పిఎంఇండియా
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు, సమాజాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, పరిశ్రమలూ – వ్యాపారాలూ, పాలన, భద్రతా రంగాల్లో విప్లవాత్మక మార్పులను తెస్తూ.. సర్వోపయోగకర సాంకేతికతగా నేటి కాలాన్ని కృత్రిమ మేధ (ఏఐ) శాసిస్తోందని భారత్, జపాన్ ప్రధానమంత్రులు వ్యాఖ్యానించారు. ఏఐ రూపకల్పన, అభివృద్ధి, విస్తరణ, పాలన అంశాల్లో నేడు మనం తీసుకునే నిర్ణయాలు.. భవిష్యత్తులో ఆవిష్కరణలు, సామాజిక సంక్షేమం, ఆర్థిక భద్రత, ప్రపంచ క్రమంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని వారు అంగీకరించారు. ఈ అవగాహనే ప్రాతిపదికగా.. ఇరుదేశాల్లో ఆవిష్కరణలనూ, వృద్ధినీ పెంపొందించుకోవడంతోపాటు ఏఐ రంగంలో సామర్థ్యాన్నీ, పోటీతత్వాన్నీ పరస్పరం మెరుగుపరచుకునే దిశగా సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. తద్వారా సురక్షితమైన, భద్రమైన, విశ్వసనీయ, సమ్మిళిత, మానవుడే కేంద్రంగా ఉండే, సుస్థిరమైన, జవాబుదారీతనంతో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించాలని వారు సంకల్పించారు.
ప్రపంచ క్రమంలో వస్తున్న నిర్మాణాత్మక మార్పులకు అనుగుణంగా మారాల్సిన ఆవశ్యకతను ఇరు దేశాల అధినేతలు గుర్తించారు. భారతదేశ ‘మహాసాగర్’ విధానానికీ, నవీకరించిన జపాన్ ‘స్వేచ్ఛా, సార్వత్రిక ఇండో–పసిఫిక్ (ఎఫ్‌ఓఐపీ) విధానానికీ అనుగుణంగా పటిష్టమైన, వృద్ధి ప్రాతిపదికగా ఉన్న ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకోవడంలో సహకరించుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇందుకోసం ఇండో–పసిఫిక్ ప్రాంతంతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుస్థిరమైన, సమ్మిళిత ఏఐ అభివృద్ధికి తోడ్పాటునందించేలా.. భారత్–జపాన్ మధ్యే కాకుండా, భావసారూప్యమున్న దేశాలు, భాగస్వాములతో కలిసి ఏఐ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు.
కృత్రిమ మేధలో సుస్థిరాభివృద్ధిని సాధించాలంటే.. ఆయా సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించడం, వాటితో ముడిపడి ఉన్న ముప్పులను తగిన విధంగా అదుపు చేయడం, అలాగే పటిష్టమైన, వైవిధ్యభరితమైన, విశ్వసనీయమైన ఏఐ సరఫరా వ్యవస్థలను నిర్మించడం అత్యంత కీలకమని ఇరుదేశాల ప్రధానమంత్రులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవలి న్యూఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో నిర్వహించిన చర్చలనూ, వాటి సానుకూల ఫలితాలనూ స్వాగతించారు.
‘జపాన్ – భారత్ సహకార కార్యక్రమం (జేఏఐ)’ పురోగతిపై ప్రధానమంత్రులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2026 ఏప్రిల్‌లో నిర్వహించిన తొలి భారత్ – జపాన్ ఏఐ వ్యూహాత్మక సమావేశంలో చర్చలను స్వాగతించారు. సంబంధిత భాగస్వామ్య పక్షాలను తగిన రీతిలో భాగస్వాములను చేస్తూ, కృత్రిమ మేధతో లభించే అవకాశాలూ, ఎదురయ్యే సవాళ్లపై సమష్టిగా అవాగాహన పెంచుకుంటూ, ఉమ్మడి సంకల్పాన్ని ఆచరణీయ ఫలితాలుగా మలచుకునే దిశగా… కింది ప్రాధాన్యతా రంగాల్లో భారత్, జపాన్ మధ్య ఏఐపై వ్యూహాత్మక చర్చలను కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు.
