Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కోఆపరేటివ్స్ మరియు సంబంధిత రంగాలలో సహకారం కోసం భారతదేశం, మారిషస్ ల మధ్య అంతర్- ప్రభుత్వ ఒప్పందం


కోఆపరేటివ్స్ మరియు సంబంధిత రంగాలలో సహకారం కోసం భారతదేశం, మారిషస్ ల మధ్య అంతర్- ప్రభుత్వ ఒప్పందానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఇరు దేశాల మధ్య ఒప్పందపు కాలపరిమితి అయిదు సంవత్సరాలు. ఈ వ్యవధి అనంతరం ఒప్పందం దానంతట అదే మరొక అయిదు సంవత్సరాల పాటు అమలయ్యేందుకు కూడా వీలుంది. ఒప్పందంలో పేర్కొన్న మేరకు స్వల్ప కాలిక కార్యక్రమాలను, దీర్ఘకాలిక కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ ఒప్పందం ముఖ్యోద్దేశాలను నెరవేర్చడానికి ఉభయ పక్షాల సమ్మతితో ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొంటారు.

పూర్వ రంగం:

మారిషస్ ప్రభుత్వం నెలకొల్పిన కోఆపరేటివ్ డెవలప్ మెంట్ ఫండ్ (సి డి ఎఫ్) కు, నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ సి యు ఐ) కు మధ్య సంస్థాగత యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలనే అంశంపై మారిషస్ ప్రభుత్వం ఆసక్తిని వ్యక్తం చేసింది. కోఆపరేటివ్ డెవలప్ మెంట్ లో ఎన్ సి యు ఐ కి ఉన్న అనుభవం నుండి ప్రయోజనం పొందాలన్నది మారిషస్ ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. కోఆపరేటివ్స్ పాలనకు సంబంధించిన శాసనాన్ని ఇరు దేశాలు ఇచ్చి పుచ్చుకోవడానికి, కోఆపరేటివ్ సెక్టర్ కు సంబంధించిన సాంకేతికతలను, సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి, ఇన్ స్టిట్యూషనల్ లింకేజి లను ఏర్పాటు చేసుకోవడానికి, ఐ టి ఇ సి కార్యక్రమంలో భాగంగా ఒక దేశ నిపుణులను మరొక దేశానికి ప్రతినిధులుగా పంపించడానికి అనువుగా ఉభయ దేశాలకు మధ్య ఒక అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ ఒ యు) పై సంతకాలకు గల అవకాశాన్ని గురించి చర్చించేందుకు 2012 సెప్టెంబరు లో ఒక సంయుక్త సమావేశాన్ని డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, కోఆపరేషన్ & ఫార్మర్స్ వెల్ ఫేర్ లో నిర్వహించారు. ఇది జరిగి ఒక సంవత్సరం గడిచిన అనంతరం (2013 సెప్టెంబరు లో ) మంత్రిత్వ శాఖల స్థాయి సమావేశం కూడా జరిగింది. కోఆపరేటివ్స్ రంగంలో ద్వైపాక్షిక సహకారానికి ఉన్న అవకాశాలను అన్వేషించడానికి మారిషస్ ప్రభుత్వ సీనియర్ అధికారులు ఇద్దరితో కూడిన ప్రతినిధిబృందం భారతదేశంలోని సహకార సంస్థలను సందర్శించింది.