పిఎంఇండియా
కేరళలోని తిరువనంతపురంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మరికొన్నింటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తూ.. కేరళ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు ఈ రోజు నవోత్తేజం లభించిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. కేరళలో రైలు అనుసంధానం మరింత బలోపేతమైందనీ, తిరువనంతపురాన్ని అంకుర సంస్థల ప్రధాన నిలయంగా నిలిపేలా చర్యలు చేపట్టామని తెలిపారు. పేదల సంక్షేమం లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త ముఖ్య కార్యక్రమమైన ‘పీఎం స్వనిధి క్రెడిట్ కార్డు’ను కూడా కేరళ వేదికగా ప్రారంభించినట్టు ప్రధానమంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులకు, తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునేవారికి, ఫుట్‌పాత్‌లపై పనిచేసుకునేవారికి ఇది ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి, ఉపాధి కల్పన కార్యక్రమాల సందర్భంగా కేరళతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలకు అభినందనలు తెలిపారు.
వికసిత భారత సాధన దిశగా నేడు దేశమంతా ఐక్యంగా ఉందని చెబుతూ.. ఈ లక్ష్య సాధనలో నగరాలు కీలక పాత్ర పోషిస్తాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా పెట్టుబడులు పెట్టిందని వివరించారు. నగరాల్లో నివసిస్తున్న పేద కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా కృషి చేసిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద దేశవ్యాప్తంగా పేదలకు 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించి ఇచ్చామనీ, అందులో భాగంగా పట్టణ పేదల కోసం కోటికి పైగా పక్కా ఇళ్లను నిర్మించామనీ తెలిపారు. ఒక్క కేరళలోనే దాదాపు 1.25 లక్షల పట్టణ పేద కుటుంబాలకు గృహాలు లభించాయన్నారు.
పేద కుటుంబాలకు విద్యుత్ ఖర్చులను తగ్గించడానికి పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద పేద ప్రజలు రూ. 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య చికిత్సను పొందుతున్నారనీ, మహిళల ఆరోగ్య భద్రత కోసం మాతృ వందన యోజన వంటి పథకాలను ప్రవేశపెట్టామనీ వివరించారు. కేంద్ర ప్రభుత్వం రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చిందని, దీని వల్ల కేరళలోని మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరిందని శ్రీ మోదీ చెప్పారు.
కోట్లాది ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించడం కోసం గత 11 ఏళ్లలో ఎంతగానో కృషి చేశామని శ్రీ మోదీ చెప్పారు. ఇప్పుడు పేదలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు, మహిళలు, మత్స్యకారులు సులభంగా బ్యాంకు రుణాలు పొందగలుగుతున్నారని ప్రధానమంత్రి చెప్పారు. వారి వద్ద పూచీకత్తు లేని పక్షంలో.. కేంద్ర ప్రభుత్వమే గ్యారెంటీగా వ్యవహరిస్తోందన్నారు.
గతంలో కొన్ని వందల రూపాయలు అప్పుగా తీసుకోవడానికి కూడా అధిక వడ్డీ రేట్లతో ఇబ్బందులు పడిన వీధి వ్యాపారుల పరిస్థితిని పీఎం స్వనిధి పథకం పూర్తిగా మార్చేసిందని ప్రధానమంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వీధి వ్యాపారులు మొదటిసారి బ్యాంకుల నుంచి రుణాలను పొందారని శ్రీ మోదీ చెప్పారు. ఇది వారికి ఎంతగానో చేయూతనివ్వడంతోపాటు జీవనోపాధిని మెరుగుపరచుకునేలా అనేక అవకాశాలను అందిస్తుందన్నారు.
వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులు అందించడం ద్వారా భారత ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందని ప్రధానమంత్రి శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. కేరళలో 10,000 మంది, తిరువనంతపురంలో 600 మందికి పైగా లబ్ధిదారులకు ఇప్పుడే పీఎం స్వనిధి క్రెడిట్ కార్డులు పంపిణీ చేసినట్టు తెలిపారు. గతంలో ధనవంతులకే క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉండేవనీ, కానీ ఇప్పుడు వీధి వ్యాపారుల వద్ద కూడా స్వనిధి క్రెడిట్ కార్డులు ఉన్నాయనీ ప్రధానమంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం రవాణా, సైన్స్, ఆవిష్కరణలు, ఆరోగ్య రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోందని శ్రీ మోదీ చెప్పారు. కేరళలో సీఎస్ఐఆర్ ఆవిష్కరణల కేంద్రం ప్రారంభోత్సవాన్నీ, వైద్య కళాశాలలో రేడియో సర్జరీ కేంద్రం ప్రారంభాన్ని ఆయన ప్రస్తావించారు. సైన్స్, ఆవిష్కరణలు, ఆరోగ్య సంరక్షణల్లో ప్రధాన కేంద్రంగా కేరళను నిలిపేలా ఇవి సహాయపడతాయని ఆయన అన్నారు.
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభంతో కేరళ రైలు రవాణా బలోపేతమైందనీ, ఇది ప్రయాణ సౌలభ్యాన్ని పెంచి పర్యాటక రంగానికి ప్రయోజనం చేకూరుస్తుందనీ ప్రధానమంత్రి చెప్పారు. గురువాయూర్ – త్రిస్సూర్ మధ్య నడిచే కొత్త ప్యాసింజర్ రైలు యాత్రికులకు ప్రయాణాలను సులభతరం చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ కేరళ అభివృద్ధిని వేగవంతం చేస్తాయని శ్రీ మోదీ అన్నారు. ‘అభివృద్ధి చెందిన భారత్’ సాకారం కావాలంటే ‘అభివృద్ధి చెందిన కేరళ’ అత్యావశ్యకమనీ, కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రజలకు అండగా నిలుస్తుందనీ భరోసానిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. మరోసారి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
కేరళ గవర్నరు శ్రీ రాజేంద్ర అర్లేకర్, ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్, కేంద్ర మంత్రులు శ్రీ వి. సోమన్న, శ్రీ జార్జ్ కురియన్, తిరువనంతపురం మేయర్ శ్రీ వి.వి. రాజేశ్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
రైల్వే అనుసంధానం, పట్టణ జీవనోపాధి, సైన్స్ – ఆవిష్కరణలు, పౌర కేంద్రిత సేవలు, అధునాతన ఆరోగ్య సంరక్షణ వంటి కీలక రంగాలకు చెందిన ఈ ప్రాజెక్టులు.. సమ్మిళిత వృద్ధి, సాంకేతిక పురోగతి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రధానమంత్రి అంకితభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
రైలు అనుసంధానానికి ఊతమిచ్చేలా.. నాలుగు కొత్త రైలు సేవలను ప్రధానమంత్రి ప్రారంభించారు. వాటిలో మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఒక ప్యాసింజర్ రైలు ఉన్నాయి. వీటిలో నాగర్‌కోయిల్-మంగళూరు, తిరువనంతపురం-తాంబరం, తిరువనంతపురం-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లతోపాటు.. త్రిస్సూర్ – గురువాయూర్ మధ్య కొత్త ప్యాసింజర్ రైలు ఉన్నాయి. ఈ రైలు సేవలను ప్రవేశపెట్టడం వల్ల కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య దూరప్రాంత, ప్రాంతీయ రవాణా సదుపాయాలు గణనీయంగా పెరుగుతాయి. ప్రయాణికులకు సకాలంలో, మరింత తక్కువ వ్యయంతో సురక్షిత ప్రయాణ సదుపాయం లభిస్తుంది. మెరుగైన రవాణా సదుపాయాల వల్ల ఈ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, విద్య, ఉపాధి, సాంస్కృతిక అనుసంధానాలకు బలమైన ప్రోత్సాహం కలుగుతుంది.