I. అంతర్జాతీయ ఏఐ పాలన, భద్రత, సైబర్ భద్రత
బాధ్యతాయుత ఆవిష్కరణలకు మద్దతునిస్తూ.. దేశ చట్టాలు, ప్రాధాన్యాలు, స్థానిక పరిస్థితులను గౌరవిస్తూ – సురక్షిత, విశ్వసనీయ, పటిష్టమైన, సమ్మిళిత కృత్రిమ మేధను ప్రోత్సహించే అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను ఇరు దేశాల ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. సమస్యలను పరిష్కరించే సమతౌల్యంతో, సమష్టి భాగస్వామ్యంతో, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, పరస్పర అనుసంధానంగా, మార్పులను అందిపుచ్చుకునేదిగా ఏఐ పాలన ఉండాలని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హిరోషిమా ఏఐ ప్రాసెస్ (హెచ్ఏఐపీ) ప్రాధాన్యాన్నీ, దాని అంతర్జాతీయ మార్గదర్శకాలనూ, అధునాతన ఏఐ వ్యవస్థల నియమావళినీ వారు గుర్తు చేశారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా.. జపాన్ సహాధ్యక్షతన ఏర్పాటైన ‘సురక్షిత, విశ్వసనీయ ఏఐ కార్యబృందం’ సిద్ధం చేసిన ‘ఏఐ పాలనపై మార్గదర్శక పత్రం’లోని సూత్రాలను కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. జీ20, ఆర్థిక సహకార – అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ), ఏఐపై అంతర్జాతీయ భాగస్వామ్యం (జీపీఏఐ), ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసుకోవాలని ప్రధానమంత్రులిద్దరూ నిర్ణయించారు. ఈ దిశగా జరిగిన మొదటి ఐక్యరాజ్యసమితి ‘ఏఐ పాలనపై అంతర్జాతీయ చర్చ’ను స్వాగతించారు. ‘హిరోషిమా ఏఐ ప్రాసెస్ ఫ్రెండ్స్ గ్రూప్ యాక్షన్ ప్లాన్ – 2026’ అమలును ప్రోత్సహించడంతోపాటు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, ప్రైవేటు రంగం భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా.. హిరోషిమా ఏఐ ప్రాసెస్ ఫ్రెండ్స్ గ్రూప్, భాగస్వామ్య పక్షాల నడుమ సహకారాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని వారు పునరుద్ఘాటించారు.
కృత్రిమ మేధ మోడళ్ల మదింపు, సామర్థ్యాల అంచనా, మార్గదర్శకాలు, సాధనాలు, ప్రమాణాలు సహా.. కృత్రిమ మేధ దశలన్నింటిలోనూ సురక్షిత రూపకల్పన, అభివృద్ధి, విస్తరణ, వినియోగంపై సహకారాన్ని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రులిద్దరూ స్పష్టం చేశారు. సాంకేతిక వనరులు, సాధనాలు, ప్రమాణాలు, అత్యుత్తమ పద్ధతులను క్రోడీకరించే సహకార వేదికగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రకటించిన ‘ట్రస్టెడ్ ఏఐ కామన్స్’ ద్వారా పరస్పర సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలని సంబంధిత సంస్థలను ప్రోత్సహించారు.
అత్యంత సామర్థ్యమున్న అధునాతన ఏఐ మోడళ్లలో శక్తిమంతమైన సైబర్ సామర్థ్యాలుంటాయనీ.. అయితే సైబర్ రక్షణ వ్యవస్థల బలోపేతంతోపాటు ఇవి దుర్వినియోగమయ్యే ముప్పు కూడా ఉందనీ ఇరుదేశాల ప్రధానమంత్రులు అన్నారు. సైబర్ స్పేస్ ప్రపంచ ప్రజల ఉమ్మడి ఆస్తి అని స్పష్టం చేశారు. ఇలాంటి అధునాతన వ్యవస్థల మదింపు, నియంత్రిత విడుదల, సురక్షిత లభ్యత వంటి ఏర్పాట్లు… ముప్పుల సంభావ్యత ఆధారంగా ఉండాలన్నారు. అలాగే బాధ్యతాయుత భాగస్వామ్య దేశాల చట్టబద్ధమైన సైబర్ రక్షణ అవసరాలకు అనుగుణంగా ఇవి ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా కీలక మౌలిక వసతుల రక్షణను దృష్టిలో ఉంచుకుని.. ఏఐ ఆధారిత సైబర్ భద్రత, ఏఐ వ్యవస్థల భద్రతపై సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు.
