Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేరళంలోని ఎర్నాకుళంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

కేరళంలోని ఎర్నాకుళంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం


కేరళం రాష్ట్ర గవర్నర్ శ్రీ రాజేంద్ర అర్లేకర్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ సురేష్ గోపి, శ్రీ జార్జ్ కురియన్, పార్లమెంటు-శాసనసభల సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్, సోదరీసోదరులారా!

కొచ్చి నగర సందర్శన నాకు సదా అద్భుత అనుభవం. ఉత్సాహం పొంగులు వారే ఈ తీరప్రాంత నగరం నుంచి కేరళం రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే అవకాశం ఇవాళ నాకు లభించింది. తదనుగుణంగా కొద్దిసేపటి కిందటే రాష్ట్రాభివృద్ధికి సంబంధించి దాదాపు రూ.11,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసుకున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.

నా ప్రియ మిత్రులారా!

వికసిత భారత్‌ సంకల్ప సాకారం సహా ‘మేక్ ఇన్ ఇండియా’ విజయం దిశగా పెట్రోలియం రంగ విస్తరణ ఎంతో కీలకం. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, కొచ్చి రిఫైనరీలోని పాలీప్రొఫైలిన్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. ఇది ఏటా 4 లక్షల టన్నుల పాలీప్రొఫైలిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, భవిష్యత్తులో ప్యాకేజింగ్, వస్త్రాలు, ఆటోమొబైల్స్, వైద్య పరికరాలు సహా అనేక ఇతర పరిశ్రమలకు ఈ కర్మాగారం మద్దతిస్తుంది.

నా ప్రియ మిత్రులారా!

తయారీ రంగానికి సంబంధించి భారత్‌ నేడు ప్రపంచ ప్రధాన కూడలిగా మారుతోంది. అలాగే, కృత్రిమ మేధ, సెమీకండక్టర్ల రంగంలోనూ దేశం వేగంగా పురోగమిస్తోంది. ఇలాంటి అన్ని కార్యక్రమాలకూ..  ముఖ్యంగా కాలుష్య రహిత, స్వచ్ఛ ఇంధనం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో సౌరశక్తి ఉత్పాదన రీత్యా భారత్‌ ఇప్పటికే ప్రపంచ అగ్ర దేశాల జాబితాలో చేరింది. అదే బాటలో కేరళం కూడా సౌర విద్యుదుత్పాదనలో మరింత ముందడుగు వేయాలన్నది మా ఆకాంక్ష. ఈ లక్ష్యంతోనే నేడు పశ్చిమ కల్లాడలో 50 మెగావాట్ల జల ఉపరితల సౌర విద్యుదుత్పాదన ప్రాజెక్టుకు పునాది వేశాం. కేరళంలో జల వనరులు అపారం. అందువల్ల, జల ఉపరితల సౌర విద్యుత్ రంగ సామర్థ్య సద్వినియోగానికి ఇక్కడ విస్తృత అవకాశాలున్నాయి.

నా ప్రియ మిత్రులారా!

భారత్‌ నేడు ఆధునిక మౌలిక సదుపాయాలలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుండటంపై ప్రపంచం ఎంతగానో ప్రశంసిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో ఈ రంగానికి రికార్డు స్థాయిలో నిధులు కేటాయించాం. మౌలిక సదుపాయాలలో ఈ పెట్టుబడుల వల్ల కేరళం ఎంతో ప్రయోజనం పొందుతుంది. అమృత భారత్ స్టేషన్ పథకం కింద షోరనూర్ జంక్షన్, కుట్టిపురం, చంగనస్సేరి రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు ముగిశాయి. షోరనూర్-నిలంబూర్ రైలు మార్గంలోని కీలక విభాగం విద్యుదీకరణ కూడా పూర్తయింది. ఇక ఇవాళ పాలక్కాడ్-పొల్లాచ్చి మార్గంలో కొత్త రైలును కూడా ప్రారంభించాం. దీనివల్ల కేరళం, తమిళనాడు ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుంది.

నా ప్రియ మిత్రులారా!

రాష్ట్రంలో ఈ రోజున అనేక కీలక రహదారి ప్రాజెక్టులను కూడా ప్రారంభించాం. ఇందులో భాగంగా నిర్మించే 6 వరుసల రహదారితో అళిక్కల్ రేవుకు అనుసంధానం మెరగవుతుంది. అలాగే కోళికోడ్ బైపాస్ మార్గంలో వాహన రాకపోకల రద్దీ తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్ర రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చడమేగాక పర్యాటక, పారిశ్రామిక రంగానికీ ఊతమిస్తాయి.

నా ప్రియ మిత్రులారా!

మౌలిక సదుపాయాల కోసం వెచ్చించే ప్రతి రూపాయి కొత్త ఉపాధి అవకాశాల సృష్టికి దోహదం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో వేలాది యువతకు కొత్త ఉద్యోగాలను చేరువ చేస్తాయి. ‘వికసిత కేరళం’పై మా సంకల్పాన్ని సాకారం చేయడంలో ఈ ప్రాజెక్టులు ప్రధాన పాత్ర పోషిస్తాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.

మీకందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను…

ధన్యవాదాలు!

 

***