Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేరళలోని తిరువనంతపురంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

కేరళలోని తిరువనంతపురంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం


కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ గారు, ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సహచర కేంద్రమంత్రులు, కొత్తగా ఎన్నికైన తిరువనంతపురం మేయర్, నా పాత సహచరుడు శ్రీ వీవీ రాజేష్ గారు, ఇతర అతిథిలు, సోదరీసోదరులారా… అందరికీ నమస్కారం.

కేరళ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నాల్లో నేడు కొత్త ఊపొచ్చింది. నేటి నుంచి కేరళలో రైలు అనుసంధానం మరింత మెరుగవుతుంది. దేశంలోనే తిరువనంతపురం ఒక పెద్ద అంకుర సంస్థల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ మొదలైంది. నేడు దేశవ్యాప్తంగా పేద ప్రజల అభ్యున్నతి కోసం ఒక గొప్ప ఆరంభం కూడా కేరళ నుంచి జరుగుతోంది. ఈ రోజు ‘పీఎం స్వనిధి క్రెడిట్ కార్డు’ను ప్రారంభించాం. దీని ద్వారా దేశంలోని వీధి వ్యాపారులు, బండ్లపై వ్యాపారం చేసే వారు, ఫుట్‌పాత్‌లపై పనిచేసే వారు లబ్ధి పొందనున్నారు. అభివృద్ధి కోసం, ఉపాధి కల్పన కోసం, ఈ పథకాల కోసం కేరళ ప్రజలకు, దేశ ప్రజలందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

అభివృద్ధి చెందిన భారత్ ను నిర్మించేందుకు నేడు దేశమంతా ఏకమై కృషి చేస్తోంది. వికసిత్ భారత్ నిర్మాణంలో మన నగరాల పాత్ర చాలా కీలకం. గత 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాల కోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది.

మిత్రులారా,

నగరాల్లో నివసించే పేద కుటుంబాల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. పీఎం ఆవాస్ యోజన కింద దేశంలో ఇప్పటి వరకు 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించి పేదలకు అందించాం. వీటిలో కోటి కంటే ఎక్కువ ఇళ్లు పట్టణ పేదల కోసం నిర్మించాం. కేరళలో కూడా దాదాపు ఒక లక్షా పాతిక వేల మంది పట్టణ పేదలు తమ సొంత శాశ్వత గృహాలు పొందారు.

మిత్రులారా,

పేద కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’  ప్రారంభమైంది. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలు 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య చికిత్స పొందుతున్నారు. మహిళల  ఆరోగ్య భద్రత కోసం ‘మాతృ వందన యోజన’ వంటి పథకాలను రూపొందించాం. కేంద్ర ప్రభుత్వం 12 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని పన్ను మినహాయింపుగా మార్చింది. దీని వల్ల కేరళ ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి, వేతన జీవులకు చాలా పెద్ద ప్రయోజనం చేకూరింది. 

మిత్రులారా,

గత 11 ఏళ్లలో కోట్లాది మంది దేశ ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించే ఒక గొప్ప పని జరిగింది. ఇప్పుడు పేదలు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ వర్గాలు, మహిళలు, మత్స్యకారులు.. వీరందరూ కూడా సులభంగా బ్యాంకు రుణాలు పొందుతున్నారు. ఎవరికైతే ఎలాంటి హామీ లేదో వారికి ప్రభుత్వమే స్వయంగా హామీదారుగా మారుతోంది.

మిత్రులారా,

రోడ్ల పక్కన, వీధుల్లో వస్తువులు అమ్ముకునే వీధి వ్యాపారుల పరిస్థితి గతంలో చాలా దయనీయంగా ఉండేది. వారు వస్తువులు కొనడానికి కొన్ని వందల రూపాయలను కూడా భారీ వడ్డీకి తీసుకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని మార్చేందుకు  కేంద్ర ప్రభుత్వం తొలిసారి వారి కోసం పీఎం స్వనిధి పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది సహచరులకు బ్యాంకుల నుంచి పెద్ద సహాయం అందింది. లక్షలాది మంది వీధి వ్యాపారులు తమ జీవితంలో మొదటిసారిగా బ్యాంకు రుణాన్ని పొందారు.

మిత్రులారా,

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి ఈ సహచరులకు క్రెడిట్ కార్డులను అందజేస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కూడా పీఎం స్వనిధి క్రెడిట్ కార్డులను పంపిణీ చేశారు. ఇందులో కేరళకు చెందిన పదివేల మంది, తిరువనంతపురానికి చెందిన 600 మందికి పైగా సహచరులు ఉన్నారు. గతంలో కేవలం ధనవంతుల వద్ద మాత్రమే క్రెడిట్ కార్డులు ఉండేవి, కానీ ఇప్పుడు వీధి వ్యాపారుల వద్ద కూడా స్వనిధి క్రెడిట్ కార్డులు ఉన్నాయి.

మిత్రులారా,

కేంద్ర ప్రభుత్వం రవాణా సౌకర్యాలు, విజ్ఞానం, ఆవిష్కరణలు, ఆరోగ్య రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. కేరళలో సీఎస్‌ఐఆర్ ఆవిష్కరణ కేంద్రాన్ని అంకితం చేయడం, వైద్య కళాశాలలో రేడియో సర్జరీ కేంద్రాన్ని ప్రారంభించడం వంటివి కేరళను విజ్ఞానం, ఆవిష్కరణలు, ఆరోగ్య రంగాల కేంద్రంగా తర్చిదిద్దడంలో ఎంతో సహాయపడతాయి.

మిత్రులారా,

నేడు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి  కేరళకు రైలు అనుసంధానం మరింత బలోపేతమైంది. కాసేపటి క్రితమే ప్రారంభించిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా కేరళలో ప్రయాణ సౌలభ్యం పెరుగుతుంది. దీనివల్ల పర్యాటక రంగానికి కూడా భారీగా ప్రయోజనం చేకూరుతుంది. గురువాయూర్ నుంచి త్రిసూర్ మధ్య నడిచే కొత్త ప్యాసింజర్ రైలు యాత్రికుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఈ ప్రాజెక్టులన్నింటి ద్వారా కేరళ అభివృద్ధి కూడా వేగవంతం అవుతుంది.

 

సహచరులారా,

అభివృద్ధి చెందిన కేరళ ద్వారానే అభివృద్ధి చెందిన భారతదేశ కల నెరవేరుతుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి శక్తితో కేరళ ప్రజలకు అండగా నిలుస్తోంది. మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం తర్వాత కేరళకు చెందిన వేలాది మంది ఉత్సాహవంతులు, ఆత్మవిశ్వాసం కలిగిన ప్రజలు నా ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడ నాకు మరింత బహిరంగంగా మాట్లాడే అవకాశం లభిస్తుంది. నేను అక్కడ వివరంగా మాట్లాడతాను. మీడియాకు కూడా ఈ కార్యక్రమం కంటే ఆ కార్యక్రమం పైనే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. మరో 5 నిమిషాల్లో మరో కార్యక్రమానికి వెళ్లి, అక్కడ కేరళ భవిష్యత్తుకు సంబంధించిన అనేక విషయాలను తప్పకుండా మీతో పంచుకుంటాను.

చాలా చాలా ధన్యవాదాలు.

 

***