పిఎంఇండియా
కేంద్ర మంత్రిమండలి (i) ఒడిశా లో షెడ్యూల్డు కులాల జాబితాలో మార్పులకు ఉద్దేశించిన రాజ్యాంగ (షెడ్యూల్డు కులాల) ఉత్తర్వు-1950లో సవరణ తో పాటు, (ii) కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి పేరును పుదుచ్చేరిగా మార్చేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ (పాండిచ్చేరి) షెడ్యూల్డు కులాల ఉత్తర్వు-1964లో సవరణ కు కూడా ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. పైన పేర్కొన్న మార్పులను చేరుస్తూ రాజ్యాంగ ( షెడ్యూల్డు కులాల) ఉత్తర్వుల (సవరణ) బిల్లు- 2017 పేరిట ఒక బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.
ఆమోదిత మార్గదర్శకాల మేరకు సువాల్ గిరి, స్వాల్ గిరి కులాన్ని సబాఖియా కులంతో సమానమన్న ప్రతిపాదనను పరిగణనార్హత కలిగినదిగా స్వీకరించి ఒడిశా రాష్ట్ర షెడ్యూల్డు కులాల జాబితాలో వరుస సంఖ్య 79 లో భాగంగా చేర్చేందుకు అంగీకరించింది. కాగా, పాండిచ్చేరి (పేరు మార్పు) చట్టం- 2006 మేరకు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి పేరును 01.10.2006 నుండి పుదుచ్చేరిగా మార్చారు. తదనుగుణంగా రాజ్యాంగ (పాండిచ్చేరి) షెడ్యూల్డు కులాల ఉత్తర్వు-1964 కు సవరణ అవసరమైంది.
షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల జాబితాలలో మార్పులకు సంబంధించిన ప్రతిపాదనల పరిశీలన కోసం ప్రభుత్వం 1999 జూన్‌లో మార్గదర్శకాలను ఆమోదించగా, 2002 జూన్‌లో ఆ మేరకు సవరించారు. సదరు ఆమోదిత మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత రాజ్యాంగ ఉత్తర్వుల చట్ట సవరణకు ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం/కేంద్రపాలిత ప్రాంత పాలన యంత్రాంగానికి మాత్రమే ఇది పరిమితం. వీటన్నిటికీ భారత రిజిస్ట్రార్ జనరల్ (ఆర్ జిఐ),షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్ (ఎన్ సిఎస్ సి) అంగీకారం తెలిపాయి.
భారత రాజ్యాంగంలోని 341వ నిబంధన కింద ప్రకటించిన షెడ్యూల్డు కులాల సభ్యులకు భారత రాజ్యాంగం కొన్ని హక్కులు/మినహాయింపులు ప్రసాదించింది. ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన షెడ్యూల్డు కులాల తొలి జాబితాను ఆయా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరం రాష్ట్రపతి ప్రకటనా ఉత్తర్వు ద్వారా జారీచేస్తారు. అయితే, సదరు షెడ్యూల్డు కులాల జాబితాలో తదుపరి చేర్పు లేదా తొలగింపు చేయాలంటే 341వ నిబంధనలోని ఉప నిబంధన (2) ప్రకారం పార్లమెంటులో చట్టం చేయడం ద్వారానే సాధ్యపడుతుంది.
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన షెడ్యూల్డు కులాలను ప్రకటిస్తూ 1950 నుండి 1978 మధ్య ఆరు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ తరువాత భారత రాజ్యాంగంలోని 341 నిబంధనలోని ఉప నిబంధన (2)కు లోబడి 1956 నుండి 2016 మధ్య సమయానుగుణంగా పార్లమెంటు చేసిన చట్టాల ద్వారా సదరు ఉత్తర్వులను సవరించారు.
బిల్లు చట్టంగా రూపొందిన అనంతరం షెడ్యూల్డు కులాల జాబితాలోని సమాజాల సభ్యులు ప్రస్తుత పథకాల కింద వారి కోసం నిర్దేశించిన ప్రయోజనాలను పొందగలుగుతారు. ఇటువంటి కొన్ని ప్రధాన పథకాలలో మెట్రిక్ అనంతర ఉపకార వేతనం, జాతీయ విదేశీ ఉపకార వేతనం, రాజీవ్ గాంధీ జాతీయ ఫెలో షిప్, అగ్ర శ్రేణి విద్య, జాతీయ షెడ్యూల్డు కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ నుండి రాయితీ రుణాలు, షెడ్యూల్డు కులాల బాలురు-బాలికలకు వసతి గృహాలు వంటివి ఉన్నాయి. ఇవే కాకుండా విద్యా సంస్థలలో ప్రవేశాలు, ఉద్యోగావకాశాలలో రిజర్వేషన్ ప్రయోజనం పొందడానికీ వారు అర్హులవుతారు.