కృత్రిమ మేధ అభివృద్ధి, విస్తరణ ప్రక్రియలో చిన్నారుల భద్రత అత్యంత ఆవశ్యకమని ఇరుదేశాల ప్రధానమంత్రులు పేర్కొన్నారు. పిల్లలకు హాని కలిగించేదిగా కాకుండా.. వారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, వారి వికాసానికి తోడ్పడే సాధనంగా ఏఐ ఉపయోగపడాలని వారు ఆకాంక్షించారు. ఇందుకోసం బాధ్యతాయుతమైన రూపకల్పన, నిర్వహణ చర్యలు, ముప్పుల సంభావ్యత ఆధారంగా రక్షణ చర్యలు అత్యంత కీలకమని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు.
II. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మోడళ్ల రూపకల్పన, మానవ వనరుల వినిమయం, సమష్టిగా పరిష్కార మార్గాలు
ఇండో–పసిఫిక్ ప్రాంతం సహా.. సురక్షిత, విశ్వసనీయ ఏఐ వ్యవస్థను నిర్మించాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రులిద్దరూ స్పష్టం చేశారు. పటిష్టమైన, వైవిధ్యభరితమైన, విశ్వసనీయమైన ఏఐ సాంకేతిక వనరుల సరఫరా వ్యవస్థల ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో భారత్, జపాన్‌లను కృత్రిమ మేధ రంగంలో వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ధి భాగస్వాములుగా నిలపాలని వారు నిర్ణయించారు. డేటా సెంటర్లు, జీపీయూలు, ఇతర కంప్యూటింగ్ వనరులు, సెమీకండక్టర్లు సహా.. సురక్షితమైన డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఆర్థిక – భద్రత కోణం నుంచి ఏఐ సాంకేతిక వనరుల్లో అవకాశాలనూ, లోపాలనూ ఉమ్మడిగా అంచనా వేయాలని నిర్ణయించారు. ఈ దిశగా డిజిటల్ అనుసంధానాన్నీ, పటిష్టమైన ఏఐ సరఫరా వ్యవస్థలనూ బలోపేతం చేయడం లక్ష్యంగా ఎఫ్‌ఓఐపీ డిజిటల్ కారిడార్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రాధాన్యాన్ని కూడా వారిద్దరూ స్పష్టం చేశారు.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో చర్చించిన పటిష్టమైన, వినూత్న, సమర్థమైన ఏఐకి సంబంధించిన స్వచ్ఛంద మార్గదర్శక సూత్రాలను పరిగణనలోకి తీసుకుంటూ.. ఈ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాల ప్రధానమంత్రులు నిర్ణయించారు. ఇందులో భాగంగా సమర్థమైన ఏఐ మోడళ్లు, సానుకూల నిర్దేశాలు, తక్కువ విద్యుత్ వినియోగించే కంప్యూటింగ్ వనరులు, పర్యావరణహిత సురక్షిత డేటా మౌలిక సదుపాయాల కల్పనతో కూడిన ‘పటిష్టమైన ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్లేబుక్’ ఆధారంగా ముందుకు సాగాలని నిర్ణయానికి వచ్చారు.
