Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

23వ భారత్–ఆసియాన్ సదస్సులో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసానికి తెలుగు అనువాదం

23వ భారత్–ఆసియాన్ సదస్సులో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసానికి తెలుగు అనువాదం


గౌరవనీయులైన అధ్యక్షులు మార్కోస్‌కు,

మహాశయులకు,

ప్రతినిధులకు,

నమస్కారం!

మన ఆసియాన్ కుటుంబంతో మరోసారి అనుసంధానం కావడం చాలా ఆనందంగా ఉంది. ఆసియాన్ అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడంతో పాటు భారతదేశ సమన్వయకర్తగా అధ్యక్షుడు మార్కోస్ అందించిన విలువైన సేవలకు హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఈ వేదికపై ఆసియాన్ నాయకులతో నేను సమావేశమవడం ఇది పదమూడోసారి. గత కొన్నేళ్లుగా భారత్–ఆసియాన్ సంబంధాలకు నూతన వేగాన్ని, మరింత విస్తృతిని మేం అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానం అందిస్తోంది. మన ఉమ్మడి సంస్కృతి, వారసత్వానికి అతీతంగా మన భాగస్వామ్యం మరింత విస్తృతమయింది. డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, అంతరిక్షం లాంటి కొత్త రంగాలకు విస్తరించింది.

2014 నుంచి ప్రజా సంబంధాలను బలోపేతం చేయడానికి 100కు పైగా కార్యక్రమాలను మనం చేపట్టాం. దాదాపుగా 250 క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టులను ప్రారంభించాం. 10,000కు పైగా నైపుణ్యాభివృద్ధి ఉపకార వేతనాలను అందించాం.

మన సన్నిహిత సంబంధాలకు… భారత్ నుంచి తొమ్మిది ఆసియాన్ దేశాలకు నేరుగా నడుస్తున్న విమానాలు, విస్తరిస్తున్న పర్యాటకం నిదర్శనంగా నిలుస్తున్నాయి.
మిత్రులారా,

గడచిన కొన్ని సంవత్సరాలుగా ఒకదాని వెంట మరొక సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటోంది. ఇప్పుడు ప్రపంచానికి అత్యవసరమైనవి – శాంతి, స్థిరత్వం, నిలకడైన పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇతివృత్తమైన ‘‘నేవిగేటింగ్ అవర్ ఫ్యూచర్, టుగెదర్’’ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

భారతదేశం, ఆసియాన్ కలిసి ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగో వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అందుకే మన భవిష్యత్తును పోటీకి బదులుగా సహకారంతో రూపుదిద్దుకునేలా చూసుకోవడం అత్యవసరం. దీనిని సాధించడానికి మనకు సామర్థ్యాలు, ఉమ్మడి సంకల్పం రెండూ ఉన్నాయి. మనమంతా కలిసి ఈ ప్రాంతాన్ని శాంతి, స్థిరత్వాలకు ప్రతీకగా నిలపగలం.

మిత్రులారా,

ఈ ఏడాదిలో నేను ఆసియాన్ దేశాన్ని సందర్శించడం ఇది మూడోసారి. ఆసియాన్‌కు భారత్ ఎంత ప్రాధాన్యమిస్తుందో ఇది తెలియజేస్తుంది. భారతదేశ వృద్ధికి, ఆసియాన్ శ్రేయస్సుకు మధ్య బలమైన సంబంధం ఉందని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము.
భవిష్యత్తులో మన ఉమ్మడి ఆకాంక్షలను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి ఆసియాన్ కమ్యూనిటీ విజన్–2045, వికసిత్ భారత్–2047 రెండూ దోహదపడతాయి.

గత పన్నెండేళ్లుగా మన భాగస్వామ్యానికి కొత్త వేగాన్ని మనం జోడించాం. ఇప్పుడు మనమంతా కలసి మన ప్రాంత భవిష్యత్తుకు సరికొత్త దిశను నిర్దేశించుకోవాలి. ఆసియాన్ ఐక్యతకు, ఈ భాగస్వామ్యం పోషించే ముఖ్యమైన భూమికకు భారత్ కట్టుబడి ఉంటుంది. 

సురక్షితమైన, సమ్మిళితమైన, సుభిక్షమైన ఇండో–పసిఫిక్‌ను నిర్మించడంలో మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ రోజు జరిగే సమావేశం నూతన శిఖరాలకు చేరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

మీ ఆలోచనలు, సూచనలు వినడానికి నేను ఎదురుచూస్తున్నాను.
 

ధన్యవాదాలు.

***