పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విమాన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో వీడియో మాధ్యమం ద్వారా సంభాషించారు. ముందుగా ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తూ- ఆయన సత్వరం కోలుకోవాలని యావద్దేశం ప్రార్థిస్తున్నదని ఊరట వాక్యం పలికారు. దాదాపు 200 ప్రాణాలను కాపాడే దిశగా లిప్తకాలంలో కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా స్మిత్ చూపిన సమయస్ఫూర్తిని, సాహసాన్ని, సహనాన్ని ప్రధానమంత్రి ఎంతగానో ప్రశంసించారు. దుండగుడుగా మారిన సహచరుడి దాడితో తీవ్రంగా గాయపడినా ఎంతో తెగువ చూపారని కొనియాడారు. ఎందరో ప్రయాణికుల ప్రాణ రక్షణ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన స్మిత్- 140 కోట్ల మంది దేశపౌరుల గౌరవాన్ని ఇనుమడింపజేశారని పేర్కొన్నారు. “భారతీయులంటే ప్రాణ రక్షకులే తప్ప ప్రాణాలు తీసేవాళ్లు కాదనే వాస్తవాన్ని నేడు యావద్దేశం సగర్వంగా పునరుద్ఘాటించగలదు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
పైలట్ స్మిత్ తల్లిదండ్రులు భూపేంద్ర, గీత, భార్య సోనాల్‌లతో నిన్నటి తన ఆత్మీయ సంభాషణను ప్రధానమంత్రి ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నారు. స్మిత్ తల్లి గీత తన కుమారుడి వ్యక్తిత్వంలో భారతీయ సాంస్కృతిక విలువలను పాదుకొల్పారని ఆయన ప్రశంసించారు. శ్రీమద్భగవద్గీతలో కృష్ణ భగవానుని ప్రబోధాలను పూర్తిగా ఆకళింపు చేసుకుని, ఆచరిస్తున్న ఆమె అందరికీ ఆదర్శప్రాయురాలని పేర్కొన్నారు.
ప్రధానమంత్రే అందరికన్నా ఎక్కువగా తనకు స్ఫూర్తి ప్రదాతని ఆయనతో సంభాషిస్తూ కెప్టెన్ స్మిత్ పేర్కొన్నారు. విమానం అకస్మాత్తుగా కూలిపోవడాన్ని గుర్తించడంలో తన పదిహేడేళ్ల విమాన చోదక అనుభవం ఎలా తోడ్పడందీ ఆయన వివరిస్తుండగా ప్రధానమంత్రి శ్రద్ధగా ఆలకించారు. తీవ్ర గాయాలతో లోపల చిక్కుకుపోయినా, ప్రయాణికుల భద్రతపై దృఢ సంకల్పంతో తలుపు తెరిచేందుకు చివరిసారి ప్రయత్నించిన భయంకర క్షణాన్ని పైలట్ ఆయనకు వివరించారు. ఆ తర్వాత హనుమాన్ చాలీసా పఠనం ద్వారా కెప్టెన్ ఆధ్యాత్మిక ఉపశమనం పొందడం ప్రశంసనీయమని ఈ సందర్భంగా ప్రధానమంత్రి అన్నారు. అంతటి పోరాటం అనంతరం ఎవరైనా భావోద్వేగానికి లోనవడం సహజమని ఆయన అన్నారు. “యావత్ ప్రపంచం నేడు మీతో సంభాషించడానికి ఆసక్తి చూపుతున్నదంటే మీ ధైర్యసాహసాలు అందుకు కారణం. మీ కుటుంబం నిజంగా దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసింది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
స్మిత్ దీర్ఘాయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ సావర్‌కుండ్ల నుంచి వడవాన్ దాకా ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఆయనకు దేశవ్యాప్త పౌరుల భావోద్వేగ సంఘీభావం ప్రకటించడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితి నుంచి తాను పూర్తిగా కోలుకోవడాన్ని సహనంతో కూడిన ఓ ప్రయాణంగా కెప్టెన్ భావించడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. భారతీయ సంస్కృతితో మమేకం కావడంలో భాగంగా తన రెండేళ్ల కుమారుడితో నిత్యం హనుమాన్ చాలీసా పఠిస్తానని పైలట్ చెప్పడంపై ఆయన అభినందించారు. పరాయి దేశంలో తాను విషమస్థితికి చేరినపుడు స్థానికుల అపార ప్రేమాభిమానాలు,అధికారులతోపాటు వైద్యుల శ్రద్ధపై కెప్టెన్ కృతజ్ఞతాపూర్వక భావనను వ్యక్తం చేశారు. ఆయనకు అద్భుత వైద్య సంరక్షణ సేవలు అందించిన సౌదీ అరేబియా, యూఏఈ ప్రభుత్వాలకు ప్రధానమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కెప్టెన్ చూపిన తెగువ ప్రపంచవ్యాప్తంగా గల భారతీయ పైలట్ల గౌరవాన్ని, ప్రతిష్టను మరింత పెంచిందని పేర్కొన్నారు. “ఇవాళ గాంధీ జయంతి… అహింస సిద్ధాంత వాస్తవ సారమేమిటో మీరు ఆచరణాత్మకంగా రుజువు చేశారు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
అనంతరం కెప్టెన్ స్మిత్, సోనాల్ దంపతుల పిల్లలు బాబా, జీవాలతో మాట్లాడుతూ వారి యోగక్షేమాల గురించి మాతృభాష గుజరాతీలో ప్రధానమంత్రి వాకబు చేశారు. స్మిత్ తల్లిదండ్రులు, భార్యతో సంభాషణ సందర్భంగా వారు ఎలాంటి నిందాత్మక భావాలు ప్రకటించకుండా అద్భుత సంయమనం, విశ్వాసం ప్రదర్శించారని ప్రధానమంత్రి ప్రశంసించారు. తాను కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని కెప్టెన్‌కు హామీ ఇస్తూ- పూర్తిగా కోలుకుని వచ్చాక వ్యక్తిగతంగా ఆ దుర్ఘటన వివరాలన్నీ స్వయంగా వింటానని వాగ్దానం చేశారు. యావద్దేశం ఆయనతోపాటు కుటుంబానికీ అండగా నిలుస్తుందని భరోసా ఇస్తూ, స్మిత్ సత్వరం కోలుకుని, సంపూర్ణారోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. “మీరు త్వరగా కోలుకుని రండి… మనం కలుసుకుందాం.. ఆ దైవం ఆశీస్సులతో మీకు దీర్ఘాయుష్షు సిద్ధిస్తుంది… జై హింద్” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
****
An unforgettable conversation with Captain Smit, filled with pride and emotions. pic.twitter.com/CCf46PKOWR
— Narendra Modi (@narendramodi) October 2, 2026