స్థానిక భాషలు, ప్రజా ప్రయోజన అప్లికేషన్లు సహా.. బహుభాషా, ఓపెన్ సోర్స్, నిర్దిష్ట రంగాలకు ఉపయోగపడే, వర్టికల్ ఏఐ మోడళ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థల నడుమ సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరుదేశాల ప్రధానమంత్రులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ రంగంలో బలమైన భాగస్వామ్యాన్ని పెంపొందించుకునే లక్ష్యంతో కుదిరిన పలు కీలక అవగాహన ఒప్పందాలను వారు స్వాగతించారు. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లపై ఉమ్మడి పరిశోధన – అభివృద్ధి కోసం ఐఐటీ – బాంబే, భారత్‌జెన్ టెక్నాలజీ ఫౌండేషన్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫార్మాటిక్స్ (ఎన్ఐఐ/ఆర్వోఐఎస్) మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం, ఏఐ సాంకేతిక వనరుల్లో సహకారం కోసం ‘సర్వమ్’, ‘ప్రిఫర్డ్ నెట్‌వర్క్స్’ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఇందులో ఉన్నాయి. అలాగే ఇరు దేశాల ఏఐ అభివృద్ధి సంస్థలకు చేయూతనిచ్చేలా ఇండియా ఏఐ – జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖల నడుమ కుదిరిన సహకార ఒప్పందాన్ని స్వాగతించారు.
ఏఐ ఆధారిత శాస్త్రీయ ఆవిష్కరణలు, అధునాతన పరిశోధనల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రులిద్దరూ అంగీకరించారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా ఏర్పాటైన ఏఐ ఫర్ సైన్స్ (ఏఐ4ఎస్) నెట్వర్క్ పరిధిలోని సంస్థలు సహా.. సంబంధిత సంస్థల మధ్య ఈ దిశగా సహకారాన్ని పెంపొందించుకోవాల్సిందిగా ప్రోత్సహించారు.
సంయుక్త పరిశోధన ప్రాజెక్టులను ప్రోత్సహించడం, పరిశోధకుల మధ్య సహకారాన్ని పెంపొందించడంతోపాటు.. ఈ రంగంలో పరిశోధన సహకారాన్ని బలోపేతం చేసుకోవాల్సిన వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని ఇరుదేశాల ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా సెమీకండక్టర్లు మొదలుకొని ఏఐ సాంకేతిక వనరుల్లోని అన్ని విభాగాల వరకు.. పరిశ్రమలు – విద్యాసంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో మానవ వనరుల వినిమయాన్ని పెంపొందించడం ద్వారా ఇరు దేశాల పారిశ్రామిక పోటీతత్వాన్ని పెంపొందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పరస్పర సహకారానికి భారత్‌లోని బలమైన ఏఐ మానవ వనరులే మూలాధారమని అంగీకరిస్తూ… దేశంలోని ప్రముఖ ఉన్నత విద్యాసంస్థలు, సాంకేతిక నిపుణులతో జపాన్ కంపెనీల భాగస్వామ్యాలను వారు స్వాగతించారు. భారత్‌లో ఏఐ ఆధారిత పరిశోధన – అభివృద్ధి, ఆవిష్కరణలు, పారిశ్రామిక భాగస్వామ్యాలను విస్తరించేలా జపాన్ కంపెనీలను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఇరుపక్షాలూ నిర్ణయించాయి. అదే సమయంలో ఉమ్మడి పరిశోధనలు, ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగావకాశాల ద్వారా భారతీయ నిపుణుల వృత్తిపరమైన ఎదుగుదలకూ, వారు జపాన్‌కు రావడానికీ తగిన సహకారాన్ని అందించాలని నిర్ణయానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో.. 2030 నాటికి భారత్ నుంచి 500 మంది అత్యంత నైపుణ్యం కలిగిన ఏఐ నిపుణులను జపాన్‌కు ఆహ్వానించాలన్న లక్ష్యాన్ని వారు పునరుద్ఘాటించారు. 2026 జనవరిలో నిర్వహించిన భారత్ – జపాన్ విదేశాంగ మంత్రుల వ్యూహాత్మక చర్చల్లో నిర్దేశించుకున్న ఈ లక్ష్యం ద్వారా ఉమ్మడి పరిశోధనలను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు.