పట్టణ జీవనోపాధిని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా.. పీఎం స్వనిధి క్రెడిట్ కార్డును ప్రధానమంత్రి ప్రారంభించారు. వీధి వ్యాపారుల ఆర్థిక సమ్మిళితత్వంలో పురోగతిని ఇది సూచిస్తుంది. యూపీఐతో అనుసంధానించిన, వడ్డీ లేని పునరావృత్త రుణ సదుపాయం తక్షణ నగదును అందించడంతోపాటు డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహాన్నిస్తుంది. ప్రామాణిక క్రెడిట్ రికార్డులను నిర్మించుకునేలా లబ్ధిదారులకు దోహదపడుతుంది. కేరళకు చెందిన వీధి వ్యాపారులు సహా లక్ష మంది లబ్ధిదారులకు పీఎం స్వనిధి రుణాలను ప్రధానమంత్రి పంపిణీ చేశారు. 2020లో ప్రారంభమైనప్పటి నుంచి.. మెజారిటీ లబ్ధిదారులకు మొదటిసారిగా అధికారిక బ్యాంకింగ్ రుణాలను పొందే అవకాశం పీఎం స్వనిధి పథకం కల్పించింది. పట్టణ ప్రాంతాల్లోని అసంఘటిత రంగ కార్మికుల పేదరిక నిర్మూలనలో, వారి జీవనోపాధి భద్రతలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది.
సైన్స్ – ఆవిష్కరణలకు సంబంధించి.. తిరువనంతపురంలో సీఎస్ఐఆర్ – ఎన్ఐఐఎస్టీ ఆవిష్కరణ, సాంకేతిక, వ్యవస్థాపక కేంద్రానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది లైఫ్ సైన్సెస్, బయో ఎకానమీ వంటి అంశాలపై దృష్టి సారించడంతోపాటు.. ఆయుర్వేదం వంటి సాంప్రదాయక వైజ్ఞానిక వ్యవస్థలను ఆధునిక బయోటెక్నాలజీతో అనుసంధానిస్తుంది. అలాగే పర్యావరణ హిత ప్యాకేజింగ్, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలపై పరిశోధనలు చేయడమే కాకుండా.. అంకుర సంస్థల ఏర్పాటు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. పరిశోధనలను మార్కెట్ సన్నద్ధ పరిష్కార మార్గాలుగా, వ్యవస్థలుగా మలిచే వేదికగా ఇది ఉపయోగపడుతుంది.
ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల బలోపేతం ఈ పర్యటనలో మరో కీలక అంశం. తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునల్ వైద్య విజ్ఞాన, సాంకేతికతా సంస్థలో అత్యాధునిక రేడియో సర్జరీ కేంద్రానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కేంద్రం సంక్లిష్టమైన మెదడు సంబంధిత వ్యాధులకు అత్యంత కచ్చితమైన, తక్కువ కోతతో కూడిన చికిత్సను అందిస్తుంది. తద్వారా ఆ ప్రాంతంలో అత్యంత ఆధునిక ఆరోగ్య సంరక్షణ సామర్థ్యాలు మెరుగుపడతాయి.
తిరువనంతపురంలో కొత్త పూజపుర ప్రధాన తపాలా కార్యాలయాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. సాంకేతికతతో కూడిన ఈ ఆధునిక కేంద్రం.. పోస్టల్, బ్యాంకింగ్, బీమా, డిజిటల్ సమగ్ర సేవలను అందుబాటులోకి తెస్తుంది. తద్వారా ప్రజా కేంద్రిత సేవల పంపిణీ మరింత బలోపేతమవుతుంది.
***
The development works being launched today will strengthen Kerala’s infrastructure, improve connectivity and create new opportunities for the people. Addressing a programme in Thiruvananthapuram.
— Narendra Modi (@narendramodi) January 23, 2026
https://t.co/bDRG9hDPhQ
आज केरला के विकास के लिए केंद्र सरकार के प्रयासों को नई गति मिली है।
— PMO India (@PMOIndia) January 23, 2026
आज से केरला में rail connectivity और सशक्त हुई है।
तिरुवनंतपुरम को देश का बड़ा startup hub बनाने के लिए पहल हुई है: PM @narendramodi
आज केरला से, पूरे देश के लिए गरीब कल्याण से जुड़ी एक बड़ी शुरुआत भी हो रही है।
— PMO India (@PMOIndia) January 23, 2026
आज पीएम स्वनिधि क्रेडिट कार्ड, लॉन्च किया गया है।
इससे देशभर के रेहड़ी-ठेले, फुटपाथ पर काम करने वाले साथियों को लाभ होगा: PM @narendramodi
विकसित भारत के निर्माण में हमारे शहरों की बहुत बड़ी भूमिका है।
— PMO India (@PMOIndia) January 23, 2026
बीते 11 वर्षों से, केंद्र सरकार urban infrastructure पर बहुत निवेश कर रही है: PM @narendramodi