్రధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముంబయి ట్రాన్స్ హార్బ‌ర్ లింక్ (ఎమ్ టిహెచ్‌ఎల్‌) ప్రాజెక్టు అమ‌లు కోసం జ‌పాన్ ఇంటర్ నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జెఐసిఎ) అఫీషియల్ డెవలప్ మెంట్ అసిస్టెన్స్ (ఒడిఎ) రుణాన్నినేరుగా పొందేందుకు రాష్ట్ర‌ ప్ర‌భుత్వ సంస్థ అయిన ముంబయి మెట్రోపాలిట‌న్ రీజియ‌న్ డివెల‌ప్‌మెంట్ అథారిటీ (ఎమ్ఎమ్ ఆర్ డిఎ)కు అనుమ‌తిని ఇస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణ‌యించింది. ముంబయి ట్రాన్స్ హార్బ‌ర్ లింక్ ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం రూ.17,854 కోట్లు. ఇందులో జెఐసిఎ రుణం రూ.15,109 కోట్ల వ‌ర‌కు ఉండవచ్చు.

ప్ర‌స్తుత మార్గ‌ద‌ర్శ‌కాల వ‌ల్ల రాష్ట్ర‌ ప్ర‌భుత్వ సంస్థ‌లు విదేశీ ద్వైపాక్షిక రుణ స‌హాయ సంస్థ‌ల ద్వారా కొన్ని ష‌ర‌తుల‌కు లోబ‌డి నేరుగా రుణాన్ని స‌మ‌కూర్చుకోవ‌డానికి వీలు ఉంటుంది. దీని ప్ర‌కారం రుణం, దానిపై వ‌డ్డీ ని రుణం అందుకున్న సంస్థ‌లే నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణాల‌కు సంబంధిత రాష్ట్ర‌ప్ర‌భుత్వం హామీ ఇస్తుంది. ఈ రుణానికి కేంద్ర ప్ర‌భుత్వం కౌంట‌ర్ గ్యారంటీని అందిస్తుంది.

ప్ర‌ధాన మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక వ‌న‌రులు అందించ‌డంలో, సామాజిక ప్రాజెక్టుల అమ‌లులో, వ్య‌వ‌స్థాగ‌త సామ‌ర్థ్యాల నిర్మాణంలో విదేశీ ఆర్థిక స‌హాయం ప్ర‌స్తుతం స‌హాయ‌క పాత్ర‌ను పోషిస్తున్న‌ది. ప్ర‌పంచీక‌ర‌ణ ఆర్థిక చ‌ట్రం నేప‌థ్యంలో పోటీ సామ‌ర్థ్యాల‌ను అందిపుచ్చుకోవ‌డానికి ఆయా రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న వివిధ మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌కు పెద్ద‌ మొత్తంలో నిధుల లోటు ఉండ‌డంతో విదేశీ స‌హాయానికి ప్రాధాన్య‌ం ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం విదేశీ అభివృద్ధి స‌హాయం ద్వైపాక్షిక‌, బ‌హుళ‌ప‌క్ష సంస్థ‌ల నుండి 1) కేంద్ర ప్ర‌భుత్వ రంగంలోని కార్య‌క్ర‌మాలు, ప్రాజెక్ట‌ుల అమ‌లుకు, 2) కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు అమలు చేసే ప్రాజెక్టుల‌కు, 3) రాష్ట్ర‌ ప్ర‌భుత్వం త‌ర‌ఫున రాష్ట్ర‌ ప్ర‌భుత్వమే అమలు చేసే రాష్ట్ర రంగ ప్రాజెక్టులు, స్థానిక సంస్థలు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు అమ‌లు చేసే కార్య‌క్ర‌మాలు, ప్రాజెక్టుల కోసం- కేంద్ర ప్ర‌భుత్వం నిధులు అందుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నిబంధ‌న‌లు రాష్ట్ర‌ ప్ర‌భుత్వ సంస్థ‌లు నేరుగా విదేశీ ఏజెన్సీల‌ నుండి రుణాలు పొందేందుకు అనుమ‌తించ‌డం లేదు.

ప‌లు రాష్ట్ర‌ ప్ర‌భుత్వ సంస్థ‌లు జాతీయ ప్రాధాన్య‌ం గ‌ల కీల‌క మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌ను అమ‌లు చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులు మంచి లాభదాయకమైనవే అయినప్పటికీ, వీటిని చేప‌ట్ట‌డానికి పెద్ద మొత్తంలో నిధులు అవ‌స‌రం. ఇలాంటి ప్రాజెక్టులకు రుణాలు సేక‌రించ‌డంలో ఆయా రాష్ట్ర‌ప్ర‌భుత్వాల రుణ సేక‌ర‌ణ ప‌రిమితి స‌రిపోని సంద‌ర్భాలూ ఉన్నాయి.ఈ అంశాల‌ను దృష్టిలో పెట్టుకొని దేశంలో అమ‌లవుతున్న ప్ర‌ధాన మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌కు పెట్టుబ‌డుల లభ్యతలో వేగం పెంచేందుకు, ఇత‌ర రంగాల‌కు విదేశీ నిధుల అందుబాటు విష‌యంలో ఏమాత్రం రాజీ ప‌డ‌కుండా , రాష్ట్ర‌ ప్ర‌భుత్వ సంస్థ‌లు ద్వైపాక్షిక విదేశీ ఏజెన్సీల నుండి నేరుగా రుణాలు పొందేందుకు వీలు క‌ల్పించే నిబంధ‌న‌లు ప్ర‌స్తుత మార్గ‌ద‌ర్శ‌కాల‌లో ఉండాల‌ని భావించారు. ఆర్థికంగా ప‌రిపుష్ఠంగా ఉన్న రాష్ట్రాలు ఖ‌జానాపై భారం ప‌డ‌కుండా మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల అమ‌లుకు అవ‌స‌ర‌మైన రుణాలు సేక‌రించి వాటిని తిరిగి చెల్లించేందుకు తాజా ఏర్పాటు వీలు క‌ల్పిస్తుంది . ఈ మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేయడమనేది ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తూ స‌మ్మిళిత అభివృద్ధికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉందన్న విష‌యాన్ని పున‌రుద్ఘాటిస్తోంది.