బాధ్యతాయుతమైన రీతిలో ఏఐ అభివృద్ధి, విస్తరణ, నిర్వహణకు మానవ వనరులే అత్యంత కీలకమని ఇరుదేశాల ప్రధానమంత్రులు పేర్కొన్నారు. ఈ దిశగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా రూపొందించిన.. ‘ఏఐ యుగంలో నైపుణ్యాల అభ్యసనం, నైపుణ్యాల మెరుగుదల కోసం స్వచ్ఛంద మార్గదర్శక సూత్రాల’ ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.
ఇరు దేశాల వ్యూహాత్మక, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యాలకు అనుగుణంగా కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలను ఉమ్మడిగా రూపొందించుకోవాల్సిన ఆవశ్యకతను ఇరుదేశాల ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా మరింత వేగవంతం చేయాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. నిర్దిష్టమైన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి విస్తృత ఏఐ సాధనాలను సమష్టిగా అభివృద్ధి చేయాలని ఇరు దేశాల కార్పొరేషన్లు, అంకుర సంస్థలు, పరిశోధన సంస్థలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ సంస్థలకు వారు పిలుపునిచ్చారు. ఈ దిశగా విజయవంతమైన ఏఐ వినియోగ నమూనాలను అందిపుచ్చుకోవడానికి, వాటి ఆధారంగా ప్రతిరూపకల్పన చేయడానికి, విస్తరించడానికి దోహదపడేలా.. ‘గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ కామన్స్’ను వినియోగించుకోవాలని సంబంధిత భాగస్వామ్య పక్షాలకు పిలుపునిచ్చారు.
III. అందరికీ ఏఐ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఆమోదించిన ‘న్యూఢిల్లీ ప్రకటన’లో ప్రతిపాదించిన ‘అందరికీ ఏఐ’ దార్శనికతను ఇరుదేశాల ప్రధానమంత్రులు స్వాగతించారు. సకల మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా, సమ్మిళిత – సుస్థిర అభివృద్ధి కోసం, ప్రజా సేవల పంపిణీని మెరుగుపరచడం కోసం ఏఐని లక్ష్యంగా చేసుకోవాలన్న ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారు.
జాతీయ చట్టాలు, ప్రాధాన్యాలు, స్థానిక పరిస్థితులను గౌరవిస్తూ – ఏఐ సామర్థ్యాలను పెంచుకోవడం, సాంకేతిక సాయం, వైజ్ఞానిక చేయూత, ఏఐ నమూనాల ప్రతిరూపకల్పనకు దోహదపడేలా.. భావసారూప్యం గల ఇతర దేశాలు, భాగస్వామ్య పక్షాలతో కలిసి పనిచేయాలని ఇరుదేశాల ప్రధానమంత్రులు నిర్ణయించారు. సురక్షితమైన, సమ్మిళిత, సుస్థిర, పటిష్టమైన, విశ్వసనీయ ఏఐ వ్యవస్థను సమష్టిగా రూపొందించడంలో.. ఇతర దేశాల భాగస్వాములతోనూ, వివిధ రంగాల ప్రతినిధులతోనూ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం కీలకమని ఏకాభిప్రాయానికి వచ్చారు.
వీలైనంత త్వరలో ఏఐ సదస్సుకు జపాన్ ఆతిథ్యమివ్వనున్నట్టు ఆ దేశ ప్రధానమంత్రి తకాయిచి సనాయె చేసిన ప్రకటనను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించి మద్దతు తెలిపారు.
***
These outcomes reflect the commitment to deepening the India-Japan cooperation across key sectors and unlocking new opportunities for growth, innovation and development. https://t.co/sGmcNFW0fy
— Narendra Modi (@narendramodi) July 2, 2026
It is wonderful to meet Prime Minister Sanae Takaichi in Delhi. Japan is an important partner of India and we are confident that our ties will get even stronger in the times to come. Our talks today covered the full range of the India-Japan Special Strategic and Global… pic.twitter.com/uxVvrOj2u6
— Narendra Modi (@narendramodi) July 2, 2026
Prime Minister Takaichi and I believe that technology partnership will become the strongest pillar of our cooperation. To realise this vision, we have today issued a Joint Statement in the field of AI. Several leading institutions of India’s AI ecosystem have also signed… pic.twitter.com/KoqrFdzYCI
— Narendra Modi (@narendramodi) July 2, 2026